బంగారు పథకాల విజేత…ఎన్నో జాతీయ-అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్స్ లో పరిశోధనా పత్రాలను సమర్పించిన శాస్త్ర వేత్త…నానో టెక్నాలజీ అనుబంధ శాస్త్రవేత్తగా IICT( ఐ ఐ సి టి) లో ఉద్యోగి ఐన మారంరాజు వేంకట మానస అనేకరంగాలలో నిష్ణాతురాలు.
తాను సంగీత సాధన చేస్తూనే ఆ సంగీతాన్ని గణిత శాస్త్రంతో తులనాత్మక పరిశోధన చేసి పత్రసమర్పణ చేసిన పట్టభద్రురాలు…
వీణ వాయంచడంలో విదుషీమణీ!
కంఠం ఎత్తి గానంచేస్తే మైమరచిపోవాల్సిందే!
ఇన్ని ప్రక్రియలలో ప్రవేశము కాదు- పరిపక్వత పొందిన పరిణీత తో తరుణి పత్రిక పాఠకులకు పరిచయ కార్యక్రమం…ముఖాముఖీ…
రంగరాజు పద్మజ:’— నేపథ్యం వివరించమ్మ!
మానస– నమస్కారం పద్మజ గారూ! మీకు మరియు తరుణి పాఠకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, హోళీ పండుగ శుభాకాంక్షలు. సాహిత్య సేవలో మీ కృషి అమోఘం. ఒద్దిరాజు సోదరుల రచనల పై అద్భుతమైన పరిశోధనలు చేస్తూ , మరోవైపు గొప్ప రచయిత్రి గా కీర్తి సంపాదించుకుని తండ్రులకు తగ్గ తనయగా సాహిత్య సేవ లో నిమగ్నులైన మీతో ఈ ముఖాముఖి నా భాగ్యంగా భావిస్తున్నాను. మీకు అనేకానేక కృతజ్ఞతలు.
నేను 1990 లో హైదారాబాదులో జన్మించాను. తల్లిదండ్రులు శ్రీ మారంరాజు ప్రవీణ్ కుమార్ – శ్రీమతి ఉషా రాణి. వృత్తి రీత్యా నాన్న న్యాయవాది, అమ్మ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఇరువురికీ సంగీత సాహిత్యాల పై యెనలేని ఆసక్తి ఉండటంతో మా ఇద్దరక్కాచెల్లెళ్లను మా చిన్నతనం నుంచే సంగీత శిక్షణకు పంపించేవారు. ఇంట్లో ఎక్కువగా ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి, బాల మురళి కృష్ణ, సుధా రఘునాథన్ గార్ల కచేరీ సీడీలు కంప్యూటర్ లో మాకు వినబడేటట్టు పెట్టి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. టివీ లో అవధానాలు, సంగీత కచేరీలు , భాగవత గోష్ఠులు, ప్రవచనాలు వస్తుంటే, యే పనైనా సరే ఆపుకుని అవి చూడవలసినదే. మరో పక్క మంచి సాంసృతిక, సాంఘిక విలువలు కలిగిన శంకరాభరణం, స్వర్ణకమలం, రుద్రవీణ వంటి చలనచిత్రాలను కూడా మా తల్లిదండ్రులు మాకు చూపించేవారు. చిన్ననాటి నుంచే నిరంతరం ఇవన్నీ చెవిలో పడుతూ ఉండేవి కనుక సంగీత సాహిత్యాల పై తెలియకుండానే రసికత ఏర్పడింది కాబోలు. మా మాతామహులు కీ. శే. డా. వనం పరాంకుశ రావు (రాయపర్తి) గారి ప్రభావము కూడా నాపై చాలానే ఉందని చెప్పవచ్చు. వారు వృత్తి రీత్యా ఆయుర్వేద వైద్యులైనా వారి పదవీ విరమణ అనంతరం విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించి విలువైన గ్రంథాలను వ్రాశారు. ఆ గ్రంథాలు చదివిన తరువాత ఏవైనా సందేహాలుంటే వారిని అడిగి తెలుసుకుని స్వేచ్చగా చర్చించుకునే అవకాశం ఉండటంతో భగవద్విషయంపైన ఆసక్తి కూడా యుక్తవయసులో మొదలైంది. అందరి పిల్లల్లా మేమూ చదువుకోవటానికి పొద్దంతా బడికి, కాలేజీలకు పోతున్నా సాయంత్రం మాత్రం కర్ణాటక గాత్ర సంగీత శిక్షణా తరగతులకు వెళ్ళేవాళ్ళం. ఈ క్రమంలో నా చెల్లి ( శ్రీమతి అనూష) నా తోపాటు గాత్రం నేర్చుకుని , హిందుస్థానీ సంగీత వాయిద్యం సితార ను శ్రీమతి బి. శారద రమణమూర్తి గారి శిష్యరికంలో నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె సితారను వాయిస్తుంటే చూసి ముగ్ధురాలను అయ్యేదాన్ని. చెల్లెలు వాయిస్తూంటే చూసి కొంతవరకు సితార ఎట్లా వాయించలో తెలుసుకున్నాను. అది హిందుస్థానీ వాయిద్యం , పైగా తారాస్థాయి వాయిద్యం , అయినప్పటికీ నేను కర్ణాటక సంగీతంలో నేర్చుకునే స్వరాలను , చిన్న చిన్న పాటలను సితార పై వాయించేదాన్ని. ఈ చిన్నపాటి పరిశోధన నన్ను ఒకరకంగా తంత్రీ వాయిద్యాలకు దగ్గర చేసింది.

నేను:– నీ విద్య గురించి చెప్పమ్మ.
పరిశోధన చేసింది ఏ విషయంపైన? అది ఎక్కడ కొనసాగింది?
వృత్తి కి సంబంధించిన వివరాలు చెప్పండి
మానస:- ఇంటర్మీడియట్ తరువాత ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణత తో కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజినీరింగ్ (బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ) సీటు వచ్చింది. ఇంజనీరింగ్ తరువాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే పిజిఈసెట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలో 51వ రాంకు వచ్చింది. తద్వారా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాదులో చేశాను. ఇందులో నేను ఎంచుకున్న స్పెషలైజేషన్ ‘నానో టెక్నాలజీ’. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 92% ఉత్తీర్ణత సాధించడంతో యూనివర్సిటీ బంగారు పతకం అనుకోకుండా వరించింది. ఇది వరకు మా అమ్మకు తాను ఎమ్. కామ్. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసినప్పుడు బంగారు పతకం వరించింది కనుక నాకు వచ్చినది మా కుటుంబంలో రెండవది. ఇంజినీరింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక పక్క చదువుకుంటున్నా మరో పక్క సంగీతం లో తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యాభ్యాస పద్ధతి లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (b.a) పూర్తి చేశాను. విశ్వవిద్యాలయానికి హాజరవుతూ వారాంతాల్లో మా సంగీత గురువు గార్లైన శ్రీమతి చంద్రకళ గారు మరియు శ్రీమతి డా. రాధా సారంగపాణి గారి వద్ద ఉన్నత స్థాయి సంగీత విద్యను అభ్యసించేదాన్ని.
సైన్స్ , టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మెడిసిన్ (STEM) సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, యూనివర్సిటీ లో మొదటి స్థానంలో నిలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం భారత సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ministry of science and technology) ద్వారా వారు చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ రంగంలో మరింత పరిశోధన ( పీ హెచ్. డీ.) చేయటానికి నిధులు కేటాయించి, ఆ విద్యార్థులకు నెల జీతం (ఫెలోషిప్) కూడా ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇదే కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్ డాక్టరేట్ పరిశోధన చేయడానికి నాకు దక్కినందుకు ఎప్పటికీ భారత ప్రభుత్వానికి కృతజ్ఞురాలను. ఐతే అప్పటికే ఆ తోటి విద్యార్థులంతా విద్య ఉద్యోగాల కోసం అమెరికా లో స్థిర పడుతూ ఉన్నారు, కానీ నాకెందుకో అవకాశం వచ్చినా మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లే ఉద్దేశమే లేదు. ఇక ప్రభుత్వ ఫెల్లోషిప్ తో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లాబొరేటరీ అయిన, హైదరాబాద్ లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ( సీ ఎస్ ఐ ఆర్ – ఐ ఐ సీ టీ) లో పీ హెచ్. డీ. ప్రవేశం పొందాను. అక్కడ నేను నానో మెటీరియల్స్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాస్ సెన్సార్ పై పరిశోధన చేశాను. ఈ క్రమలోనే మా గైడ్, సీనియర్ సైంటిస్టు డా. సరళా దేవి గారి ప్రోత్సాహం తో అనేక సైంటిఫిక్ జర్నల్స్ లో పత్రాలు సమర్పించడం జరిగింది.
మా లాబొరేటరి నుండి ప్రచురితమైన పత్రాలు కింది వెబ్ లింక్ లో చూడవచ్చు. https://scholar.google.com/citations?user=TWVKlu0AAAAJ&hl=en
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాదులో బంగారు పతకం అందుకుంటున్న ఫోటోలు
2022 లో పీ హెచ్ డీ పట్టాను అకాడెమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (AcSIR) , న్యూఢిల్లీ నుంచి పొందాను. అనంతరం ఎన్ ఎం ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాను. ప్రస్తుతం భారత సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సైంటిస్ట్ ( మహిళా శాస్త్రవేత్త) గా మళ్లీ నానో టెక్నాలజీ పై పరిశోధనలు ప్రారంభిస్తున్నాను.
నేను :– గణిత శాస్త్రంతో సంగీతాన్ని తులనాత్మక చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీరు సమర్పించిన పత్ర విశేషాలు, దానికి సంబంధించిన పెద్దల తోడ్పాటు, పలువురి అభిప్రాయాలు తెలుపండి!
మానస :– ఇంజినీరింగ్ చదువుకునే రోజుల్లో మా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగ అధిపతి, ప్రొఫెసర్ శ్రీ వినయ్ పాటంకర్ గారు అని ఉండేవారు. వీరు మహారాష్ట్ర బ్రాహ్మణులు, హిందుస్థానీ సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారు. వీరు గాత్రమే కాక హార్మోనియం , తబలా వాయిద్యాలలో కూడా నిష్ణాతులు. వీరు మాకు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులను బోధించేవారు. వీరి తరగతి లో ఉట్టి పాఠ్య పుస్తకాలలో ఉండే అంశాలే కాకుండ నిజ జీవితంలో ఆ అంశాలను ఎక్కడ ఉపయోగిస్తామో కూడా చెబుతుండేవారు. ఒకమారు ‘ beat frequency ‘ అనే అంశంపై బోధిస్తుండగా నావైపు సుద్దముక్కతో వేలెత్తి చూపుతూ, ” మానసా, ఇది నువ్వు నీ నోటు పుస్తకంలో రాసుకో, నువ్వు సంగీత విద్యార్దివి, రాను రానూ నీకీ అంశం బాగా ఉపయోగపడుతుంది ” అని అన్నారు. అప్పుడు నివ్వెరపోయి ఇట్లా ఇంజినీరింగ్ శాస్త్రము సంగీతానికి కూడా జతపడి ఉంటుందా అన్న కోణంలో ఆ తరగతిలోనే ఆలోచనలకు పునాది పడింది. లోతుగా అధ్యయనం చేస్తుంటే అణువు , పరమాణువు , మౌలిక కణాల గురించి ఆలోచిస్తే సంగీతం లోని శ్రుతులు, నాదము, తాళ గమనము వంటి అంశాలకు బాగా దగ్గరగా అనిపించింది. సంగీతమైనా ఇంజినీరింగ్ అయినా తెలుసుకోవలసినది ఒక్కటే కాని అభ్యాసం చేసే దారులలో మనకు వ్యత్యాసం ఉంటుంది.
ఒక పక్క నానో టెక్నాలజీ సెన్సర్ పరిశోధనలలో నిమగ్నమైవున్నా కూడా తీరిక సమయాలలో నానో మెటీరియల్స్ ( సూక్ష్మ పదార్థాలు) ని సంగీత పౌన:పుణ్యాల తో ఎందుకు జత చేయకూడదు అనే ఆలోచనలు తొలుస్తుండేటివి. అసలు నేను చేసే ఆలోచన సరైనదేనా అని అనుకుంటూ ఒకసారి ఇదే ఆలోచనను మా గురువుగారైన రాధా గారికి చెప్తే, నీ ఆలోచన బాగానే ఉంది కానీ దీంట్లో పరిశోధన కోసం ముందుకు వెళ్లాలంటే సంగీతజ్ఞులు, శాస్త్రవేత్త, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డా. నల్లాన్ చక్రవర్తి మూర్తి గారు అని ఉన్నారు, వారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరియు నూకల చిన సత్యనారాయణ గార్ల శిష్యులు. వారిని కలవమని సూచించారు. గురువుగారి సూచన మేరకు వారిని కలిసి ఇటు సైన్స్ అటు సంగీతం రెంటినీ కలిపి పరిశోధన చేసే నా ఆలోచనలు చర్చించాను. మానసా, నీ ఆలోచన బాగానే ఉంది, తప్పేంలేదు, నీకు వీలుగా ఉన్న పరికరాలను ఉపయోగిస్తూ పరిశోధన చేయి, వీలైతే అమెరికా లో కూడా పరిశోధన కొన్నాళ్ళు చేసి రమ్మన్ని ఎంతగానో ప్రోత్సహించారు. వారి పరిచయం అమూల్యం. ఇప్పటికీ ఏవైనా సందేహాలుంటే వారిని అడిగి తెలుసుకుంటాను. వారి ప్రోత్సాహంతో ఇంజనీరింగ్ రంగంలో ఉన్న నా స్నేహితులతో మరియు మా ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వినయ్ పాటంకర్ గారితో సమావేశమయ్యి వారి సహాయంతో ఇంటర్ఫిరోమీటర్ అనే పరికరం నేను ఇదివరకు చదువుకున్న కేశవ్ మెమోరియల్ కాలేజీ లో ఈ పరిశోధన కోసం ఏర్పాటు చేయించుకున్నాను.
ఇంజినీరింగ్ శాస్త్రంలో సౌండ్ వేవ్స్ అంటాము, అవే సంగీత శాస్త్రములో స్వరాలు అంటాము. ఇంజినీరింగ్ శాస్త్రంలో బ్యాండ్విడ్త్ అంటాము, దాన్నే సంగీత శాస్త్రములో శృతి అంటాము. సైన్స్ లో విశ్వమంతా ఫ్రీక్వెన్సీ లతో నిండి ఉంటుంది అంటాము, సంగీత శాస్త్రము లో నాదము, నాదోపాసనము అంటాము. గాయకుడు ఒక స్వరం పాడుతున్నాడు లేదా వాద్యకారుడు వాయిద్యంపై ఒక స్వరం వాయిస్తున్నాడంటే ఆ స్వరం యొక్క శబ్ద తరంగం ప్రకృతి లోకి వదులుతున్నట్టే. ఆ శబ్ద తరంగం మన వాతావరణంలో ఉన్న వాయువులో మిళితమై యున్న అణువులను ప్రభావితం చేసి వాటిని కంపింపచేస్తుంది. ఈ కంపనల వల్ల వచ్చే ప్రతిధ్వనులతో ఆ గాయకుని లేదా వాద్యము చుట్టూ ఒక అలౌకికమైన నాదము ఉద్భవిస్తుంది. ఈ నాదము ఆరోగ్యకరమైనది. ఐతే సంగీత స్వరాలు ప్రకృతిలో సహజంగా ఉండే ప్రతీ సూక్ష్మ మూలకమును (nano elements) ప్రభావిత పరుస్తుందని నా అభిప్రాయం. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో చదువుకున్న పరిజ్ఞానం తో నానో పార్టికల్స్ తయారు చేసి, వాటి కంపనలని కొన్ని పరికరాల ద్వారా గుర్తించి , కొన్ని గణనల ద్వారా వాటి పౌనః పుణ్యాలను లెక్క కట్టి చూడగా సంగీత శాస్త్రములో ద్వాదశ శృతులకు అన్వితమైనవి అని నా ఈ పరిశోధనలో గుర్తించగలిగాను. ఈ పరిశోధనకు సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నా దగ్గర ఉంది కానీ అవి ప్రచురిస్తే సామాన్య పాఠకులకు అర్థం కాదని, దాని సారాంశం మాత్రం సంస్కృతి ఫౌండేషన్ వారు ప్రచురిస్తున్న తరంగ్ పత్రికలో ఇంగ్లీషు లో వెలువడింది, ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు,
https://issuu.com/tarangmagazine/docs/edition_2-67/s/11695570?fbclid=IwY2xjawIicS1leHRuA2FlbQIxMQABHdgSN-DStvfNhq0Zke8ZIUd2zrubA7skUCQMeo4UwBunesZ9FNL_WjD3hg_aem_8A8jksM8xQXnaJoft4VR5g&sfnsn=wiwspwa
నేను:– సంగీత కచ్చేరీలు చేసిన విశేషాంశాలు చెప్పండి!
మానస :– స్కూల్ విద్యార్థి గా మా పాఠశాల తరఫున జంట నగరాల్లో జరిగే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో పాల్గొనేదాన్ని. వీటిల్లో చెప్పుకోదగ్గది నచికేత తపోవన్ సంస్థ నిర్వహించిన గాత్ర సంగీతం పోటీల్లో జంటనగరాల్లో మూడవ బహుమతి గెలుచుకున్నాను. శ్రీ కొవ్వూరు యాదగిరి రావు గారి ప్రోద్బలంతో ఆల్ ఇండియా రేడియోలో స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం సందర్భముగా ప్రసారమయ్యే బాలల కార్యక్రమాలలో దేశ భక్తి గీతాలు ఆలపించాను. ఇదే ప్రసార భారతి రికార్డింగ్ స్టూడియోలో నా తొలి అనుభవం. తరువాత ఆల్ ఇండియా రేడియో నిర్వహించే కర్ణాటక గాత్ర సంగీత యువవాణి పోటీల్లో ఎంపికయ్యాను. తెలంగాణా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కచేరీ చేయడం జరిగింది. విస్సా ఛానెల్ మరియు హిందూ ధర్మం చానెళ్లలో కచేరీలు ప్రసారమయ్యాయి. అన్నిటికంటే నాకు బాగా సంతోషాన్నిచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కచేరీ. శ్రీ శశిభూషణ్ గారు వాయులీన సహకారం, శ్రీ సుధాకర్ గారు మృదంగ సహకారం అందించారు. స్వయంగా తిరుమల శ్రీనివాసుని అనుగ్రహంతో సత్కరింపబడ్డ కచేరీ అది. ఇక ప్రతీ ఏటా సంస్కృతీ ఫౌండేషన్, శాంకరి సంస్థ , కె వి ఆర్ కళాక్షేత్రం నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొంటాను. చిన్న పిల్లల పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి.
నేను :– కచ్చేరీలు చేసే కొత్త గాయనీ గాయకుల కు మీరిచ్చే సలహా!
మీరు పొందిన పురస్కారాలు, అందుకున్న సన్మానాలు, బిరుదులు వాటి గురించి చెప్పండి.
మానస :– సలహాలిచ్చే అంతటి దాన్ని కాను. ప్రదర్శనలు ఇవ్వదలుచుకునే కళాకారులు నిత్యం సంగీత సాధన చేస్తూనే ఉండాలి, నాటి నేటి కళాకారుల కచేరీలు బాగా వినాలి. వీలైతే గాయకులు వాద్యకారులతో , వాద్యకారులు గాయకులతో లేదా ఇతర వాదకారులతో కలిసి సాధన చేస్తే స్వర, రాగ , తాళ జ్ఞానం బాగా అవపోషణ పట్టవచ్చు. పరస్పర అవగాహనకూ దోహద పడుతుంది, తద్వారా మంచి సృజనాత్మక సంగీతము పుడుతుంది. మనోధర్మ సంగీత అంశాలైన రాగం, తానం, పల్లవుల పై ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందని, కచేరీల్లో కూడా ఈ అంశాలను ప్రదర్శిస్తే కచేరీ ఇంకా రక్తి కడుతుందని నా ఉద్దేశం. శాస్త్రీయ సంగీత కచేరీలు పండిత జనరంజకం మాత్రమే అనే భావన సమాజంలో లోతుగా నాటుకపోయి ఉన్నది. ఇది సరైన భావన కాదు కనుక కచేరీలు చేయదలిచే నవ కళాకారులు సంగీతమంటే ఏమిటో కూడా తెలియని వారికి కూడా సంగీతం పై మక్కువ పెంచేలాగ తమ కచేరీని రూపొందించుకుంటే బాగుంటుంది. సంగీతం సర్వ జన రంజకం, సకల చేతనాచేతన రంజకం అని నిరూపించగలిగినప్పుడే ఆ కచేరీ సార్ధకమపుతుంది.
ఇప్పటి వరకూ పరిశోధనా కోణంలోనే శాస్త్రీయ సంగీతం పై దృష్టి సారించాను కానీ కచేరీలపై, ప్రదర్శనలపై దృష్టి పెట్టలేదు. అవకాశం వచ్చినప్పుడు ప్రదర్శించటం తప్ప పురస్కారాలు బిరుదులు అందుకునే అంత గొప్పదాన్ని కాను. ప్రతీ ఏటా మహిళా దినోత్సవ సందర్భంగా అమెరికా అంతర్జాతీయ మహిళా సంస్థ మరియు రాబా మీడియా (మద్రాసు) సంయుక్తంగా అన్ని రంగాల్లో విశేష కృషి చేస్తున్న మహిళామణులను గుర్తించి వారికి బిరుదులను ప్రధానం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో 2023 లో ఉమెన్ అచీవెర్ బిరుదును విద్యారంగంలో నాకు ప్రదానం చేశారు.ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఇంటర్ స్కూల్ గాత్ర సంగీత పోటీల్లో స్వామీ గహనానందా జీ చేతులమీదుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుమతి అందుకుంటున్న దృశ్యం
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కచేరీ తరువాత లోక్ సభా మాజీ సభ్యులు, ఆనాటి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారిచే చిరు సత్కారం పొందిన ఫోటో ప్రముఖ సాహితీవేత్త, కవి , జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలు డా. సి. నారాయణ రెడ్డి గారి సమక్షంలో పాడుతున్న చిత్రం ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ మాడా వేంకటేశ్వర రావు గారి చేతులమీదుగా ఆంధ్ర బాలానంద సంఘంలో సర్టిఫికెట్ పొందుతున్న దృశ్యం అమెరికాలో తెలుగు వారికోసం ప్రత్యేకంగా ‘మన తెలుగు’ టివీ చానెల్ లో ప్రసారమైన సంగీత కచేరి (రికార్డింగ్ దృశ్యం)
నేను:– సంగీతం మీద పరిశోధనలు చేసేవారికి ప్రోత్సాహం ఎలా ఉంది?
ఇంకా ప్రభుత్వ పరంగా ఏమి చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు?
మానస :– కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సీ సీ ఆర్ టీ ( center for cultural resources and training) ఫెలోషిప్ ను ప్రతిభ గల కళాకారులకు వారు మరింత అభ్యాసం చేయడానికి ఒక పథకాన్ని అమలు చేస్తుంది. యువ కళాకారులకు ఇది సదవకాశం. విలువైన గ్రంథాలను తెలుగు విశ్వవిద్యాలయం లోని సంగీత శాఖ గ్రంథాలయంలో మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో భద్రపరిచారు. అంతేగాక జి ఎన్ బాలసుబ్రహ్మణ్యం , సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, వోలేటి వెంకటేశ్వర్లు, ఎమ్ ఎల్ వసంత లక్ష్మీ, డి కె పట్టమ్మాల్, అరియకుడి రామానుజ అయ్యంగార్ వంటి గొప్ప సంగీతజ్ఞుల కచేరీలు సీడీ ల రూపంలో పరిశోధనా విద్యార్థులకు ఉపయోగకరంగా భద్రపరిచారు. ఇదొక మంచి పరిణామం. ఉన్నత స్థాయి సంగీత విద్యార్థులు మరియు పరిశోధనా విద్యార్థులకు ఉపయోగకరంగా నావంతు కృషి గా ‘ వేంకటమఖి విరచిత చతుర్దండి ప్రకాశిక ‘ అనే పుస్తకరూపంలో ప్రచురించి శాస్త్రీయ సంగీతానికి నాలుగు స్తంభాలైన ఆలాప, గీత, ఠాయ, ప్రబంధములను సరళంగా వివరించాను. ఇందులో సంగీతానికి సంబంధించిన సాంకేతిక శబ్దాలు (చాలా పురాతనమైనవి, ఇటీవల కాలంలో వాడుకలో లేనివనే చెప్పవచ్చు) చాలానే ఉంటాయి. 2వ శతాబ్దము నుండి ~10 వ శతాబ్దం మధ్య వాగ్గేయకారులు సంస్కృతంలో గ్రంథాలు రాసి, సంగీతము కు సంబంధించిన అమూల్యమైన ముఖ్యమైన విషయాలు పొందుపరిచారు. కాలక్రమేణా సంగీతం నేర్చుకుని సభా ప్రదర్శనలు ఇచ్చే వారు ఎక్కువైనారు కానీ సంగీతంలోని శాస్త్రీయత పై దృష్టి పెట్టే వారు చాలా తగ్గిపోయారని నా బాధ. అసలు అట్లా నేర్పించే గురువులు కూడా ఇప్పుడు నాకు కనబడట్లేదు. అటువంటప్పుడు నిర్దిష్టమైన సంగీతజ్ఞులను మన సమాజం కొల్పోతున్నది. ఈ మధ్య చాలా మంది సంగీతం లో b.a , m.a , PhD లు చేస్తున్నరు కానీ ఎక్కువ థీసిస్ లు పూర్వ వాగ్గేయకారుల రచనలు, తాళ కాల ప్రమాణాలు, ఇతరత్రా అంశాలపై చేస్తున్నరు. ఒకందుకు మంచిదే,. ఇంకా లోతుగా అసలు సంగీతం ఎట్లా వృద్ధి చెందింది అని పరిశీలిస్తే ఎన్నెన్నో కీలకమైన , పరిశోధనలు చేయవలసిన విషయాలు బయటకు వస్తాయి. పరిశోధకులు ఇటువంటి అంశాలపై కృషి చేయాలని నా అభిలాష.
కచేరీల పైనే ఎక్కువ కేంద్రీకరించకుండా సంగీతంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధికారికంగా మరిన్ని నిధులు కేటాయించాలని నా అభిప్రాయం. సంగీత కళాశాలలు ఉన్నాయి కానీ పాఠశాల స్థాయిలోనే సంగీతాన్ని ఒక సబ్జెక్టుగా పిల్లలకు పరిచయం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడా కోటా రిజర్వేషన్ ఉన్నట్టు సాంస్కృతిక కళల కోటా రిజర్వేషన్ కూడా ప్రవేశపెడితే ఎంతో మంది కళాకారులకు చేయూతగా ప్రోత్సాహకరంగ ఉంటుంది
కేంద్ర సంగీత సాహిత్య అకాడమీ మరియు అఖిల భారత గంధర్వ మహా విద్యాలయం (మహారాష్ట్ర) సౌజన్యం తో ములకలూరి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు నిర్వహించిన కర్ణాటక సంగీత కార్యక్రమం భారతీయ సంతతికి చెందిన పూర్వ వాగ్గేయకారుల కృతులు, కీర్తనలు మొదలగు కూర్పులకు భారత ప్రభుత్వం పేటెంట్ హక్కులు కలిగించాలని నా కోరిక. ఇట్లా చేస్తే అవి దుర్వినియోగ పడకుండా కాపాడుకోగలుగుతాము.
తరుణి మహిళలకు స్పూర్తినిచ్చే ఒక మంచి మాట చెప్పండి!
మంచి సమాజాన్ని స్థాపించటంలో ఒక మహిళ పాత్ర అతి కీలకమైనది. సహజంగానే మహిళ తన చుట్టూ అల్లుకునే బాధ్యతలతో ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదురుకుంటుంది. ఆవేదనలను ఆటుపోట్లను అగాథంలోకి తొసివేసి తన మనస్సాక్షికి తాను విలువనిస్తూ ముందుకు సాగాలి. పొగడ్తలకు పొంగక తెగడ్తలకు కృంగక తన లక్ష్య సాధనకు పాటుపడాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వెయ్యాలి. ఈ సందర్భంగా మగువ పై రాసిన కవితను మీతో పంచుకుంటాను,
మగువ మోమున మంచి మణి నగవు మెరియగా,
మలయ మారుతము ముసురు మాళిగంతా!
మాయ మర్మముల మాన్ప మహిన మందహాసముచే,
మరువంపు మార్గమౌ మనుగడంతా!
నేను :– మీ ఇతరత్రా అభిరుచులేమిటి?
సితార్ మరియు వీణా వాదనల్లో నిష్ణాతురాలను కాను కానీ వాయించటం నాకు చాలా ఇష్టం. పుస్తక పఠనం, మంచి సంగీతాన్ని వినడం వల్ల ప్రశాంతత లభిస్తుంది, ఇతర భాషలు నేర్చుకుని మాట్లాడడం కూడా ఇష్టమే, ఈ క్రమంలో తమిళం మరియు సంస్కృతం కొంత వరకు నేర్చుకున్నాను. తమిళం నేర్చుకున్నందుకు దివ్య ప్రబంధం కాస్త సులువుగా అర్థమవుతుంది. ఇక ఇటీవల మా చిన్నమ్మ శ్రీమతి నీరజా రాణి గారి ప్రోత్సాహం తో సంస్కృత భారతి సంస్థ నిర్వహించిన సంస్కృత భాష పరీక్ష లో ప్రవేశ స్థాయి లో ఉత్తీర్ణురాలినయ్యను.
సంస్కృత భారతి సంస్థ నుంచి అందుకున్న ప్రవేశా పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్
ఒక చక్కని పాట తో ముగిద్దాము. ( తరువాత వాయిస్ రికార్డ్ చేసి పంపంచండి)
మానస — — —
ఈ సదవకాశాన్ని నాకిచ్చిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి రంగరాజు పద్మజ గారికి మరియు తరుణి పత్రిక యాజమాన్యానికి అనేక కృతజ్ఞతలు. తరుణి పాఠకులందరికీ శుభాకాంక్షలు. నమస్కారం.
