తీరున్న పల్లె

అరుణ ధూళిపాల

ఆరుబయట ఓ సాయంకాలం..
ఎర్రటి ముఖాన,
నల్లటి మబ్బు ముసుగుతో
రెక్కల భామలకు వీడ్కోలిచ్చి,
కొండలకు గొప్పదనాన్ని కప్పి
మళ్లీ రావాలన్న తొందరలో
కిందికి జారుతుంటాడు సూరీడు..

గుమ్మం ముందు అరుగులు
నవ్వుల ఆవాసాలుగా నోళ్లు విప్పి,
క్షేమాలను అరుసుకుంటాయి..
బాల్యమంతా రాశిగా
దుమ్మును ఎగదోస్తుంటుంది ఆకాశానికి
గంగడోలు సంగీత వాద్యాలు
గుంజలకు చేరగిలబడి
విశ్రాంతి తీసుకుంటాయి
తడి పైరును చుట్టుకున్న గాలి
మట్టి గంధాన్ని చిలకరిస్తుంది

కాలిన పొగ వాసనలు,
రుచులుగా నోటికి తగులుతుంటాయి
అమ్మతనం చేయంతా నిండి
ముద్దలుగా గొంతులోకి జారుతుంది
దుమ్ము దులపరించుకొని
ఒళ్ళు విరుచుకున్న మడతమంచం
సిద్ధమవుతుంది కథలు వినడానికి
గూటిలోని దీపం,
మగతలోకి జారుతూ
కలలుగా కరుగుతుంటుంది

తలయెత్తిన కోడిపుంజు
ఎప్పటిలాగే
తూర్పు వైపు చూస్తూ ఉంటుంది
కొక్కొరోకో ధ్వనుల గొంతుకను
సవరించుకుంటూ…
పల్లె పదముల పథము కొరకు….!!

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అసలు ఏమైందంటే ..

మన మహిళామణులు