కొత్త సంవత్సరం- ఓ చూపు!!

కురుక్షేత్ర యుద్ధరంగంలో, యుద్ధాలు ఆక్రమణలతో ప్రజలకు ముఖ్యంగాస్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది. కుటుంబ, కుల వ్యవస్థ ,వంశాచారాలు, వర్ణ సంకరమై తద్వారా దేశ ఉన్నతి అన్నిటికీ నాశనం కలుగుతుంది కదా అన్న అర్జునుని మనస్థాపానికి కారణమై సందిగ్ధాన్ని కలిగించిన ఒక సందేహానికి భగవంతుడొసగిన ఉపశమనంతో ఆ యుగం గడిచిపోయినా, కాలం కలంగా మారి రాస్తున్న అక్షరాలు ప్రపంచచరిత్ర పుటలలో మానవ మనుగడకు కొత్త అర్థాలు చెబుతూనే ఉన్నాయి. కానీ శాశ్వత పరిష్కారాలనేవి నిర్ణయించగల శక్తి కాలానికి కూడా లేదేమో!
ప్రకృతి వనరులను గూడి సిరిసంపదలతో తులతూగుతూ ఋషులు యోగులు నడయాడిన వేద నిలయమైన మన పుణ్యభూమి ఎందరికో స్వంతం చేసుకుని శాశ్వతంగా పరిపాలన సాగించాలన్న కోరికను కలిగించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ద్రోహంతోనో, దౌర్జన్యంతోనో మన ఇంట్లోకి ప్రవేశించి మనకు బానిసత్వపు సంకెళ్లు వేసి, ఆకలి తీర్చుకునేందుకు నాలుగు మెతుకులు విసిరి నట్లుగ,అలా వచ్చినవారు ఒక్కొక్కరి పరిపాలనలో ఒక్కోరకమైన ఆంక్షలు, నిరంకుశత్వం, నిత్యం చావు భయంతో బిక్క చచ్చిన బ్రతుకులు, మతమార్పిడులు, వర్ణ సంకరాలు( ఇప్పుటి రోజులకు వర్ణ సంకరం అన్న పదాన్ని చెరిపివేయొచ్చేమో ), పన్నుల భారాలతో కృంగిన జీవితాలు , మన నమ్మకాలను అవమానిస్తూ దేవాలయాలను ధ్వంసం చేయడం దేవతామూర్తులను ఎత్తుకుపోవడం ఇలా ఎన్నెన్నో అరాచకాలతో గాయాలుతో నిండిన గతం,ప్రజల ఆచార వ్యవహారాలను సడలించలేకపోయింది. ఆత్మస్థైర్యంతో కొత్త శక్తిని పుంజుకుని భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు.
మనదేశంలో ఎప్పటినుంచో ప్రాంతీయ భాషలు ఉన్నాయి తెలుగు కన్నడ తమిళం మరాటి గుజరాతి మలయాళం బెంగాలీ,హిందీ ఇలా పలు భాషలను సంప్రదాయాలను కూడి ఉన్న సువిశాల దేశం మనది అయితే అప్పట్లో అధికారిక భాష మాత్రం సంస్కృతం, పండితులు సంస్కృతంలోనే మాట్లాడేవారు. పుస్తకాలు కూడా సంస్కృతం లోనే వ్రాయబడి ఉండేవి. పాఠాలు కూడా సంస్కృతం లోనే చెప్పేవారు. కానీ ప్రజలు సహజంగానే ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడుకునేవారు. ఇదంతా హిందూ రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇస్లాం పాలన వచ్చింది అప్పుడు మొగలులు పర్షియన్ను అధికారిక భాషగా చేశారు పుస్తకాలు కూడా (Persian )పర్షియన్ భాషలోనే వ్రాసేవారు. మొగలుల అనంతరం మరాఠా రాజులు పాలకులయ్యారు అప్పుడు తిరిగి సంస్కృత భాషను తీసుకువచ్చారు. వీరి కాలంలోనే బ్రిటిష్ వారు ప్రవేశించి 200 సంవత్సరాలు 1858 నుండి 1947 వరకు సుదీర్ఘంగా పాలన సాగించారు. విభజించి పాలించడమనే కుయుక్తితో చాప కింద నీరులా విస్తరించారు. వెండి బంగారం, ధనం ఆకర్షణీయమైన బహుమతులు ఇలా ఎన్నో రకాలుగా సేనాధిపతులకు, మంత్రులకు, సామంతులకు రాజ్య లాభాన్ని ఎఱ చూపుతూ ( లంచం అనేది అప్పటినుండే మొదలయిందంటారు) అంతః కలహాలను రేపి , పెత్తనం చేజెక్కించుకున్నారు. క్రయవిక్రయాలకు పన్నులు కడుతూ మన దేశం ప్రవేశించిన ఆంగ్లేయులు మనతోనే పనులు కట్టించుకునే స్థితిని కల్పించారు. మన వాళ్ళనే ఆయుధంగా చేసుకొని మన జనాన్ని అమానుషంగా హింసించారు. ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య కంటే వీరి పరిపాలనలో జరిగిన జననష్టమే ఎక్కువని చరిత్ర చెబుతుంది.
పేరుకు సంస్కృతం అధికారిక భాష అయినా ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష ఉందని భావించిన ఆంగ్లేయులు దేశం మొత్తం ఒకే భాషను అధికారిక భాషగా పెడదామని, ఇంగ్లీష్ భాషను వ్యవహారిక భాషగా చేస్తే పరిపాలన సులభమవుతుందని భావించి 1835లో ఇంగ్లీషును వాడుకలోకి తెచ్చారు. అన్ని కార్యాలయాలలోనూ, పాఠశాలల్లోనూ అదే భాషను చెప్పించారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు సంస్కృతులు సమాజాలు, ఒకదానితో ఒకటి అనుసంధానం కావడం,వస్తువుల, సర్వీసుల ( పనులు సేవలు ) పెట్టుబడులు, సమాచారం సాంకేతికత, అన్ని లావాదేవీలకు ఈ భాష సానుకూలంగా మారింది. ప్రజలు సరిహద్దులు దాటి స్వేచ్ఛగా ఒకే వ్యవస్థగా మారడం అనేది పరిణామం. ఈరోజు వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తి స్వాతంత్ర్యం రెండు రెక్కలుగా చేసుకొని ప్రపంచ నలుమూలలకు ఎగర కలుగుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్యాలండర్లో జనవరి కొత్త సంవత్సరం గా గుర్తింపబడి ప్రపంచ వ్యవహారమంతా, ఇంగ్లీషు నెలల,తేదీల లెక్కింపు తోనే జరుగుతుంది .దైనందిన జీవితంలో అదే సౌలభ్యంగా అందరూ అలవాటు పడిపోయారు. ఏ మాత్రం భాషా జ్ఞానం అక్షరజ్ఞానం లేని అతి సామాన్యుడు కూడా ఇంగ్లీష్ పదం లేని వాడి సొంత భాషను మాట్లాడలేడు అంతలా మమేకమైపోయాము. ఈ తరం వారికి తెలుగు పండుగలు ఉన్నాయని, ఉగాది తెలుగు సంవత్సరాది అని తెలిసేమో గాని, సౌరమాన ప్రకారం మన తెలుగు క్యాలెండర్ ( పంచాంగం) మన సంవత్సరాలను, మాసాలను, తిధులను మనకు ఏర్పరచిఉందని చాలామందికి తెలియదు. ప్రభవ నామ సంవత్సరంతో మొదలయ్యి అక్షయ వరకు 60 సంవత్సరాలు ఆధ్యాత్మిక, జ్యోతిష్య శాస్త్ర సంబంధంతో కూడి ప్రతి సంవత్సరము ఒక విశిష్ట ఫలితాన్ని సూచిస్తుంది. ఉదా: ప్రభవ నామ సంవత్సరం ప్రభవించునది అంటే పుట్టుక. యజ్ఞములు విరివిగా జరుగుతాయని సూచిస్తుంది. విభవ అంటే వైభవంగా ఉండేది,జనులు సుఖంగా ఉంటారు. ఇలా ఉంటాయి. అలాగే తెలుగు నెలలు 12 ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు గుర్తించవచ్చు. ఉదా : పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు కనుక ఆ నెల చైత్రము అయ్యింది. అలాగే పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రంతో కలిసిన ఆనెల వైశాఖము. నక్షత్రాలు 28 అశ్విని, భరణి మొదలగునవి.
అయితే సనాతన ధర్మం, సాంప్రదాయానుసారం,పండుగలు శుభకార్యాలు ప్రయాణ సమయాలు శుభ ఘడియలు, దుర్ముహూర్తాలు రాహుకాలం యమగండకాలం, మూడం,ఇవన్నీ వారి వారి ఆచార వ్యవహారానుసారం తప్పకుండా పాటిస్తుంటారు.

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు????
Wish you a Happy New Year ????????

Written by Polamreddy Vijayalaxmi

పొలంరెడ్డి విజయలక్ష్మి శ్యామదాసిగా , రచనా ప్రపంచానికి పరిచయం అయ్యాను. ప్రత్యేకించి విద్యార్హత ఏమి లేదు వానాకాలం చదువు మాత్రమే. యదార్ధాన్ని పునాదిగా , నా అనుభవాలు , నా చుట్టూ జరిగే వాస్తవాలు, నా మనోభిలాషను తృప్తిపరస్తూ, అక్షర రూపంలో సహృదయులైన మీవంటి ప్రోత్సహకులు చెంత చేరి ప్రాణం పోసుకున్నాయి. అలా ఊపిరందుకున్న రచనలు, నవవ్యాస మాలిక , కొత్త కథలు, గుర్తుకొస్తున్నాయి, ప్రియమైన నీకు, కథలు, లోగిలి, ధీర. మరికొన్ని మంత్లీ మ్యాగజైన్ లో కూడా ప్రచురింపబడ్డాయి. వేదం, వేదాంతం, బ్రతుకు బాసటగా నిలిచే అన్నమయ్య కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, రోజు వాకా పాఠంగా నేర్చుకోవడం అతి ముఖ్యమైన దినచర్య.

పూర్తి పేరు : పొలంరెడ్డి విజయలక్ష్మి
కలం పేరు: శ్యామదాసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి విషయసూచిక – డిసెంబర్

స్నేహస్మృతులు పాలపుంత పోర్ట్ ల్యాండ్