
మరొక 20 నిమిషాలు అయితే ఏర్పోర్ట్ చేరుకుంటారు అనే సమయంలో నీలాంబరి ఒక్కసారిగా ” అయ్యో మర్చిపోయానే” అన్నది.
” ఏం మర్చిపోయావు నీలా” అన్నాడు భూపతి.
” నా పెయింటింగ్ బ్రష్లు ఆయిల్ పేపర్స్ ఇంకా కలర్స్ అన్నీ ఒక చిన్న బ్యాగ్ లో పెట్టానండి అది పెట్టుకోవడం మర్చిపోయాను” అన్నది నీలాంబరి.
” ఇన్నేళ్ల సావాసంలో నీకు ఏది ఇష్టమో నాకు తెలియదా పెయింటింగ్ అంటే మీకు ప్రాణమని నాకు తెలుసు కదా..అందుకే నేను బ్యాగ్ తెచ్చాను.. అందులో నువ్వు వేసే చిత్రాలన్నీ సజీవంగా ఉంటాయి. ప్రాణమున్న బొమ్మల్లాగా కనిపిస్తాయి నిజంగా ఇంత అద్భుతమైన కళ నీలో దాగి ఉంది .. ఎన్నోసార్లు నీ చిత్రాలు విక్రయానికి కావాలని చాలామంది అడిగారు కానీ నీకు ఇష్టం లేనందువల్ల నేనెప్పుడూ వాటిని ఎవరికీ ఇవ్వలేదు అందుకే మన ఇంటి నిండా నీవు పెయింట్ చేసిన చిత్రాలు ఫ్రేమ్ కట్టించి పెట్టాను ..ఇప్పుడు నువ్వు వచ్చేవరకు ఆ చిత్రాలను చూస్తూనే కాలం గడుపుతాను” అని అన్నాడు భూపతి.
” మీ ప్రోత్సాహం ఉండబట్టే నేను ఎన్నో చిత్రాలు వేయగలిగాను మీకు చెప్పడం మరిచాను మన ఇంటికి వచ్చిన కలెక్టర్ గారు ఈ పెయింటింగ్స్ చూశారట మొన్న నా మొబైల్ కి మెయిల్ పంపించారు ఈ చిత్రాలు అన్నింటిని ఎగ్జిబిషన్లో పెట్టడానికి నా అనుమతి కావాలని.. నేను మిమ్మల్ని అడిగి చెప్తాను అని చెప్పాను అయినా నా మొబైల్ నెంబర్ వాళ్లకి ఎలా దొరికిందో నాకు అర్థం కాలేదు” నీలాంబరి..
” అవునా ఇంత మంచి విషయం ఇంత ఆలస్యంగా చెప్తావ్ ఏంటి? నాపర్మిషన్ ఎందుకు చిత్రాలు ఎంతో కష్టపడి తయారు చేసింది నువ్వు ఆహక్కులన్నీ నీకే ఉంటాయి .. నీకు ఇష్టముంటే నేను పంపిస్తాను… నీ మొబైల్ నెంబరు నేనే ఇచ్చాను ఊరి పనుల గురించి ఒకసారి కలెక్టర్ గారు మన ఇంటికి వచ్చారు అదే సమయంలో నా మొబైల్ పాడైనందువల్ల నీనెంబరు ఇచ్చాను.. ఆ రోజు గోడకు తగిలించి ఉన్న నీ చిత్రాలన్నీ చూసి నేను వీటిని ఎగ్జిబిషన్లో పెడతానని ఆనాడే చెప్పారు కానీ నిజంగా పెడతారని నేను అనుకోలేదు.. అందుకే నీ మొబైల్ నెంబరే నేను ఇచ్చాను” అన్నాడు భూపతి.
అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎయిర్పోర్ట్ వచ్చింది… కిందికి దిగి ట్రాలీలో సూట్ కేసులన్నీ డ్రైవర్ సహాయంతో పెట్టారు… సాగర్ కి కూడా అమ్మ వెళ్లడం కొంచెం బాధనే కలిగింది కానీ వెంటనే సర్దుకున్నాడు ఎలాగూ మరో 15 రోజుల్లో తను కూడా వెళుతున్నాడు కదా కానీ, భూపతికి మాత్రం కళ్ళల్లో సన్నటి నీటి పొర కనపడింది..
అది గమనించిన నీలాంబరి తొందరగానే వస్తాను లేండి బాధపడకండి వేళకు భోజనం చేయండి ..అని చెప్పి గేట్ లోపలికి వెళ్ళిపోయింది… బయట నుండి భూపతి సాగర్ చేతులు ఊపుతూనే ఉన్నారు.
లగేజ్ అంత చెకింగ్ లో వేసేసి హ్యాండ్ బాగ్ మాత్రం దగ్గర పెట్టుకొని తన ఫ్లైట్ వచ్చే గేట్ దగ్గర వెళ్లి కూర్చుంది. ఇంకా గంట టైం ఉంది.. ఇంత టైం ఏం చేయాలా అనుకుంది…
ఎవరో “నీలాంబరి గారు” అని పిలిచినట్టు అనిపించింది. పక్కకు తిరిగి చూసింది… ఆనవాళ్లు పోల్చుకోలేకపోయింది…
” నేను గుర్తు పట్టలేదు సారీ మీరు ఎవరో చెప్తారా” అని అడిగింది.
” నేను నీతో పాటుగా చదువుకున్న నీరజను” గుర్తుపట్టావా నన్ను ఇప్పటికైనా అని అడిగింది.
ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది నీలాంబరి..
” నీరజ నువ్వా నిన్ను అసలు చూస్తాను అనుకోలేదు మనం ఇద్దరం ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళం.. మా అమ్మ మీ ఇంటికి మాత్రమే నన్ను పంపించేది ఎవరి ఇంటికి వెళ్ళనిచ్చేది కాదు” అన్నది నీలాంబరి.
” అవును గుర్తుంది నేను మీగడిలోకి వచ్చి ఆడుకునేదాన్ని మీ ఇల్లును చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది నువ్వు ఒక రాకుమారి లాగా ఉండే దానివి.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు నీఅందం ఏ మాత్రం తగ్గలేదు అసలు వయసు కూడా అంత ఉంటావు అని అంటే ఎవరూ నమ్మరు” అన్నది నీరజ.
” అదంతా నిజమే కానీ నన్ను గారు అని అన్నావ్ ఏంటి మనిద్దరం స్నేహితులం కదా! స్నేహితుల మధ్య గారు అని ఉంటుందా!” అని అన్నది నీలాంబరి.
” అంటే నువ్వు జమీందారీ ఇంటి కోడలివి.. ఏమనుకుంటావో అని అలా పిలిచాను” అన్నది నీరజ.
” చాల్లే ఊరుకో అవునూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్!”
” నా కూతురు డెలివరీకి ఉంది అందుకే నేను అమెరికా వెళుతున్నాను” అన్నది నీరజ.
ఇద్దరి సీట్ నెంబర్స్ అనుకోకుండా పక్క పక్కనే దొరకడం ఇద్దరికీ సంతోషాన్ని కలిగించింది .. ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినగానే ఇద్దరు ఫ్లైట్ ఎక్కారు…
ఇద్దరు అమెరికా చేరేవరకు వారి చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ సమయం తెలియకుండా గడిపారు…
ఫ్లైట్లో ఇచ్చిన ఆహారం నీలాంబరికి నచ్చనందువల్ల ముందే ఇంట్లో ప్రిపేర్ చేసి తెచ్చు కున్న పులిహోర ఇద్దరు కలిసి తిన్నారు…
ఫ్లైట్ గమ్యం చేరింది ఇద్దరు ఫ్లైట్ దిగగానే లగేజ్ తీసుకునే బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు తర్వాత ఎవరు వెళ్లాల్సిన ప్లేస్ కి వాళ్ళు వెళ్లి నిలబడ్డారు…
నీలాంబరి కూతురు అల్లుడు వచ్చే కారు కోసం ఎదురుచూస్తూ నిలబడింది…
ఇంతలో ఆమె ముందు నీలం రంగు పెద్ద కారు ఆగింది అందులోంచి కూతురు అల్లుడు చెయ్యి ఊపి..కార్ దిగి అలేఖ్య నీలాంబరి నీ హగ్ చేసుకుంది..ఇద్దరు కాళ్ళకి నమస్కరించారు.. లగేజ్ అంతా కార్ డిక్కీలో పెట్టారు.
కూతురు అలేఖ్య సంతోషంగా మాట్లాడుతూ ఉంది.. ఎన్నో రోజులకు చూసుకున్నందుకు ఇద్దరికీ ఎంతెంతో మాట్లాడుకోవాలి అని ఉంది… అలా కారు ఇంటి వైపు వెళ్తూ ఉంది….