(ఇప్పటివరకు: అపూర్వ వస్తున్నట్లు మెసేజ్ పెడుతుంది. అపూర్వ ను రిసీవ్ చేసుకొని తెనాలి వస్తాడు ప్రసాద్. అపూర్వ మకాం మైత్రేయి తన ఇంట్లో ఏర్పాటు చేస్తుంది.భవ్య కూడా తెనాలికి వస్తుంది. మర్నాడు భవ్య, అపూర్వల తో సహా ప్రసాద్ లాయర్ వెంకటేశ్వర్లు గారిని , వసుంధరని కలుస్తాడు. లాయర్ వెంకటేశ్వర్లు ఫామిలీ కోర్ట్ లోని ఎక్స్పర్ట్ లాయర్ అయిన రాఘవరాణి ని పిలిపిస్తాడు.ఆమె ద్వారా ఫ్యామిలీ కోర్ట్ లో విడాకులు అప్లై చేస్తారు ప్రసాద్ – అపూర్వ. )
అపూర్వ, భవ్య ఆ రోజే లంచ్ అవగానే విజయవాడ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిపోయారు.
ప్రసాద్ కి మనసంతా శూన్యం గా మారిపోయింది. ఎదో చెప్పుకోలేని బాధ. తాను నిజంగా అపూర్వని ప్రేమించాడు. ఆమె చిలిపితనం , చిన్నపిల్లలా చేసే పనులు, అమాయకత్వం తననెంతో ఆకర్షించాయి. ఎవ్వరు లేని తనకు చంద్రమౌళి గారు, సుమతి ఆంటీ వాళ్ళే తనవాళ్లవుతారని ఎంతో ఆశ పడ్డాడు. చివరికి ఎం మిగిలింది? తనలో తానే నవ్వుకున్నాడు వేదాంతి లాగ.
మైత్రేయి వచ్చి అతన్ని పిలిచింది. “ప్రసాద్ గారు, ఏంటి ఎదో విచారంలో ఉన్నారు. అపూర్వ ఇంత త్వరగా వెళ్లిపోయిందని బాధపడుతున్నారా?” అడిగింది.
ప్రసాద్ చిరునవ్వే సమాధానం అయింది. ప్రసాద్ కి మూడ్ మార్చాలని , “ప్రసాద్ గారు, పదండి మనం గుడికెళదాము, “అంటూ అతని లేవదీసింది.
ఇద్దరు బైక్ మీద కాంతమ్మ గారి ఇంటి దగ్గర ఉన్న మహంకాళి గుడి కి వెళ్లారు. అమ్మవారిదర్శనం అయ్యాక వచ్చి గుళ్లోనే మెట్ల మీద కూర్చున్నారు. చల్లటి గాలి తగులుతూ మనసుకి ఎంతో ప్రశాంతం గా ఉన్నట్లనిపించింది. అటువైపు కూర్చోవటానికి వచ్చిన రమణి వీళ్ళని చూసింది.
“నమస్తే అక్క, నమస్తే అన్న ఎలా ఉన్నారు? మీరీ మధ్యన రావడం లేదే, రాంబాయమ్మగారు కూడా తలుచుకుంటున్నారు,” అంది రమణి.
మైత్రేయి సంతోషంగా ,” రమణి రా! రా! ఇక్కడ కూర్చో,” అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది.
ఇంతలోకే జానీ కూడా అక్కడికి వచ్చాడు, “హలో జానీ ఏంటి విశేషాలు? మీరిద్దరికి పెళ్లి అయిందని ప్రభాకర్ అంకుల్ చెబితే నాకు ఆశ్చర్య మేసింది,” అన్నాడు ప్రసాద్.
“ అవును సార్, నాకు రమణి దక్కదేమో అని నేను చాల బాధపడ్డాను. ఆ అమ్మోరి దయవల్ల తనకి అనుకున్న సంబంధం తప్పిపోయింది. నా రమణి నాకే దక్కింది” అన్నాడు తృప్తిగా.
“ అవునక్క! నీ అనుమానం నాకు అర్ధమయింది. మా అన్న పెళ్లయిన రెండురోజులకే మా వదిన వాళ్ళ నాయన ప్లేట్ ఫిరాయించాడు. కొడుక్కి ఎదురు డబ్బులు ఇవ్వాల్సిందే అని పట్టు బట్టారు. మా అయ్య కాడ అంత డబ్బెక్కడిది. నేను అమ్మ గారికి ఫోన్ చేసి చెప్పిన. అమ్మగారు మా అయ్యకి నచ్చచెప్పి నన్ను తీసుకు రమ్మని జానీ ని పంపించింది. జానీ వచ్చాడు. జానిని చూస్తూనే నాకు పోగొట్టుకున్న పెన్నిధి దొరికిందనిపించింది. వెంటనే జానీ తో మా అయ్యా, అమ్మ వద్దన్నా వినకుండా నేను ఇక్కడకు వచ్చేసిన,” చెప్పింది.
“నేనేమో రమణి అంటే నాకెంతో ఇష్టమని అయ్యగారికి సెప్పిన. అయన పెద్దమనసుతో మా పెళ్లి జరిపించి మాకోసం వాళ్ళింటి యెనకాతలే ఒక గది మాకు ఉండడానికి కూడా ఇచ్చారు,” చెప్పాడు జానీ. “మాకు పెద్ద రాంబాయమ్మ గారే,” అంది రమణి. వాళ్ళ కధ వినడానికి ఎంతో సొంపుగా , చూడ ముచ్చటయినా జంటలా అనిపించింది.
“అక్క నీకో విషయం తెలుసా?”
“ఏంటి?”
“ అమ్మగారు , అయ్యగారు మూడేళ్ళ పాటు పంజాబ్ లో ఉంటారంట,” చెప్పింది రమణి.
“వ్వాట్ ,” ఇద్దరు ఒక్కసారే నమ్మలేనట్లు చూసారు రమణి వంక.
************
కొద్దీ రోజుల పాటు ప్రసాద్ , మైత్రేయి వారి పనుల్లో మునిగిపోయారు. మైత్రేయి కాలేజీ కెళ్ళడం రావడం లో చాలా బిజి గా ఉన్నది. కొన్ని అడిషనల్ డ్యూటీస్ ఇవ్వడంతో పనుల వత్తిడి పెరిగి తన ఫైనల్ కేసు తీర్పు రోజు గురించిన ఆలోచన పక్కన పెట్టింది.
కానీ వసుంధర మాత్రం అవకాశం ఉన్నంతవరకు సుబ్బారావు కి సంబంధించిన విషయాలు, అతను చేసిన కొన్ని సీక్రెట్ వ్యవహారాలు చాలా మటుకు కూపీ లాగించింది సుమంత్ ద్వారా. అలాటి ఒక విషయమే సుబ్బారావు చేసిన లోన్ మాఫియా వ్యవహారం. ప్రభాకర్ నుండీ కూడా ఆయన సేకరించిన సమాచారమంతా తెప్పించి కోర్ట్ లో సుబ్బారావు కి వ్యతిరేకంగా సబ్మిట్ చేసింది. కోదండపాణి కూడా చాల మటుకు సుబ్బారావు కి నష్టం కలగకుండా ఉండడానికి కావాల్సిన సాక్ష్యాలను కోర్ట్ కి సమర్పించాడు. అయినా కూడా ఆయన కి అనుమానంగానే ఉన్నది సుబ్బారావు ని ఈ కేసు నుండి తప్పించటం అంత సులభం కాదని.
ఎవరి ప్రయత్నాలు ఎన్ని చేసిన జరగాల్సింది జరగక మానదు. అందరు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది.
కోర్ట్ వాతావరణం ఎప్పటి లాగే ప్రతి ఒక్కరి మనసులో ఉండే భయాందోళనలను ప్రతిబింబిస్తూ, నల్లకోటు తెల్ల టై తోటి కనిపించే లాయర్లు న్యాయా ని కి రక్షకులుగా కనిపిస్తున్నారు. కోర్ట్ ఆవరణలో ఉన్న పోలీసు లు అందరిని రక్షించటం, అక్రమాన్ని అరికట్టడం తమ బాధ్యత అన్నట్టుగా హుందాగా అటు ఇటు తిరుగుతున్నారు. న్యాయం జరుగుతుందా లేదా! తనకు అనుకూలమయిన తీర్పు వస్తుందా రాదా? ఇలా ఎంతకాలం చెప్పులరిగేటట్టు ఈ కోర్ట్ చుట్టూ తిరగాలిరా భగవంతుడా అన్ని బెదురుబెదురుగా కోర్ట్ ఆవరణ లోకి వస్తున్న జనం. ఆ జనం మధ్య నుండి ఆటో దిగిన మైత్రేయి, ఆమె వెనకాలే పరంధామయ్య గారు , ప్రసాద్ కోర్ట్ ఆవరణలోకి వచ్చారు. అప్పటిదాకా వాళ్ళకోసమే ఎదురుచూస్తున్న రాజ్యలక్ష్మి వాళ్ళని కలుసుకొని లాయర్ వసుంధర కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది..
మరో వైపు లాయర్ కోదండపాణి తోటి వస్తున్న సుబ్బారావు కనిపించాడు. కొద్దీ రోజులక్రితం దాకా ఉన్న అహంకారం కనిపించటం లేదు సుబ్బారావు లో, ఎదో భయం కొట్టొచ్చినట్టు గా కనిపిస్తున్నదని గమనించాడు ప్రసాద్.
సుబ్బారావు నేరుగా పరంధామయ్య గారి దగ్గరి కొచ్చి,” నమస్కారం మావయ్య గారు! కులాసానా? “ అంటూ కుశల ప్రశ్నలు వేసాడు. పరంధామయ్యగారు పొడిపొడిగా సంధానం చెప్పాడు. మైత్రేయి వంక కోరగా చూస్తూ నడుస్తూ ఎదురుగా ఉన్న స్థంభం చూసుకోకుండా తలకి గుద్దుకున్నాడు. నుదుటి మీద బొప్పి కట్టింది. “ వెనక ముందు చూసుకోకుండా వ్యవహారాలు చేస్తే ఫలితం ఇలాగె ఉంటుంది ,” అంటూ చురకవేసాడు లాయర్ కోదండపాణి.
********************************
కోర్ట్ కారవాయిని అనౌన్స్ చేసాడు బంట్రోత్ కిష్టయ్య. జయమ్మ గారు కోర్ట్ హల్లో కి రాగానే అందరు గౌరవంగా లేచి నిలబడ్డారు. ఆమె కూడా నమస్కారం చేసి కూర్చుంది. ఆ రోజు గృహహింస చట్టం కింద నమోదయిన మైత్రేయి vs సుబ్బారావు కేసు మీద ఇచ్చే తీర్పు ఆ రోజే. పరంధామయ్య గారు, ప్రసాద్, అక్కమ్మ, రమాదేవి, పంతులు గారు లాంటి వాళ్ళందరూ విజిటర్స్ కూర్చునే చోట కూర్చున్నారు. ఒక కార్నర్ లో ప్రభాకర్ గారు కూడా కూర్చొని ఉన్నాడు. అందరు ఆసక్తి కరం గా చూస్తున్నారు జస్టిస్ జయమ్మ గారేమి చెప్పబోతున్నదాని !
సుబ్బారావు కి మొహం లో నెత్తురుచుక్క లేదు. మైత్రేయి కి మనసంతా ఆందోళనగా ఉన్నది. వసుంధర చాలా ఆత్మవిశ్వాసంతో, లాయర్ కోదండపాణి కాస్త అనుమానంతో ఆమె తీర్పు కోసం వేచి ఉన్నారు.
జస్టిస్ జయమ్మ గారు కళ్ళద్దాలను సవరించుకొని తను రాసిన తీర్పు లోని కొన్ని ముఖ్యమయిన అంశాలను మాత్రమే చదువుతానని, మిగిలిన విషయాలన్నీ తీర్పు యొక్క కాపి లో అందచేయబడతాయని చెప్పి, చదవటం మొదలుపెట్టింది.
“ ముందస్తుగా గృహ హింస జరిగిందని దానికి న్యాయం చేయమని ధైర్యం గా ముందుకొచ్చి , ఇప్పటివరకు ఎన్నోరకాలుగా సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటు కూడా ధైర్యం గా నిలబడిన పిటిషన్ దారురాలు శ్రీమతి మైత్రేయి ని న్యాయస్థానం అభినందించకుండా ఉండలేకపోతున్నది.
ఇప్పటికి కూడా ఆడపిల్లలు ఇలాటివిషయాలలో ధైర్యంగా ముందుకు రాలేక పోతున్నారు. శ్రీమతి మైత్రేయి లాంటి వారు ఒకస్పూర్తి అవుతారని ఆశిస్తున్నాను.
అలాగే పది ఇళ్లలో పనిచేసుకుని బతికే శ్రీమతి అక్కమ్మ, గృహలక్ష్మి లాగా ఇంటిని సరిద్దిద్దుకునే ఇల్లాలు రమాదేవి గారు లాంటి వారు సహితం ఆమెకు అండ గా నిలబడిన నేపథ్యంలో, తల్లి తండ్రులెందుకు మారలేకపోతున్నారు, పెళ్లి చేయగానే ఆడపిల్లకి కన్నవారికి ఎలాటి బందంలేదు అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో నాకు అర్ధం కావటంలేదు. అలాటి స్థాయి ఇప్పటికి కూడా ఉన్నదని తెలిసిసి నేను చింతిస్తున్నాను.
ఇప్పుడు అసలు కేసు విషయానికొస్తే సుబ్బారావు గారి కి అలవాటుగా భయపెట్టడం , ఇబ్బంది పెట్టె నైజం ఉన్నదని రుజువవుతున్నది. అంతే కాదు అతనెంత బాధ్యతా రహితంగా తన కుటుంబం పట్ల ప్రవర్తించాడో అనేది కూడా స్పష్టమవుతున్నది. శ్రీమతి మైత్రేయి గారి లాయర్ వసుంధరగారు ప్రవేశపెట్టిన కొన్ని ఆధారాలను పరిశీలించిన మీదట , సుబ్బారావు గారు న్యాయ స్థానం ముందు ఎంత పశ్చాత్తాపము ప్రకటించినా కూడా, అయన చేసిన పనులేవీ క్షమించదగినవిగా లేవని న్యాయ స్థానం నమ్ముతున్నది. అందుకని 498A of IPC ( గృహ హింసనుండి మహిళల రక్షణ చట్టం, 2005,)
115 ఆర్టికల్ ( 115 Causing Hurt- ofences requiring a particular intent or knowledge committed by one who is intoxicated) క్రింద శ్రీమతి మైత్రేయిని ఆమె భర్త శ్రీ సుబ్బారావు ఆమెను శారీరకంగా హింసించాడని, తన తప్పిదం కప్పిపుచ్చుకోవడానికి తప్పులమీద తప్పులు చేస్తూ శ్రీమతి మైత్రేయి ని మానసిక క్షోభకు గురిచేసాడని న్యాయస్థానం నమ్ముతుంది.
తప్పు కానీ నేరం కానీ మొదటిసారే అయిన దానిని తప్పుగానే లేక నేరంగానే పరిగణించపడుతుంది. అసలు తప్పే చేయకూడదు. ఆ తప్పు చేసానని వప్పుకొని పశ్చాతాపం తో
క్క్షమా పణ అడిగిన సుబ్బారావు గారు కొంత వరకే క్షమార్హులు. అతని వలన మైత్రేయి అనుభవించిన మానసిక క్షోభ వెలకట్టలేనిది. ఆమె కోల్పోయిన గౌరవం తిరిగిపొందటానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేనిది.
ఈ నాడూ ఈ న్యాయ స్థానం ఇచ్చే తీర్పు వలన సుబ్బారావు లాంటి వాళ్లకి కను విప్పు కావాలి. ఇలాటి గృహహింస నేరాలు అదుపులోకి రావాలన్న బలమయిన సంకల్పంతో సదరు సుబ్బారావు పెనాల్టీ రూపంలో శిక్ష తప్పదు. ఆర్ధికం గా ఆయన సహాయం అక్కర లేకపోయిన ఆమెకి కొంత ఊరట కలిగించే ప్రయత్నం లో శ్రీమతి మైత్రేయి కి సుబ్బరా గారు అయిదు లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సివుంటుంది. అంతేకాకుండా అతనిలో ఉన్న నేర ప్రవృత్రికి శిక్ష గా లక్ష రూపాయలను కోర్ట్ కు చెల్లించవల్సిందిగా న్యాయ స్థానం ఆదేశిస్తున్నది.
స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీల రక్షణ కోసం ఎప్పుడు ముందుండే లాయర్ వసుంధర ని అభినందిస్తున్నాను. ఈరోజు నా సమక్షంలో హాజరయిన అనేకమంది నగర ప్రముఖులు ఇలాటి సమస్యలు లేని ఒక మంచి సమాజ నిర్మాణానికి కృషిచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను,” అంటూ జస్టిస్ జయమ్మ గారు ముగించారు.
కోర్ట్ విచారణ అప్పటికి ముగిసిందని, తిరిగి లంఛ్ బ్రేక్ తరువాత విచారణ కొనసాగుతుందని బంట్రోతు కిష్టయ్య అనౌన్స్ చేసాడు.
అందరు జయమ్మ గారు వెళ్లెవరకూ ఆగి బయటికి వచ్చారు. లాయర్ కోదండపాణి లాయర్ వసుంధరని అభినందించాడు. రాజ్యలక్ష్మి మైత్రేయి ని హగ్ చేసుకొని మనసారా అభినందించింది.
పరంధామయ్యగారు, తీర్పు లో జయమ్మ గారు తమ గురించి ప్రస్తావించిన విషయం తలచుకొని బాధపడ్డారు మనసులోనే. కానీ పేలవంగా అయినా అయన ముఖం లోని భావాన్ని ప్రసాద్ తో పాటు మైత్రేయి కూడా గమనించి, “నాన్న గారు , మీరు బాధ పడకండి. జయమ్మ గారు ఏమి చెప్పిన ఒక్కరిని ఉద్దేశించి కాదు. అందరు తెలుసుకోవాలని చెబుతారు.” అన్నది. అయన మనః స్ఫూర్తి గా, “నాలాంటి తల్లి తండ్రులకి కూడా ఈ తీర్పు కనువిప్పు లాంటిదమ్మ. మనకు తెలియక పోతే ఇలాటి విజ్ఞులు చెప్పినప్పుడయినా తెలుసుకోవాలి,” అన్నాడు.
కోర్ట్ నుండి అందరు వెళ్ళడానికి సిద్దమయ్యారు. పరంధామయ్య గారు మైత్రేయి ఆటో లో ఇంటికి చేరారు. వాళ్లతో పాటె ప్రసాద్ పంతులుగారిని రమాదేవి ని, అక్కమ్మ ను మరో ఆటోలో ఎక్కించి, తాను తన బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. అందరు ఇల్లు చేరు కున్నారు.
“ మైత్రేయి నువ్వు అన్నం ఒక్కటే వండుకో , మీ నాన్నగారు కూడా ఉన్నారు కదా, పప్పు కూర, చారు నేనిస్తాను,” అంటూ చకచక రమాదేవి లోపలకెళ్లిపోయింది. ఆమెలో ఎదో మార్పు కలిగినట్లనిపించింది మైత్రేయికి. ఆ మార్పు ఒక స్పందన, అది తనని తానూ తెలుసుకోవడానికి జరిగే మానసికమయిన వ్యధ , అదే తనతో తానూ చేసే పోరాటం. ఇక రమాదేవి మంచి వైపుకే నడుస్తుందని అనుకుందాం.
లోపలికి వెళ్ళగానే మైత్రేయి అందరికి కాఫీ కలిపిచ్చింది. “ప్రసాద్ గారు, మీరు కూడా ఇక్కడే తిందురుగాని, ఫ్రెష్ అయి రండి ,” అంది మైత్రేయి. అలాగే అంటూ కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు అతను. మైత్రేయి “నాన్న గారు నేను కూడా స్నానం చేసి వస్తాను, “ అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. పరంధామయ్య గారు ఒక్కరే అక్కడ కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక బైక్ ఆగినట్లనిపించింది ఆయనకి బయట. అయన వాకిలి వైపు చూసాడు. సుబ్బారావు వస్తున్నాడు లోపలకి. నేరుగా వచ్చి అయన కాళ్ళకి దణ్ణం పెట్టి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
“ మావయ్య గారు , నన్ను క్షమించండి. నేనే మైత్రేయిని చాలా బాధపెట్టాను. అందుకు నేను తీసుకు రాలేనంత రొఖం నాకు పెనాల్టీ గ పడింది. ఇప్పుడు మీరే నన్నాదుకోవాలి. మైత్రేయికి నచ్చచెప్పండి. కోర్ట్ వారు చట్టపరం గా మమ్మల్ని విడదీయలేదు. అందుకని ఆమె నా నుండి విడిపోయే ప్రయత్నాలేవీ చేయొద్దని చెప్పి , మా సంసారం నిలబడేలా చూడండి ,” అంటూ ప్రాధేయ పడ్డాడు. పరంధామయ్యగారికి కోపంతో దవడలు బిగుసుకున్నాయి. ఇప్పుడు తానేమి మాట్లాడకూడదని శాంతంగా, “ చూడు సుబ్బారావు , నువ్వు నన్ను కూడా మభ్య పెట్టావు నీ ప్రవర్తనతో. ఇప్పుడు నేను కూడా నీ మీద నమ్మకం పోగొట్టుకున్నాను. ఈ విషయం లో నేను మైత్రేయికి ఏమి చెప్పను, అంతా తన నిర్ణయమే. ఇప్పుడీ విషయాలేవీ మాట్లాడే సమయం కాదు. నువ్వువెళ్లిపోవచ్చు,” అని ఖరాఖండిగా చెప్పాడు. మారుమాట్లాడకుండా సుబ్బారావు వెళ్ళిపోయాడు. అతను వెళ్లిపోవడం అక్కమ్మ చూసింది.
రమాదేవి తను తయారు చేసిన పప్పు, కూర, టమాటో చారు గిన్నెలో పెట్టి తీసుకు వచ్చింది. చనువుగా వంటగదిలోకి వెళ్లి, “మైత్రేయి గిన్నెలు ఇక్కడపెడుతున్నాను,” అంటూ
“ బాబాయ్ గారు తనకి చెప్పండి ఉరువులన్ని వంటగది లో పెట్టానని; మీ అల్లుడు వచ్చినట్లున్నాడే ?” అన్నది
“అవునమ్మా. కానీ నువ్వు అతన్ని చూసినట్లు మాత్రం మైత్రేయికి చెప్పమాకు,” అన్నాడు.
“సత్య ప్రమాణికంగా,” అంటూ వెళ్ళిపోయింది.
మైత్రేయి వచ్చి జోజనం వడ్డించి ప్రసాద్ ని కూడా పిలిచింది. అందరు జోజనం చేసారు. పరంధామయ్యగారు కాసేపు విశ్రాంతి తీసుకొని, “అమ్మ మైత్రేయి, నేనిక వెళతానమ్మా. నువ్విప్పుడు స్వతంత్రురాలివి. మానుండి కూడా నీ మీద ఏ వత్తిడి ఉండదు. నువ్వు నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. ఏది చేసిన కొంచం ఆలోచించి చేయి. పెద్దవాళ్ళం కద సలహాలు చెప్పకుండా ఉండ లేము,” అన్నాడు.
ప్రసాద్ ఆయన్ని బస్స్టాండ్ దగ్గర దింపి గుంటూర్ బస్ ఎక్కేదాకా ఉండి వెనక్కి వచ్చేసాడు.
*******************************
ఆ మరునాడు మైత్రేయి కాలేజ్ కెళ్ళింది. ప్రిన్సిపాల్ ఇందిరాదేవి , తెలుగు లెక్చరర్ వైదేహి మైత్రేయి ని మనసారా అభినందించారు. స్టాఫ్ రూమ్ లో ఉండగా మాథ్స్ లెక్చరర్ రాజన్ ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తమమయిన తీర్పు అన్న హెడ్డింగ్ తో ప్రచురించబడిన వార్తని పెద్దగా చదువుతూ, “ఇందులో పేర్లు ప్రస్తావించకుండా రాసారు,” అన్నాడు.
మైత్రేయి విని విననట్లు ఉండిపోయింది. అన్ని క్లాసులు అయిన తరువాత , వైదేహి తో కలిసి కాంటీన్ కెళ్ళింది. అక్కడ వైదేహి అన్నది, “ముగిసిపోయిన దాన్ని మనసులోంచి కూడా తీసేసి ముందుకు నడవాలి మైత్రేయి. ఈ ప్రపంచం భయపడేవాళ్ళని మరింత భయపెడుతుంది, పట్టించుకునేవాళ్ళని, మరింతగా పట్టించుకునేలా చేస్తుంది, వ్యతి రేకించేవాళ్ళని వెంటబడి తరుముతుంది, ధైర్యంగా ఎదురు నిలిచే వాళ్ల వెనకాతల నమ్మకమయిన పెంపుడు జీవిలాగా వెంటవస్తుంది. ఈ ప్రపంచం నీకెలా కావాలో ఆలోచించుకొని ముందుకి నడువు. ఇప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతాయి. నీ జీవితం నీ ఇష్టమే అయిన, అందరు తలదూర్చటానికి ప్రయత్నిస్తారు. మనసు దిటవుగా ఉంచుకోవాలి, చెప్పిన ప్రతిదాన్ని, అన్నదాన్ని మనసులోకి తీసుకొని బాధపడకూడదు,” అన్నది.
మైత్రేయి కాఫీ తాగుతూ ఆమె చెప్పినదంతా శ్రద్దగా విన్నది. కాంటీన్ బయటికొచ్చి , “నాకేమి క్లాసులు లేవు మేడం నేను వెళతాను. మీ మాటలు నన్ను ఆలోచింపచేశాయి. మళ్ళి కలుద్దాం,” అని వెళ్లిపోయింది.
అలా వెళ్లిపోతున్నా మైత్రేయి, “ కొలిమిలో కాల్చి న ఇనుము లాగా చాలా ధృడంగా కనిపించింది. ఇప్పుడు ఆమెని ఎలాటి సమస్యలేవీ కదిలించలేవని అనిపించింది. గట్టి పడిన మంచులా ఆమె మనసు మారిపోయిందేమో, ఇప్పుడు ఆమె మనసనే అమృత సరోవరం నుండి జీవనది పుట్టాలి. అది ఎందరికో ప్రాణాధారం అవ్వాలి,” అంటూ మనఃస్ఫూర్తిగా మైత్రేయి ని దీవించింది ఆమె.
(ఇంకాఉన్నది)