పిల్లనగ్రోవి

కవిత

రాధికాసూరి

ఓ మురళీ! బాధించే మేని
గాయాల నడుమ
మధుర భాండమై దాగి
మునివేళ్ల తాకిడితో సుధారసమొలికించే
నాదఝరుల్ని పదిలంగా భద్రపరచిన
నీ రస హృదయానికి జోహార్లు!

మది దోచే తరంగనాదాలకు పరవశమొంది
మనో వీధిలో ఆనంద విహారం చేస్తున్న నా
మూసిన కనుల మాటున
కదలాడే చిత్రాలు ఎన్నో!

పైరగాలి తెమ్మెరల్లో పచ్చందానివై పరవశమొందిస్తావు
సెలయేటి సవ్వడులలో నీ నాదామృత ధారలతో నీటి మాటున సయ్యాటలాడే పడతుల లత్తుక నలదిన పదపల్లవ సోయగాలలో ధ్వనితరంగమై ఇంపొందిస్తావు
బాలభాను లేత కిరణాల ప్రవాహాన్ని
నాదఝరులతో స్వాగతిస్తావు
పల్లె జనుల పదసవ్వడులకు మంజీర నాదమౌతావు
తువ్వాయిల మెడ గంటల చిరుసవ్వడులకు
సరిజోడువై సరాగాలాడేవు వేణుగాన సమ్మోహనానికి మైమరిచిన జంట హృదయాలకు
మధురానుభూతినిస్తావు
వెదురుతో వెలుగుందే నీ వైభవానికి మురిసిన వెన్నుడు
తన హస్తభూషణమై అలరారమంటూ ధన్యత గూర్చాడు

రాధికాసూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రతిభా పురస్కారాలు

Unveiling the beautiful hidden world of Farm Animal Intelligence and Emotions