ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలు అంతరిక్ష పరిశోధన చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, విజయవంతంగా భువిపై కాలు మోపిన సందర్భంగా ..,
అంతరిక్షం ఆమెకు అంతఃపురం
అంతులేని ఆకాశం ఆమెకు అందిన వరం

ప్రగతి పథంలో ఆమె పరిశోధనలు చేస్తూ
ప్రజలందరికీ ఖగోళక్షేత్రాన్ని పరిచయం చేసింది
బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ (వ్యోమనౌక)ను
పరీక్షించుటకు కంకణం కట్టుకుని దివిలోకి ప్రవేశించింది
వ్యోమగాములను, సాంకేతిక నిపుణులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్) లోకి
భువి నుండి తరలించే ప్రక్రియలో వ్యోమనౌకలో లోపాలను గుర్తించింది
అదియేమి అదృష్టమో స్టార్ లైనర్ మొట్టమొదటి మహిళా పైలట్ గా
ఆమెను మాత్రం సురక్షితంగా అంబుదాయంలోకి (ఐ.ఎస్.ఎస్) చేరవేసింది
ఎనిమిది రోజుల నిరంతర పరిశోధన అనంతరం తిరిగివచ్చే దశలో
హీలియం వాయువు కారిపోవుట
దాని వల్ల వ్యోమనౌకను ముందుకు నడిపే తృస్టర్ యంత్రాల విఫలం చవిచూసింది
చెడిపోయిన నౌకలో తిరుగు ప్రయాణం ప్రమాదమని
మానవరహితంగా నౌకను నాసా భూమి పైకి మళ్ళించింది
చేసేదేమీ లేక ఆమె భూ కక్ష్య లో తిరుగుతూ ఉన్న ఐ.ఎస్.ఎస్ లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
రీసైకిల్డ్ ప్రాణవాయువును పీలుస్తూ,
తేమ లేని ఆహారాన్ని భుజిస్తూ
వాతావరణానికి అనుగుణంగా వ్యాయామాలతో
శరీరాన్ని మలుచుకుంటూ జీవనం సాగించింది
ఐ.ఎస్.ఎస్ లోని సమాచార వ్యవస్థను వాడుకుంటూ
నాసా గ్రౌండ్ కంట్రోల్ తో అనుసంధానం ఏర్పరుచుకుంది
గురుత్వాకర్షణశక్తి లేమిని గుండె నిబ్బరంగా తట్టుకొని
విశాల రోదసిలో విహాంగంలా విహరించింది
ఏమరుపాటు నౌక శూన్యం లోకి నెట్టినా
ఏట్రింత పక్షి వలె స్వేచ్ఛగా ఎగిరింది
నీహారికల్లో గంటల తరబడి స్పేస్ వాక్ చేసి
నవ వ్యోమగాములకు రాచబాట వేసింది
ఉర్వి పైనే కాదు ఖగోళం లోనూ
తోటపని చేయవచ్చని నిరూపించింది
గగన గర్భము ఆమెను తొమ్మిది నెలలు మోసి
పేగు తెంపుకుని భువికి సంతోషంగా సాగనంపింది
కుమారస్వామి భూమండలాన్ని చుట్టుట పురాణం
ఆమె నాలుగువేల సార్లు చుట్టి వచ్చుట చారిత్రాత్మకం
ట్రంప్ పుణ్యమో ఎలాన్ మస్క్ కృషియో
దిగ్విజయంగా పృథివి పై కాలు మోపింది
ప్రాణం మీదికొచ్చే పరిశోధనలేమో గానీ
శాస్త్రవేత్తల ఆనందహేలకు కారణభూతమైంది
నక్షత్ర మండలంలో మిణుకుతారగా మిగలకుండ
చందమామను చుట్టే ఉపగ్రహంగా ఉండిపోకుండ
మరల సాటి మానవ జీవనాన్ని సాగించే
ఆశావహ దృక్పథంతో ఉన్నది ఆమె!
శారీరక ఇబ్బందులను సైతం భరిస్తూ
మహిళా సాధికారతకు నిర్వచనంగా నిలుస్తున్నది
ఆమె రాకకై ఎదురు చూసినది యావత్ ప్రపంచం
ఆమె ఆగమనం అద్భుతం, అనిర్వచనీయం, ఆదర్శప్రాయం
ఆమె విశ్వంభరి , ఆమె మౌన సంఘర్షిణి
అందుకే, ‘ ఆమె ‘ అంతరిక్షాన్ని జయించింది!!
ఈ వేళ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అన్న మాటలు గుర్తుచేసుకుంటూ,
” రావమ్మా మహారాణి
ఏలమ్మా కాలాన్ని
అంది ఈ లోకమే
అన్నీ నీకోసమే
అంతా సౌందర్యమే…”