దేవుడిచ్చిన గొప్ప వరం – అమ్మ

తన కడుపు పండాలని ఎన్నెన్నో గుళ్లు,గోపురాలు తిరిగే అమృతమయి.
వ్రతాలు,నోములు నోచే కరుణామయి అమ్మ

బిడ్డను కళ్లారా చూసుకునే భాగ్యం కోసం, నవమాసాలు కడుపున ఆనందంగా మోస్తూ,
క్షణమొక యుగంలా ఎదురుచూసే అవనీలలామ

పురిటినొప్పులకోర్చి,ప్రాణాలను పణంగా బెట్టి,బిడ్డకు జన్మనిచ్చే అమేయ త్యాగ సంజీవని

బిడ్డల ఆలనాపాలనా చూస్తూ,నిద్రలేని రాత్రులెన్నో గడుపుతూ,
వారి బాగు కోసం నిరంతరం పరితపించే అపురూప ప్రేమజలధి

చల్లని ఒడిలో సేదదీర్చి,బాధలమరపించే ఆత్మీయ సన్నిధి

బిడ్డలకు కోరినవందించే కల్పతరువు అమ్మేగా అందరికీ చక్కని ఆదరువు

ధైర్యంతో అమ్మ వేయిస్తుంది తొలి అడుగు మన భవితకదే బంగారు తొడుగు

విద్యా బుద్ధులు నేర్పే తొలిగురువు అమ్మే పూజించవలసిన తొలి దైవము

అమ్మ ఋణం తీర్చుకొనుట కాదు మనకు సాధ్యం అమ్మ లేని లోటు తీర్చుట కాదు ఎవ్వరితరం
అమ్మను సేవించుట మన కర్తవ్యం అమ్మ మనకు దేవుడిచ్చిన గొప్ప వరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇల్లంతా ఇల్లాలు

చరిత్ర కెక్కని శతగ్నులు