బొమ్మ-బొరుసు

భార్గవీ…భార్గవీ…. ఎక్కడున్నావ్…ఇక్కడ కళ్ళజోడు, నా డైరీ  కనబడక అరిచి చస్తున్నా.. పలకవెం…కోపంగా అరిచాడు శంకర్రావ్.

ఆ.. నేనే పెట్టుకున్నాను….. ఇక్కడ ఇంటిపనంతా  చేయలేక సతమతమయి చస్తుంటే… మీ గోలోటీ……కళ్ళజోడంటే తప్పదనుకోవచ్చు…24 గంటలు ఆడైరీ వెంటేసుకు తిరగడమెందుకూ….సెల్ లా దానికీ రింగ్ ఇస్తే పలికెలా ఉన్నా బావుండు… మీకు బ్రష్షు , టవల్, కళ్ళజోడు, డైరీ , కాలి  చెప్పులతో సహా వెదకడం నా వల్ల కాదు… విసుగ్గా అంది భార్గవి.

వొహో..నువ్వొక్కదానివే చేస్తున్నావ్…ఊర్లో ఎవరూ చేయట్లేదు….. అరె .. షాప్  కి వెళ్ళేమనిషి …సమయానికి అన్నీ అందిద్దాం అని ఉండదే…విసుగ్గా అన్నాడు .

  ఆ.. ఎందుకుంటుంది… ఒక్క షాప్  కెళ్ళగానే మీకయిపోతుంది గాని… రోజంతా మాకేన్ని పనులు… పొద్దస్తమానం చేసినా తీరదు… పైగా మీకులా పండగ సెలవులు, ఆదివారాలు గట్రా లేవు… పండగొస్తే ఒళ్ళు హూనమే… జీవితాంతం ఇదే తంతు… చేసుకుపోతూనే ఉండాలి.. విసురుగా ఏ మాత్రం తగ్గకుండా అంది భార్గవి.

   ఏముందో… రోజంతా పని.. వంట పని , ఇంటిపని అంతేగా… అన్నం, కూర వండి , అంట్లు తోమి ఇల్లు వూడ్వడానికి జీవితాంతం కష్టపడి పోతున్నట్లు ఫీలవుతున్నావ్.

   అవును …టిప్ టాప్ గా తయారై…టిఫిన్ ఆరగించి, బండి మీద అలా షికారులా ,షాప్ కెళ్ళి , నాలుగుసార్లు టీ తాగి  , బాతాఖానీ కొట్టి, గుమాస్తాలపై అజమాయిషీ చేసి  మమ అనిపించుకుని ఎంతో అలసిపోయినట్లు సేదతీరడం….ఓ యబ్బో.. మాకు రాదేంటి?…. మేమూ అవలీలగా ఎడమచేత్తో చేయగలమా  పనులు

  ఆ… ఏమిటేమిటేమిటి… నా పని అవలీలగా ఎడమచేత్తో చేస్తావా… ఆదేమైనా వయ్యారంగా గరిట పట్టుకుని బాండీ లో  తిప్పటమనుకున్నావా… తెలివితో వ్యవహారం…ఎగతాలిగా అన్నాడు శంకర్రావ్.

    అంటే.. ఇక్కడ మేము బండ చాకిరే చేస్తున్నాం గాని… మెదడు వాడడం లేదనా మీ ఉద్దేశ్యం… ఎంత అవమానం… ఎంత ఘొరం.. ఎంత తలవంపులు… ఏ భారత నారీ సహించదీ అవమానం…బస్తీమే  సవాల్… సరి సరి… నా డ్యూటి మీరు చేస్తారా.   దమ్ముందా… మీ పనికి నేను రెడీ… సవాల్ విసిరింది భార్గవి.

   రోషం పొడుచుకొచ్చింది శంకర్రావ్ కి. ఎంత మాటన్నావ్…పౌరుషానికి పెట్టింది      పేరయిన మా వంశాన్ని పట్టుకుని అంత సవాల్ విసురుతావా… ఇదిగో ఇప్పుడే షాప్  కెళ్ళి రెండు రోజులు అక్కడి వర్క్ ఇంటికి తెస్తాను…. బయట తిరిగి చేయాల్సిన పనులన్నీ చెప్తాను. ఈ రెండు రోజులు సెకండ్ సాటర్ డే , సండే కనుక నా పని నువ్వు, నీ పని నేను చేస్తాను…అప్పుడు నువ్వే దాసోహమంటావు… కాస్కో వాస్కోడిగామా..అన్నాడు శంకర్రావ్ పంతంగా.

   చూస్కొండి  నా తడాఖా… నాకేనా చేతకానిది….. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దారనేర్పించినన్ అన్నారు చిలకమర్తిగారు. ఏ పనయినా చిటికే లో చేస్తా..నేను రెడీ…. ఈ రెండు రోజులు చాలు మీరు దాసోహమనడానికి పౌరుషాన్ని రెచ్చగొట్టింది భార్గవి.

   డన్  అంటే డన్ అనుకున్నారిద్దరూ.

   ఆ రోజు భార్గవిని తీసుకుని, ఆఫీస్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం, బాంక్ లో పని, కరెంట్ బిల్, ఇంటి పన్ను కట్టడం వగైరాలన్నీ చూపిస్తూ, దారిలో పాడైన కుక్కర్ రిపేర్ చేయించుకుని, కూరగాయలు కొనుక్కుని , ఇంటి దగ్గర భార్గవిని దించి షాప్  కెళ్ళి, సాయంత్రము వరకు నెలాఖరు పనంతా  ఇం టికి తీసుకొచ్చాడు శంకర్రావ్. ఇద్దరూ కాఫీ   త్రాగాక, ఎవరి పనులు వారు పేపర్ పై రాయాలంది  భార్గవి. మెడికల్ షాప్ ఒనర్ గా ఉన్న శంకర్రావ్ నెలాఖరున చేసే రికన్సిలేషన్, ఎక్స్పైరీ అయిన మందు లు తీసేయ్యాల్సిన చిట్టా తదితరాలన్నీ తీసుకొచ్చాడు. ఇద్దరూ ఎవరేం చేయాలో  రాసేసి జోకులేస్తూ కాస్సేపు చర్చించుకున్నారు. ఆ తర్వాత భోజనం చేసి అలసిపోయి నిద్రపోయారు .

    తెల్లవారి లేస్తూనే, కాఫీ అంటున్న అతన్ని, మర్చి పోయారా.. అది మీ వంతే అంది భార్గవి పేపర్ తిరగేస్తూ.

   అప్పుడు గాని, ముందురోజు ఛాలెంజ్ గుర్తుకురాలేదు శంకర్రావ్ కి. ఓ.కె...ఐ యాం రెడీ.. అంటూ, మనసులో ముందు రోజు కమిట్ అయినందుకు తిట్టుకుంటూ, పైకి హుషారు నటిస్తూ లేచాడు శంకర్రావ్. అతను పెట్టిన కాఫీ, అతనికే నచ్చలేదు, కాఫీపొడి ఎక్కువై చేదైనందుకు, అయినా పైకి ముఖం లో ఆ చాయా లేమీ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ రోజుకి భార్గవి చెబుతుంటే చేసిన టిఫిన్, అన్నం, కూర ఏదో మమ అనిపించాయి. కుక్కర్ లో పెట్టిన అన్నం కొంచెం మెత్తగా అయినా టిఫిన్ లో ఉప్పు తక్కువై అస్సలు తినబుద్దికాలేదతనికి. ఇక కూర లో కూడా ఉప్పూకారం సరిపడేలా లేకపోవడం, పాలు తోడుపెట్టినా అది పుల్లగా ఉండడం, చారు రుచీ పఛీ లేకుండా ఉన్నా తానే పైకి అనలేక నోరు మూసుకుని ఏదో మమ అనిపించాడు. ఇక భార్గవి షాప్  వర్క్ అతను ఎలా చేయాలో ఆ గణాంకాలు, అక్కౌంట్ బుక్స్ నేర్పిస్తుంటే విన్నది కానీ, సరిగ్గా, పూర్తిగా తలకెక్కలేదు, అతన్ని అడుగుతూ ఎలాగో చేయడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు ఏమిటీ తలనొప్పి, హాయిగా ఆడుతూ పాడుతూ వంట పని, ఇంటిపని చేసుకుంటూ ఉండక అనీ అనిపించింది. అయినా బింకంగా బయటపడక, ఎంజాయ్ చేస్తున్నట్లు నటించడానికి కాస్తంత కష్ట పడింది.

      రాత్రి మళ్ళీ వంట చేయాలంటే చిరాకొచ్చింది శంకర్రావుకి అయినా పంతానికి స్వయంగా చేశాడు. కానీ కూర మాడింది. టమాటా చట్నీ లోకి పచ్చి మిర్చి నూనెలో వెయిస్తూ అవి చిట్లి మీద కంట్లో పడితే నానా హంగామా చేశాడు. చేయి కాల్చుకున్నాడు. కాలిన చేయితో అంట్లు తోమలేక నానా అవస్థ పడ్డాడు. నువ్వులను పచ్చడి లోకి వేయిస్తూ, అది ఎగిరి ఇల్లంతా పడితే నానా హైరానా పడ్డాడు. తెల్లవారి ఇడ్లీకి రవ్వ కడుగుతూ, నీళ్ళు పేరుకోకుండానే పారబోసేసరికి రవ్వ కూడా అంతా నీళ్ళతో కలిసి సింక్ లో  పడి పోయింది. భార్యకు తెలీకుండా ఎలాగో మేనేజ్ చేశాడు. ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ  ఏదో తిన్నామనిపించి అలసటగా నిద్రపోయారు.

   ప్రొద్దున్న బయట ఊడ్చి , చల్లి ముగ్గేయడం భార్గవి చేస్తే, ఇల్లు ఊడ్వడం, తుడవడం, టిఫిన్ చేయడం, అంట్లు తోమడం,వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం,  ఆరేయడం, మడత పెట్టడం మళ్ళీ అంట్లు, మధ్యహ్న్నమ్ భోజనం తయారుచేయడం,  తెల్లవారి టిఫిన్ కోసం నానబెట్టుకోవడాలు, పిండి కోసం ఎండబెట్టుకోవడం,…...మధ్య మధ్య లో స్నేహితులనుండి, పిల్లల నుండి , బందువుల నుండి వచ్చే ఫోన్ లతో వొళ్ళు హూనమయి తెగ హైరానా పడి  పోయాడు శంకర్రావ్. భార్గవి కి కూడా ఎప్పుడో మర్చిన చదువు…మళ్ళీ ఆ గణాంకాలు ఏం చేస్తే ఏమవుతుందోననే భయం… భర్త చెబుతూ చేసిన రికన్సిలేషన్ స్టేట్మెంట్ ట్యాలీ అయినా తాను అలాగే చేసిన మరోది ట్యాలీ కాక టెన్షన్ తో తిండి కూడా సరిగ్గా సహించ లేదు. మొత్తానికి ఇద్దరూ హుషారు కోల్పోయి ఒకరి పనులు మరొకరికి ఎంత కష్టమో తెలుసుకున్నారు. అయినా ఎవరికి వారు బింకంగా బయట పడక పంతం తో ఉండి పోయారు. ఒకరి పని గురించి మరొకరికి పూర్తి అవగాహన వచ్చింది. లాభనష్టాలు ఎలా వస్తాయి, సరుకు ఎక్కడనుండి తీసుకురావాలి, కొనుగోలు విధానం , గుమాస్తాలను ఎలా మేనేజ్ చేయాలి, వాట్ గురించి ఎప్పటి కప్పుడు ఎక్స్పైరీ అయ్యే మందుల గురించి ఏ మెళకువలు పాటించాలి  అనేవి భర్త దగ్గర భార్గవి నేర్చుకుంటే, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుంది , కనీసం వంట చేయాలంటే ఏం చేయాలి, ఇంట్లో ఆడవారికి ఎన్ని పనులుంటాయి లాంటి వన్నీ శంకర్రావ్ నేర్చుకున్నాడు.

      రెండురోజులయ్యాక, సహజంగానే సహనం లో మహిళ లకి తర్వాతి స్థానం లోనే ఉండే పురుషునిగా శంకర్రావ్ ఆ రాత్రి ఆమెకు సరెండరయిపోయాడు, భార్గవీ… నేనోడిపోయానే….. అమ్మో… నీ పనులు కొంచెం కష్టం..కొంచెం క్లిష్టం.. అని నాకర్ధమయింది గాని ఇక ఎవరి పని వారే చేసుకుందామే… ఇంకా నీలా పురుగులు పట్టకుండా పప్పులు ఎండబెట్టడాలు, వడియాలు చేయడాలు….లాంటివి లేకుండానే వొళ్ళు హూనమయింది… మంచి భోజనానికి దూరమయ్యాను. అమ్మో ఇంకా మన పిల్లలిద్దరూ హాస్టల్ లో కాకుండా ఇక్కడే ఉంటే ఇంకెంత కష్టమయ్యేదో… ఏ గ్రైందరో, వాషింగ్ మిషనో ట్రబులిస్తే ఇంకెలా ఉండేదో నా పరిస్తితి. నీకో దణ్ణం ..మీ మహిళల ఓపికకో దణ్ణం..గాని ఎప్పుడూ రవంత పని కూడా నాచే చేయించని నువ్వు… నేనిలా చేయి కాల్చుకుని కష్టపడుతుంటే కూడా ఎలా ఓర్చుకున్నావే…అంటూ సిన్సియర్గా.

      ఏం చేయమంటారు….వొర్చుకోవాలని గుండె దిటవు చేసుకున్నాను.. పరిస్థితులు అలా వచ్చాయి… తప్పదు మరి.. అంది భార్గవి నిట్టూరుస్తూ.

    ఏంటి పరిస్థితులు..ఎందుకు తప్పదు…నాకేం అర్ధం కావడం లేదు… అయోమయంగా అన్నాడు శంకర్రావ్.

  మరే..ఇలా కావాలనే చేశాను. నా పరిస్తితి మీలాగే ఉంది. రోజూ చేసే పనులు ఎవరికి వారికే తేలిగ్గా అనిపిస్తాయి. కానీ నేను శాశ్వతం కాదు. మీరు శాశ్వతం కాదు.. ముందుగా ఎవరు పోతామో తెలీదు…… ఎవరు పోయినా, మరొకరి పనులు వాళ్ళే చేసుకోవాలనంటే  కనీస పరిజ్ఞానం ఉండాలి కదా.. అందుకే ఆ రోజూ మీరలా మాట్లాడుతుంటే, సడన్ గా ఆలోచన వచ్చి , మాటకు మాట అన్నా, ఇలా చేద్దామన్నా… భార్గవి అంది వివరంగా చెబుతూ.

   అదేంటి…నీ కింత అకస్మాత్తుగా మనం పోతే ఎలా అనే ఆలోచన ఎందుకొచ్చింది ఆశ్చర్యంగా అన్నాడు శంకర్రావ్.

   ఇటీవల మా బంధువులమ్మాయి భర్త చనిపోతే వెళ్ళాను కదా.. అక్కడి పరిస్తితి ఘోరంగా ఉంది. అతను మార్నిగ్ వాక్ కనీ వెళ్ళి అక్కడే రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయాడట.  అన్నీ పనులు అతనే చేసే వాడట. వాళ్ళ పిల్లలిద్దరూ మన పిల్లల్లాగే దూరం ఉన్నారట. ఆమెకి కనీసం సెల్ ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలీదట. కేవలం పిల్లల దగ్గర్నుండో , అతని దగ్గర్నుండో  ఫోన్ వస్తే ఎత్తడం, ఏ విషయానికైనా అతనికి రింగ్ చేయడం ఒక్కటే తెలుసట. మార్కెట్ కెళ్ళడం, ATM కెళ్ళడం, బాంక్ పనులు అన్నీ అతనే చేసేవాడట. అలా ప్రొద్దున్న నవ్వుతూ వెళ్ళిన మనిషి శవమై వచ్చేసరికి షాక్ తో స్పృహ తప్పిందట. తర్వాత కార్యక్రమాలు జరగడానికి, డబ్బుల గురించి అడిగితే తనకేం తెలీదంటుంది. ప్రక్కనున్న వాళ్ళే ఆమె సెల్ లో ఫీడ్ చేసిన నెంబర్ లకి సమాచారమందించారట. అందరూ దూరంగానే ఉన్నారు. కనీసం డబ్బులు ఏ బాంక్ లో ఉన్నాయి,ATM లు ఎవరి దగ్గరున్నయి , వాటి పాస్ వర్డ్ లు , ఆస్తుల వివరాలు ఏవీ తెలీవట. చాలా మందికి అప్పులు ఇచ్చాడట. అతను చనిపోవడం, ఎక్కడా రాయక పోవడం, ఏదైనా నోట్ రాయించుకోకపోవడం తో ఎవ్వరూ మాకివ్వలేదు అన్నారట. ఏ విషయం ఆమెనడిగినా నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు, నాకే పని ఏనాడూ చెప్పలేదు… నన్ను అన్యాయం చేసి పోయాడు అంటూ ఎడ్చింది.అలాగే మా అమ్మ పోయాక, టీ పెట్టుకోవడం కూడా రాని  నాన్న వంటకి ఎంత ఇబ్బంది పడుతున్నాడో ప్రత్యక్షంగా చూశాను. మన పక్కింటి లో కూడా హఠాత్తుగా భార్య చనిపోయేసరికి అతను దాదాపు పిచ్చివాడయి పోయాడు. మరో విషయం…. చనిపోయిన వారు ఎందులో అయినా నామినీ గా ఉంటే వెంటనే , మరో నామినీ ని రిజిస్టర్ చేయించుకోవాలి , మన ఎదిరింటి లో తాయారమ్మ గారు భర్త కన్నా ముందే చనిపోయింది.   ఆవిడ భర్త బాంక్ అక్కౌంట్ లో ఆమెనే నామినీగా ఉండేదట. అయినా ఆవిడ భర్త మరో నామినీ ని అతను బ్రతికుండగా రిజిస్టర్ చేయించలేదట. మొన్న అతను కూడా చనిపోతే వాళ్ళబ్బాయి ఆడబ్బులు తీసుకోవడానికి చాలా కష్టం అయ్యిందట. నామినీ ఉంటే నిమిషం లో అయ్యేపని, కేవలం రెండు నిమిషాల్లో రిజిస్టర్ చేసుకునే పని చేయక పోవడం వల్ల మళ్ళీ షూరిటీ, నోటరీ, ఫామిలీ మెంబర్స్ సర్టిఫికేట్, కోర్ట్ నుండి లీగల్ హైర్ సర్టిఫికట్ అంటూ నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. ఆ అబ్బాయి నాతో చెబుతూ వాపోయాడు. జాతస్య మరణం  దృవమ్ అన్నారు. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. కానీ మనిద్దరిలో ఎవరం ముందు పోతామో ఎవరికీ తెలియదు. కానీ ఎవరం ముందు పోయినా మరొకరు మరీ ఇబ్బంది పడకూడదనే ఇలా బెట్ అన్నాను. మిమ్మల్ని కష్టపెట్టాను. నన్ను క్షమించండి… కన్నీళ్లతో అంది భార్గవి.

     పిచ్చిదానా…ఈ విషయాలన్నీ నేనెప్పుడో ఆలోచించి ఈ డైరీ లో రాశాను. ఈ డైరీ ఎందుకేప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటానని ఎప్పటికీ అంటావు కదా.. చదువు… అంటూ ఇచ్చాడు శంకర్రావ్.

     అందులో తన తదనంతరం ఆస్తి భార్య, పిల్లలు, అనాధశరణాలయాలకి ఎంతెంత ఇవ్వాలో ఆ వివరాలు, తమ ఆస్తుల వివరాలు, వీలునామా వివరాలు, బాంక్ అక్కౌంట్స్ వివరాలు అన్నీ రాసి  ఉన్నాయి. క్రింద రెడ్ పెన్ తో నేను నా భార్య కన్నా ముందు చనిపోతే పాటించాల్సినవి అన్న చోట ఆమె చూపు నిల్చిపోయింది. నేను నా భార్య కన్నా ముందు పోతే,  నా భార్యకు అత్యంత ఇష్టమైన బొట్టు, గాజులు తీసివేయకూడదు. భర్త పోతే భార్యకు తెల్ల చీర కట్ట బెట్టి, బొట్టు గాజులు తీసేసి , ఆమెను మానసిక చిత్రవధ చేసే సాంఘిక దురాచారాన్ని తరిమికొట్టండి. అవన్నీ  స్వతహాగా పుట్టుక నుండే వచ్చిన అలంకారాలు, మధ్యలో వారిని పెళ్లాడిన మేము పోగానే తీసేయడం ఎంత హేయం. అందుకే నేను ఆమెతో జీవితాంతం బొట్టు, గాజులై తోడున్నాననే ధైర్యం ఇచ్చే వాటినలాగే ఉంచండి….’ చదువుతున్న ఆమె కళ్ళ నిండా నీరు నిండి తరువాతి అక్షరాలు అలుక్కుపోయి  కనిపించాయి. 

     కళ్ల నుండి జారిన నీరు చెక్కిళ్లను తడిపెస్తుంటే, డైరీ పక్కన పెట్టి భర్తను హత్తుకు పోయింది. అతను ఆమె వీపు నిమురుతూ అలా ఉండిపోయాడు.

                                        ************************

Written by Namani Sujanadevi

పూర్తి పేరు- నామని సుజనాదేవి

ఫోన్ నెంబర్ : 7799305575

స్వ స్థలం- హన్మకొండ ,వరంగల్.

.ఉద్యోగం/ వృత్తి- భారతీయ జీవితబీమా సంస్థ లో లీగల్ మేనేజర్

ఇప్పటి వరకు దాదాపు 250 పైగా కథలు అన్నీ ప్రముఖ మాగజీన్లలో , పత్రికల్లో, వెబ్ సైట్ లలో ప్రచురించబడ్డాయి.

వెలువరించిన పుస్తకాలు.. 2 కవితా సంపుటాలు, 6 కథా సంపుటీలు, ఒక నవల.
ప్రధానమంత్రి గారు, 75 వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆన్లైన్లో దేశంలోని అన్ని జిల్లాలకు పెట్టిన లోరీ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నుండి ప్రథమ బహుమతి.
ఇటీవల స్వాతి వారి అనిల్ అవార్డు, ఎక్స్రే వారి ప్రధాన కవిత పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ కథ రచయిత్రి పురస్కారం అందుకున్నాను.

ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా బహుమతులు పొందిన కథలు, కవితలు. ప్రతిలిపి వెబ్సైటు లో ఆరు లక్షల పై చిలుకు అభిమానులు.

కొన్ని కథలు కన్నడం లోకి, ఆంగ్లం లోకి అనువదించ బడ్డాయి. కొన్ని కథలు ఆకాశవాణిలో ప్రసారం చేయబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బతకాలికదరా

వాన కోయిల