స్టేట్ ఫస్ట్ వచ్చిన తరుణ్ US వెళ్లాలనుకుంటున్నాడు. కవిత సంతోషిస్తోంది, సుమ బాధపడుతోంది. ఎవరిది కరెక్ట్?
—
కాలింగ్ బెల్ మోగడంతో ఎవరా అని తలుపు తీశా. చూస్తే ఎదురుగా నా ప్రియ నెచ్చెలి కవిత చిరునవ్వుతో నిలబడి ఉంది.
నేను ఆశ్చర్యంతో చూస్తుంటే, “ఏమిటే సుమా, నన్ను లోపలికి రానివ్వవా ఏంటి?” అంటూనే నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చింది. అప్పటికి తేరుకుని నేను కూడా తనని లోపలికి ఆహ్వానించాను.
“ఏమిటే ఇంత సర్‌ప్రైజ్? రారా, ఇప్పుడే పని తెముల్చుకుని టీవీ ఆన్ చేశాను. రా, కూర్చో” అన్నాను సోఫా చూపిస్తూ.
అది కూడా నాతో పాటు సోఫాలో కూలబడుతూ చెప్పింది, “ఏం లేదే, ఓ శుభవార్త చెప్పుదామని… మన తరుణ్ లేడూ, బీటెక్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాడే!”
“ఓ, అవునా! ఇంత తీపి కబురు అలా నాన్చుతూ చెప్తావేం! అమ్మాయి, ఈ సందర్భంలో గ్రాండ్‌గా మా అందరికీ పార్టీ ఇవ్వాలి, తెలిసిందా?” అన్నాను.
మళ్లీ నేనే, “ఆఁ, ఇక నెక్స్ట్ ఏంటి? తరుణ్ ఏం చేయదలచుకున్నాడు?” అని అడిగాను.
“ఏముంది మామూలే, యూఎస్ వెళ్దామని వాడి ఆలోచన. అందుకని ప్రిపేర్ అవుతున్నాడు. జీఆర్ఈ, టోఫెల్ రాయాలిగా!” అన్నది తాపీగా.
“ఎందుకే? అక్కడ అసలే పరిస్థితి బాగోలేదు కదా. హాయిగా ఎంటెక్ గానీ, ఐఐఎంలో గానీ జాయిన్ అయిపొమ్మనరాదూ. అందరూ అమెరికా అంటూ వెళ్లిపోతే మన దేశం ఏం కావాలే?” అన్నాను కొంచెం కోపంగా.
“వాడు మన మాట వినడే! వాడే కాదు, ఈ కాలం పిల్లలే అంత. ఏం చేస్తాం చెప్పు?” అన్నది.
“మాట వినకపోతే వినేటట్లు చేసుకోవాలి మనమే. కానీ మీకు కూడా ఉంది కదా ఈ అమెరికా పిచ్చి. మనల్ని ఆ భగవంతుడు కూడా రక్షించలేడే!” అన్నాను అసహనంగా.
“అది కాదే సుమా, అక్కడ లైఫ్ ఇక్కడ కన్నా ఎన్నో రెట్లు మేలు కదే. చూస్తూ చూస్తూ మెరిట్ ఉన్నవాడిని అవకాశం ఉన్న చోటికి పంపకుండా ఎలాగే ఉండేది?”
ఆ మాటకి కాస్త నిరుత్సాహ పడ్డా చేసేది లేక టాపిక్ మార్చాను. కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పి, భోజనానికి ఉండమన్నా ఉండకుండా పని ఉందంటూ వెళ్లిపోయింది కవిత.
ఒంటిగంట అవుతోందని నేను భోజనానికి కూర్చున్నాను. తింటున్నానన్న మాటే కానీ మనసు అక్కడ లేదు. ఆలోచనలు కవిత, తరుణ్‌ల చుట్టూ తిరుగుతున్నాయి.
ఒక్క యూఎస్‌యే కాదు, ఈ మధ్య మన భారతీయులు చదువు కోసం వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్న దేశాలు చాలా ఎక్కువ అయ్యాయి. కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, గల్ఫ్ దేశాలు… ఇలా పూర్వం కన్నా చాలా ఎక్కువ.
అందరికీ డబ్బు పిచ్చి పట్టింది. పైగా ఈ మధ్యకాలంలో ఆయా దేశాలకు వీసా లభ్యం కావడం కూడా కష్టం అయిపోయింది. ఆ దేశ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం కారణం. అయినా యువత ఆ దేశాలకు వెళ్లే ఆలోచన మానడం లేదు.
అంతే కాదు, ఇలా బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతుంటే మన దేశం అభివృద్ధి చెందేదెప్పుడు? ఈ గడ్డపై పుట్టి పెరిగి, ఒక స్థాయికి ఎదిగాక వదిలిపెట్టి వెళ్లిపోవడం ఎంతవరకూ న్యాయం? ఆ మాత్రం మాతృభూమి మీద ప్రేమ లేకపోతే ఎట్లా?
అసలు ఈ ‘బ్రెయిన్ డ్రెయిన్’ అన్న పదం ఇవాళ్టిది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా మనం దీన్ని వింటున్నాం. కానీ అప్పుడు నూటికో కోటికో ఒకళ్లు ఉండేవారు. అప్పటికీ ఇప్పటికీ హస్తిమశకాంతరమంత వ్యత్యాసం ఉంది.
తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపేందుకే మొగ్గు చూపుతున్నారు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే కష్టాలు వచ్చేది తమకే అని ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు.
గత రెండు మూడు దశాబ్దాలప్పుడు పిల్లలు చదువు కోసం గానీ, ఉద్యోగం కోసం గానీ వెళ్లారంటే అర్థం ఉంది. ఎందుకంటే అప్పుడు మన దేశం అంతగా అభివృద్ధి చెందలేదు. అన్ని సౌకర్యాలూ లేవు. విదేశాల్లో ఉన్న పిల్లలతో మాట్లాడాలంటే కనీసం ఫోన్ సౌకర్యం కూడా ఉండేది కాదు.
సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రతిభకు తగ్గ ఉద్యోగ అవకాశాలు ఉండేవి కావు. అందుకని విద్యార్థులు విదేశాలకు వెళ్లారంటే అర్థం ఉంది.
కానీ ఇప్పుడో? పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. విదేశాల్లో లభించే ఉన్నత విద్య మన దేశంలోనూ లభ్యం అవుతోంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు మనకున్నాయి. అక్కడి వసతులు, సదుపాయాల విషయంలో కూడా మనం చాలా వరకు పోటీ పడుతున్నాం.
అయినా లోటు ఎక్కడ ఉంది? అందరికీ సరిపడా నాణ్యమైన అవకాశాలు ఇంకా లేవు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు, ప్రపంచ స్థాయి రీసెర్చ్‌కి ఫండింగ్, ప్రతిభకు తగ్గ జీతాలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం — ఇవన్నీ ఇంకా పెరగాల్సి ఉంది. ఉన్న అవకాశాలూ, మౌలిక సదుపాయాలూ కొందరికే పరిమితం అవుతున్నాయి.
తమాషా ఏంటంటే, ఆడపిల్లలు కూడా తమకు కాబోయే వరుడు విదేశంలో ఉన్నవాడై ఉండాలి అని భీష్మించుకుని కూర్చుంటున్నారట. లేకపోతే మాకు పెళ్లే వద్దంటున్నారట. పైగా తల్లిదండ్రులు కూడా పిల్లలు విదేశంలో ఉండటం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఇక్కడ మనం ఓ మాట చెప్పుకోవాలి. నాకు తెలిసిన ఒక పేరుమోసిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కి అమెరికా ప్రభుత్వం, “మీరు మా దేశానికి రండి, మేము అక్కడ ఇచ్చే దానికన్నా ఎన్నో రెట్లు డబ్బు ఇస్తాం” అని ఆహ్వానించిందట. కానీ ఆయన ససేమిరా ఒప్పుకోలేదు.
పైగా, “నేను బ్రతికి ఉన్నంతవరకూ నా దేశానికి సేవ చేయడమే నా అభిమతం. వేరే దేశానికి ఎంత డబ్బులు ఇచ్చినా సరే, చస్తే రాను” అని సగర్వంగా చెప్పారుట! అటువంటి వారు మన యువతకు ఎంతో ఆదర్శప్రాయులు.
పోనీ, విదేశాలు చూడొచ్చు అనే కోరిక తీరడం కోసం వెళ్తున్నారా అంటే, ఈ రోజుల్లో విదేశాల్లో సెటిల్ అవ్వాల్సిన పని లేదు. విజిటింగ్ వీసాతో ప్రపంచమంతటా చుట్టి రాగల అవకాశాలు నేడు వచ్చేశాయి.
అందుకే, ఈ బ్రెయిన్ డ్రెయిన్‌ని పూర్తిగా ఆపాలంటే రెండు వైపులా మార్పు రావాలి.
ఒకవైపు ప్రభుత్వం — ఉన్నత విద్యలో సీట్లు పెంచడం, రీసెర్చ్‌కి నిధులు కేటాయించడం, ప్రపంచ స్థాయి జీతాలు, స్టార్టప్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా ‘ఇక్కడే అవకాశం ఉంది’ అనే భరోసా కల్పించాలి. స్కాలర్‌షిప్‌తో విదేశాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చి సేవ చేసేలా బాండ్ లాంటి విధానాలు ఆలోచించాలి.
మరోవైపు మనం — తల్లిదండ్రులుగా, సమాజంగా ‘విదేశం = గొప్ప’ అనే భ్రమ నుంచి బయటపడాలి. రామాయణంలో రాముడు లక్ష్మణుడికి చెప్పినట్టు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్న సూక్తిని పిల్లలకు బాల్యం నుంచే నేర్పాలి.
ప్రభుత్వం అవకాశాల వంతెన వేస్తే, మనం దేశభక్తి అనే పునాది వేయాలి. అప్పుడే యువత ‘వెళ్లాలి’ అని కాకుండా ‘ఇక్కడే సాధించాలి’ అని అడుగులు వేస్తారు. అప్పుడే ఈ బ్రెయిన్ డ్రెయిన్‌కి అడ్డుకట్ట పడుతుంది. ఏమంటారు?