

సమస్త సగళం
ఆమె గళ విన్యాస
గమన విన్యాసాల రజ్జువులో
ఇమిడి
ముడివడి
ఇది అది అనలేని అనంతానంద సందేశాలు మోసుకొచ్చి
కవి హృదయం కవితయ్యిందన్న
చక్కని మాటకు ఉదాహరణ గా నిలిచింది
మాట దాటని
మనసు దాటని
వయసు పెత్తనాన్ని జడ కెక్కించి
జడత్వాన్ని రూపుమాపింది
రూపలావణ్యాల సిరి సంపదలు
సత్ప్రవర్తన గల తరుణుల పాపిట బిళ్ళ అయినట్టే
అందం గుండె గంటను మ్రోగిస్తే
జడ కుప్పెలు గుప్పెడు మదిని ఊగించె
పాత తరాలు
కొత్త సంతతికి బాటలు చూపినట్టు
సంప్రదాయ పద్ధతి
వద్దనే వారెవరూ?
తెలివి ధైర్యం సొంత మైన ఇంతి
ఇవ్వగలదో వింత ఆజ్ఞ!!
కావ్య నాయిక
కథానాయిక
చరిత్ర గతి మార్చే భూమిక!!
చిత్ర కవిత రచన
– డా. కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు