పూర్వపు సంస్కారమనే విత్తనమే విత్తాను!
ఓ మొక్కైతే మొలిచింది! కానీ
ఎదిగీ- ఎదగనే లేదెందుకో?
తరతరాల ఆచారాలనే గొప్పులు బాగానే తీసానే?
విలువలనే పుట్టమన్ను, ఎఱ్ఱమన్నూ… గొప్పుల్లో బాగానే నింపాను…
అయితేనేం?
చదువులనే ఎరువులు బస్తాలకొద్దీ వేసినా…
సుభాషితాలనే నీళ్లు పోసినా…
మంచి ఆలోచనలనే కత్తెరతో..తెగులు రోగాలనే భావాలులు తెంచినా…
ఎందుకో??మంచి చెట్టుగ చిగురించడమే లేదు…
బహుశా అంతస్తులనే చీడపీడలేమో?
దానికీ కు విదేశీ మొక్కవ్వాలనే అంటురోగమేమైనా తాకిందేమో?
బహుశా కాలమంతా పూర్తిగా వేసవే కావచ్చు!
పరిష్కారాలే లేని సమస్యల వడగాల్పులతో…పచ్చదనం బండలైంది!
మృదుత్వం వడలిపోతున్నది..హింసాత్మక దృశ్యాలేమైనా చూసిందా?
ఆర్ద్రత ఆరిపోతున్నది!
పెడతోవల నాగరికత పెను తుఫాను తాకిడితో…
జంతు జీవన శైలి కార్చిచ్చు వేళ్ళను కాల్చేస్తున్నది కాబోలు!
ఇక చెట్టు కోలుకోలేకపోవచ్చు!!
పదను మీద ఉన్నప్పుడే…
అదను దాటి పోకుండా…
సనాతన ధర్మమనే కషాయం తాగిస్తేనో?
భారతీయతనే శస్త్రచికిత్సచేస్తేనో?
మొక్క మానై ఫల- పుష్పాలనిస్తుందేమో?