పల్లె ఒకటైన వేళ..

ఈరోజు మకరసంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం పర్వదినం సందర్బంగా నేను మా వారు సత్యమూర్తి,మాఇంట్లోవుండే సీను,రేణుక,దినేష్ తో కలసి కారులో నా జన్మభూమి పుట్టి పెరిగిన ఊరు ఏదులాబాద్ కు ప్రయాణం,
కన్న ఊరు,కన్నతల్లి గొప్పది కదా ఎన్నగా ఎవరికైనా..
ఘటకేశ్వర్ మండలంలో నెలకొన్న
గోదా రంగనాథస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కల్యాణం సందర్బంగా పట్నం నుండి పల్లెకు బయలుదేరి ఉదయం 11.30.గంటలకు వెళ్ళాము.


మా ఊరికివెళుతుంటే నాకు చెప్పలేని ఆనందం,ఉత్సాహం .ఊరికి చేరుకోగానే అభివృద్ధి చెందిన ఊరును, ఎత్తైన భవనాలను చూసి పరవశించిపియాను.
ప్రతి ఇంటిముందు పెండతో చల్లిన నీళ్లతో పచ్చదనం నింపుకున్న వాకిళ్ళు తెల్లని ముత్యాల ముగ్గులు సప్తవర్ణ శోభితమై,గొబ్బెమ్మలు వాకిలి కొప్పులో అలంకరించి పల్లె సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ఆహ్లాదకర వాతావరణం చూస్తుంటే రెండు కన్నుల సరిపోవన్నది సత్యం.
ముందుగా నేను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చూచి ఆనందంతో గుర్తుగా ఒక ఫోటో తీసుకుని వెళుతూ పెద్ద చెరువు చూసి పరవశించి ఆనాడు బతుకమ్మ ఆట ఆడిన జ్ఞాపకాలను తలచి నెమరువేసుకుంటూ వెళుతున్నాము.
ఎన్నో కార్లు నిలబడి ఉన్నాయి.కిలోమీటరు దూరంలోనే ఆపేశారు పోలీసులు.చాలా మందితో నిండిపోయింది. నాకు వేరే దారి తెలుసు కాబట్టి దారి మళ్లించి
మా ఊరు కాబట్టి ప్రైమరీ బడి పక్కదారిలో నుండి గ్రామపంచాయతీ ఆఫీసు మీదుగా రామాలయం ( మా బాబాయి వాళ్ళది.మా పెదన్నయ్య అందులో పూజలు చేసేవాడు) వెళ్ళాము.చాలా మార్పులు చేస్తున్నట్లు గమనించాము.రామాలయం అంతా తిరిగి చూచి ఫోటోలు దిగాము.మా చిన్నపుడు శ్రీరామనవమి ఉత్సవాలు,సీతారామ కల్యాణం వైభవంగా జరిగేది.మా పెద్దన్నయ్య రాములు పంతులు ఆ గుడిలో చాలా యేండ్లు పని చేసాడు.అప్పుడు కూడా సీతారామ కళ్యాణ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి.మేము ప్రతి సంవత్సరం రామనవమికి ఊరికి వెళ్ళేవాళ్ళము.
ఇప్పుడు కూడా చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి.

కారును వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర పార్కింగ్ చేసి రంగనాథ ఆలయం వెళ్ళాము.
ఇసుక వేస్తే రాలనంత రద్దీ.పల్లె అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది.అంతేకాకుండా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలనుండి జనం తరలి వచ్చారు.మల్కాజిగిరి MLA మల్లారెడ్డి కుటుంబంతో ,పరివారం తో వచ్చాడు.
.ఆనందం,ఆశ్చర్యం..
లోపలికి వెళుతుంటే తెలిసిన వాళ్ళందరూ పలకరింపులతో పులకించిపోయాను. అక్కడ మేడ్చల్ మల్కాజిగిరి MLA మల్లారెడ్డి గారు కనిపించారు.పలకరించాను.
రంగనాథ గోదాదేవి
దైవ దర్శనం చేసుకున్నాక అమ్మవారిగాజులు ప్రసాదంగా ఇస్తే తీసుకుని కల్యాణం విందు .భోజనం చేస్తుంటే వడ్డన చేస్తున్నవారిలో నాతో కలిసి చదివిన సహాధ్యాయులు కనిపించి గుర్తుపట్టి నువ్వు సీతవేనా? అని అడిగారు.చాలా కాలమైంది చూసి .పాపయ్య,శ్రీరాములు.. ఎన్నో చిన్ననాటి ముచ్చట్లు గుర్తుచేసుకుని మాట్లాడుకున్నాము.అక్కడ నుండి బయటకు వచ్చి వైష్ణవుల యిండ్లు మా చిన్ననాటి స్నేహితులను కలిసి అనుభవాలు పంచుకున్నాము. అట్లా బయలుదేరి .నేను పుట్టిన మా ఊరి నేను పెరిగిన యిల్లు చూచి వారితో మాట్లాడి బయలుదేరి దిడ్డి ( నా చిన్నప్పుడు కూరగాయల మార్కెట్ అన్నమాట) నుండి తిరుమన్నారాయణుని బండ (ఏకశిలా.పెద్దబండ..కింద పెద్దగుహ,గోలకొండకిటకు సొరంగ మార్గం ఉంది అని అంటారు( అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.ఇప్పుడు.బండపైకి ఎక్కి చిన్నపుడు ఆడుకున్న ఆటలు,తీరుతెన్నులు తలచుకొని బయకుదేరాము.మా ఇంటిపక్కన వుండే మా గురువు రామానుజం పంతులు యొక్క (కొడుకు సత్యం ఈ మధ్య మరణించాడు.బాధగా ఉంది.ఎప్పుడు కలిసినా ఆనందంతో పలకరిస్తాడు) వారిభార్య రాజేశ్వరి ఆమె లేదు.వాళ్ళ పక్కింటి వాళ్లు పెరికె వెంకటేశంకు నేను రచించిన మా అమ్మ గురించి మాతృశతకం జానకీ రాఘవీయం, సీతమాట *ద్విశతి రెండుపుస్తకాలు ఇచ్చాను.ద్విశతి మాగురువుకే అంకితం చేశాను. వాళ్లకు అందజేయమని చెప్పి ఒక ఫోటో తీసుకున్నాను గుర్తుగా.


మా అమ్మకు నాన్నకు,మాకు ఊరితో ఆత్మీయానుబంధం ఎక్కువే.
మర్చిపోయాను చెప్పడం వస్తుంటే తొంటలక్ష్మి కనబడి గట్టిగా పట్టుకుంది.ఎంతో సంతోషించింది.కుడిచెయ్యి గిర్నీలో పడి నలిగిపోయింది.ఎడమ చెయ్యి ఒక్కటే ఉంది.కానీ మా చిన్నప్పుడు ఒక్క చెయ్యితోనే పట్టుకుని తలమీద నీళ్లకుండ ఒకటికాదు కుండమీద కుండ రెండు కుండలు పెట్టుకుని చేద బావినుండి నీళ్లు తోడుకొని తెచ్చిన ఘనురాలు.
అలా ఊళ్ళో అందరిని కలుసుకుని ఎంతో అనుభూతిని ఆనందాన్ని మూటకట్టుకుని హైదరాబాద్ లో ఉన్న మా ఇంటికి ఉప్పల్ భగాయిత్ గుండా బయలు దేరి సాయంత్రం 5.30 కి క్షేమంగా చేరుకున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంక్రాంతి ముగ్గులు

నా బాధ్యత