పూల జీవితాలన్నీ
ఒకేలా ఉండవు
కొన్ని సూర్య ప్రియం
కొన్ని చంద్ర ప్రియం
ఇంకొన్ని దేవతల ప్రియం
మరికొన్ని మహిళల ప్రియం
కొన్నైతే ఎవరికీ ప్రియం కావు
ఏ పూజకూ పనికిరావు
అవే బోగన్ విలియాలు
పాపం సృష్టికర్తకు
ఏ జన్మలో ఏ రుణం తీర్చలేదో
పరిమళం లేకపోగా
ముళ్ళు సైతం కుచ్చుకునేలా!!
కానీ స్త్రీల జీవితాలన్నీ
ఒకేలా ఉంటాయి
కొందరు వద్దనుకుంటే
పుట్టారని అ ప్రియం
కొందరు కాదనుకుంటే
మిగిలారని అ ప్రియం
ఇంకొందరు బరువనుకుంటే
బ్రతికారని ఉక్రోషం
మరికొందరు పరువనుకుంటే
పారిపోయారని ఉన్మాదం
కొందరైతే సమాజానికి
అసలు పరువే కాదు
వారి బ్రతుకు బ్రతుకే కాదు
వారే వేశ్యాకన్యలు
అన్నీ తానే ఐన
సృష్టికర్తకు (XY )
ఎన్ని జన్మలు ఎందరు స్త్రీలు
రుణం తీర్చుకున్నా
ఇంకా శేషం మిగిలే ఉందేమో
సశేషం చెయ్యాలని
కుక్కర్లో సైతం ఉడికించేలా!!