మళ్లీ కూయవే గువ్వా”-1

ధారావాహిక నవల

విండో కర్టెన్స్ పూర్తిగా జరిపింది మాధవి! విండో గ్లాస్ లోనుండి పౌర్ణమి వెన్నెల, వెన్నెలలో మెరుస్తున్న చినరాయని చెరువులో నీళ్లు! చెరువు చుట్టూ కట్టిన అపార్ట్ మెంట్స్ నుండ తళుక్కుమంటున్న విద్యుత్కాంతులు.
గదిలో ఉన్న ఏసి చల్లదనానికి జడలో విరిసిన మల్లెల సౌరభాలు గదిలో వెలిగించిన అగరొత్రుల పరిమళాలతో కలిసి మనసుని ఉల్లాస భరితంగా మారుస్తోంది. సారేగామ కారవాన్ లో వినిపిస్తున్న వెన్నెల పాటలు ప్రతి పౌర్ణమి తమకు వసంత పౌర్ణమే! అనుకున్న మాధవి మనసులో మధురోహలు! అకస్మాత్తుగా తనని వెనకనుండి చుట్టుకున్న బలమైన చేతులు ఆమె మెడ ఒంపులో తలాన్చిన కేశవరావు మత్తుగా మల్లెపూలని ఆఘ్రాణిస్తూ “ఏమిటో రాణీగారు ప్రకృతి రమణీయతలో ములిగిపోయినట్లున్నారు. ఈ దాసుణ్ణి కూడా తమ చూపులతో కరుణించాలి ఇంక ఇది నా సమయం కదా!” అన్న అతని మాటలకు జివ్వుమన్న మేనుతో అతనికి అభిముఖంగా తిరిగి అతని మెడచూట్టూ చేతులు వేసి “నేనేం కాదన్నానా! తమరి గురించేగా ఈ సింగారం ఈ వెయిటింగ్! తమతు జలకాలాటలు పౌడర్ గుభాళింపులు, అత్తరు అలదుకోడాలు చూడకపోతేనా! అవన్నీ నాకోసమేగా అని కాస్త సమయమిచ్చాను అంతే!” అని కేశవరావుని హత్తుకుంది. ఆ ప్రేమాలింగనంలో కాసేపు అలా ఉండిపోయారు.
కాసేపున్నాక “పద అన్నం పెట్టు! నేను కూడా వచ్చేస్తున్నాను! అన్న కేశవరావు మాటలకి “పదండి “అన్నీ మీకిష్టమైనవి చేసాను. అన్నింటికి న్యాయం చేయాలి మరి!” అని కొంటెగా అంటూ వంటింటిలోకి దారి తీసింది మాధవి
ఆమె వెన్నంటే కిచెన్ లోకి వెళ్లి మంచినీళ్లు నింపుతూ
“అది నా డ్యూటీ కదా! కేవలం భోజనానికే కాదమ్మడూ!
తమరికి కూడా” అంటూ కొంటె గా కన్ను గీటాడు.
అతనికి జవాబుగా అక్కడే ఉన్న గరిటతో సుతారంగా ఒక్క టిచ్చి , “తాతగారైనా పెద్దరికం రావటంలేదు తాతగారికి! అన్న మాధవి వెంటే మంచినీళ్ల గ్లాసులు డైనింగ్ టేబుల్ పైన పెట్టి కంచాలు కూడా తేవడానికి వెడుతూ,
“అవన్నీ మనకొచ్చిన ప్రమోషన్స్ అయినా అమ్మమ్మ అయ్యావు బామ్మ అయ్యావు నీ అందమేదైనా తగ్గిందా? నాకు పెద్దరికం రావడానికి! పెద్దరికాలు మన శరీరాలకు వస్తాయి మనసుకి కాదమ్మడూ! మనకి ఎనభైలు తొంభైలు వచ్చినా ఇలాగే ఉండాలి. అన్నాడు.
ఆమాటకు నవ్వుతూ ” హా మీరుంచుతారు ఉంటారు! ఇలాంటివాటికేమి కొదువ లేదు అనేక నవ్వుతూ వడ్డించటం మొదలుపెట్టింది.
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసారు. అన్నీ యధావిధిగా సర్దేసి మంచినీళ్ల చెంబు గ్లాసు తీసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చేసింది మాధవి.
అప్పటికే పక్కంతా సర్దుతున్న కేశవరావుని వక్కపొడి కావాలా అంది మాధవి. వద్దు లవంగాలు తీసుకురా? అన్బాడు కేశవరావు అక్కడే అల్మరాలో ఉన్న స్టీలు భరిణలో న్న లవంగాలు రెండు నోట్లో వేసుకుని, మరో రెండు కేశవరావు చేతిలో వేసి మంచం మీద కూర్చుంది మాధవి.
అప్పటికే నడుం వాల్చిన కేశవరావు “బాగా అలసి పోయావుకదామధూ! అన్నాడు.
“హా! ఉదయం ఫంక్షన్ కని త్వరగా లేచాము కదా!”
అంది.
“నాకు సావిత్రిని చూస్తే దిగులుగా ఉంది మధూ! తనయితే ధైర్యంగా ఉంది. కానీ తను ఇంకా కోలుకోవటంలేదు.
ఎలా ఉన్న మనిషి ఎలా అయిపోయింది!” అన్నాడు కేశవరావు.
“అవునండీ! మీరు దిగులు పడకండి. అక్క కోలుకుంటుంది.
వచ్చిన ప్రాబ్లం అలాంటిది కదా! మనమందరమున్నాము కదా! ఈ రోజు మనవరాళ్లను మనవడిని చూసుకుని ఒకటే ఆనందం అక్కయ్యకి!”
అవును ఒకరా! ఇద్దరా మొత్తం మన పిల్లలు ఏడుగురు పిల్లలకి కలిపి పదిమంది పిల్లలు. వారందరిని చుట్టూ పెట్టుకుని మనం ముగ్గురం దిగిన ఫొటో ఎంత బాగా వచ్చిందో! అన్నాడు.
“ఆ ఫొటో లామినేషన్ చేయించి ఇక్కడ కూడా ఒకటి పెడదాము” అంది మాధవి. “తప్పకుండా! ఇంక పడుకుందామా! లైటార్పేస్తాను” అంటూ బెడ్ పక్కనే ఉన్న స్విచ్ ఆపేసి బెడ్ లైట్ వేసాడు. సన్నని నీలం కాంతి రూమంతా పర్చుకుంచి.
మాధవి కూడా అతని పక్కనే నడుం వాల్చింది.
ప్రేమగా దగ్గరకి లాక్కున్నాడు కేశవరావు
ఆ క్షణం కోసమే చూస్తున్నట్లుగా అతన్ని అల్లుకుపోయింది.
మోహావేశాలతో అల్లుకుపోయిన ఆ జంటను చూసి చంద్రుడు అల్లరిగా నవ్వుకున్నాడు.

“ఎండలు మండిపోతున్నాయి! తలుపు తీస్తే చాలు వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఎండలోకి వెడితే ఒళ్లంతా కాలుతున్నంత వేడి! భానుడు ప్రచండంగా మింటినుండి భగభగలాడుతున్నాడా అనిపిస్తోంది.
” మాగాయముక్కలు సాయంత్రానికి బాగా ఎండిపోతాయి. రేపు కలిపేస్తే ఊరగాయల పని అయినట్లే !అనుకుంటూ, గుమ్మంబైట మంచం మీద ఎండ బెట్టిన మాగాయముక్కలను ఒకసారి ఎడాపెడా కదిపి, ఊటను కూడా గరిటతో కలిపి, ఇంట్లోకి వచ్చింది మాధవి. అప్పటికే ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. లోపలకి రాగానే పిల్లతెమ్మెరలా సోకిన ఏసి చల్లదనానికి హాయిగా అనిపించింది. హమ్మయ్య అనుకుంటూ కుర్చీలో కూర్చున్న మాధవిని చూసి
“ఎందుకురా మధూ! అలా ఎండలో ఇంట్లోకి బైటకు అస్తమాను తిరుగుతావు?
రంగు తగ్గిపోతావు జాగ్రత్త! అంటున్న కేశవరావుని చూసి
“ఎంత తగ్గినా మీకన్నా తెల్లగానే ఉంటాలే !” అని కొంటెగా అంది మాధవి. “అది నిజమేలే! అందుకే తమరికి అంతగీర!” అన్నాడు మురిపెముగా మాధవిని చూస్తూ.
ఏదో అనబోయిన మాధవి
కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడింది.

అప్పుడే చేతిలోకి తీసుకున్న
 టీవీ రిమోట్ టేబుల్ పైన పెట్టి తలుపు తీయబోతో సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తున్న కేశవరావుని ప్రశ్నార్ధకంగా చూసింది. మాధవి.

 పర్వాలేదు తీయి! అన్నాడు కేశవరావు.
 తలుపు తీసిన మాధవి సంబ్రమాశ్చర్యాలలో మునిగి తేలింది. ఎదురుగా తన స్నేహితురాలు జాహ్నవి.

‘సశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీవే నా ప్రాణం