“ హలో వసుధ బాగున్నావా ? ఏయ్ నన్ను గుర్తుపట్టలేదు కదూ, అవున్లే నన్నెందుకు గుర్తుంచుకుంటావు! నేను చిన్నప్పటినుండి లేనిదాన్నని మీరందరు హేళన చేసేవారు
అలానే దూరంపెట్టారు, కానీ వసుధ మీరంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు నేను చాలా డబ్బున్నదాన్ని తెలుసా? నీకో విషయం తెలుసా నేను మన స్నేహితులందరిని కలుసుకోవాలనుకున్నాను, మొన్న పద్మను కలిస్తే నీ నెంబరిచ్చిందిచాలా రోజులైంది కదా
మనం కలిసి, నిన్ను గుర్తుపట్టగలనో లేదో ఎందుకంటే నేను చాలా మారిపోయాను నన్ను మీరెవ్వరు గుర్తుపట్టలేరు అంత లావయ్యాను, అది సరే నన్నెప్పుడు కలవమంటావు
ఎక్కడికి రమ్మంటావో చెప్పవే,” వసుధ ఫోన్ ఎత్తినప్పటినుండి ఆపకుండా మాట్లాడిన
స్నేహితురాలు సుజననుగుర్తుచేసుకుని నవ్వుకుంది.
“ సుజన … అబ్బా నువ్వేం మారలేదే అప్పటిలాగే లొడలొడవాగుతునే ఉన్నావు,
ఎలా ఉన్నావే ఎన్నాళ్ళయిందో మనమంతా కలుసుకుని, ఇప్పుడెక్కడున్నావు ఏం చేస్తున్నావు చెప్పవే,” చిన్ననాటి స్నేహితురాలితో మాట్లాడుతున్న ఆనందం వసుధ మాటల్లో తెలుస్తుంది చూసేవాళ్ళకు.
“ ఏముందే చెప్పడానికి … ఇప్పుడు నేను నలుగురు పిల్లల తల్లిని మావారు బడిపంతులు, వండడం పెట్టడం ఇదే నాపని మీలాగా నాకు చదువులేదు కదా,
అది సరే ఇంతకు ఎప్పుడు కలుద్దాం చెప్పవే… ఎప్పుడెప్పుడు మన వాళ్ళందరిని చూస్తానా అని ఉంది,” నిట్టూరుస్తూ అంది సుజన.
“ రేపాదివారం మా ఇంటికి రావే మావారు కూడా ఉండరు, మనిద్దరం గత జ్ఞాపకాలతో
సంతోషంగా గడుపుదాము, మా ఇంటి అడ్రసు నీ ఫోన్ కు పంపుతున్నాను తొందరగా వచ్చెయ్, నీరాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాను ఉంటా,”ఫోన్ పెట్టేసింది.
చాలా ఏళ్ళ తరువాత కలిసిన ఆనందంతో స్నేహితులిద్దరు మురిసిపోయారు.
“ అవును వసుధా … అబ్బా నువ్వేమి మారలేదు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు, కాకపోతే కొంచెం వయసు వచ్చిన దానిలా కనిపిస్తున్నావు, అవునే వసుధ… మీరింత డబ్బున్నవాళ్ళు కదా నువ్వేంటి ఇంత సాదసీదగా ఉన్నావు,
నీగురించి ఎంత గొప్పగా ఊహించుకున్నానో తెలుసా? ఒంటినిండా నగలతో పట్టుచీరలో
ఉంటావు అనుకున్నా , నీ ముందు నేను ఎలా ఉంటానో అనుకున్నాను కానీ నన్ను చూడూ ఎంత నిండుగా తయారయ్యానో,” ఒంపులు తిరుగుతూ నవ్వుతూ అడిగింది.
“ సుజన … నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటినుండి ఇలానే ఉండడం ఇష్టం,
అయినా నగలున్నాయి కదా అని పొద్దస్తమానం వేసుకోలేము కదా సందర్భాన్ని
బట్టి వేసుకుంటానులే, సుజన… ఇప్పుడు నువ్వు తృప్తిగా ఉన్నావా ? చిన్నప్పుడు
అన్నింటికీ ఇబ్బందిపడేదానివి కదా! అయినా నిన్ను చూస్తుంటేనే అర్ధమవుతుందిలే,”
సుజనను దగ్గరకు తీసుకుంటూ అంది వసుధ.
“ పోవే ఎంతయైనా నీ అంత శ్రీమంతురాలిని కాదు ఏదో ఉన్నంతలో ఇవే నా నగలు
నా వేషం, ఇప్పుడు దేనికి లోటు లేదు మా ఆయన మంచివాడు నన్ను పిల్లలను
చాలా బాగా చూసుకుంటాడు, నేనేది అడిగినా కాదనడు కాకపోతే ఆయనతో ఒకటే చిక్కవచ్చింది, షాపింగ్ కు తీసుకవెళతారా తొందర తొందరగా షాపింగ్ చెయ్యాలంటాడు నాకేమో ఓ పట్టాన నచ్చవు దానితో ఆయనకు విసుక్కుంటారు, పైగా చెబుతారు
నీకేది కావాలో ఇంట్లో కూర్చొని తీరుబడిగా ఫోన్లో వెతుకు లేదంటే మీ స్నేహితుల దగ్గర
ఏమైనా నగల డిజైన్లు ఉంటాయి కదా అవి ఫోటోలు తీసిపెట్టుకున్నావంటే నీకు చాలా ఈజీగా ఉంటుంది అంటారు, అది సరే మీపిల్లలేం చేస్తున్నారు మీ వారు నిన్ను బాగానే
చూసుకుంటాడనుకుంటాను,” నవ్వుతూ తన భర్త గురించి గొప్పలు చెప్పింది.
“ ఇంకేం అంత మంచిగా చెబుతున్నారు కదా మీ వారు నువ్వాపని చేస్తే సరి, మీ వారు చాలా ఓపికస్తుడున్నట్టుంది చక్కగా నిన్ను షాపింగ్ లకు తీసుకవెళతాడు, మా వారికి షాపింగ్ అంటేనే ఆముదం తాగినట్టు మొహం పెట్టుకుంటారు, అలా అని ఇంత ఖర్చెందుకు చేసావు ఇదెందుకు కొన్నావని అనరు షాపింగ్ కు మాత్రం రానంటారు,”
స్టౌ మీద కాఫీ పెట్టి ఇల్లు చూద్దువుగాని రా అంటూ చెయ్యిపట్టుకుని చూపెట్టసాగింది. ఆ ఇల్లు హోదా చూస్తుంటే సుజనకు కళ్ళు తిరుగుతున్నాయి.అమ్మబాబోయ్ ఇదేం ఇల్లు ఏదో ఉన్నంతలో శ్రామంతురాలనుకున్నాను గానీ మరీ ఇంత గొప్పదనుకోలేదు. ఖచ్చితంగా నేనుకున్నది సాధించుకోవాలి .సుజన మనసులో ఏవో ఊహలు రూపు దిద్దుకుంటున్నాయన్నా సంగతి వసుధకు తెలియదు.
“అబ్బా వసుధ… ఎంత బాగుందే నీ ఇల్లు చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి,
వసుధ మీ బాత్రామ్ చూస్తుంటే మా పిల్లల పడక గదంతా ఉంది, ఈసారి మా పిల్లలను తీసుకవస్తాను నాకే ఇంత ఆనందంగా ఉందంటే మా పిల్లలైతే మీ ఇంట్లోనుండి కదలరంటారేమో,” చిన్నపిల్లలా ఇల్లంతా కలియతిరిగుతూ చెప్పింది సుజన.
“ సుజన … మీ వారిని కూడా తీసుకురా హాయిగా వారం రోజులు ఇక్కడే ఉండండి
మా పిల్లలు మీ పిల్లలతో సరదాగా ఆడుకుంటారు, మా వారు మీ వారు కూడా స్నేహితులైపోతారు ఇక మనకు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు రావొచ్చు
ఏమంటావు,” పడకగదిలోకి తీసుకవెడుతూ అడిగింది వసుధ.
“ వసుధ… ఇది ఇది నిజంగా ఏ మహరాణులు ఉండే గదిలాగా ఉంది, ఈ ఇల్లు మీరు దగ్గరుండి కట్టించుకున్నారా లేకపోతే కట్టిందే కొన్నారా,” ఆశ్చర్యంపోతూ అడిగింది.
“ మేమే దగ్గరుండి కట్టించుతున్నాము ఇదంతా నా ఫ్లానే , ఇల్లు మళ్ళి మళ్ళి కట్టుకోము అదేదో కట్టేటప్పుడే మనకు నచ్చినట్టు. చేయించుకున్నామనుకో తృప్తిగా
ఉంటుంది,” చెబుతూ తను బట్టలు పెట్టుకునే బీరువా తెరిచి చూపింది. అసలది బీరువా
అనేకంటే అద్దాల షోకేస్ అనొచ్చేమో అన్ని షాపులో మాదిరిగా రకరకాల పట్టుచీరలు డ్రెస్సులతో మెరిసిపోతుంటే సుజనకు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి.
“ ఏంటే వసుధ… చిన్న షాపింగ్ మాల్ పెట్టుకున్నావు ఎన్ని చీరలున్నాయే, అయినా ఇంత సింపుల్ గా ఉన్నావేంటి,” నవ్వుకుంటూ అంది సుజన.
“ నాకు చిన్నప్పటి నుండి అలవాటు నాకు ఏదైనా నచ్చిందంటే కొనేస్తాను, అలాగని
ఉన్నాయి కదాని కట్టుకోని రుద్దను ఏ ఫంక్షన్ కు దగ్గట్టుగా అప్పుడు కడతానుఇంట్లో మామూలుగానే ఉంటాను సుజన,” అంది.
“ మరి వీటికి తగ్గట్టుగా ఆభరణాలు ఉండాలిగా ఏవో మామూలివి వేసుకుంటే ఏం
బావుంటుంది,” అడిగింది . అవి కూడా చూపెడితే బాగుండునని మనసులో అనుకుంటూ.
“ బలేదానివే నువ్వు ఇంతమంచి చీరలకు మాములు నగలెందుకు వేసుకుంటాను అవి కూడా చూపెడతాను ఆగు, ముందు నువ్విలా ఈ సోఫాలో కూర్చో ఈలోపల నేను కాఫీ తీసుకోస్తాను,” వంటగదిలోకి వెళ్ళి కాఫీ కప్పులతో పాటు స్నాక్సు తెచ్చితను
సుజన పక్కనే కూర్చుంటూ ఇద్దరు ముచ్చట్లతో స్నాక్సు కాఫీ అయిందనిపించారు.
సుజన కాఫీ తాగుతుందే కానీ ఎప్పుడెప్పుడు వసుధ తన నగలు చూపుతుందా
అని మనసు నిలవనీయడంలేదు.
“ ఇదిగో సుజన ఇటు చూడు ఇది ఎవ్వరికి కనిపించకుండా సీక్రెట్ లాకర్ ,” అంటూ
అది సుజన చూడకుండా ఓపెన్ చేసి తన నగల బాక్సులు తెరిచి చూపుతుంటే.
సుజనకు కళ్ళు తిరిగినంత పనైంది.
“ ఇదిగో చూసావా ఇదే నాకు ఇలాంటి పెద్దగొలుసు చేయించుకోవాలని ఉంది,ఎన్ని షాపుల్లో చూసానో దొరకడమే లేదు షాపువాళ్ళకేమో అర్థంకాదు చెబితే, ఒకసారి ఒక పెళ్లిలో ఎవరి మెడలోనో చూసాను అప్పటినుండి వెదుకుతున్నాను, వసుధ… ఇది ఎక్కడ కొన్నావు చెప్పు నేను కొంటాను,” మురిపెంగా చూస్తూ అడిగింది.
“ సుజన… ఇది ఇక్కడ కొనలేదు మేము దుబాయి వెళ్ళినప్పుడు కొన్నాము, అక్కడ
బంగారం కల్తీ ఉండదు ఖరీదు కూడా తక్కువే ఉంటుంది,” చెబుతూ ఒక్కొక్కటి చూపసాగింది.
“ అయ్యయ్యో నాకర్మ కాకపోతే డిజైను దొరికింది కదా షాపు పేరు చెబితే తీసుకుందామనుకున్నాను, పోనీ ఒకసారి ఇది ఇస్తావా మాకు తెలిసిన కంసాలి ఉన్నాడు ఆయనకు చూపెడతాను, మళ్ళి రెండు రోజుల్లో తెచ్చిస్తాను నీకు నా మీద నమ్మకం ఉంటేనే సుమా ఏమంటావు ,” అడిగింది ఆశగా.
“ అదికాదు ఇవ్వద్దని కాదు కాకపోతే మా వారికి తెలిస్తే ఏమంటారోనని, పోని ఓ పని చెయ్యి నీ ఫోన్ లో ఫోటో తీసి చూపెట్టు సరిపోతుంది,” తటపటాయిస్తూ చెప్పింది .
“ అదేంటి వసుధ నా మీద నమ్మకం లేదా నీకు , ఇలాంటి ఫోటోలో చాలా చూపాను మా ఆయనకు , ఇలా చూసి అలా పక్కన పెడతాడు ఇది తీసుకపోయి నా మెడలో వేసుకుని చూపెడితే ఆయనకు నచ్చుతుందని ఆశపడినాను, పోనీలే నీకు ఇవ్వాలని లేదు స్నేహితురాలి సోమ్ము దక్కించుకునేంత దుర్మార్గురాలిని కాదు వసుధ,” నిష్టూరం ధ్వనించే స్వరంతో అంది.
“ అయ్యో ఎంతమాటన్నావు సుజన నీమీద నాకలాంటి అభిప్రాయం ఎందుకుంటుంది చెప్పు? మా ఆయనకు కోపమెక్కువ ఈ విషయం తెలిస్తే అగ్గిమీద గుగ్గిలం అవుతారని అన్నానే కానీనీకివ్వద్దని కాదు, సరేగానీ నువ్వు మళ్ళి తొందరగా తెచ్చివ్వు ఆయనకు తెలియకుండా లోపల దాచేస్తాను సరేనా,” సుజాత చేతిలో పెడుతూ అడిగింది.
“ వసుధ … నీదెంత మంచి మనసో నాకు తెలియదా? అందుకే చిన్నప్పటినుండి నీ స్నేహం కోసం తపన పడేదాన్నీ, రేపే మా ఆయనకు చూపి గోల్డ్ షాపుకు తీసుకవెళాతాను
అక్కడ ఇలాంటిది తీసుకోగానే నీ దగ్గరకు వస్తానుమరి నేను వెళ్ళిరానా,” నవ్వుతూ
వసుధ చేతిలోనుండి బంగారం తీసుకుంటూ అడిగింది.
సుజన వెళ్ళినప్పటినుండి వసుధ మనసు మనసులో లేదు. నిజంగా నా బంగారం నాకిస్తుందో లేదో చాలా ఏళ్ళ తరువాత కలిసాము. చిన్నప్పటి స్నేహితురాలని తనను నమ్మాలా? తన మనస్తత్వం ఏంటో ఇప్పుడేలా తెలుస్తుంది. దేవుడా నా వస్తువు నాకు వచ్చేలా చూడు తండ్రి చేతులేత్తి దేవుడికి దండం పెట్టుకుంది.
అనుకున్నట్టుగానే నాలుగురోజుల్లో వసుధ గొలుసు తెచ్చిచ్చి తను కొన్న గొలుసు చూపెడుతూ . “ వసుధ చూసావా అచ్చంగా నీలాంటిదే తీసుకున్నాను, నీ గొలుసు చూడగానే మా ఆయనకు బాగా నచ్చింది వెంటనే షాపుకు తీసుకవెళ్ళి కొనిచ్చాడు,
నీకో విషయం తెలుసా?,” ఆనందం పట్టలేక చెప్పడం ఆపింది.
సుజన ఇచ్చిన గొలుసును పరీక్షగా చూస్తూ ఏంటి అన్నట్టుగా సుజన వైపు చూసింది.
“ మా ఆయనేమన్నాడంటే నీ స్నేహితురాలు దగ్గర ఏమేమి ఉన్నాయో అవి చూసి నీకు నచ్చినవి కొనుక్కోమన్నారు, ఇప్పుడు సంపాదన బాగానే ఉందికదా అన్నారు నాకైతే
ఇదంతా నిన్ను కలిసిన వేళావిశేషం అనిపించందంటే నువ్వు నమ్ముతావా? వసుధ …
ఇదిగో నా గొలుసు మొదలు నువ్వే వేసుకో,” అంటూ వసుధ మెడలో వేసింది.
వసుధకు స్నేహితురాలి మురిపెం చూస్తుంటే పాపం అమాయకురాలు అనిపించింది
సుజనను కౌగిలించుకుని. “ సుజన … పోనిలే మీ ఆయన మంచివాడిలా ఉన్నాడు
మనం అడిగినప్పుడు కొనివ్వరు , వాళ్ళు కొనిస్తా అన్నప్పుడే మనం కొనుక్కోవాలి
ఆలస్యం అమృతం విషం అన్నట్టు వెంటనే నీకేం కావాలో కొనేసుకో,” అంది.
“ ఎలా కొనుక్కోను నేను షాపుకు వెళితే అన్ని నచ్చుతాయి ఓ పట్టాన ఏది తీసుకోలేను, అప్పుడు మా ఆయనకు కోపం వచ్చి ఇక చాలు చూసింది
ఇంకోసారి వద్దామని బయటకు వచ్చేస్తాడు, ఇక బంగారం షాపుకు వెళదామంటే కూడా ఒప్పుకోడు,” బేలగా ముఖం పెడుతూ అంది.
సుజన ముఖం చూసి కిలకిలా నవ్వింది వసుధ. “ బలే తమాషాగా చెబుతున్నావే
నీకేమో బంగారం పిచ్చి మీ ఆయనకేమో ఓపిక తక్కువున్నంటుంది, పోనీ ఓ పని చేయ్యికూడదా? ఫోన్ లో గూగుల్ లో వెతికితే నీకు నచ్చినవి దొరుకుతాయి,
అవి ఫోటో తీసుకున్నావనుకో నీ సరదా తీరుతుంది మీ ఆయన సంతోషపడతాడు
ఏమంటావు,” వస్తున్న నవ్వునాపుకుంటూ అంది.
“ ఆహా అంత తెలివే నాకుంటే షాపుకు వెళ్ళినప్పుడే కొనుక్కునేదాన్నీ, పోనీ ఒకపని చేద్దామా వసుధ ,” ఆత్రుతగా అడిగింది.
“ ఏంటీ కొంపతీసి నన్ను నీ వెంబడి షాపుకు రమ్మంటావా ఏంటే,” ఆశ్చర్యపోతూ అడిగింది.
“ అదికాదే నువ్వేమనుకోనంటే ఒకమాటడుగుతాను అడిగాక కాదనకూడదు సరేనా,”
“ సరేసరే అడుగు,” కళ్ళెగరేస్తూ అంది వసుధ.
నీ దగ్గరున్న నీ నగలు ఓ నాలుగివ్వు అలాంటివి కొని నీవి నీకు తెచ్చిస్తాను, మొన్న పెద్ద గొలుసు కొనగానే తెచ్చివ్వలేదు అలాగా, నీకు నమ్మకం ఉంటేను సుమా ! నేనా ఈ ఊరు విడిచి వెళ్ళిపోను వారం రోజుల్లో అన్ని ఇచ్చేస్తానుకాదనకే ఫ్లీజ్,” వసుధ చుబుకంపట్టుకుని బ్రతిమాలసాగింది.
వసుధకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది ఒక్కసారిగా. నోటమాటరానట్టు సుజనను చూస్తుండిపోయింది.
“ ఏయ్ వసుధ ఏమిటే అలా ఉలుకు పలుకు లేని బొమ్మలా ఉండిపోయావు, నేనేమన్నా ఉత్త పుణ్యానికి అడిగాననుకున్నావా ఏంటి అంత భయపడిపోయావు,” నవ్వుతూ చక్కిలిగింతలు పెట్టింది వసుధకు.
“ అబ్బా ఆగవే… నువ్వేంటి నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నావు, అయినా నా దగ్గరున్నవన్నీ పాత డిజన్లు ఇప్పుడన్ని కొత్తవి బోలెడన్ని డిజన్లు వచ్చాయి, నీకు తోడుగా రమ్మంటే నేను వస్తాను ఇద్దరం కలిసి చూద్దాం ,” తప్పించుకోవడానికి అంది.
“ వద్దులే స్నేహితురాలి మీద నమ్మకం లేనప్పుడు ఏమనుకోని ఏం లాభం , సరే నేను
వెళతానింకా నా బాధేదో నేను పడతానులే ,”సున్నాలా మూతిముడుచుకుని గబగబా లేచింది వెళ్ళిపోవడానికన్నట్టు.
“ అబ్బా అలా కోపంతెచ్చుకోకే ఇవ్వడానికి భయంకాదు , మా ఆయన చూసాడంటే నిన్ను నన్ను ఇద్దరిని ఉతికిపారేస్తాడు అందుకు భయం, అయినా నువ్వంతగా ఆరాటపడుతున్నావు కాబట్టి నీ మనసు నొప్పించడం కష్టంగా ఉంది నాకు , నా తంటాలేవో నేను పడతానునువ్వు మాత్రం ఆలస్యం చెయ్యకుండా తెచ్చివ్వు , మూడో కంటికి తెలియకుండానే పనైపోవాలి సరేనా,” లోపల భయపడుతూనే నాలుగైదు డిజన్లు తెచ్చి సుజన చేతిలోపెట్టింది వసుధ.
“ అబ్బా నువ్వెంత మంచిదానివే నిజమైన స్నేహితురాలంటే నువ్వేనే, నువ్వు నీ మాట నిలుపుకున్నావు సరిగ్గా వారంరోజుల్లో నీ నగలన్ని నీ చేతిలో పెట్టి నా మాట నిలబెట్టుకుంటాను, నిన్ను ఇబ్బంది పెడుతున్నాననే బాధ ఉంది కానీ ఏం చెయ్యను
నా వీక్ నెస్ చెప్పాను కదా,” అంటూ గట్టిగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని గబగబా
బ్యాగు తీసుకుని బయలుదేరింది సంతోషం పట్టలేకపోతుంది సుజన.
స్నేహితురాలి ఆనందం చూస్తుంటే తృప్తిగా అనిపించింది కానీ మనసులో మాత్రం భయంగా ఉంది భర్తకు తెలిస్తే ఎక్కడ తిడతాడోనని.
వారం రోజులు గడిచిపోయాయి సుజన వస్తున్న జాడే తెలియడం లేదు. ఫోన్ చేస్తే ఫోన్
ఎత్తడం లేదు వసుధ గుండెలో ఒకటే దడ వస్తోంది. ఏమైంది సుజనకు నా నగలు నాకు
నాలుగురోజుల్లో ఇస్తానంది ఇంకా తేవడం లేదు . ఒకటి కాదు రెండు నాలుగు ఇచ్చాను ఎంత లేదన్నా ఒక్కోటి నాలుగు తులాలపైనే ఉంటాయి అంటే పది లక్షల నగదు అమ్మో.
గుండెలమీద చెయ్యి వేసుకుని భయపడుతూ ఒకవేళ తను ఆ రోజు బంగారం తీసుకుని క్షేమంగా ఇల్లు చేరిందా లేక దారిలో ఏదైనా ఇబ్బందికి గురైందా. తను ఫోన్ చెయ్యకపోతే
నేనైనా చెయ్యలేదే తనకు ఇల్లు చేరావా అని. ఇప్పుడెలా దానింటికి వెళదామన్నా ఇంటి
అడ్రసు తెలియదు ఏమిటో ఎప్పుడు అడగాలని అనుకోలేదు . అందుకే ఈయన తిడతారు మట్టి బుర్ర అని. ఇప్పుడేం చెయ్యాలి తనను ఎలా తెలుసుకోవాలి పోలీసు కంప్లయింట్
ఇద్దామంటే అది ఏ పరిస్థితిలో ఉందో. అమ్మో పోలీసులు ఇంటికి వచ్చారంటే ఈయనకు మొత్తం తెలిసిందంటే నా ఒళ్ళు హూనం చేసినా చేస్తారు అసలే కోపం మనిషి. ఇలా చేసానంటే ఊరుకుంటాడా ఎవరికి చెప్పను పోనీ ఇంకో వారంరోజులు చూస్తాను అప్పటివరకు సుజన వస్తుందేమో. ఎటూ తేలని ఆలోచనతో సతమతమౌతుంది వసుధ.
ఇంకో వారం పదిరోజులు గడిచిపోయాయి కానీ సుజన జాడ లేదు. ఫోన్ చేస్తునే ఉంది
ఈ నెంబరుతో ఫోను పని చెయ్యడం లేదు అరిగిపోయిన రికార్డులా చెప్పిందే చెబుతుంది తప్పా ఫోన్ రింగైన పాపాన పోవడం లేదు. దేవుడా మంచికి పోతే నాకు చెడు ఎదురైంది
ఎలాగైన ఈ గండం నుండి నన్ను గట్టెక్కించు స్వామి పదే పదే దేవుడి ముందు కూర్చొని
వేడుకుంటూ గుమ్మం వైపే చూపులు నిలుపుకుంది. సరిగ్గా నెల రోజులకు ఎట్టకేలకు సుజన ఫోన్ ఎత్తింది .
“ హలో ఎవరు మాట్లాడుతున్నది ,” అవతలనుండి అడిగింది సుజన.
“ సుజన నేను వసుధను మాట్లాడుతున్నాను, ఏమైందే ఎక్కడకు వెళ్ళిపోయావు నీకోసం
ఎంతగా ఎదిరి చూస్తున్నానో తెలుసా, నా బంగారం గురించి మా ఆయన అడిగాడంటే ఏం చెప్పాలో నాకు భయంగా ఉంది సుజన, ఇప్పుడెక్కడున్నావు తొందరగా నా బంగారం నాకు తెచ్చివ్వు భయంతో నా ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి,” ఆదుర్దాగా అడిగింది సుజన ఫోన్ ఎత్తగానే ఆవేశం కట్టలు తెంచుకుంది వసుధలో.
“ వసుధ… ఎందుకంత కంగారుపడుతున్నావు నీ వస్తువు నీకు తెచ్చివ్వకుండా ఉంటానా చెప్పు, వేరే పని మీద అర్జంటుగా వెళ్ళాల్సి వచ్చింది అంత మాత్రానికే భయపడిపోతే ఎలా,”
“ అదికాదు సుజన…నువ్వు వారం రోజుల్లో నా బంగారు నగలు నాకిస్తానన్నావు కానీ నెలరోజులు గడిచిపోయింది ఇప్పటికి తేలేదు, పోనీ నీకు ఫోన్ చేస్తున్నాను ఫోన్ కూడా తియ్యడం లేదు నువ్వు, నేనెంత భయపడుతున్నానో తెలుసా? నువ్వు ఎంత బిజీగా ఉన్న ఒక్క ఫోన్ చెప్పకూడదా నిన్ను నమ్మి ఇచ్చాను కదా,” నిష్టూరం ధ్వనించేలా అంది.
“ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నీ బంగారం నేను తీసుకపోవడమేమిటి? నీకేమన్నా
మతి చలించిందా , నువ్వే ఏం చేసావో ఏమో నా మీదకు నెడుతున్నావు, స్నేహితురాలవనినీ ఇంటికి వస్తే నా మీదనే అభాండం వేస్తావా, ఛీ ఛీ చిన్నప్పటినుండి అంతే నువ్వు నన్నేప్పుడు ఇలాగే ఏడిపించేదానివి, అయినా స్నేహితురాలవని నీమీద ప్రేమతో వస్తే నాకు తగిన గుణపాఠం చెప్పావు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు ఈ ఫోన్ నెంబరు కూడా తీసీపడేస్తున్నా, చూడు నువ్వొక వేళ పోలీసులకు చెప్పాలని చూసినా నువ్వే నీ బాయ్ ఫ్రెండుకు ఇచ్చి నాటకం ఆడుతున్నావని మీ ఆయనకు చెబుతాను జాగ్రత్తా, నాతో పెట్టుకున్న వాళ్ళెవరూ బాగుపడలేదు ఉంటా ,” ఫోన్ కట్ చేసింది .
నోటమాట రాకుండా అలాగే ఉండిపోయింది వసుధ. ఎన్ని తియ్యటి మాటలు చెప్పి ఎంత మోసం చేసింది. చివరకు నా ఇంట్లో నన్నే దొంగని చేసింది. ఇలాంటి వాళ్ళను ఊరికే వదల కూడదుఅనుకుంటూ మళ్ళీ ఫోన్ చేసింది స్విచ్చాప్ వస్తుంది. అంటే నిజంగానే ఫోన్ నెంబరు మార్చిందా ఇక తనను పట్టుకోవడమెలా అయిపోయింది తను ఘోరంగా మోసపోయింది.ఇంతకు ముందు తీసుకున్న పెద్ద గొలుసు నాదేనా లేక అది కూడా మోసమేనా అనుకుంటూగబగబా గదిలోకి వెళ్ళి బీరువా తెరిచి చూస్తే అది గిల్టు నగ నోరు తెరిచి అలానే చూస్తుండిపోయింది వసుధ.