ఎంకట్రాంరెడ్డి శ్రీరంగాపురం నుండి వొస్త వొస్త తెచ్చిన (కోడె )ఎంకన్న రంకేసిండు. ఊరన్న ఊరు నాదిచ్చింది….. నాసిరకపు కోడెలన్నీ ఉరికినవి. మక్తమ్మ కోట్టంల సీతక్క సెవులల్ల ఆ రంకె పడ్డది. ఆ కొత్త కోడె వాసన పసిగట్టి సీతక్క మందల కలిసి బాట పట్టింది. ఎంకన్నగూడ ముర్క చూసిండు. మల్లోసారి ఎంకన్న రంకె విన్న సీతక్క పై జలదరిచ్చింది. ఆ రాత్రి సీతక్క ఎంకన్న ఎంట ఎంకట్రాంరెడ్డి కొట్టం జేరింది. మర్నాడు మాపటికి సీతక్క ఎంకన్నను ఎంట బెట్టుకొని మక్తమ్మ పసుల మాలెలకొచ్చింది. ఎంకట్రాంరెడ్డి గాసగాళ్ళు వచ్చి నానా యాతనలు వడ్డా ఎంకన్న సీతక్కను వదిలి పోలేదు. పరిస్థితులేమైనా సీతక్క కట్టింది. లక్ష్మికి జన్మనిచ్చింది.
పశువుల్లోని ఆత్మీయతానుబంధాలు
ఇది కథాంశం. సీతక్క గతంలో ఊళ్ళో ఉన్న ఏ కోడెలతో లైంగికంగా కలిసి కట్టలేదని, కుటుంబ సభ్యులు దానిపట్ల నిరాదరణ చూపించ డమే గాక దున్నడానికి మెడ మీద కాడిని మోపాలనుకున్నా ఆ ఇంటి యజమానురాలు ముక్తమ్మ సీతక్క మీది ప్రేమతో ఆ చర్యను అడ్డుకుంది. కాని ఎప్పుడైతే సీతక్క ఎంకన్న రంకె విన్నదో ఆ రంకెకు ఆకర్షితురాలైంది. దాని ఒళ్ళు జలదరించింది ఎంకన్నను చూసి పక్క మందల వయ్యారంగా నడిచింది.. సిగ్గుపడ్డది. నాటకం తొక్కినట్లు నడవడమే కాదు. దాని వైఖరి చూసి దానితో లైంగికంగా కలిసే ఉద్దేశంతో దగ్గరికి వచ్చిన పటేల్ మందల కోడెలను సీతక్క సీదరిచ్చు కున్నది. .కాని తనను ఎంబడించిన ఎంకన్న జతకట్టింది సీతక్క. ఈ సన్నివేశాలను మొత్తంగా గమనించినప్పుడు సీతక్క ఎంకన్న తప్ప మరే కోడెను దగ్గరికి రానీయలేదు. ఎంకన్న రంకె వినగానే దాని శరీరం పులకరించింది. అంటే దానితో లైంగికంగా కలవడానికి మనసు ఉవ్వి ళ్లూరింది. అందుకే వయ్యారంగా నడిచింది. సిగ్గు పడ్డది. నాట్కం తొక్కినట్లు నడిచింది. ఎంకన్నతో జోడిగా నడిచి ఆ సాయంకాలానికి దానితోపాటు ఎంకట్రాంరెడ్డి పసుల కొట్టానికి పోయింది. మరునాడు తన ఇంటి పసుల కొట్టానికి ఎంకన్నను తోడు తెచ్చుకుంది. ఎంకన్న కూడా ఎంకట్రామిరెడ్డి గాసాగాండ్లు తమ కొట్టానికి తీసుకుపోవాలను కున్నా వాళ్ళ ఆటలు సాగనీయలేదు. నెలకు పైగా ముక్తమ్మ పసుల కొట్టంలోనే ఉండి సీతక్కతో జతకట్టింది. లక్ష్మీ జన్మకు తోడ్పడ్డది.
సమాజంలో లైంగిక విశృఖలతను చూసినప్పుడల్లా జనం అంతా మృగ చర్యగా పరిగణిస్తారు. విజ్ఞానం లేని వాళ్లను, విచక్షణ లేని వాళ్లను, నీతి నియమాలు లేని వాళ్లను జంతువులతో పోల్చడం పరిపాటి. కానీ పై సంఘటన గమనిస్తే జంతువులకు లైంగికంగా కలవడానికి ఒక ఇచ్చా అనుభూతి ఉంటాయని విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని సీతక్క ఇంటి యజమానురాలు ముక్మమ్మ ” కంటికి అన్తే సీతక్క కాదన్నదా” అనే మాటల్లో స్పష్టమే. అంటే పశువులు ఆడమగా కలవాలంటే వాటికంటికి కూడా నచ్చాల్సిందే అనే భావం పై మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది
ఇది కేవలం లైంగికతకు సంబంధించిన విషయమే. కొంతకాలం గడిచిన తర్వాత ఓనాడు
ఈ రెండు పసురాలు కానరాక వెతుకుతుండగా
ఎంకన్న అలికిడి విన్న జీతగాండ్లకు ఎంకన్ననే సీతక్క లేవ లేకుండా కూలబడ్డ జాగ చూపించింది. దాన్ని తోల్కపోతుంటే ఎంకన్న కూడా ముక్తమ్మ పసరు కొట్టానికే పోయిండు. ఎన్ని పసర్లు పోసినా లాభం లేక సీతక్క ప్రాణం విడిచింది. సీతక్కను సమాధి చేసే ప్రయత్నంలో భాగంగా కదిలించబోతే ఎంకన్న అడ్డుకున్నాడు కొమ్ములతో కుమ్మిండు. సీతక్కను మన్ను చేసినంక తన పసలకొట్టం చేరిన ఎంకన్న దాణ తినలేదు. పెండకడి వేయలేదు. తెల్లారేవరకే అసువులు బాసిండు. ఈ రెండు పశువుల ప్రవర్తన పెళ్లి చేసుకున్న మానవుల చర్యను గుర్తుతెస్తది . పశువుల్లోనూ ఉండే ఆత్మీయతానుబంధాలను అద్దం పడుతది. ఎంకన్న ప్రవర్తన మానవులకు అతీతంగా ఉందేమో అనిపిస్తుంది. ఈ సంఘటన అచ్చంగా మనుషుల్లో భార్య చనిపోతే బతకలేని కొందరు భర్తల ప్రవర్తనను పోలి ఉంది. కొందరికి ఆ లక్షణాలు ఏమాత్రము ఉండవని చాలామంది మగవాళ్ళను చూసి అర్థం చేసుకోవచ్చు.బహుశా మనుషులు ఈ అనుబంధాలను చూసైనా సిగ్గు తెచ్చుకొని మానవ జన్మ ఎత్తినందుకు తమ జీవితాలను సార్ధకం చేసుకోవాల్సి ఉంటుంది.
కథలో పశువులు వ్యవసాయానికి సంబంధించిన విషయాలు రచయిత్రి చాలానే ప్రస్తావించింది. అన్ని కథల్లో వలెనే ఈ కథలోనూ అచ్చంగా తెలంగాణలో ఉపయోగించే పదాలు చాలానే ఉన్నాయి.
తెలంగాణ పదాలు
గడెం కట్టు నాగలిని అనుసంధానం చేసి వ్యవసాయానికి ఉపయోగించుకొను
పై పెయి, శరీరం
బిర బిర తొందర తొందరగా
కట్కేతనం కటిక తనం అనగా కటిక కులస్తులు పశువులను దయాదాక్షిణ్యాలు లేకుండా చంపి కోసి అమ్మినంత కఠినంగా
గొడ్డు సంతానం లేని లక్షణం
తెచ్చుకం. తేవడం
గాసగాండ్లు. సంవత్సరానికింత ధాన్యం
తీసుకొని పనిచేసే నౌకరీలు
ఎడ్లమాలే. ఎడ్లను కట్టివేసే కొట్టం
తలుగు. పశువులను కట్టి వేసే తాడు
నాదిచ్చింది పెద్ద చప్పుడుతో రంకె వేసింది
పెయ్యలు దూడలు
ముర్కజూసుడు వాసన చూసుడు
కుడ్తి. కుడితి,
బియ్యం కడిగిన నీళ్లు గంజి వంటలో ఉపయోగించుకోగా మిగిలిన కూరగాయల భాగాలను పశువులు తాగడానికి ఉపయోగిస్తారు
మెకం. మృగం
సొతాగా స్వతహాగా, స్వంతంగా
తర్మి. తరిమి, పరిగెత్తించి
మకరు కోడె
తావు. జాగ
యాడ్వి యాడనే. ఎక్కడివి అక్కడనే
ఊరన్న ఊరు. ఊరు మొత్తం
అర్సుకోలేదు. పట్టించుకోలేదు
కంటి కాన్తె. కంటికి నచ్చితే
ఆవలీవల పడ్డది. అవతలివతల పడ్డది , బాధ పడ్డది
బిర్రు. బింకము
బేపికరు. చింత లేకుండా
కర్ర పన్గడి. కర్రతో కటకటాలుగా చేసిన తలుపు
ఆదెరువు. సహాయం
బండాలం. పెట్టుబడి సొమ్ము
కైగట్టి. కవితలు కట్టి
పొంటి. నుండి
గవి. గుహ లేదా సొరంగం
జవ తగ్గినవి. సత్తువ ఉడిగినవి
మన్ను చేయుట. చనిపోయిన వాటిని ఖననం చేసి పాతి పెట్టుట
గవ్వల బింకి. గవ్వలతో చేసిన వాద్య విశేషము
బింకి. కుండ, లొట్టి
ఏక్తార్. ఒంటి తీగ తంబూరా
గజ్జల కర్ర. అధికారికమైన కోల
,