పిచ్చి ము(కు)దిరింది.

కథ

ఆ రోజు మాలతి, కూతురు లలిత ఏంచేస్తోందో చూద్దామని నెమ్మదిగా తన గది తలుపు తీసింది.
ఇంకేవుంది, భీభత్సం మొదలయింది.
” ఎందుకు వచ్చావు నా గదిలోకి, అసలు నువ్వెవరు, నా అనుమతి లేనిదే ఇక్కడ చీమయినా దూరడానికి వీల్లేదంటే వీల్లేదు” అంటూ లలిత ధడాలున గది తలుపు మూసేసింది.

తలకి తగిలిన బొప్పి తడుముకుంటూ
నొప్పితోనూ , బాధతోనూ కలిసి పైకుబికిన కన్నీరు దాచుకోడానికి విశ్వ ప్రయత్నంచేస్తూ మాలతి ముందు గదిలోకి వచ్చింది.
“అంటే ఎప్పటిలాగే ఏం మార్పు లేదన్నమాట” నిట్టూరుస్తూ విశ్వనాధ్ భార్యని దగ్గరగా తీసుకున్నాడు.
~~~~~~~~
మాలతి మనసు పదిహేనేళ్ళ వెనక్కి వెళ్ళింది. అది మాలతి, తన భర్త విశ్వ నాధ్ కెనడాకి వచ్చిన కొత్త. మొదటి రెండు సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచాయి.
ఆ తరువాత మాలతి గర్భవతి అయింది. అప్పుడు, రక్తపోటు ( బ్లడ్ ప్రెషర్) ఎక్కువ కావడం , నీరు పట్టడం ( ఎడిమ) ఆ తర్వాత ప్రసవం కూడా కష్టమే అవడంతో మాలతి ఆరోగ్యం బాగా దెబ్బ తింది కాని , ముద్దులు మూటగట్టే పాపకి జన్మనివ్వడంతో ఇంక ఆ దంపతుల ఆనందానికి మేర లేక పోయింది.
చిన్నారి లలిత బుడి బుడి నడకలతో, ముద్దు ముద్దు మాటలతో క్రమంగా పెద్దదయింది. లలిత మొదట్లో బాగా చురుకుగా క్రొత్త విషయాలు నేర్చుకోవడం, ఆటపాటల్లో పాల్గొనడం
చేసేది. బడిలో కూడా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకుంది.
కాని పెద్దదవుతూన్నకొద్దీ , లలితలో క్రమక్రమంగా మార్పులు రావడం మొదలయింది. మెల్లమెల్లగా ఒళ్ళు చేసింది. మాలతి, విశ్వనాధ్ తమ పాప కాస్త బొద్దు బొద్దుగా అవుతోందనుకున్నారు తప్ప పెద్దగా పట్టించుకోలేదు.
ఆరోజు లలిత టీచర్ ఫోన్ చేసి మాట్లాడినప్పటి నుంచీ, మాలతి మనసు గాయపడింది. లలిత చదువులో బాగా వెనకబడుతోందిట,
ఎప్పుడు చూసినా మందకొడిగా ఓ మూల కూర్చుని నిరాశక్తిగా ఉంటోందని సారాంశం.

ఆరోజు ఆదివారంకావడంతో మాలతి వంట, వార్పు ముగించుకుని లలితని దగ్గరగా తీసుకుని అసలు విషయమేమిటని అడిగింది. లలిత బిక్కమొగం వేసింది. “ ఏమోనమ్మా, నాకేం తెలియడం లేదు” అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. మాలతి కూతురిని దగ్గరగా తీసుకుని తల నిమురుతూ ఉండిపోయింది.
అది మొదలు లలిత, ఏ కారణం లేకుండానే ఏడవడం, అతి చిన్న విషయానికి అమితంగా కోపం తెచ్చుకోవడం మొదలు పెట్టింది.
మాలతీ, విశ్వనాధ్ ల కేమీ పాలు పోవడంలేదు. అప్పటికే డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు.

అంతలో ఈ రోజు ఇలాంటి కొత్త ఉపద్రవం వచ్చి పడింది. లలిత కోపానికి హద్దు లేకుండా పోయింది.

“ఆ ( ఆ (, అమ్మో, అయ్యో, అమ్మా, నన్ను వీళ్ళు కొడుతున్నారు చూడు” లలిత పెట్టే గావు కేకలకి నివ్వెరపోయి మాలతి, విశ్వనాధ్ కంగారుగా లలిత గది తలుపు తెరిచి చూస్తే ………….

లలిత ఒక మూల ముడుచుక్కూర్చుని భయం భయంగా చూస్తోంది.
మాలతి, విశ్వనాధ్ తెల్లబోయి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. లలిత గదిలో తను ఒక్కతే తప్ప మరెవ్వరూ లేరు. వెంటనే వాళ్ళు తమ కూతురు పిచ్చిదైపోతోందా అన్న భయంతో, బరువెక్కిన హృదయాలతో, లలితని తీసుకుని ఎమర్జెన్సీకి — హాస్పటల్ కి వెళ్ళారు. అక్కడ అది మామూలేగా.
గంటలు గడుస్తున్నయిగాని ఇంకా డాక్టరులెవరూ లలితని చూడ్డానికి రాలేదు. లలితకి అసహనం పెరిగిపోతోంది . ఉండుండి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చేతికందిన వస్తువులు విసిరి వేయడానికి ప్రయత్నించడంతో, మాలతి, విశ్వనాధ్ , లలితకి పిచ్చి ముదిరి పోతోందని తల్లడిల్లిపోయారు.
అంతలో నర్స్ ఒక ఇంజక్షన్ తీసుకు వచ్చి “ డాక్టర్‌గారు మీ అమ్మాయిని శాంత పరచడానికి ఈ ఇంజక్షన్ ఇవ్వమన్నారు. తరువాత వచ్చి చూస్తారు” అంటూ లలితకి జబ్బమీద ఇంజక్షన్ ఇచ్చింది. దానితో లలిత స్థిమితపడి నిద్రలోకి జారుకుంది.
ఇదే అదను అన్నట్లుగా నర్స్ వచ్చి గబ గబా ఓ నాలుగు గొట్టాల రక్తం , లలిత రక్త నాళాల్లోంచి నింపి,వివిధ పరీక్షల కోసంప్రయోగశాలకి(లాబ్ )పంపించింది.
“ఇంక మీ అమ్మాయి ప్రశాంతంగా ఉంది కదా. మీరు ఇంటికి వెళ్ళవచ్చు. పరీక్షా ఫలితాలకోసం మీ కుటుంబ వైద్యులని సంప్రతించండి” అని నర్స్ చెప్పడంతో మాలతి , విశ్వనాధ్ , లలితని నెమ్మదిగా లేపి , నడిపించి, కారెక్కించి ఇంటి దారి పట్టారు.
కెనడా లో డాక్టర్ల కొదవ మరీ ఉధృతంకావడంతో, అమెరికా లో అభ్యసించి అక్కడి ధృవపత్రాలు ఇంటర్నల్ మెడిసిన్ లో సంపాదించి, కెనడాలో మా వారితో
( వల్ల) నివసిస్తున్న నాకు కెనడాలో వందేళ్ళ తరవాత ( అంటే కొంచెం అతిశయోక్తేననుకోండీ) స్పెషలిస్ట్ లైసెన్స్ ప్రసాదించారు.

ఆరోజు నేను క్లినిక్ కి కాస్త త్వరగా వెళ్ళి, చూడవలసిన పేషంట్ల లిస్స్ట్, వాళ్ళకి సంబంధించిన రక్త పరీక్షా ఫలితాలు చూస్తున్నాను. అంతలో నా మెడికల్ అసిస్టెంట్ “ ఈ పేషంట్ కి ఫామిలీ డాక్టర్ లేరు, కానీ రక్త పరీక్షలు అసాధారణంగా ఉన్నందువల్ల మీరు చూడగలరా అని ఎమర్జన్సీ డాక్టరు ఫోన్ చేశారు అని, లలిత ఫైల్ తెరిచింది.
లలిత—-రక్త పరీక్ష ఫలితం చూడగానే విభ్రాంతురాలనయ్యాను.
థైరాయిడ్ హార్మోన్ లెవెల్— (T4) గుర్తించలేనంత తక్కువగా ఉంది.

థైరాయిడ్ స్టిమ్ములేటింగ్ హార్మోన్ (TSH)లెవెల్ 255 ( నార్మల్ = 0.4 — 4.0 )

తరువాత లలితకి నిర్దేశించిన సమయానికి, తనని తల్లి తండ్రులిద్దరూ తీసుకుని వచ్చారు.
మాలతి, విశ్వనాధ్ లలిత పుట్టినప్పటినుండీ అప్పటిదాకా జరిగినదంతా పూస గుచ్చినట్లు , అక్షరం పొల్లు పోకుండా వివరించారు. లలిత మాత్రం బేల మొహంతో ఏమీ పట్టనట్లు కూర్చుంది.
మాలతి ఎంతో బెంబేలెత్తి పోయి ఇంతకు ముందు ఎమర్జెన్సీ లో “ లలితకి పిచ్చి ముదిరిందని పిచ్చి వాళ్ళ విభాగంలో చేర్చవలసి ఉంటుందేమోనన్నారు” అంటూ దుఖం ఆపుకోలేక వలవలా ఏడ్చేసింది. విశ్వనాధ్ కళ్ళల్లో నీరు చిప్పిల్లింది.
నేను వాళ్ళని “ఏమీ భయపడవలసిన అవసరంలేదు . లలిత మిక్సిడీమా పిచ్చి ( Myxedema madness ) అనే జబ్బుతో బాధ పడుతోంది . ఇది మెడ మధ్య భాగంలో గొంతు ముందు ఉండే అవటు గ్రంధి ( థైరాయిడ్ గ్లాండ్) శరీరానికి కావలసినంత థైరాయిడ్ రసాయనం ( hormone ) తయారు చేయకపోవడం వలన వచ్చే వ్యాధి. మొదట్లో , మలబద్ధకం, మందకొడితనం, నీరసం, ఏ విషయాల్లోనూ ఆసక్తి లేక పోవడం, జుట్టు పలచ బడటం వంటి గుణాలు కనపడతాయి. తరువాత తరువాత, నిరాశ, నిస్పృహలు, ఆందోళన ,విపరీత ధోరణి , మొదలయినవి విజృంభిస్తాయి.
కానీ మీరు భయపడవద్దు. మీఅమ్మాయిని పిచ్చివాళ్ళ విభాగంలో ఆసుపత్రిలో చేర్చ వలసిన అవసరంలేదు. థైరాయిడ్ రసాయనం మందు దీనికి సరయిన చికిత్స “ అంటూ లివో థైరాక్సిన్ ( Levothyroxine ) మందు చీటీ రాసిచ్చి వెంటనే మొదలు పెట్టమని చెప్పాను.
ఆరోజు పాపం, లలితనీ, తన తల్లి తండ్రులనీ తలుచుకుంటూ ఇల్లు చేరాను

మూడు రోజుల తరువాత: ఆ రోజు ఆదివారం కావడంతో , నేనూ, మా వారు ,మాల్ కి వెళ్ళి విండో షాపింగ్ చేస్తున్నాం.
ఇంతలో “ నమస్కారం డాక్టర్ గారూ” అన్నమాట విని వెనక్కి తిరిగి చూశాను.
లలిత రెండుచేతులూ జోడించి నవ్వుతోంది. తన వెనక , మాలతీ, విశ్వనాధ్ లు కూడా ఉన్నారు. మాలతి “ పిచ్చి కుదిరింది” అని నోటితో శబ్దం చేయకుండా చెబుతూ , చిరునవ్వు నవ్వుతూ తనూ, విశ్వనాధ్ కూడా చేతులు జోడించారు.

Written by Jabilamma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పిట్ట కథ

వ్యాకరణం – జీవన వ్యాపారం