మన మహిళామణులు

అనువాద సరస్వతి – మద్దూరి రాజ్యశ్రీ

మద్దూరి రాజ్యశ్రీ

అనువాద సరస్వతి బిరుదాంకితురాలైన మద్దూరి రాజ్యశ్రీ అటు తెలుగు సాహిత్యపు పరిమళాల మధ్య ఎమెస్కో ఇంట పెరగటం, ఇటు ఆంగ్ల ఉపన్యాసకురాలిగా, ఆంగ్ల సాహిత్యాన్ని బోధించటంవల్ల రెండు చేతులతోనూ రెండు భాషలనూ ఒడిసిపుచ్చుకున్నారు. అనేక కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు రెండు భాషలలోనూ రచించటమే కాక, అనువాదాలు కూడా అనేకం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, అద్వైత వేదాంతబోధను తన భర్త రాఘవరావుగారితో కలిసి చేస్తూ, అద్వైత వేదాంతంలో ప్రస్థానత్రయాన్ని బోధించటమేకాక, పుస్తకరూపంలో వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత వారికే దక్కింది.
ఉద్యోగపర్వంలోనూ, సాహితీరంగంలోనూ 50 వసంతాల తన సుదీర్ఘ పయనంలోని ఎన్నో అనుభవాలను, జ్ఞాపకాలను, అనుభూతులను మాతో కలబోసుకున్నారు. ఆ గుభాళింపులను వారి మాటలలోనే విందాము.
నేను మొట్టమొదటిగా రాసింది రీడర్స్‌ రిపోర్ట్‌. నేను యం. శేషాచలం అండ్‌ కంపెనీ వ్యవస్థాపకులు అయిన శేషాచలం గారి మనవరాలిని. ఎమెస్కో అధినేత యం.యన్‌.రావుగారి గారాల పుత్రికను. ఎందరో రచయితలు, రచయిత్రులు ఎమెస్కోలో తమ నవలలను ప్రచురించమని వారి వ్రాతప్రతులను పంపుతారు. వాటిని ఎన్నుకునేందుకు ఈ రీడర్స్‌ రిపోర్ట్‌ తోడ్పడుతుంది. ఆ నవల సారాంశాన్ని వివరిస్తూ, ఒక పాఠకురాలిగా ఆ నవల ప్రచురణకు అనుగుణంగా ఉందో లేదో చెప్పాలి. నేను బియ్యేలో ఉండగా, మా నాన్నగారు ఒక నవల ఇచ్చి రీడర్స్‌ రిపోర్ట్‌ రాయమన్నారు. అది మా ఎడిటర్‌గారికి చాలా నచ్చింది. సారాంశం రాసిన పద్ధతి ప్రత్యేకంగా ఉందనీ, అందులో పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ రాశాననీ మెచ్చుకున్నారు. అది శుభారంభం. అవి రెండువందల పైచిలుకు రాశాను. అంతేకాదు, పుస్తకాలకు బ్యాక్‌ కవర్‌ మ్యాటర్‌ కూడా రాశాను.
అలా ఎడిటోరియల్‌ వర్క్‌ ముందు మా నాన్నగారికీ, తరువాత మా అన్న యం.యస్‌. కుమార్‌కీ చేశాను. అప్పుడు పుస్తకప్రపంచం అని ఒక మ్యాగజైన్‌ వచ్చేది. అది సభ్యులకు ఉచితంగా ఇచ్చేవారు. అందులో వచ్చే నెలలో ప్రచురించే పుస్తకం గురించి రివ్యూ రాసేదాన్ని. ఇవి బాగున్నాయి, ‘కథలు ఎందుకు రాయవు?’ అన్నాడు యం.యస్‌. కుమార్‌. ‘ఒకటి రాసే ఉంది, నీకు నచ్చుతుందో లేదోనని ఇవ్వలేదు,’ అంటూ వెంటనే నా వ్రాతప్రతిని ఇచ్చాను. మా అన్న అప్పటికప్పుడు అది చదివి చాలా బాగుందని చెప్పి తనే దానికి ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అని పేరు పెట్టాడు. అందులో చివరిలైను ` ‘అప్పటినుంచీ రవి ఇంట్లో ఉండగా షర్ట్‌ విప్పితే ఒట్టు.’
తనకు అది చాలా నచ్చింది. ఓ హెన్రీ కథల్లో ఉండే ట్విస్ట్‌ ఉంది నీ రచనలో అన్నాడు. నీ శైలి నీకు పెద్ద ఎస్సెట్‌ అని నాకొక కితాబు కూడా ఇచ్చాడు. ఈ ప్రశంసను ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అనేకమంది నోటంట వింటూనే ఉన్నాను. దాని తర్వాత, ఇంక వెనక్కి తిరిగి చూడలేదు.
‘భావం నాదీ, భాష నీదీ,’ అని మావారు నాచేత అనేక కథలు రాయించారు. పుస్తక ప్రపంచం అంతా మా కథలు, వ్యాసాలతో నిండిపోయేది. మగవారికి పొట్టిజుట్టు ఎందుకు? ఫోర్క్‌లు ఎందుకు వాడతారు? ఇటువంటివి ఎన్నో! తను కార్టూన్లు వేసేవారు, నేను జోక్స్‌ రాసేదాన్ని. ఈనాడు, జయంతి పత్రికలలో కూడా కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. అంతేకాక ట్రాచెన్‌బర్గ్‌ సిస్టమ్‌ ఆధారంగా ఎక్కాలే అక్కరలేని లెక్కలుగా సీరియల్‌గా రాశాము.
ఆ రోజుల్లోనే యం.యస్‌ కుమార్‌ వార్కా అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌ ప్రచురించేవాడు. అది తెలుగులో ఎవరో అనువదించారు కాని, తనకు అది నచ్చలేదు. నేనెవరి చేతనైనా వ్రాయిస్తే మీకు అభ్యంతరమా అని అడిగాడుట. వారు ఫర్వాలేదు అంటే నా దగ్గరకు తీసుకువచ్చి, రెండు రోజుల్లో రాసివ్వమన్నాడు. అందులో ముందే బొమ్మలు ప్రింటయి వస్తాయి. ఆ మధ్యభాగంలో తెలుగులో రాసింది వస్తుంది. ముందు నేను భయపడ్డా, ధైర్యం చేసి రాశాను. అందులో యాజధానీ లేఖలు అని ఉండేది. అది చాలా బాగుండేది. ముందు అది రాసేదాన్ని. ఇది రెండేళ్ళు కొనసాగింది. వారి నవల ఒకటి ‘ఎ క్రై ఫ్రమ్‌ ది హార్ట్‌’ను కూడా అనువదించాను. అవి కాక ఆలిస్‌్‌ ఇన్‌ వండర్‌లాండ్‌ అనువదించాను. అనువాదాల మీద రీసెర్చ్‌ చేస్తున్న ఒక రీసెర్చ్‌ స్కాలర్‌ ఇది బాగుందని నా దగ్గరికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసింది.
మా నాన్న గురించి, రెండు సభల్లో ప్రసంగించాను, ఐదారు పత్రికల్లో ప్రచురించారు. కాని అన్నిచోట్ల యం.యన్‌.రావుగారి గురించి ఒక జర్నలిస్ట్‌గానే ఉండేది కాని కూతురుగా ప్రస్థావించలేదు. అది నచ్చి కౌముదిలో కిరణ్‌ప్రభగారు మన రచయితలు/త్రులు పేరిట రెండు సంవత్సరాలు నా వ్యాసాలను ప్రచురించారు. ఒక్కొక్క రచయిత గురించి వారి రచనాశైలి మీద రెండు పేజీలు, వారి ముఖ్య నవల మీద నాలుగైదు పేజీలు రాశాను.
పెళ్ళికి ముందునుంచే ఇంగ్లీషు లెక్చరర్‌గా బందరులో ఎస్పియమ్‌హెచ్‌ కళాశాలలోనూ, పెళ్ళయ్యాక హైదరాబాద్‌లో నాగార్జునా జూనియర్‌ కాలేజీలోను 35 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. రెండిరటిలోనూ ఇంటర్వ్యూ కమిటీ వారు రాజ్యశ్రీని తీసుకోండి, ఆమె మీ కాలేజీకి ఎస్సెట్‌ అవుతుంది అని చెప్పారుట. ఇంట్లో అందరికన్నా చిన్నదాన్ని, చాలా సున్నితమైన మనస్సుతో పెరిగాను. ఎవరైనా ఏదైనా అంటే ఏడిచేదాన్ని. అలాంటిదాన్ని లెక్చరర్‌గా ఉద్యోగం చేయగలనా అని భయపడ్డారు మావాళ్ళు. కాని ఎక్కడ చేసినా, చేరిన కొన్నాళ్ళలోనే యాజమాన్యం, విద్యార్థుల హృదయాలను చూరగొనేదాన్ని. అందులోనూ ఇంగ్లీషు బోధించేదాన్ని కాబట్టి నా సాహితీ గుభాళింపులను అక్కడ విరబూయిస్తూండేదాన్ని. నేను చదివినవీ, నాకు నచ్చినవీ, విద్యార్థులకు ఉపయోగపడేవీ నా బోధలో చొప్పించేదాన్ని. జెమ్స్‌ ఇన్‌ పెడగాగీ పేరిట 50 రత్నాలు, జీవితసత్యాలు ఏరి వారికి ఇచ్చేదాన్ని. ఊరికే ఇవ్వటం కాదు, ప్రిన్సిపల్‌తో సహా అందరూ వాటిలో వారికి నచ్చినది ఒకటి చెప్పాలి. వాటిలో ఓ ఉదాహరణ ` కని, పెంచిన అమ్మకు నీ తొలిజీతంలో ఏదైనా కానుక ఇవ్వాలి. ఇంగ్లీషు గ్రామర్‌మీద నాకున్న మమకారాన్ని చూసి, ఒకరోజు మా ప్రిన్సిపల్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు వచ్చి మీరొక గ్రామర్‌ బుక్‌ రాయండి, నేను పబ్లిష్‌ చేస్తాను అన్నారు. జూనియర్‌ ఇంటర్మీడియెట్‌లో గ్రామర్‌కు 60 మార్కులు ఉన్నాయి. దానికోసం బాగా తర్ఫీదు ఇచ్చేవారము. అందువల్ల అలా అన్నారు మా ప్రిన్సిపల్‌. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో రెండు, మూడు గ్రామర్‌ బుక్స్‌ రెఫర్‌ చేసి ‘ఆప్ట్‌ ఇంగ్లీషు గ్రామర్‌’ పేరిట ఒక పుస్తకం ప్రచురించాము. నేను అనుకున్నదానికన్నా బాగా వచ్చింది అది. కొందరు లెక్చరర్లు కూడా దాన్ని వాడుకునేవారు.


ఈ సందర్భంలో ఒక అనుభవాన్ని పంచుకోవాలి మీతో. నేను బందరులో పనిచేస్తున్నప్పుడు, అక్కడ తెలుగు మీడియం పిల్లలు ఎక్కువ ఉండేవారు. ఒక అమ్మాయి మా కొలీగ్‌ చెల్లెలు. నేను డైరక్ట్‌`ఇన్‌డైరక్ట్‌ స్పీచ్‌ చెప్పినప్పుడు, ఆ అమ్మాయి టక్కున జవాబు చెప్పింది. పైగా నేను చాలా బాగా చెప్పాను కాబట్టి బాగా అర్థమయింది అందిట. దట్‌ వజ్‌ ఎ ఫెదర్‌ ఇన్‌ మై క్యాప్‌.

రాజశ్రీ రచించిన పుస్తకాలు

మాది ఎయిడెడ్‌ కాలేజీ. అందువల్ల పదవీ విరమణ చేసినప్పుడు నాకొచ్చిన ప్రశంసా పత్రంలోంచి నాలుగు వాక్యాలు ` ‘వృత్తిరీత్యా ఆంగ్లభాషను బోధిస్తూ, ఎమెస్కో వారి వారసత్వపు సంపదగా తెలుగు భాషాభిమానము రచనా కౌశలము గల రాజ్యశ్రీ మేడమ్‌ గారి కలం నుండి జాలువారిన స్వతంత్ర రచనలు ` అనువాదల నవలలు` ఎన్నో ప్రక్రియలు వారి బహుముఖ ప్రజ్ఞను చాటిచెప్తాయి. విద్యార్థులకు ఆమె ఒక ఆరాధ్యదైవం, కళాశాల యాజమాన్యానికి ఒక ఆదర్శ ఉపాధ్యాయురాలు, కళాశాలకు ఒక ఎస్సెట్‌.’
ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ విష్ణుప్రసాద్‌ గారి ద్వారా మంతెన సత్యనారాయణరాజు గారి ప్రసంగం వినటం తటస్థించింది. ఆయన ప్రోత్సాహంతో, మంతెన గారి అంగీకారంతో ఆయన పుస్తకాలు నాలుగు తెలుగు నుండి ఇంగ్లీషుకు అనువదించాను. తెలుగులో వాటి పేర్లు ఆరోగ్యమే ఆనందం, మధుమేహానికి ప్రకృతివైద్యం, మలబద్ధకం, నీరు`మీరు. మలబద్ధకం మీద అమెరికా నుంచి ఎవరో అడిగిమరీ వ్రాయించుకున్నారు. ఈ పుస్తకాలను విడుదల చేసేటప్పుడు విజయవాడలో ఆయన ప్రకృతి ఆసుపత్రి ప్రాంగణంలో, 1000 మంది సభ్యుల సమక్షంలో, నన్ను సన్మానం చేసి, ‘అనువాద సరస్వతి’ అని పేరు చెక్కించి, సరస్వతీదేవి ఉన్న పెద్ద మొమెంటో బహుకరించారు. అది నా జీవితంలో మరపురాని రోజు. ఇవికాక ఆంధ్రభూమిలో యువగీత, శ్రీపీఠంలో మానవీయ విలువలు, సాక్షిలో ఆధ్యాత్మకథలు, ధ్యాన భావనలుÑ ఇంటర్నెట్‌లో ఇంగ్లీషులో పర్సెనాలిటీ డెవలప్‌మెంట్‌ త్రూ గీత, డివొటీస్‌ స్టోరీస్‌,భజగోవిందమ్‌మీద ప్రేమ్‌ సిద్ధార్థగారి వ్యాఖ్యానం ప్రచురితమయ్యాయి.
ఈ మజిలీలన్నీ తెలిసిన మా ఇంకొక ఫ్యామిలీ ఫ్రెండ్‌ రవికుమార్‌ గారు ఒక అనువాద నవల తెచ్చిచ్చి, ‘మీరింతకన్నా బాగా రాయగలరని నాకు తెలుసు. మీరెందుకు ప్రయత్నించకూడదు?’ అన్నారు. అది జైకో వారి ప్రచురణ. సరే, ప్రయత్నిస్తే తప్పేముందని నేను వారికి ఒక లేఖ రాశాను. వారు పదిపేజీలు పంపి, దాన్ని అనువాదం చేసి పంపమన్నారు. వారికి అది చాలా నచ్చి, ఇంకా నా చేత ఎన్నో రాయించుకున్నారు. వారి ఎడిటోరియల్‌ బోర్డులో నన్ను చేర్చుకుని, తక్కిన అనువాదకుల సమీక్షలు చేయించుకునేవారు. ఒకటి రాస్తూండగా ఇంకొకటి పంపటమో, రెండూ ఒకేసారి పంపటమో చేశారు. రాబిన్‌ శర్మవే ఆరు పుస్తకాలు చేశాను. సెల్ఫ్‌ హెల్ప్‌ మీద, వేదిక్‌ మాథ్స్‌ మీద, పర్శనాలిటీ డెవలెప్‌మెంట మీద, పాజిటివ్‌ థింకింగ్‌ మీద అనేకం అనువదించాను.
ఈ పాజిటివ్‌ థింకింగ్‌ నార్మన్‌ విన్సెంట్‌ పీల్‌ రాశారు. ఆయన బైబిల్‌లోంచి అనేక కొటేషన్లు వాడారు. నేను ఒక తెలుగు బైబిల్‌ సంపాదించి, అందునుంచి రాసేదాన్ని. కొన్ని దొరకకపోతే, నా క్రిస్టియన్‌ ఫ్రెండ్‌ సహాయం తీసుకునేదాన్ని. కాని అది చాలా బాగుంది. నిజజీవితంలోని ఎందరివో అనుభవాలు, అందులో ఉండేవి. జైకో వారి పుస్తకాలు చూసి, మంజుల పబ్లికేషన్స్‌ కూడా కొన్ని రాయించుకున్నారు. రెండూ కలిపి 21 వచ్చాయి.
నేను రిటైర్‌ అవకముందే మావారు రాఘవరావుగారు చెన్నైకు చెందిన పరమార్థానందస్వామి వారి బోధలు వింటూండేవారు. స్వామీజీ అద్వైత వేదాంతం బోధించేవారు. మా ఇంట్లో ఇటుక, ఇటుకకూ ఆయన బోధ సుపరిచితమే. నేను వంట చేసుకుంటూ, ఆయన గొంతు వినేదాన్ని కాని అది ఏమిటో తెలియలేదు ముందు. ఒక శుభముహూర్తాన (నిజంగా అది శుభముహూర్తమే) కుతూహలం కొద్దీ ఏమిటి వింటున్నారు అని అడిగాను మావారిని. నువ్వే విను, నీకు తెలుస్తుంది అనిచెప్పి ముండకోపనిషత్తు నా సెల్‌లో వేసి ఇచ్చి, రోజుకొక లెక్చర్‌ కింద వినమన్నారు. అవి 36 లెక్చర్లు ఉన్నాయి.
అది వినేనాటికి నాకు అసలు అద్వైతం అంటే ఏమిటో తెలియదు. ఉపనిషత్తు, ఆత్మ, అనాత్మ, శరీరత్రయం, పంచకోశాలు, కర్మ సిద్ధాంతం ` ఈ పదాలతో బొత్తిగా పరిచయం లేదు. అలాంటి అజ్ఞానంలో ఉన్న నేను ముండకోపనిషత్తు వినటం మొదలుపెట్టాను. పరమార్థానందస్వామీజీ పూజ్యస్వామీజీ దయానంద సరస్వతిగారి శిష్యులు. ఎంత బాగా చెప్పారనుకున్నారు! ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే! అసలేమీ తెలియని ప్రపంచంలోకి, స్వయంగా మన చేయి పట్టుకుని, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించి, ఎక్కడ జారిపోతామో అని మధ్యమధ్యలో జాగ్రత్తగా చూసుకుంటూ, పైకి తీసుకువెళ్ళి ఒక అద్భుతప్రపంచం చూపించారు.
నేను కూడా ఇంగ్లీషు లెక్చరర్‌నేమో, మేము ఒక ఇంగ్లీషు పోయెమ్‌ ఎలా బోధిస్తామో, అలాగే స్వామీజీ ఒక మంత్రం చదివి, ముందు దాని గురించి కొంత ఉపోద్ఘాతం ఇచ్చి, మళ్ళీ ఒక్కొక్క మంత్రంలోని ఒక్కొక్క పదానికి అర్థం, గూఢార్థం చెప్పి, మళ్ళీ దానికి ముక్తాయింపు పలకటం, మర్నాడు పదినిముషాలు పాత పాఠాన్ని గుర్తు చేయటం ఆయన బోధనాశైలి. ఆయనది ప్రసంగం కాదు, క్లాస్‌రూమ్‌ టీచింగ్‌.
మావారూ, నేనూ కలిసి, అప్పుడు మూడుచోట్ల అద్వైత వేదాంతాన్ని బోధించే వారము. అద్వైతవేదాంత పరిచయం, అద్వైత వేదాంతంలో ప్రాథమిక గ్రంథం. శిష్యుల సహకారంతో దాన్ని ప్రచురించాము. అది విశేష ఆదరణ పొంది, నాలుగవ ప్రచురణకు వచ్చింది. అద్వైత వేదాంతంలో ప్రస్థానత్రయం అని ఉంటుంది. అవి ` భగవద్గీత, పది ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు (చతుస్సూత్రీ).గురుకృప, సరస్వతీకృపవల్ల ఎనిమిదేళ్ళలో మేమిద్దరం ప్రస్థానత్రయం బోధ చేయటమూ, వాటిని మా సత్సంగసభ్యుల సహాయసహకారాలతో ప్రచురించటం కూడా అయింది. ఇంటర్నెట్‌లో ఇంగ్లీషులో ఎ ట్రియటైజ్‌ ఆన్‌ మెడిటేషన్‌ , ఆత్మబోధ, తైత్తిరీయం ప్రచురించ బడ్డాయి. మా జీవితంలో ఈ ఆధ్యాత్మిక రంగంలో విజయం ఒక మైలురాయి. మేమిద్దరం రాఘవ రాజీయమ్‌గా, గురుదంపతులుగా, ఒకే బాటలో నడిచే ఆదర్శజంటగా మన్ననలందుకుంటున్నాము.
భగవద్గీతను మూడు షట్కాలుగా (2500 పుటలు) ప్రచురించాము. ఇవికాక కొన్ని ప్రకరణ గ్రంథాలు, అద్వైత జీవనవిధానం అనే గ్రంథాలు కూడా ప్రచురించటం జరిగింది. ఇవన్నీ కలిపి 20 గ్రంథాలు అయ్యాయి. అన్నీ విశేషంగా జనాదరణను పొందాయి. వాటిలో చాలా పునర్ముద్రణకు కూడా నోచుకున్నాయి. పండితులను, పామరులను అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జటిలమైన సబ్జెక్టును తేటతెలుగులో రచించారనీ, ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతున్నట్టే ఉందనీ, మా దంపతులకు పూర్వజన్మ సుకృతం ఉందనీ, మాకు సరస్వతీకృప అపారంగా ఉందనీ, ఎక్కడా అనువాదంగా లేదనీ, ఇది చూసి మేము కూడా బోధ చేయటానికి వీలుగా ఉందనీ ఎందరో ప్రశంసల వర్షం కురిపించారు.
ఆ విధంగా ఏ రంగంలో చేయి పెట్టినా, అవార్డులు, బహుమతులు రాలేదు కాని, ఆ రంగంలో ప్రశంసల వర్షం కురిసిందనీ, నిజానికి ఆయా రంగాల్లో వారే కోరి చేయించుకున్నారనీ చెప్పారు మద్దూరి రాజ్యశ్రీ. 65 పైగా గ్రంథాలు, శీర్షికలు ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం వారిరువురు, ఏం ఎస్‌ టీమ్స్‌లో భగవద్గీత, ఉపనిషత్తులు బోధిస్తున్నారు. ఆర్షవిద్యా తరంగిణి పేరిట యూట్యూబ్‌లో చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తీరున్న పల్లె

మానవత్వం