కదం తొక్కుతు కదలి రావే చెల్లెలా!

నిష్ఠూరపు సమాజముకు నీ పుట్టుకే బరువాయె
నీవు నాల్గు గోడల నడుమ బంధీవాయె
వాడుకొనుట తప్ప వాగ్స్వేచ్ఛ కరువాయె
పితృస్వామ్య పెత్తనమున పీకులాటల బ్రతుకాయె

పుట్టింట తల్లిదండ్రి పెనిమిటింటికి తరిమెనాయె
జీవితము పొయ్యి నుండి పెనముల పడ్డదాయె
పాటి పాటికీ పరిస్థితులతో పాచికలాటలాయె
పాము బుసలనెదుర్కొనుట నిత్య కృత్యమాయె

పది మందిలో నీ పలుకే వినబడదాయె
పాకశాలకు కట్టివేసిన పాత రోకలివాయె
పరీక్షించుట తప్ప గోడు వినే దిక్కు లేదాయె
పదే పదే ప్రస్తావించ పట్టింపే లేకపాయె

అణచివేతకు గురి చేసినా, ఆలోచనలనాపలేరే
తిరుగుబాటెక్కడో కాదు నట్టింట్లనే మొదలాయె
మాటలతో తూట్లు పొడుచుట నీవూ నేర్చితివాయె
కట్టుబాట్ల నడుమ స్వాతంత్ర్యం దక్కెనాయె

నేలకు కొట్టిన బంతి పైకి లేవకపోదు
రగిలే అగ్నిగోళము బయటికుబకకబోదు
ఉదయించే సూర్యుడు పగలు మండకబోడు
వెలుగునిచ్చు దివ్వెతోనాడ వేలిని కాల్చకబోదు

చాలు చాలమ్మ నీ నిష్పాక్షిక రోదనములు
కల్లి బొల్లి కబుర్లు వినిన వేసటములు
ఆసన్నమైనవిక శుభయోగ ఘడియలు
తిరిగి చూడక ముందుకు వెయ్యడుగులు

నీలోని ప్రతిభయే చిర వైభవంబిచ్చు
నీ సాధనము నీకు కీర్తినిచ్చు
మణులు మాణిక్యాలు ముత్యాల హారాలు
వెల వెలా బోవు, నిను జాతి మెచ్చు

చెలిమి కలిమి జేయ అక్షరాస్యత తోడ
అంతరంగము లోకి తొంగి చూడ
అవని పులకించి పరుచు చల్లని నీడ
చేయూత నీయవే పరులు వేడ

సువిశాల ధరలోన నీకు నీవే సాటి
సిరి కాంతులు వెదజల్లు నీ ఉనికి తోటి
నిలువెత్తు నిదర్శనముగ నీవు యదుగగా, మేటి
విశ్వ విజయంబవ్వు నీకు పరిపాటి

సంగీత స్వరములా, వేద ఘోషమ్ములా
నాదించు నీ ఖ్యాతి స్త్రీ స్ఫూర్తిలా
చైతన్య కిరణాలు నీవల్ల వెలిగేలా
కదం తొక్కుతు కదలి రావే చెల్లెలా!

Written by Dr. MaramRaju Venkata Manasa

రచయిత్రి పరిచయం

పేరు: డా. మారంరాజు వేంకట మానస
విద్య: M.Tech. (JNTUH), Ph.D (Engineering Sciences, AcSIR)
ఉద్యోగం: నానో టెక్నాలజీ అనుబంధ శాస్త్రవేత్త, ఐఐసిటి
చిరునామా: H.No. 2-2-1109/BK/MIG3, Nandanavanam Colony, Shivam Road, Hyderabad - 500013, Telangana
Phone number: 9849850038

డా. మారంరాజు వేంకట మానస శ్రీమాన్ ప్రవీణ్ కుమార్ - శ్రీమతి ఉషా రాణి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. వీరు ఇంజనీరింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యాభ్యాసం జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ లో చేసి గోల్డ్ మెడల్ సాధించారు. నానో ఇంజనీరింగ్ లో పరిశోధన చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్స్పైర్ ఫెలోషిప్ పొంది సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో రీసర్చర్ గా పని చేసారు. వీరు నానో టెక్నాలజీ పరిశోధనలపై అకాడెమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్, న్యూఢిల్లీ నుంచి పీహెచ్.డి. పట్టభద్రులయ్యారు. తరువాత ఎన్ ఎమ్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసి, ప్రస్తుతం నానో శాస్త్రవేత్తగా తన సేవలు కొనసాగిస్తున్నారు. వీరు అనేక జాతీయ, అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్స్ లో పరిశోధనా పత్రాలను సమర్పించారు. వృత్తి రీత్యా శాస్త్రవేత్త అయినా వీరి ప్రవృత్తి సంగీత సాహిత్యాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక సంగీతం లో దూరవిద్య ద్వారా బీ.ఏ పట్టభద్రులయ్యారు. వీరు ఆల్ ఇండియా రేడియో లో యువవాణి కళాకారిణి. అంతేగాక, పలు ప్రముఖ వేదికలపై గాత్ర సంగీత కచేరీలు కూడా చేసారు. ' వేంకటమఖి విరచిత చతుర్దండి ప్రకాశిక ' అను సంగీత పరమైన గ్రంథాన్ని రచించి కఠినమైన అంశాలను సులువుగా సంగీత విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రచురించారు. విద్యారంగం లో వీరి ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ సొసైటీ వీరికి ఉమెన్ అచీవర్ అవార్డు ' ను ప్రదానం చేసింది. వీరి అభిరుచులు గాత్రం, పుస్తక పఠనం, దివ్య ప్రబంధ పఠనం, వ్యాస రచనలు, కవితా రచనలు, వీణా వాదన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శాంతి చేకూర్చండి

బతకాలికదరా