ఇది కవిత కాదు నాకు అర్థం కాని ప్రశ్నలు

                   రూప

మనం వాడుతున్న సెల్లుఫోనూ
మనం తొక్కుతున్న మోటార్లు
మనం ఎక్కుతున్న వాహనాలు
మన ఆడవారికి ఆసరాగా మిక్సిలు
మనం పొద్దస్తమానం చూసే టీవీలు
మన వినోదానికి సినిమాలు
ఇంకా…. ఇంకా… ఇంకా…..
వాయబ్బా
చెప్పాల్నాంటే శానానే ఉన్నాయ్ ❕

లేచింది మొదలు నిద్ర పోయేదాకా
యంత్రాలు లేకుంటే మనం వికలాంగులం అయిపోయాం!

మరి ఎందుకు యంత్రాన్ని యంత్రాలను కనిపెట్టిన వారిని తిడుతున్నాం❓

మన పిల్లలను సాంప్రదాయ విద్యలలో కి కాకుండా యంత్రాలు కనిపెట్టే ఇంజనీరింగు లోకి ఎందుకు నెట్టుతున్నం❓
రేపు వాడు ఇంజనీరు అయ్యి ఏ యంత్రాన్ని కనిపెట్టాలని బలవంతపు చదువులు వానిపై రుద్దుతున్నం?❓

మన పిల్లలు సాంప్రదాయ విద్యలు, కుల వృత్తులు చెయ్యడం మనకే ఇష్టం లేదు మరెందుకు మనం మందిని తిడుతున్నం?❓

ఉద్యోగాలు వెయ్యడం లేదని ప్రభుత్వాలనెందుకు నిందిస్తున్నం?❓

బార్బరు షాపులు పెట్టించలేదనా❓
చాకిరేవు నిర్మించలేదనా❓
కుమ్మరి చక్రం ఇప్పించమనా❓
కొలిమిలు తవ్వించలేదనా❓

కాదే❗

మనం ఫ్యాను కింది ఉద్యోగాలు మాత్రమే కోరుతున్నాం‼️

కుల వృత్తులను ఎంకరేజ్ చేసేదానికి గొఱ్ఱెలు బర్రెలు లాంటివి ఇస్తే ప్రభుత్వాలను ఎగతాళిగా మాట్లాడుతున్నాం❗

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులన్నీ గౌరవప్రదమైనవే వాటిని చేసినా తప్పేమీ లేదని ఎవరైనా మాట్లాడితే… నానా రభస రాస్తున్నాం❗
వాళ్ళపై రాళ్ళు రువ్వుతున్నం❗

ఇలా ఎందుకు మనకు ఈ రెండు నాలుకల ధోరణి ⁉️❗

అసలు మన పిల్లలు కుల వృత్తులలో ఉండటానికి ఇష్టపడుతున్నారా…⁉️

మరెందుకు మనం ఇప్పుడు యంత్రాలను, యంత్రాలను కనిపెట్టిన వారిని నిందిస్తున్నాం❓

ఎందుకు మనకు ఈ రెండు నాలుకల ధోరణి ⁉️❗

ఆ చక్రాన్ని కనిపెట్టకుంటే ప్రపంచ గతికి పరుగేది❓
ఈ కరంటునే కనిపెట్టకుంటే… మానవ మనుగడకు వెలుగేది❓
ఆ యంత్రాలే కనిపెట్టకుంటే ఈ రోజున ఇంత ప్రగతి సాధ్యమయ్యేదేనా…⁉️
మనిషి జీవన ప్రమాణాన్ని పెంచుతున్నాయి యంత్రాలు
మనిషికి సౌఖ్యాలు సమకూరుస్తున్నాయి యంత్రాలు❗
దూర తీరాలకు నడక తప్పించాయి❗
నెలల తరబడి జరిగే పనులను రోజుల్లో,
రోజుల తరబడి జరిగే పనులను గంటల్లో .. నిమిషాల్లో నెరవేరుస్తున్నాయి❗

ఆ సౌలతులన్నీ మనకు కావాలీ❗
అయినా …
మనం యంత్రాలను, యంత్రాలను కనిపెట్టే వారిని, యంత్రాలను సమకూర్చే వారిని దూషిస్తాం అదే మన భాషలో చెప్పాల్నాంటే ఆడిపోసుకుంటాం.❗

మళ్ళీ మనం వెనక్కేళ్ళి మోటబావిలో యాతమెయ్యగలమా…❓
యంత్రాలను మానేసి లేదా వదిలేసి లేదా ధ్వంసం చేసి మళ్ళీ మనం ఆదిమానవుల్లా బతకగలమా❓
అలా బతకడానికి కనీసం ఊహైనా చేయగలమా❓

కవులు రచయితలు గా మనం కోరుకోవాల్సిందల్లా…
మత్తు వదలాలని,
సోమరితనం వీడాలని,
అవినీతి పోవాలని,
దోపిడీ పోవాలని,
తారతమ్యాలు పోవాలని,
సమ భావన రావాలని,
సమాన అధికారాలు,
సమాన హక్కులు కావాలని,
సర్వ మానవ సమానత్వం నిండాలనీ….

Written by Rupa devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాన్న ఎక్కడ

అవును….అక్కడే!!!