సాయంత్రం వేడెక్కిన కొద్దీ యువకుల డార్మెటరీ నుండి ఆసక్తికరంగా యువకుల గాత్రాలు ఇష్టమైన పాటలతో ఉయ్యాలలు ఊగుతూంటే, యువతులు కూడా సమాధానమిస్తూ, మధురంగా పాడుతున్నారు.
“నువ్వెందుకు బయటకు వెళ్లకూడదు ఇప్పుడు నేస్తం” అంటూ కమిలీ, సాలీ చెవిలో గుసగుసలాడింది.
“నీకు వినబడలేదా నీ ప్రియుడు, నీకిష్టమైన యువకుడు పిలుస్తున్నాడు” అన్నది.
” నన్ను కాదు నిన్ను పిలుస్తున్నాడు అతడు” అని గుసగుసగా బదులిచ్చింది సాలీ.
ఆ గానం పిలుస్తూనే ఉంది రాత్రంతా ఆమెను. ఉన్నట్టుండి ఏదో ఆమెను కదిలించింది. ఆమె లేచి నిద్రిస్తున్న కమిలీని కదిపింది, నిద్ర పోయిందో లేదో అని. కళ్ళ చివర నుండి చుట్టూ చూసింది. అప్పుడు నిశ్శబ్దంగా లేచి, గది నుండి బయటకు నడిచి చీకటిలో కలిసిపోయింది. ఆమె ఉత్సాహం నిండిన బాధతో తల పైకెత్తి ఆకాశంలోకి చూసింది. అది విశాలంగా తను కోల్పోయిన శూన్యంలా కనిపించింది. ఆమె అవిరామంగా అటు ఇటు కాసేపు తిరిగి వెనక్కి వచ్చి కమిలీ పక్కన పడుకుంది.
అప్పటివరకు నిద్ర పోయినట్టు నటిస్తున్న కమిలీ, సాలీ ముఖంలో ముఖం పెట్టి “ఇంత తొందరగా తిరిగి వచ్చావేమిటి” అని అడిగింది.
సాలీ గురక పెట్టింది.
” నువ్వెందుకు ఆ డార్మెటరీకి వెళ్ళవు. నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి అమ్మాయి” అన్నది కమిలీ.
సాలీ మళ్లీ గురక పెట్టింది.
కమిలీ ఆమెను కదిపింది గిల్లింది ఒక్కసారి కుదుపుతూ చేతుల్లో బిగించింది. సాలీ ముఖంలో ముఖం పెట్టి “నువ్వు ఇట్లా గురక పెడుతూ పడక మీద దొర్లుతూ ఉంటే ఏదో ఒక రాత్రి నీ నుండి నీ హేమ్లాను దొంగిలిస్తాను వింటున్నావా” అన్నది.
ఆ సమయంలో భూక్యా తాగిన మత్తులో తన ఇంటి వరండాలో పడుకొని కమిలీ గురించి కలలుగంటున్నాడు.
నిండు పున్నమి చంద్రుడు వేలితో గుచ్చుతూ పూరి గుడిసె పైకప్పు నుండి నవ్వుతున్నాడు.
అదే సమయంలో సోమ్లా తన కొడుకు టీక్యా తో “మనం మన వరి పంట నూర్పుల గురించి బాధపడనవసరం లేదు. మీ అన్న భూక్యా జాగ్రత్తగా అన్నీ చేయగలడు” అన్నాడు.
“అవును నాయనా” అని టిక్యా బదులిచ్చాడు.
“నీకు తెలుసా భూక్యా ఇరవై మంది మనుషులు చేసే పని ఒక్కడే చేయగలడు” అన్నాడు తండ్రి .
“అవును నిజమే, ఎవరు కూడా అందులో సగం కూడా చేయలేరు” అన్నాడు టీక్యా.
” వాడు అద్భుతమైన పిల్లవాడు. పిల్లను చూసి పెళ్లి చేయాలి. పెళ్లి పిల్లకు ఇచ్చే ధనాన్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నామన్నదే నా విచారం. అయినా సరే ఏదో ఒక రకంగా పంట నూర్పుల తరువాత భూక్యా పెళ్లి గురించి జాగ్రత్తపడాలి” అన్నాడు సోమ్లా.
” అవును నాయనా తప్పకుండా చూడాలి” అన్నాడు టిక్యా.
” అందమైన అమ్మాయి కమిలీ..” తనలో తను అనుకున్నాడు సోమ్లా.
మళ్లీ తనే “అద్భుతమైన జంట కమిలీ భూక్యాలది. కమ్లీ వంటి బిడ్డను కలిగిన వాల్యా అదృష్టవంతుడు” అన్నాడు సోమ్లా కమిలీని తలుచుకుంటూ .
“అవును నాయనా మంచి అమ్మాయి. మంచి డాన్సర్ కూడా. వసంతోత్సవంలో ఆమె నాట్యం చూశాను” అన్నాడు టిక్యా.
“నేను ఆమె నాట్యాన్ని గురించి మాట్లాడటం లేదు. ఆమె పనులు చేయడం గురించి, ఆమె అన్ని పనులు చేస్తూ ఉంటుంది వాల్యా ఇంట్లో. అంతేకాదు అప్పుడప్పుడు పశువుల మందలను కాస్తూ ఉంటుంది. ఎప్పుడు అలిసిపోయినట్లు కనపడదు” అని, టిక్యా సమాధానాన్ని విని “నీకు ఆమెతో మంచి పరిచయం ఉందా ! గుర్తుపెట్టుకో నీకు కాబోయే వదిన. ఆమెను గౌరవించకపోతే ఆమె నీకు సరిగ్గా తిండి పెట్టదు. నా సలహా పాటించి ఆమె నీకు సహకరించేలా, నిన్ను అభిమానించేలా చూసుకో ” అని నవ్వుతూ సలహా ఇచ్చాడు సోమ్లా.
“నా గురించి బాధ పడకు నాన్నా. ఆమెతో నువ్వే జాగ్రత్తగా ఉండు” అని నవ్వుకున్నారు ఇద్దరూ. ఒకరినొకరు నవ్వులతో కుదుపుకున్నారు. వారు వడ్డీ వ్యాపారి పొలాల్లో పని చేస్తున్నప్పుడు, వారి శ్రమను మరిచిపోవడానికి వారి సంతోష సమయాల గురించి సుఖదుఃఖాలళగురించి మాట్లాడుకుంటూ ఊరట పొందుతారు. అదీ అక్కడి గోటీల పరిస్థితి.
*** *** *** *** ***
ఇక్కడ ఇంటివద్ద… కుటుంబం వ్యవసాయం బాధ్యతలను మోస్తున్నాను అనే భావన భూక్యాని మరింత అహంకారిగా మార్చాయి. ఎద్దులా రోజంతా పని చేసేవాడు. సాయంత్రం తాను కాచిన మద్యం అతిగా సేవించి రాత్రంతా మొద్దు నిద్ర పోయేవాడు. ఒక్కొక్కసారి పొలానికి వెళుతూ సారాయి కూడా తీసుకు పోయే వాడు. పనిలో అతనికి అలసట లేకుండా అది ఉపయోగపడేది.
సాలీ, మాలీ వేకువనే లేచి అంబలి తాగి అడవికి వెళ్లి ఆకుకూరలు దుంపలు సేకరించేవారు. ఇంకా కొందరు యువతులు దారిలో వారికి కలిసేవారు. అందరూ కలిసి పాటలు పాడుతూ దుంపలు తవ్వేవారు. పశువులను కాచే అబ్బాయిలు పక్కనే కొండలు ప్రతిధ్వనించే వారి పాటలకు గొంతు కలిపేవారు. అడవంతా రకరకాల పక్షులతో, పక్షుల పాటలతో సజీవంగా ఉత్సాహంగా ఉండేది.
అడవిలో వెళ్తున్నప్పుడు దారిలో అమ్మాయిలకు గ్రామ పెద్ద వద్ద గోటీగా ఉండే పాలేరు కాక్లా కలిసేవాడు. “కాక్లా” అంటే కాకి అని అర్థం. కాక్లా ఒక మరుగుజ్జు. వేలాడుతున్న అవయవాలతో దొడ్డి కాళ్ళతో దిష్టి బొమ్మలా ఉంటుంది అతని రూపం. నవ్వు తెప్పించే పొడవైన ముఖం శరీరం కంటే పొడవు అనిపించేది. పనికిరాని విషయాలను మాట్లాడుతూ మూఢనమ్మకాలతో ఉండేవాడు. ఇటువైపు ఎందుకు వచ్చావని అమ్మాయిలు అడుగుతే పశువులు మేపడానికని , తప్పిపోయిన పశువును వెతకడానికని చెప్పేవాడు. కానీ అక్కడ ఏ పశువులు కనిపించేవి కావు. అతని మాటలు చాలా తొందరలో ఉన్నట్టు, ఎవరో చావుబతుకుల్లో ఉన్నంత హడావిడిగా ఉండేవి. అతనితో మాట్లాడడం వారికి వినోదంగా ఉండేది. “కాక్లా అన్నా మా కోసం కొన్ని గడ్డలు తవ్వి పెట్టవా” అని అడిగేది సాలీ. అతను కళ్ళు పెద్దవి చేసి ఆమె దగ్గరగా వచ్చి. “సరే సరే నాతో రా” అంటూ అడవిలోకి దారి తీసే వాడు. కొంత దూరం వెళ్లి చూస్తే అతని వెంట ఎవరూ ఉండేవారు కాదు.
ఇంకొన్నిసార్లు మాలీ “కాక్లా అన్నా ఒక పాట పాడవా” అని అడిగేది.
“పాటా.. సరే..” అంటూ పాట అందుకునే వాడు గురు గురు మంటూ. అందరూ నవ్వుతుంటే ఆశ్చర్యంగా చూసే వాడు. తను దేనికి బాధ పడేవాడు. కాదు ఏ మాట అతనిని నొప్పించేది కాదు. అన్నిటినీ సరదాగానే తీసుకునేవాడు.
సాలీ, మాలీలు ఆకుకూరలు దుంపల మూటలలో తల, ముఖము కూరుకుపోయిన బరువుతో ఇంటికి చేరే వారు.
భూక్యా ఒక్కొక్క సారి పని మధ్యలో ఆపి గొడ్డలి భుజం పై పెట్టుకొని, కాళ్లు ఎడంగా జరిపి నిలుచునే వాడు. ఆ ఎండలో అతని అచ్ఛాదన లేని శరీరమంతా చెమటతో తడిసి మెరుస్తూండేది. అతని కళ్ళు దూరంగా ఉన్నా వాగు వైపు వెతుకుతూ చూసేవి, కమిలీ కోసం. అంతలోనే ఉలిక్కిపడి తన ధ్యాస నుండి తేరుకొని, తన వెంట తెచ్చుకున్న సొరకాయ బుర్రలోని సారా ఒక గుటికెడు నోట్లో పోసుకుని, తిరిగి పని మొదలు పెట్టేవాడు. ఒక గడియారం ఆగినా తిరిగి పరిగెత్తేందుకే అది.. అన్నట్టు ఉండేది అతని పని.
“చాలా ఎక్కువ తాగుతున్నావు భూక్యా జాగ్రత్త” అని హెచ్చరించేది సాలీ.
“నువ్వు తాగుతావా ! నీకు కావాలా ?”అని బదులిచ్చే వాడు .
“దేవుడు చూసుకోవాల్సిందే, ఒకవేళ నేను తాగింది తలకెక్కి నాట్యం మొదలు పెడితే, డుంగుడుంగా ఎవరు వాయిస్తారు?” అని నవ్వింది.
మళ్ళీ తనే “కానీ అన్నా నీ కమిలీ భలేగా నాట్యం చేస్తుంది తెలుసా ?” అంటుంది. భూక్యా మాట మారుస్తూ తెచ్చిపెట్టుకున్న గంభీర్యంతో…
“వినండి పిల్లలూ నేను మీతో ఒక విషయం చెప్పాలి. వీలయినన్ని ఎక్కువ మాహువా పూలను సేకరించండి. వాటితో మనం ఎక్కువ సారాయి కాయాలి. నాకు తెలుసు అది చట్ట ప్రకారం నేరం. కానీ మీకు తెలుసు కదా! మన దగ్గర పంట నూర్చే కూలీలకు ఇచ్చేందుకు కూలీ డబ్బులు లేవు. అయినా మనం డబ్బుకు బదులు కూలీలకు సారపోసి పని చేయించవచ్చు. డోంబ్ వీధిలో కొందరితో నేను మాట్లాడాను. వారు మన వరి పొలం కోసేందుకు సారాయి తీసుకునేందుకు అంగీకరించాడు” అన్నాడు కఠినమైన కంఠంతో.
“సరే నీకోసం మరింత ఎక్కువ విప్ప పూలను సేకరిస్తాము. కానీ మొత్తం నీకే లెక్క చేసుకోకు అన్నా” అన్నది మాలీ.
“సరే మనం బేరమాడుదాం. మీరు నాకోసం మాహువా పూలు తెస్తే, నేను మీకోసం సంత నుండి దువ్వెనలను తెస్తాను” అన్నాడు.
” పో పో మాకు కాళ్లు లేవా సంతకు పోవడానికి. మేము నీ మీద అంతగా ఆధారపడ్డాము అనుకుంటున్నావా ? అయితే విను భూక్యా ఆ మిరప పెరడు మాదే. మేమే దానిని పెంచాము. ఇప్పుడు మిరప పంట బాగా వచ్చింది. ఇవాళో రేపో నేను సంతకు తీసుకుపోయి అమ్ముతాను. కానీ అందులో పైసా కూడా నీకు చెందదు. నాకు ఒక చీర సాలీకి ఒక చీర కొంటే తప్పా” అంటూ బదులిచ్చింది మాలీ.
“సరే మంచిది ఇప్పుడు మంచి అమ్మాయిలా వెళ్లి మరిన్ని మాహువా పూలు తే. అప్పుడు చూడు నీకోసం ఏమి బహుమతి కొంటానో చూడు” అన్నాడు భూక్యా బుజ్జగిస్తూ.
మాలీ నవ్వుతూ “నాకు తెలుసు అదేమిటో, నువ్వు ఎంత పిసినారివో ఏ బియ్యప్పిండి మిఠాయిలు మొలాసిస్, చౌకబారు బచ్చీసాలో తెస్తావు” అన్నది.
భూక్యా బాధపడ్డాడు “అయితే మీరు నన్ను పిసినిగొట్టు అనుకుంటున్నారన్నమాట” అన్నాడు. కానీ అదలా మొదలై వాళ్ళిద్దరూ అన్నయ్య చుట్టూ జోరీగల్లా తిరుగుతూ అతనిని వెక్కిరిస్తూ హాస్యం ఆడారు.
“అవును కానీ భూక్యా ఎందుకు కమిలీ కోసం నోరు తెరుస్తావు”అని అడిగింది మాలీ. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ముసి ముసిగా నవ్వుతూ “ఆమెను జాగ్రత్తగా చూడాలి లేదంటే ఇంట్లో అన్నీ తినేస్తుంది” అని సాలీ అన్నది.
” నీ కమిలీ మంచిది కాదు” అన్నది మాలీ.
భూక్యా వాళ్ళిద్దర్నీ ఆపవచ్చు కానీ కమిలీ పేరుతో చెల్లెళ్ళు తనను వేధించడం అతనికి కూడా నచ్చింది.
ఆలస్యం చేయకుండా ఈరోజు రాత్రికి యువకుల డార్మిటరీకిక వెళ్లాలి. స్నేహితులను కలవాలి అనుకున్నాడు. కానీ సాయంత్రం కాగానే సారా తాగి తన ఇంటి వరండాలో నిద్ర పోయాడు. అతని కలల్లో మాత్రమే ఆమెను చూస్తున్నాడు. ఆ కలల్లో కొన్ని సారాయి పొగలా మారాయి. తనకు తాను అపరిచితునిగా అడవుల్లో, గలగలలాడే వాగుల్లో, తలెత్తి నిలబడిన కొండ దిగువలో లేదా కొండ ఎక్కుతూ గడుపుతున్నాడు.
..*** *** *** ***