ఇంద్రజీత్ కౌర్ సంధు

ప్రముఖ విద్యావేత్త ,వైస్ ఛాన్సలర్, స్టాఫ్ సెలక్షన్ కమిటీ చైర్ పర్సన్ ఐన వీరు, సెప్టెంబర్ 1, 1923న పాటియాలాలో జన్మించారు . తల్లిదండ్రులు కల్నల్ షేర్ సింగ్ సంధు, కర్తార్ కౌర్.

 

పటియాలాలో విద్యాభ్యాసం చేసిన వీరికి ,పంజాబ్ సంస్కృతి, సంప్రదాయాలన్నా, పంజాబీ భాషన్నా మరీ మక్కువ. పంజాబీలో స్నాతకోతర పట్టా కలిగిన తొలి మహిళగా వీరు రికార్డు కెక్కారు.తత్వశాస్త్రంలో కూడా స్నాతకోత్తర పట్టాపొందారు. పటియాలాలో జన్మించి, లాహోర్లో ‘రాయ్ బహదూర్ సోహన్ లాల్ ట్రైనింగ్ కాలేజ్’ నుండి టీచర్ ట్రైనింగ్ లో ప్రాథమిక శిక్షణ పొంది 1946లో అధ్యాపకురాలిగా వృత్తి ప్రారంభించారు.

వీరి భాగస్వామి శ్రీ జ్ఞాని గుర్దిత్ సింగ్ కాగా వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు ప్రముఖ జర్నలిస్టు ,రచయిత శ్రీ రూపీందర్ సింగ్ కాగా మరొకరు ప్రముఖ వ్యాపారవేత్త ఐన శ్రీ రవీందర్ సింగ్ .

స్టాఫ్ సెలక్షన్ కమిటీ చైర్ పర్సన్ గా ఎన్నికైన తొలి ఉత్తర భారత మహిళగా రికార్డు సాధించారు.
ఆ సమయంలోనే ‘మాతా సాహిబ్ కౌర్ దళ్’ ద్వారా శరణార్థులు ,నిర్వాసితులైన మహిళలకు వెన్నుదన్నుగా నిలిచారు.

2009లో ( డాటర్స్ ఆఫ్ పంజాబ్) ‘ ధియాన్ పంజాబ్ డియాన్’ సిరీస్ లో సంధుపై జలంధర్ దూరదర్శన్ వారు డాక్యుమెంటరీ నిర్మించారు.

2020లో బిబిసి ప్రసారం చేసిన ప్రత్యేక సిరీస్ లో దేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన 10 మంది భారతీయ మహిళల్లో వీరొకరంటూ పేర్కొంది. ఈ కార్యక్రమం అనేక భారతీయ భాషల్లో ప్రసారమైంది.

‘ఎ ఫెస్ట్ స్క్రిప్ట్ ఫర్ ఇంద్రజిత్ కౌర్ సంధు అండ్ ఇన్స్పైరింగ్ స్టొరీ ‘ని సీనియర్ జర్నలిస్టు మరియు కుమారుడు ఐన శ్రీ రూపీందర్ సింగ్ ఎడిట్ చేసిన సంకలనమిది.శ్రీమతి కౌర్ తొంభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని వర్చువల్గా ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని. ఆమె గురించి తెలిసిన వ్యక్తులు, ఆంతరంగికుల అభివ్యక్తీకరణల సమాహారమీ వ్యాససంపుటి.
దీన్ని ఆంగ్లం, పంజాబీ భాషలలో వెలువరించారు. మొత్తం 29 కథనాలున్నాయిందులో.

1980 – 85 మధ్యకాలంలో న్యూఢిల్లీలో స్టాఫ్ సెలక్షన్ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న కాలంలో ఈమె ఎన్నో సంస్కరణ చేపట్టారు. పటియాల పంజాబ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా 1975 – 77 వరకు విధులు నిర్వర్తించారు ఈ కాలంలో అంతర్జాతీయ విద్యావేదికలని పంచుకుని దేశ ప్రతినిధిగా ఎంతో సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించారు. ఈమె కామన్వెల్త్ విశ్వవిద్యాలయంలో సభ్యురాలు కూడా .యూఎస్ఏ ఆస్ట్రేలియా ,యు కె లాంటి దేశాల్లో వేదికల పైన తమ స్ఫూర్తివంతమైన ప్రసంగాలతో ఎంతగానో అలరించారు.

1946లో అధ్యాపకురాలిగా వృత్తి ప్రారంభించిన ఇంద్రజిత్ కౌర్ దేశ, విదేశీ మీడియాల ద్వారానే విస్తృత ప్రచారంలోకి వచ్చారు.
ప్రొఫెసర్ నివేదిత శ్రీమతి కౌర్ గురించి చెప్తూ – ఆమె విసి అయ్యాక ,ప్రముఖ నాటక రచయిత అయిన డాక్టర్ సుజిత్ సేథిని వెయిన్ వి నాటక్ ‘ది ఏక్ పత్తర్ ‘రాయమని కోరగా ఆ నాటకం యూనివర్సిటీలో ప్రదర్శిస్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జ్ఞాని జైల్ సింగ్ ప్రత్యేకంగా విచ్చేసి వీక్షించారని గుర్తు చేసుకున్నారు.

కోవిడ్ మహమ్మారికి చిక్కి
జనవరి 27 , 2020 న
శాశ్వతంగా ఆ శారదాంబ పాదాలచెంతకు చేరిన ఈ విద్యా కుసుమానికి అక్షరాంజలి ఘటిస్తూ…

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాకాల యశోదారెడ్డి కథలలో (మా ఊరి ముచ్చట్లు) నాగి

‘అనూరాధకి ..ఆశీర్వచనాలు’ — అన్న పిలుపు నేడు మూగ పోయింది –