మనసుకు నచ్చిన మెచ్చిన భావాలు…
మాటల కందని పద గుంఫనలు…
మల్లెలా వికసించి తావిలా మిగిలేటి….
అక్షర కుసుమాలే నా కవిత్వం…..
నునులేత కొమ్మలకు విరబూసిన
పూల మకరందం తేనీయలొలుకుతూ….
సున్నితంగా ,మొలకెత్తే పద చిత్రాలు
ప్రతి కవనం నుండి రాలుతున్న….
అక్షర సేద్యమే నా కవిత్వం….
మంచిని తలచి మమతను పెంచి…
సమాజ హితాన్ని ఆలంబనగ చూసి…
ప్రకృతి పులకరింతకు జాలువారి….
నరనరాన పరవశించేదే నా కవిత్వం…
ఆసక్తి తో మేధా సంపత్తిని పదును పెట్టి
లోకం ,పోకడల,తారతమ్యాలను ..
మంచి చెడుల మమతల బంధాన్ని….
భ్రాతృ ప్రేమకు పట్టాభిషేకం
చేసే నవ సంజీవనిగా….
మనస్సు లోతుల్లో నుండి వచ్చేదే నా కవిత్వం…
ప్రకృతి అయినా, సంస్కృతి అయినా
వస్తువైన… అస్తిత్వ మైనా..
సంప్రదాయ సాంస్కృతిక జీవనమైనా ….
దైవమయిన ,పురాణమయినా…
మనిషి వ్యక్తిత్వం అయినా…
ఆటుపోటులు ,హృదయ కంపనలు…
సంవేదనగా ,పుట్టుకొచ్చేదే నా కవిత్వం…
జాబిలి వెన్నెలలను తాకే చల్లదనం లా…
ఆనందాల హరివిల్లులు నేమరువేసుకునేలా…
తమ తమ కలాలనుండి ….
స్పష్టంగా వచ్చే పదాలే నా కవిత్వం …
మస్తిష్కంలో జ్ఞాపకాల మేటలేసి
కలలోనైన వదలనంటుంది….
మరణం వరకు వీడనంటుంది నా కవిత్వం…
తీపి చేదు జ్ఞాపకాల సంతకాలే…
అలసిన ప్రాణానికి కాసేపు …
ఊరడించి సేద తీర్చేదే నా కవిత్వం.