
” సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా, బంగారు కలలే కంటున్నారా”
బంగారు కలలు చిత్రంలోనిదీపాట. సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు, సాహిత్యం కొసరాజు గారు, గానం పి .సుశీల గారు, అభినయం వహీదా రెహమాన్ గారు దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావుగారు.
జీవితంలోని వివిధ దశల్లో యవ్వనం చాలా ముఖ్యమైనదే కాదు అందమైనది మరెంతో బాధ్యతాయుతమైనది కూడా. అలాగే అభద్రతతో కూడుకున్నది. యవ్వనం పాదరసంలా ప్రమాదకరమైనదే కాదు తీక్షణమైంది కూడా. ఎంతో ఎరుకతో జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుంది. పెద్దలు హద్దులు గీస్తున్నారనేది యువత భావన. కానీ జీవితాన్ని కాచి వడపోసి ఒంట పట్టించుకున్న జీవిత సత్యాల్ని ముందు జాగ్రత్తగా, తమ పిల్లలకు విడమర్చి చెప్పడంలోని ఆంతర్యం హద్దులు తెలుసుకొని మసులుకుంటారనే ఆశావాదం మాత్రమే. జాగ్రత్తగా ఉంటే ఉపద్రవాలు ముంచెత్తవనే ముందు చూపు వెరసి తమ పిల్లలు జీవిత సత్యాల్ని తెలుసుకుంటూ, సమాజపు పోకడలని అవగాహన చేసుకుంటూ తప్పటడుగులు వేయకుండా సమయస్ఫూర్తితో జీవితంపై చక్కని అవగాహన కలి
గి ఉంటారనేది వారి భావన.
కానీ యుక్త వయసు చాలా ప్రమాదకరమైనది, తొందరపాటు తనాన్ని ప్రతి సందర్భంలోనూ ప్రదర్శిస్తుంది. పరిణతి చెందని మానసిక స్థితి ఊహాజనిత లోకంలో విహరింప చేస్తుంది .సరైన మార్గదర్శి ఉంటే చాలా వరకు మంచి దారిలో వెళ్ళడానికి ప్రేరణ పొందగలుగుతారు. వ్యక్తిత్వం వికాసవంతం చేసుకునే వీలవుతుంది .
ఇక విషయ వివరణ లోకి వెళ్తే – ధనవంతుల ఇంట్లో పెరిగిన సరోజ అనే అమ్మాయి, దుర్మార్గుడైన శేషగిరిచే మోసగించబడి ఒక బిడ్డకు జన్మనిచ్చి, పరిస్థితుల ప్రభావంతో క్లబ్బుల్లో డాన్సర్ గా , డాన్స్ చేస్తూ స్నేహితుడైన రవికి ఎదురౌతుంది. ఆ సందర్భంలోనిదీపాట.

జీవితంలో మోసపోయిన తనలాంటి అమ్మాయిలను ఉద్దేశిస్తూ – అందమైన అమ్మాయిలూ, జీవితాన్ని గూర్చి, బంగారు భవిష్యత్తు కోసం అందమైన కలలు కంటున్నారా? జీవితమంటే చక్కని రహదారి కాదుసుమా! ఎన్నో ఎగుడుదిగుళ్ళు, సవాళ్ళు ఉంటాయి .మీరు పూలబాట అనే భ్రమతో ముళ్లబాటను ఎంచుకుని నడుస్తున్నారు. విశృంఖలత్వం ఎప్పుడూ సమర్థనీయం కాదు, హద్దులు దాటిన నడవడికతో నష్టపోయేది ,నవ్వులపాలు అయ్యేది ఆడపిల్ల మాత్రమే.సరైన మార్గంలో పయనించాలని చెప్తూ –
కలతలతో కూడిన కాపురాలు ఎప్పుడూ సరైన మార్గంలోఅంటే సజావుగా సాగవని, అన్యోన్యతతోనే అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే దాంపత్య బంధం పరిమళభరితమై ,విరితావులు వెదజల్లుతుందని లేదా రాలిన పూలలా వాడిపోయిన వసంతానికి ప్రతికగా మారుతుందని చెప్తూ –
ప్రేమలేని జీవితాలు ఎలా ఉంటాయో, ప్రేమ మోజులో పడి ఆహుతైన జీవితాలు ఎన్నోఅంటూ –
ప్రేమ అనేది ఇరువురి మధ్య అందమైన ,దృఢమైన వారధిగా రూపు దాల్చాలని, ఏకపక్షపు ప్రేమ ఆచరణీయం, ఆమోదయోగ్యం కాదంటూ, మోసంతోకూడిన ప్రేమ అత్యంత ప్రమాదకరమని, పాము పడగ నీడలో సేదతీరడం లాంటిదని, ఏ క్షణంలోనైనా అది కాటు వేయక మానదని హెచ్చరిస్తూనే – లోకం తీరు తెలుసుకొని మెలగాలంటూ, మంచి చెడులను వివేకంతో తెలుసుకొని, జాగ్రత్తగా నడుచుకోవాలంటూ, ఆకర్షణ మోజులోపడి ప్రేమనుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, బ్రతుకు భారమై అంధకార బంధురమై కన్నీటి సాగరంలో మునిగిపోతుందంటూ చక్కని సందేశాన్ని అందించిందీపాట. కొసరాజు గారి కలం నుండి జాలువారిని అక్షర సత్యాలకు సాలూరివారి సంగీత స్వరాలు తోడై, సుశీలమ్మ స్వరవాహినిలో తేలియాడించిన పాటకు , వహీదా రెహ్మాన్ గారి అభినయం సహజత్వాన్నిచ్చింది. ఏ కాలమాన పరిస్థితుల్లోనైనా సందేశాత్మకమై ఆడపిల్లల్ని ఆలోచనల్లో పడేసేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.