కొంచెం ఆసరాగా నాతో!

ఎప్పటిలాగే..
చర్వితచర్వణంగా అదే ప్రశ్న
ఇప్పుడు ఏం రాయాలన్నది?
గుట్టలను తవ్వుతూ వెదికి
సముద్రాలను ఈదుతూ తీరం చేరి
చెట్టు కొమ్మల్లో ఊగుతూ పరవశించి
లోయలలో పల్టీలు కొడుతూ భీతిల్లి

పూబాల పరిమళాల చెక్కిలిగింతలు
పక్షుల శబ్ద రాగాల పులకింతలు
పసితనాన్ని వేలాడేసుకున్న స్వప్నాలు
అమ్మతనపు ఆలింగనల చెమరింతలు
రాయడమంటే ఇదేనా?
అనుభూతుల పరమార్థం ఇంతేనా?
అనుభావిక జీవనపాఠం సరిపోయిందా?
ఇక నాకు అవి వద్దు…

అల్లకల్లోలమైన ఉదంతాన్ని
వార్తగా కన్ను చూసినప్పుడు
వినకూడని దుర్మార్గాన్ని
సమాచారంగా చెవి అందించినప్పుడు
ఒక్కొక్కటిగా క్రూర ఘటనలతో
మనసు మొద్దుబారినప్పుడు
మనిషి మీద మనిషి చేస్తున్న
దుశ్చర్యల హింసలతో
శిథిలమవుతున్న మానవతాశిల్పాన్ని
తిరిగి నిలబెట్టడానికి
ఆసరానివ్వుమని
నాలో అణువణువు నిండిన
ప్రత్యక్షరాన్ని అడుగుతున్నా !
నినదించే చేతన తానవ్వాలని
కోరుతున్నా!!

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు-26

బోగన్ విలియాలు