అవధేశ్ రాణి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీల పాత్రధారి ఐన ఈమె హైదరాబాదు పాతబస్తీలోని గౌలీపురాలో జన్మించారు. రజాకార్ల నెదిరించి పోరాడిన నాటి మహిళా మణులలో ఒకరు. కేవలం స్వాతంత్ర సమర యోధురాలే కాకుండా విద్యావేత్త కూడా.

ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు , పార్లమెంటేరియన్ రాజ్ బహద్దూర్ గారి ప్రియతమ సోదరి. వీరి కుటుంబం యావత్తు నైజాం కర్కశత్వాన్ని ఎదిరించి పోరాడిన ధీశాలురు.

1946 నుండి 51 మధ్య కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఈమె కొరియర్గా విశేష సేవలు అందించారు. ఆనాటి పరిస్థితులలో ధైర్యంగా ఆయుధాల్ని, రహస్య సమాచారాన్ని వివిధ ప్రదేశాలకు చేరవేయడంలో వీరు అత్యంత సాహసం ప్రదర్శించారు. శత్రువులు గుర్తుపట్టకుండా ఉండడానికి వీరికి రహస్య కోడ్ నిర్దేశించబడిందట.
‘పాల్ రాబ్సన్ ‘అని దాని గుర్తు. బడుగు వర్గ పక్షపాతి ,నక్సల్ సానుభూతిపరులు ,నట గాయకులైన అమెరికా నల్లజాతీయుడు ‘పాల్ రాబ్సన్’ ప్రభావం ఆ రోజుల్లో ఎక్కువగా ఉండటం వల్ల వారి పేరుమీద ఈ కోడ్ నిర్ణయించబడిందట. ఆయుధ సరఫరా, సమాచార బట్వాడా నిమిత్తం తనకు అప్పగించిన బాధ్యతలను తన శక్త్యానుసారం అత్యంత చురుగ్గా సమర్థవంతంగా నిర్వహించానంటారామె.

‘ కామ్రేడ్స్ అసోసియేషన్ ‘ప్రారంభకుల్లో ఒకరైన రాజ్ బహద్దూర్ సోదరిగా తమ ఇంట్లో తరచూ అన్నగారి సహచర బృంద సమావేశాలు జరుగుతుండడంతో పుచ్చలపల్లి సుందరయ్య ,రావి నారాయణరెడ్డి , మఖ్దుం
మొహియుద్దీన్ ,చండ్ర రాజేశ్వరరావు ,జావేద్ రిజ్వీ లాంటి ఎంతోమంది మహనీయులను ప్రత్యక్షంగా కలిసే అవకాశం లభించిందని,
వారి రహస్య మంతనాలను, మగ్ధుం కవితలను వింటూ పెరిగానంటారామె.

1947లో దీపావళి పండుగ రోజు కామ్రెడ్స్ అందరూ మా ఇంట్లో రహస్య సమావేశం జరుపుకుంటున్నప్పుడు, మా బంధువైన పోలీస్ అధికారి’ కిషన్ లాల్’, అన్నయ్యను కలిసే మిషతో వచ్చారని కానీ నేను లోపల పూజ జరుగుతుంది వెళ్ళకూడదు అంటూ ఎదిరించినప్పుడు వారు నా చెంప పగలగొట్టారనే కోపంతో రక్కి గొడవ చేస్తే వెళ్ళిపోయారు . ఒకవేళ నన్ను కొట్టినప్పుడు మా అన్నయ్య ఉండిఉంటే నేను ఏడుస్తూ అతని దగ్గరకు వెళ్తే వాళ్ళు దొరికిపోయేవాళ్ళంటూ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత కిషన్ లాల్ గారే నాతో చెప్పారని గుర్తుచేసుకుంటారు .

1948 సెప్టెంబర్ 17న, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన ఘట్టాన్ని ‘దక్కన్ రేడియో’లో జఫ్రూల్ హసన్ ఉర్దూలో ప్రకటించడం నాకు బాగా గుర్తుండిపోయింది అంటూ జ్ఞాపకాల దొంతరలను విప్పి చెప్తారు.
తెలంగాణ ఆవిర్భావ అమృతోత్సవాలలో భాగంగా తమ మనోభావాలను వివిధ పత్రికలతో పంచుకున్నారు. తన సోదరుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు నిజాం పోలీసులు తమ ఇంటిపై నిఘా పెట్టడం , వారు ఇంటిపై దాడి చేసిన సమయంలో తమ ఇంట్లోని విప్లవ సాహిత్యాన్ని భద్రపరచడానికి నానా తంటాలు పడేవారమని గుర్తు చేసుకుంటారు .

ఆనాడు మహిళలు ఎదుర్కొన్న కష్టనష్టాల్ని రజాకార్ల ఆగడాలను ఎదిరించి పోరాడిన సందర్భానికి సజీవ సాక్ష్యమై నిలిచారీమె. కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై నాటి యువత కుల,మతాంతర వివాహాలు చేసుకోవడం ఆకాలంలో సర్వసాధారణ విషయంగా మారిపోయిందంటారు. ఎంతోమంది ముస్లిం సోదరులు తెలంగాణ సాయుధ పోరాట యోధులకు తమ వంతు సహాయాన్ని సహకారాల్ని అందించారని చెప్తారామె. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతమంది హిందువులు సైతం రజాకార్లుగా మారిపోయిన సంఘటనలున్నాయంటారు. మధ్యతరగతి ముస్లిం మహిళలు నిజాం పోకడలను గర్హింహించారని , నిజాం చర్యలకు నిరసనగా హిందూ, ముస్లిం మహిళలు ఏకమై కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్తారు. నాటి ఉద్యమ లక్ష్యం కేవలం పేదలకు భూములు పంచడమేనని, హైదరాబాద్ ఉమ్మడి సంస్కృతిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడడం అత్యంత బాధాకరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఓనమాల నుండి డాక్టరేట్ వరకు తన చదువంతా ఉర్దూ మాధ్యమంలోనే కొనసాగిందని చెప్పే వీరు, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేశారు. ఎన్సీఈఆర్టీ ఉర్దూ పాఠ్యపుస్తకాల రూపకర్తల్లో ఒకరిగా కూడా ఉన్నారు.
హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలపై మక్కువ, ఉర్దూ భాషా వైభవం గురించి ఎన్నో వేదికలపై తరచూ మాట్లాడేవారు.

‘లాస్ట్ నిజాం’ పుస్తక రూపకల్పన సమయంలో ఐఏఎస్ అధికారి వసంత కుమార్ తో కలిసి పనిచేసిన సందర్భంలోనే తమ
పరిచయం పెరిగి
పెళ్లికి దారితీసిందని గుర్తుచేసుకుంటారామె.

సాయుధ పోరాటంలో రజాకార్ల దాష్ఠీకాన్ని ఎదిరించి నిప్పురవ్వలై ఎగిసిపడ్డ నారీమణులు ఎందరో! పోరాటంలో పాలుపంచుకుని రజాకార్ల దమనకాండను అడ్డుకుని ఉద్యమ నేతలకు సహాయ సహకారాలు అందించి నిజాం పాలన నుండి విముక్తి పొందడం వరకు అన్ని ఘట్టాలను కళ్ళారా చూసిన వీరవనితైనా తెరవెనకే మిగిలిపోవడం అత్యంత బాధాకరం . వారి ఫోటో కోసం వెతుకులాటలో ఎంతో సమయం వెచ్చించాల్సివచ్చింది.మీలాంటి త్యాగధనుల పోరాట ఫలితమే నేడు మేము అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవనం .మీ సేవలకు, అంకిత భావానికి అక్షరప్రణతులతో —

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మళ్లీ కూయవే గువ్వా”-1

ఆలు-మగలు