సాంప్రదాయ జిమ్

“ఏమండీ నేను మనకి వంట మనిషిని చూద్దామనుకుంటున్నాను” అన్నది దీక్ష.

“ఇప్పుడు వంట మనిషి ఎందుకు? పనులన్నీ చేయడానికి ఇద్దరు మనుషులను పెట్టుకున్నావు. ఉండేది నలుగురము. పోనీ నువ్వు జాబ్ చేస్తున్నావా అంటే అదీలేదు. ఎందుకు వంట కూడా చేయలేకపోతున్నావా? లేక ఆరోగ్యం బాగాలేదా?” అని అడిగాడు వినయ్.

“అసలు మీరు నన్ను పట్టించుకుంటున్నారా? ఒక్కసారైనా నన్ను చూశారా? నేను చాలా లావైపోయాను” అన్నది.

“అవును చూసాను. కానీ లావు అయ్యావు అని చెప్తే బాధపడి కోపంతో నన్ను ఎక్కడ తిడతావో అని చెప్పలేదు”మెల్లిగా అన్నాడు.

“అయితే తెలిసి చెప్పలేదన్నమాట. నేను ఎంత లావైపోయినా మీకేం బాధ లేదా? ఇటు నా అందము పోయి, అటు ఆరోగ్యము పోతే మీకు సంతోషమా”? అంటూ గ య్యమన్నది.

“ఇదెక్కడి బాధరా దేవుడా! వంట మనిషిని పెట్టుకుంటా అంటే, సరే అంటే సరిపోయేది. ఇప్పుడు ఈ గోల నుంచి బయటపడే మార్గం ఎలా?”అని మనసులో ఆలోచించాడు.

“ఏంటి సమాధానం చెప్పరు? ఇంతకు వంట మనిషిని పెట్టాలా వద్దా?”అంటూ కోపంగా అరిచింది.

“వద్దంటే మాత్రం ఊరుకుంటావా? అయితే నాకు ఒకటి అర్థం కాలేదు. నువ్వు లావు అవడానికి వంట మనిషికి సంబంధం ఏమిటి”? అన్నాడు ఆలోచిస్తూ..

“ఉంది. నేను వంట మనిషిని పెట్టుకుంటే, ఆ సమయంలో జిమ్ కి వెళ్తాను. వెళ్లి ఎక్సర్సైజులు చేసి సన్నగా అయిపోతాను. మన పెళ్లప్పటి బ్లౌజ్ లు నాకు సరిపోవాలి. అంతలా మారిపోవాలి. అందంగా సన్నగా మల్లెతీగలా కావాలి. అప్పుడు మిమ్మల్ని చూసి నా పక్కన అంకుల్ లా ఉన్నారని అంటారు. అదే నా టార్గెట్” అన్నది ముఖం నాలుగైదు వంకలు తిప్పుతూ..

“ఇది ఎక్కడి ఖర్మ రా బాబు. లావయ్యావని నేను ఒక రోజు కూడా అనలేదు. ఎవరున్నారో కానీ దొరుకుతే చితక్కొట్టేస్తాను. ఈవిడ మల్లెతీగలా మారి ఏం చేస్తుందట? ఫ్యాషన్ షోలకి వెళ్తుందా ఏంటి? అయినా రోజు చిప్స్, పిజ్జాలు తింటే డ్రమ్ములా కాక ఇంకెలా అవుతారు?” అని స్వగతంగా అనుకున్నాడు.

ఇంట్లో పనిమనిషి పనులను ఎక్కువ చేసేసింది. జీతం బాగా పెంచి ఇల్లంతా ఆమెకే అప్పగించింది. వెతికి వెతికి వంట మనిషిని పట్టుకుంది. ఉదయమే వచ్చిన వంట మనిషితో మాట్లాడింది.

“మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు?” అని అడిగింది వంట మనిషి స్టైల్ గా.

“నలుగురం ఉంటాము” అని చెప్పింది.

“సరే ఏ టైం కు రావాలి వంటలు ఏమేం చేయాలి?”అన్నది కుక్కు.

“ఉదయం 6 గంటలకి రావాలి. రాగానే మా వారికి కాఫీ ,పిల్లలకి పాలు ,నాకు వెజిటబుల్ జ్యూస్ తయారు చేసి ఇవ్వాలి. తర్వాత బ్రేక్ ఫాస్ట్ రోజుకో రకం చేయాలి. నాకు మాత్రం సలాడ్స్ చేయాలి. మధ్యాహ్నం కోసం అన్నం, పప్పు కూర పచ్చడి ,చారు వాళ్ళ ముగ్గురుకి చేసి, నాకోసం పచ్చి గడ్డి కూర, సొరకాయ రసం, రాగి ముద్ద మెంతుల పప్పు చేయాలి. ఇక డిన్నర్ కి రోటీలు కూర చేసిపెట్టి వెళ్ళాలి”అని చెప్పింది.

“ఇన్ని ఐటమ్స్ చేయాలా? అమ్మో చాలా కష్టం. అందులో నేను కూడా డైట్ లోనే ఉన్నాను. సరిపెట్టుకునీ కష్టపడి చేద్దాం అంటే మీ డైట్ లో ఉన్న ఐటమ్స్ నా డైట్ లో లేవు. నేను తినేవి చేయమంటే ఒప్పుకొని చేస్తాను. కానీ జీతం మాత్రం ఎక్కువే కావాలి”అన్నది కుక్కు.

“నీ డైట్ లో ఏమేమి ఉన్నాయి?”అని అడిగింది దీక్ష.

“గోధుమ గడ్డి పచ్చడి, బ్లాక్ రైసు, ధనియాలతో పప్పు జీలకర్ర పొడి , పెరుగు, అడ్డంగా కోసిన క్యారెట్, నిలువుగా కోసిన కీరా, ఫ్రూట్ జ్యూస్” అన్నది.

“దీని ఖర్చే ఎక్కువ అయ్యేలాగ ఉంది” అనుకుని..

“సరే రేపటి నుండి వచ్చెయ్యి” అన్నది .

“సాయంత్రం మాత్రం రాను మేడం” అన్నది.

అన్ని మాట్లాడుకుని గూగుల్ లో మంచి జిమ్ గురించి వెతికింది.

“సాంప్రదాయ జిమ్” అనే పేరు చూసి సెలెక్ట్ చేసుకుని, వాళ్లతో మాట్లాడింది.

ఏ భాగాలు తగ్గాలో చెప్తే శిక్షణ ఇస్తామని చెప్పారు.

ఆన్లైన్ లో డబ్బులు కట్టేసింది.

రేపటి నుండి నోరు కట్టేసుకోవాలని, రాత్రికి బిరియాని, చిప్స్ అన్ని కడుపు నిండా లాగించేసింది దీక్ష.

అన్ని గమనిస్తున్న వినయ్ ఏమీ మాట్లాడకుండా చూస్తున్నాడు. కాకపోతే ఇటు పనిమనిషి జీతం పెరిగి, అటువంట మనిషి జీతం, ఇటు జిమ్ ఖర్చు తడిసి మోపెడు అయ్యింది.

బీరువా తెరిచి పెళ్లినాటి బ్లౌజులు అన్ని ఒక కబోర్డ్ లో పెట్టుకుంది. నెల లోపల అవి సరిపోవాలి అని టార్గెట్ పెట్టుకుంది.

అద్దంలో చూసుకుంది. టీ షర్ట్ లో నుండి బొజ్జ తోసు కుని వచ్చింది.నవ్వితే చెంపలు పరాటాలంత అయ్యాయి.

“ఏం పరవాలేదు సన్నగా అయిపోతాను” అని సర్ది చెప్పుకుంది.

తెల్లవారి కుక్కు వచ్చి ముందు తన డైట్ వండుకుని, మిగతావి చేసింది. వైఫై పాస్వర్డ్ అడిగి చెవులకి ఇయర్ ఫోన్ తగిలించుకుని చిత్రంగా ఊగుతూ వంట చేస్తుంది. వేసుకున్న చిరుగుల జీన్స్, రేగిన జుట్టు, పూసల దండలతో చిత్రంగా ఉంది.

సాయంత్రం దీక్ష సాంప్రదాయ జిమ్ కి వెళ్ళింది.

లోపలికి స్టైల్ గా వెళ్ళింది.అక్కడ వాతావరణం చూసి నోరు వెళ్ళ బెట్టింది..

లోపలికి వెళ్ళిన దీక్షకి అంత అయోమయంగా అనిపించింది. తాను “జిమ్కే వచ్చానా? లేక ఏదైనా పేరంటానికి వచ్చానా?” అనుకుంది.

సాంప్రదాయ జిమ్ అనే టైటిల్ చూసి సంప్రదాయంగానే రావాలని అనుకున్నారేమో! చాలామంది మహిళలు పట్టు చీరలు కట్టుకొని, పూలు పెట్టుకొని, చక్కగా తయారై వచ్చారు. ప్రాంగణమంతా పండగ వాతావరణం లాగా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోజు వీళ్ళు ఇంటికి వచ్చే కుక్కు తల్లి మొదటి లైన్ లో కూర్చుని మొబైల్ చూసుకుంటుంది.

కాకపోతే ఇందులో జాయిన్ అయ్యి ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. అందరూ కొత్త వాళ్లే.

దీక్ష గబగబా కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ మేనేజర్ ను అడిగింది.

“ఇది జిమ్ ఏ కదండీ?”అన్నది.

“అవునండి మీరు ఈరోజే కొత్తగా వచ్చారా?”అని కౌంటర్ లో ఉన్న అతను అడిగాడు.

“అవును నిన్ననే పేమెంట్ చేశాను. మరి వాళ్లంతా పట్టు చీరలు కట్టుకొని వచ్చారేంటి? ” అన్నది.

“అలా ఏం లేదు మేడం. సాంప్రదాయ జిమ్మని పేరు చూసి వాళ్ళు అలా వచ్చారు. అప్పటికి మేము వివరించాము . కానీ కొంతమందికి అర్థం కాక అట్లా వచ్చారు. రేపటి నుంచి జిమ్ డ్రెస్ లోనే వస్తారు. మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్లండి. ముందుగా మీరు ఏ పార్ట్ తగ్గించుకుందాం అనుకుంటున్నారు?”అన్నాడు.

వాళ్ళు ఇచ్చిన ఫామ్ లో డీటెయిల్స్ రాసింది. అందరి మహిళల్లో ఉన్న సమస్య నడుములో కొవ్వు ఎక్కువగా పేరుకోవడమే. నిజం చెప్పాలంటే ఇందులో మన ఆహారపు అలవాట్లు ఒకటి కారణమైతే, ఈ ఫాస్ట్ కాలంలో అన్ని మిషన్స్ వాడడం మరొక కారణం. పాతకాలం పద్ధతులు అవలంబిస్తే అయ్యే పనులు కాదు.

ఫాం ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేసింది.

“మేడం మీరు లెఫ్ట్ సైడ్ గేట్ల నుండి లోపలికి వెళ్ళండి అక్కడ 20 నెంబర్ సెక్షన్ కనిపిస్తుంది. దానిలోకి వెళ్ళండి”అని చెప్పా డు.

బరువు తగ్గుతాను అనే కాన్ఫిడెన్స్ ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది ఉంది .ఇక రేపటి నుండి నా బరువు తగ్గి నెల లోపల సన్నగా అయిపోతాను జిమ్ వాళ్ళు కూడా చెప్పారు తగ్గుతానని లా ల లా లా “ఇలా సంబర పడుతూ బరువుగా అడుగులు వేస్తూ వాళ్ళు సూచించిన సేక్షన్ లోకి వెళ్ళింది.

“ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ,ఈమె కొలతలు హైట్ అన్ని తీసుకొని మరొక తలుపు నుంచి బయటకు పంపించారు.

అదంతా ఒక పెరడు లాగా ఉంది.

పొట్ట ,నడుము తగ్గించడానికి వచ్చిన మహిళలే ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ బోలెడన్ని రోళ్ళు, రోకళ్ళు తర్వాత దంచడానికి నానబెట్టిన బియ్యం, ప ప్పులు ఇలాంటివన్నీ ఉన్నాయి. మహిళలకు చేతులకు గ్లౌజెస్ వేసి తలకి క్యాప్ పెట్టి వారి చేతిలో రోకలి పెడుతున్నారు.

మరొక విషయం ఏమిటంటే ఈ జిమ్ పక్కనే ఒక ప్రొవిజన్స్ స్టోర్ ఉంది. ఈ సాంప్రదాయ జిమ్ లో దంచబడ్డ లేదా విసరబడ్డ పదార్థాలు ఆ స్టోర్ లోకి వెళ్లిపోతాయి. అది మరొక రకమైన వ్యాపారంగా ఏర్పడింది.

ఇదంతా చూసి కళ్ళు తేలేసింది దీక్ష.

“ఇంట్లో పనులన్నీ తప్పించుకొని ఇక్కడికి వస్తే, ఇదే దంచడం. అయినా ఇంట్లో ఎవరి దంచుతున్నారని మిక్సీ వేసుకోవడమే కదా! ఆ పనిని కూడా పని మనిషికి అప్పజెప్పి వచ్చానే”అని మనసులో అనుకుంది.

కానీ అప్పటికే ఆన్లైన్లో డబ్బు కట్టేసింది. చచ్చినట్టు ఇక్కడ ఈ పనులు చేయాల్సిందే. అని అనుకుని..

మళ్లీ మేనేజర్ దగ్గరికి వెళ్లి అడిగింది.

“నేను జిమ్ అంతా ఒకసారి తిరిగి చూడవచ్చా? అంటే ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయో తెలుసుకుందాం అని”అన్నది నెమ్మదిగా.

“దానికేం భాగ్యం మేడం. వరుసగా ఉన్న గదిలో గుండా వెళ్లి చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకే తెలుస్తుంది”అన్నాడు.

ఎందుకో దీక్షకు అతను నవ్వు ఆపుకున్నట్లు అనిపించింది. ఇంట్లో మా ఆయన చెప్తే ఒక పని చేయను. ఇక్కడ ఇంకా ఏమేం చేయిస్తారో అనుకొని మిగతా గదులు చూడడానికి వెళ్ళింది.

ఒకచోట బోలెడన్ని విసుర్రాళ్ళు ఇడ్లీ బియ్యం, గోధుమలు , బియ్యం విసిరితూనే ఉన్నారు అందరూ. పాపం ఇక్కడ ఏదో చేయొచ్చు అని వచ్చిన వాళ్ళే. కిమ్ అనకుండా వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.

మరొక సెక్షన్ కి వెళ్ళింది . గోధుమపిండి కిలోల చొప్పున తడపడం, చపాతీలు చేయడం, ఆ తయారైన చపాతీలు స్టోర్ లోకి వెళ్లిపోతాయి.

అప్పడాల పిండి తడపడం అప్పడాలు చేయడం.

మరొక సెక్షన్ లోకి వెళ్తే అక్కడ కృత్రిమమైన బావి ఏర్పాటు చేశారు. అందులో కొన్ని నీళ్లు పోసి తోడమంటున్నారు. నీళ్లు తోడినవి ఒక పాత్రలో పోస్తే ఆ నీళ్లు మళ్ళీ బావిలోకి వెళ్ళిపోతాయి. ఇదంతా చేతులు తగ్గడానికి ఎక్సర్సైజ్.

ఒక సెక్షన్ లో తోట పని, మరొక సెక్షన్ లో వంట పని, ఇలా ప్రతి దాంట్లో సాంప్రదాయ సిద్ధమైన పనులు చేయిస్తున్నారు. యాజమాన్యానికి ఇటు ఫీజుల రూపంలో డబ్బులు వస్తాయి. తయారైన పదార్థాలు అమ్ముకోవడానికి మరొక రకమైన వ్యాపారం.

“తప్పదు ఇవన్నీ చేయక” అని అనుకొని రోకన్ల సెక్షన్ కి వెళ్ళింది దీక్ష.

రెండు గంటలు అయ్యాక ఇంటికి చేరుకుంది. ఒళ్లంతా చెమటలు. విపరీతమైన నొప్పులు. ఇంటికి వెళ్లి అలాగే పడుకుంది.

ఎలాగూ కుక్కు వస్తుంది .కాబట్టి రెస్ట్ తీసుకుంటాను అనుకుంది.

ఇంతలో కుక్కు ఫోన్ చేసి..

“మేడం మీ ఇంటికి ఈరోజు వంటకి రాలేనం నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి. జ్వరం వచ్చింది “అని చెప్పింది.

చచ్చినంత పని అయింది దీక్షకి.

ఆమెకు జ్వరం రాలేదని తెలుసు. తాను కూడా జిమ్లో జాయిన్ అయింది. కాబట్టి ఇలాగే ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి. అనుకొని భర్తను పిలిచింది..

“ఏమండీ ఈరోజు కుక్కు రాదట. నేను వంట చేయలేను. మొదటి రోజు జిమ్ లో జాయిన్ అయ్యాను కదా! కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటాయని చెప్పారు. ఈరోజు మీరు చేసుకుని వెళ్తారా? అలాగే పిల్లలకు బాక్సులు పెట్టండి” అని నిదానంగా చెప్పింది.

“ఇంత సౌమ్యంగా మాట్లాడుతుంది ఏంటి?”అని అనుకొని..

“సరే చేస్తాలే !ఇంతకీ మీ జిమ్ లో మొదటి రోజు ఎక్ససైజ్ ఎలా జరిగింది?”అని అడిగాడు.

“చాలా బాగుందండి. కొత్త కొత్త ఈక్విట్మెంట్స్ అసలు అవన్నీ ఎక్కడినుండి ఇంపోర్ట్ చేశారో తెలియదు. కానీ అబ్బ భలే ఎక్స్పీరియన్స్ అండి”ఏడవలేక హి హి అని నవ్వింది.

డబ్బు కట్టిన పాపానికి ఒక వారం రోజులు వెళ్ళింది. కానీ ఆపై తన వల్ల కాలేదు. ఇక్కడ డబ్బులు కట్టి ఈ పిండి విసరడాలు రుబ్బడాలు ,చేసే బదులు ఆపనేదో ఇంట్లో చేసి, కాస్త నోరు కట్టేసుకొని ఒళ్ళు తగ్గించుకుంటాను. బుద్ధొచ్చింది మహాప్రభు” అని అనుకొని ముందుగా కుక్కును మాన్పించింది.

మెల్లగా ఇంట్లో పనులు చేస్తూ డైటింగ్ ప్రారంభించింది.

ఇవన్నీ గమనిస్తున్న వినయ్ “జిమ్ లో ఏదో జరిగింది లే !ఏదైనా మన మంచి కొరకే అమ్మయ్య ఖర్చు తగ్గింది” అని సంతృప్తి పడ్డాడు.

ఇంకా ఈ సాంప్రదాయ జిమ్ లో బాధితులు ఎందరో!

శుభం

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పశువుల్లోని ఆత్మీయతానుబంధాలు

అలసిపోతున్న ఆనందం