
మదిలో మొగే వీణలకు
భావం కూడా స్ఫూరించని తరుణం…
తలపులో తలపువై ..
సంగీతంలో స్వరమువై..
ప్రాణానికి ఆయువైపోయావా అప్పుడే..??
ఏడేడు జన్మాల బందంగా…!!!
అలుపెరుగని ఆలోచన
ఒక క్షణం తీరిక అడిగిందట,
నీ కలవరింపులకు కొరత లేదని..
విశ్రమించని ఎడద విశ్రాంతి కోరేనట..,
ఎడబాటు అవస్థకు గురై…!
గోరువేచ్చని వెచ్చదనానికి కరిగిపోయే మేను,
చల్లని నీ స్పర్శకై నిరీక్షిస్తోందట..
భావోద్వేగాలకు చలించని బీడు హృదయంలో..,
స్నేహ బీజాలు నాటి..,
నవ వసంతాల ఋతువులు పంపి..,
చిరునవ్వుల జల్లులు కురిపించగా..
ప్రేమ పుష్పాలు వలపుల తోటలో పూచెనట!
తోడు లేని గోరింక
గూవకై వేచినట్లు..
తుమ్మెదలు సైతం
మకరంద సేకరణ మానుకొన్నాయాట!
తన తోడు లేని మాధుర్యం అనుభవింపలేనని!!!
ఎవ్వరికోసం చింతించని
సెకను ముల్లు
నీ ధ్యాసలో అక్కడే చిక్కుకుందట!!
నిశీధిని తరిమే వెన్నెల
పక్షం రోజుల్లో వస్తానన్నది..
మరి నీవులేని ఈ ఎడబాటు అంతమయ్యేరోజేదో కాస్త
కబురైనా పంపవా నేస్తమా..!!
నీ పరిచయపు ఛాయల్ని చిరకాలం దాచేస్తాను..
వేచిచూడటం లోను ప్రేమతత్త్వపు మాధుర్యానికి
నిదర్శనం నేనవుతాను!
నీతో గడిపిన స్మృతులతో
జన్మంతా జీవిస్తాను!!!