మహానటి

కథ

“మీకు తెలీదు అత్తయ్యగారూ! ఆ అర్చన ఏదో మదర్ థెరిసాని అనుకుంటుంది. తనేమైనా డాక్టరా! నాకు ప్రాణం పొయ్యడానికి ? నేను పదిసార్లు చెప్పాను ఎవరైనా ఆయాని పెట్టుకుంటాను అని. ఈవిడగారు “వద్దు నేనుండగా ఆయా ఎందుకు?” అంటూ తీసిపారేసింది. నాకు ఎంత మొహమాటం వేసేదో ఈవిడ చేత అన్నీ చేయించుకోవడానికి. అదే ఆయా ఉంటే దబాయించి చేయించుకునేదాన్ని, అందరూ అర్చన వల్లనే నువ్వు ఇలా కోలుకున్నావు అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ” తలుపు తోసుకుని ఇంటి లోపలకి వస్తున్న అర్చన దివ్య మాటలు విని ఒక్క నిమిషం మాన్ప్రడి నిల్చుంది.

కొంచెంసేపటికి సర్దుకుని, మొహమంతా నవ్వు పులుముకుని, లోపలికి అడుగుపెట్టింది. అర్చనని చూసిన దివ్య ఖంగు తింది, తను అన్న మాటలు విన్నదేమో అని అనుమానంతో పట్టి చూస్తూ, “నూరేళ్లు అక్కా! ఇప్పుడే అత్తయ్యగారితో అంటున్నాను! అక్క నాకు మళ్లీ ప్రాణం పోసింది, ఇలాంటి తోటికోడలు ఉండడం నా అదృష్టం!” అన్న దివ్యని చూసి ‘అబ్బ! నువ్వు నటివి కూడా కాదు మహానటివి’ అనుకుంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వి “తలనొప్పిగా ఉంటే సెలవు పెట్టి వచ్చాను, కాసేపు పడుకుంటాను” అత్తగారితో చెప్పి రూమ్ లోకి వెళ్లింది.
నిజంగానే, ఆఫీసులో గొడవకి, తలనొప్పి వచ్చి సెలవు పెట్టి వచ్చింది అర్చన.

తనకి రావాల్సిన ప్రమోషన్, వేరే అమ్మాయికి ఇచ్చేసరికి, మేనేజర్ తో దెబ్బలాట పెట్టుకుంది అర్చన. “నువ్వు పని పీక్ లో ఉన్న టైం లో పదిహేను రోజులు సెలవ పెట్టావు. నీ మెడికల్ ఎమర్జెన్సీ కూడా కాదు, మీ తోటికోడలికి ఆక్సిడెంట్ అయిందని సెలవు పెట్టావు. అప్పుడు వర్క్ ఎంత దెబ్బతిన్నదో తెలీదా నీకు, నిన్ను ఉద్యోగం నుంచి తియ్యలేదు సంతోషించు!” ఉద్ధరించినట్టు అన్న ఆయన మాటలకి కోపం వచ్చి, ఆయన మీద నాలుగు అరిచి సెలవ పెట్టి వచ్చింది.

ఇంటికొచ్చాక, ఎవరి కోసమైతే సెలవు పెట్టిందో, ఆ దివ్య ఇలా మాట్లాడేసరికి తల తిరిగిపోయింది అర్చనకి. పడుకుంది కానీ అసలు సంగతులు గుర్తుకొచ్చేసరికి, నిద్ర పట్టలేదు.

అర్చన ఆ ఇంటికి పెద్ద కోడలు. ఉద్యోగం ఉంది, పిల్ల బావుంది అని పెద్ద కొడుకు అఖిల్ కి అడిగి మరీ కోడలిని చేసుకున్న అత్తగారింట్లో, ఉద్యోగ బాధ్యతలతో పాటు కోడలి బాధ్యత కూడా, చక్కగా నిర్వహిస్తోంది అర్చన.
మరిది వినయ్ పెళ్లి అయ్యి, దివ్య తోటికోడలిగా ఇంటికి వస్తే, అక్కచెల్లెళ్లు లేని తనకి ఒక చెల్లి దొరికిందని సంతోష పడింది. అప్పటినుంచి తన కోసం ఏ చీర, డ్రెస్ కొనుక్కున్నా, దివ్యకి కూడా కొనేది.

దివ్య మంచి చదువే చదివినా, పెళ్లికి ముందే ఉద్యోగం చెయ్యను అని చెప్పింది. అత్తగారు తనకి తోడుగా ఉంటుందిలే అని సంతోషపడింది కానీ, ఆ తోడు కబుర్ల వరకే అయింది.
స్వతహాగా దివ్య బద్ధకస్తురాలు, తన మాటల చాతుర్యంతో, అంత పనీ దివ్యే చేసింది అని అందరూ అనుకునేట్లు కబుర్లు చెప్పేది.
దివ్యకి ఒక అక్క , ఒక చెల్లి ఉన్నారు. అందువల్ల అర్చనని ఇంకో అక్క అనుకోకపోయినా, అవసరార్థం కబుర్లు బానే చెప్పేది.
దివ్య బయటికి వెళ్ళాలంటే స్కూటర్ మీద వెళ్ళేది. ఒక రోజు కొద్దిగా చీకటి పడ్డాక వస్తుంటే, మలుపులో ఒక బస్ గుద్దేసింది.స్కూటర్ పప్పు అయింది, దివ్యకి చాలా దెబ్బలు తగిలాయి.
చుట్టుపక్కల వాళ్ళు అంబులెన్సు పిలిచి, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తూ, ఇంటికి ఫోన్ చేశారు.
ఆ టైం కి ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరు, అత్తగారు ఖంగారుపడితే, అర్చన, ఆసుపత్రికి వెళ్లి వినయ్,అఖిల్ వచ్చేదాకా అన్నీ చూసుకుంది.
దివ్యకి రక్తం బాగా పోవడంతో పాటు, కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అప్పటికప్పుడు ఆపరేషన్ చెయ్యాల్సి రావడంతో, దివ్య రక్తం గ్రూప్ తో అర్చనది సరిపోయిందని రక్తం ఇచ్చింది. దివ్య అమ్మగారు, పెద్ద కూతురి పురిటికి అమెరికాలో ఉన్నారు, చెల్లెలు ముంబైలో ఉంటుంది. ఆ అమ్మాయి తన అత్తగారు, మామగారు పెద్దవాళ్లని, వదిలి రావడం కష్టమని, దివ్య ఇంటికి వచ్చాక ఒకరోజు వచ్చి చూసి వెళ్తానని చెప్పింది.

అత్తగారు, వినయ్ , దివ్య పుట్టింటి నుంచి సాయం లేదని బాధ పడుతుంటే అర్చన, “నేను దివ్య ఇంటికి వచ్చేవరకు, సెలవ పెట్టి ఆసుపత్రిలో చూసుంటానులే అత్తయ్యగారు, మీరు వంటమనిషిని పెట్టుకుని ఇంట్లో చూసుకోండి” అంది.
“మాతల్లే! ఎంతైనా అర్చనలాగా ఏ కోడలు ఉండదురా అబ్బాయ్! తోటికోడలు కోసం ఎవరు ఇంత చేస్తారు?” అత్తగారి పొగడ్తకి దభీమని పడిపోయింది అర్చన.

పదిరోజుల పాటు దివ్యతో ఆసుపత్రిలో ఉండి, ఒళ్ళు హూనం చేసుకుని సేవ చేసింది.
అఖిల్ ఒక సారి తల్లి, వినయ్ దగ్గర సణిగాడు కూడా “ఎవరైనా ఆయాని పెట్టుకుంటే నయం కదా! అర్చనకి బాగా శ్రమ అవుతోంది”
“ఆయా అర్చనలాగాచూస్తుందా? ఎంతైనా ఇంటివాళ్ళకి పనివాళ్ళకి తేడా లేదూ!” అన్న తల్లి మాటలకి నోరుమూసుకున్నాడు అతను. అలా దివ్య ఇంటికి వచ్చేవరకు, అర్చన దివ్యని, చెల్లెలు కన్నా ఎక్కువగా చూసుకుంది. దివ్య గారాబాలు పోతూ తనచేత ఎన్ని సేవలు చేయించుకున్నదీ గుర్తొచ్చి, అర్చనకి ఒళ్ళు మండిపోయింది. ఒక్కసారికూడా దివ్య ఆయాని పెట్టుకుందామని అన్నట్టు గుర్తులేదు.
తనకే బుద్ధి లేదు, దివ్య నటన పసిగట్టలేకపోయింది.

అప్పటికీ అమ్మ అంటూనే ఉంది ”మొత్తం నువ్వు పూసుకుని హైరానా పడుతున్నావు, ఆ దివ్య చెల్లెలు ఆసుపత్రి లో ఉన్నప్పుడు ఒక్క రోజన్నా వచ్చివెళ్లలేదు! దివ్య మేనత్తలు, పిన్నులు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరూ వచ్చి ఒక గంట చూసి వెళ్లారు తప్ప, ఒక్క పూట ఆసుపత్రిలో ఉంటామని కూడా అనలేదు” అంటే “తప్పేముంది అమ్మా! నాకు సొంత చెల్లి ఉంటే చెయ్యనా?” అని తల్లి నోరు మూయించింది అర్చన.

‘నిజంగా గొప్ప కోసమే దివ్యకు సాయం చేశానా, తన స్వంత మనిషి అని అనుకోలేదా? ఎంత ఆలోచించినా, అర్చనకి, మెప్పుకోసం దివ్యకి సాయం చేసినట్లు అనిపించలేదు.
‘నా కర్తవ్యం అనుకుని చేశాను, దివ్య ఎలా అనుకుంటే నాకేమిటి? తన మెప్పు, వేరే వారి పొగడ్త తనకి అక్కర్లేదు. కానీ ఇదివరకటిలాగా దివ్యతో అంత ప్రేమగా ఉండలేదు.
మనసులో దివ్య మాటల బాణాలలాగా గుచ్చుకొని చేసిన గాయం ఎవరికీ కనిపించకపోవచ్చు కానీ, తనకి ఆ బాధ తెలుస్తూనే ఉంటుంది. తను ఒక మామూలు మనిషేగా. పైకి దివ్యతో మాములుగా నటించినా ఇదివరకటిలాగా నిజమైన అభిమానం చూపలేదు, దివ్యని చూసినప్పుడల్లా, కొంత కాలమైనా తన అన్న మాటలు గుర్తొస్తాయి’ అనుకుంది అర్చన.
“మొత్తానికి ఆ మహానటి నాకూ నటన నేర్పించింది” ఏడవలేక నవ్వుతూ అనుకుంది అర్చన.
రోజులు గడుస్తున్నాయి. ఇదివరకటిలాగా దివ్యతో అంత ప్రేమగా ఉండలేకపోతోంది అర్చన. కొద్దిగా ఇంటి ఆర్ధిక వ్యవహారాలు కూడా గమనించసాగింది.
అర్చన, అఖిల్ మంచి కంపెనీల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. అన్న,వదినలతో పోలిస్తే వినయ్ అంత మంచి స్థాయిలో లేడు, పైగా దివ్యకు ఉద్యోగం లేదు.
మొదటి తారీఖు జీతం రాగానే, అఖిల్ తండ్రి ఖాతాలో, ఇంటి ఖర్చు కోసం ఒక ఏభైవేలు వేస్తాడు. తరవాత, ఆ ఖర్చు, ఈ ఖర్చు అని అత్తగారు, అర్చన దగ్గర పది, పరకా తీసుకుంటూండేది. వినయ్, ఇంటికి ఖర్చు పెట్టకపోగా, తల్లి దగ్గర్నుంచి ఏదో ఒకటి లాగేవాడు. దివ్య సరేసరి! అత్తగారిని ఉబ్బేసి డ్రెస్ లో, చీరలో కొంటుండేది.
ఇవన్నీ చెప్తే అఖిల్ ఎంత అర్థం చేసుకుంటాడో తెలీదు, పైగా మా వాళ్ళని అనుమానిస్తున్నావా అని గొడవ పెట్టుకోవచ్చు.
ఎలా నెమ్మదిగా ఈ సమస్య ని ఎదుర్కోవాలో అర్థం కాక తల్లిని సలహా అడిగింది అర్చన.
ఎదురుగా తండ్రి కూడా ఉన్నాడు.
“నేను చెప్తూనే ఉన్నా! నువ్వే …” ఏదో అనబోతున్న తల్లిని ఆపాడు తండ్రి.
“అర్చన అడుగుతున్నది ఇప్పుడేమి చెయ్యాలి అన్నది, పాతవాటి గురించి అనవసరం,
నాకు ఒక పరిష్కారం కనిపిస్తోంది మీరు ఎలానో టాక్స్ ఎక్కువ కడుతున్నారు, ఒక ఇల్లు, కానీ ఫ్లాట్ కానీ కొంటే, మీ డబ్బు కొంత వృధా కాకుండా ఆదా చేయచ్చు, టాక్స్ కూడా తగ్గుతుంది, మీరు ఆ రకంగా ఆలోచించండి. నాకు తెలిసి మీ మామగారికి వినయ్,దివ్య నాటకాలు అన్నీ తెలుసు, మీ అత్తగారి నోటికి భయపడి ఏమీ అనడంలేదు. మీరు ఆయన సలహా తీసుకోండి”.
అర్చనకి తండ్రి సలహా బాగా నచ్చింది. అఖిల్ తో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తుంటే,
“అర్చనా! మన సాకేత్ వాళ్ళు ఆఫీసుకి దగ్గర ఉంటుందని, గచ్చిబౌలిలో ఫ్లాట్ కొందామని చూస్తున్నారు. ఒకటి ఆల్మోస్ట్ ఫైనల్ అనుకుంటున్నారట , రేపు ఆదివారం మనని కూడా చూడడానికి రమ్మన్నాడు” అన్నాడు అఖిల్.
సాకేత్, అఖిల్ కి మంచి స్నేహితుడు, అతని భార్య నేహా కూడా అర్చనకి స్నేహితురాలు.
ఇదేదో దేవుడిచ్చిన అవకాశం అనుకుంది అర్చన.
“అవునా! తప్పకుండా వెళ్దాం అఖిల్! మా ఆఫీసులో కూడా, ఒకరిద్దరు అక్కడ ఫ్లాట్లు కొంటున్నారు. ఆస్తి అమర్చుకోవడమే కాక, టాక్స్ కూడా ఆదా చేయచ్చు అంటున్నారు.
పిల్లలు, బాధ్యత మొదలయ్యేలోగా కొంత ఆదా చేసుకోవాలి, మనకి పెన్షన్లు లేవుగా!” అన్న అర్చన మాటలకి, అఖిల్ కూడా ఆలోచనలో పడ్డాడు.
మరుసటి ఆదివారం అర్చన,అఖిల్, ఫ్లాట్ చూడడానికి వెళ్లారు. అది మంచి లొకేషన్ లో ఉంది. దాదాపు అన్ని కంపెనీలకి దగ్గరగా ఉంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఉంది. ఇంటికి కావాల్సిన అన్ని అవసరాలు మాత్రమే కాక, వాకింగ్ ట్రాక్ ,స్విమ్మింగ్ పూల్ లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్లాట్ కూడా, వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యడానికి ఒక విడి రూమ్, రెండు బెడ్రూంలు, వీలుగా ఉన్న వంటిల్లు, యుటిలిటీ ఏరియా, భలే నచ్చింది అర్చనకి.
“అబ్బా! ఎంత బావుంది నేహా! మేము కూడా కొనుక్కుంటే ఎంత బావుంటుందో!” మనసులో మాట బయటికి వచ్చింది.
“ఇది నా క్లాస్మేట్ డెవలప్ చేశాడు, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అఖిల్! మనిద్దరికీ మంచి డిస్కౌంట్ ఇమ్మని అడుగుదాం” అన్నాడు సాకేత్.
సాకేత్ ముందు చెప్పిన ధరే తక్కువ అనుకున్న అఖిల్, ఇంకా తగ్గుతుంది అనేసరికి మొగ్గు చూపాడు.
“కనుక్కోరా, ఫైనల్ గా ఎంతకి ఇస్తాడో?” అన్నాడు.
అప్పటికప్పుడు, సాకేత్ అతనికి ఫోన్ చేసి, రెండు ఫ్లాట్లు తీసుకుంటే ఫైనల్ రేట్ అడిగేసరికి, అతను కూడా బాగా తగ్గించి చెప్పాడు.
“అఖిల్! మనం మామయ్యగారితో మాట్లాడి ఫైనలైజ్ చేద్దాము” అంది అర్చన.
అఖిల్ కూడా ‘సరే!’ అని ఇంటికెళ్లాక తండ్రితో మాట్లాడాడు.
ఆయన కూడా “ఒకసారి ఫ్లాట్ చూసి అప్పుడు చెప్తాను” అన్నాడు.
అర్చన ఏదో అనేలోపే, ఆయనే, “ఇప్పుడే మీ అమ్మకి చెప్పకు, ఆవిడేదో అడ్డుపుల్ల వేస్తుంది” అన్నాడు.
‘అన్నీ మంచి శకునములే… ఫ్లాట్ లాభ సూచనలే ’ సంతోషంగా పాడుకుంది అర్చన.
మర్నాడే, ఆయన ఫ్లాట్ చూసి, వేరే తెలిసిన వాళ్ళని అడిగితే, “మంచి బేరం” వెంటనే తీసుకోమన్నారు.
సాకేత్, అఖిల్ వెంటనే అడ్వాన్స్ ఇచ్చి, లోన్ కి అప్లై చేశారు. అప్పటికే, ఆ బ్యాంకు లో ఆ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది అప్పు తీసుకోవడంతో, లోన్ వారంలో శాంక్షన్ అయింది.
వెంటనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కూడా అయింది. అత్తగారికి చెప్పకుండా రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే అర్చన భయపడింది కానీ, “మీ అత్తగారిని సర్ప్రైజ్ చేద్దాం” అన్న మామగారి మాటలకు ధైర్యం వచ్చింది. వివరాలు, ఎప్పటికప్పుడు తల్లితండ్రులకు తెలియచేస్తున్నా, అర్చన వాళ్ళకి ఫ్లాట్, వీడియోలో తప్ప, తీసుకొచ్చి చూపించలేదు. అఖిల్ తండ్రి కూడా వినయ్, దివ్య, తన భార్యని కబుర్లతో ఐస్ చేసి, డబ్బులు తియ్యకుండా మేనేజ్ చెయ్యడం గమనించి, అఖిల్ కి అన్యాయం జరగకూడదని అనుకున్నారు. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న ఆయనని వీళ్లే సలహా అడిగారు.
ఫ్లాట్ కి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చాక, అఖిల్ ఫ్లాట్ లో అవసరమైన పనులు చేయించి, వచ్చేద్దామని నిశ్చయించుకున్నాడు.
తండ్రి సలహాతో, ఒక ఆదివారం అందరినీ బయలుదేరదీశాడు అఖిల్. “ఎక్కడికిరా?” అడిగిన తల్లికి “మనందరం బయటికి వెళ్లి భోజనం చేసి చాలా రోజులయ్యింది కదా! నేను, అర్చన చిన్న పార్టీ ఇద్దామనుకున్నాం!” అన్నాడు.
“ఏంటి విశేషం?” అని అడిగిన వినయ్,దివ్యలకి, “చెప్తాంగా!” అంటూ
ఫ్లాట్స్ దగ్గరికి తీసుకొచ్చారు.
“ఇక్కడేముందిరా?” అన్న తల్లికి “సాకేత్ ఫ్లాట్ కొన్నాడమ్మా! మీ అందరికీ చూపించమన్నాడు” అన్నాడు అఖిల్. సాకేత్, నేహా, ఇంట్లో అందరికీ తెలుసు, “సాకేత్ కొన్నా, ఫ్లాట్ గృహప్రవేశం అపుడు చూడచ్చుగా!” అనుకున్న దివ్య పైకి అనేసింది.
“అవునన్నయ్యా!” అని వినయ్ అనే లోగానే, లిఫ్ట్, ఫ్లాట్ పక్కనే ఆగింది.
ఫ్లాట్ ముందు కొద్దిగా స్థలం ఉంది, లోపలికి వెళ్ళాక మంచి గాలి,వెలుతురుతో విశాలంగా ఉన్న హాలు, వీలుగా ఉన్న కిచెన్, యుటిలిటీ,పెద్ద బాల్కనీ… “అబ్బా! భలే బావుందిరా ఫ్లాట్, ఎంత పెట్టి కొన్నాడు?” తల్లి ప్రశ్నకి “కోటిన్నర అయింది,బావుందా అమ్మా!”
అఖిల్ తల్లితో మాట్లాడుతున్నా అర్చన చూపులు దివ్య మీదే ఉన్నాయి.
విసుగ్గా,చిరాకుగా మొహం పెట్టుకుని చూస్తోంది దివ్య.
సరిగ్గా అప్పుడే బాంబు పేల్చాడు అఖిల్.
“అమ్మా! వినయ్! మీకో సర్ప్రైజ్!” అర్చన చూపుల్ని, దివ్య నుంచి తిప్పుకోకుండా చూస్తోంది, మధ్యలో ఒక నిమిషం వినయ్ వంక చూస్తోంది.
“ఇది నేను కొన్నాను, మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది, మిమ్మల్ని సర్ప్రైజ్ చెయ్యాలని అంతా అయ్యేదాకా చెప్పలేదు” అన్నాడు అఖిల్. “నిజంగా! మంచి పని చేశావురా అఖిల్!” సంతోషం పట్టలేక, హత్తుకున్న తల్లిని చూసి, కళ్ళలో నీళ్లు నిలిచాయి అఖిల్ కి.
వినయ్ ఒక్క నిమిషం నిజంగానే ఆశ్చర్యపోయి, వెంటనే అన్న చేయి ఊపుతూ “కంగ్రాట్స్ అన్నా! చాలా బావుంది ఫ్లాట్” అన్నాడు.
దివ్య మొహం మాత్రం, అసూయతో, ఎర్రగా,కందగడ్డలా అయింది.
“ఎవరికీ చెప్పకుండా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారా? పెద్దవాళ్లకి చెప్పాలిగా! అవునులే! మీ అమ్మా వాళ్ళకి చెప్పే ఉంటావు” కటువు స్వరంతో అన్న దివ్యతో,
“మామయ్యగారికి తప్ప ఎవరికీ తెలీదు దివ్యా! ముందు మీకే చూపిస్తున్నా, అమ్మవాళ్ళు చూడలేదు” అంది శాంతంగా.
చప్పున మహానటి ఆవహించింది దివ్యని.
“అక్కా! ఎంత బావుందో ఫ్లాట్, ఆఫీసులకి కూడా బాగా దగ్గర, పూజ ఎప్పడు పెట్టుకుందాం? ఒకటి రెండు నెలల్లో షిఫ్ట్ అవుదాం, నీ ఆఫీస్ కూడా దగ్గర కదా వినయ్?”
ఊహించని ఉపద్రవానికి తెల్లబోయింది అర్చన.
అయోమయంగా మామగారివేపు చూసింది.
“ఇది రెండు బెడ్రూంల ఫ్లాట్ దివ్యా! ఎప్పుడైనా మేమో, వాళ్ల అమ్మగారు వాళ్ళో వస్తే ఉండడానికి వీలు ఉంటుంది కానీ, అందరం ఇక్కడ ఉండలేం.
మీరు మూడు బెడ్రూంల ఫ్లాట్ కొన్నప్పుడు, అందరం అక్కడికి షిఫ్ట్ అవుదాం. అప్పటివరకు అఖిల్ వాళ్ళు ఒక్కళ్లే, ఇక్కడికి మారతారు. కొత్త ఫ్లాట్ సుఖం అనుభవించాలిగా?”
అన్నారు ఆయన.
గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అయింది దివ్యకు.
అందరూ సంతోషంగా ఉంటే, తను ఒక్కతే ఏడిస్తే బావుండదుగా? అందుకే ఏడుపులాంటి నవ్వు నవ్వింది.

ఈ కథ నా స్వీయ రచన.

Written by Sripathi Lalitha

నా పరిచయం

నా కథలే పాఠకుల సమస్యలకి కౌన్సిలింగ్ చెయ్యాలి - ఇదే నా మోటో

నా పేరు శ్రీపతి లలితకుమారి.
నేను ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను.

అరవై ఏళ్లకి, ఫేస్బుక్ లో కొన్ని సాహితీ గ్రూపులలో చేరాను. అక్కడ ప్రారంభమైంది నా సాహితీ ప్రయాణం.
శ్రీపతి లలిత పేరుతో కథా రచన మొదలుపెట్టి, సుమారు తొంభై పైనే కథలు వ్రాసాను.
ఈనాడు, సహరి, రవళి, సంచిక, మన తెలుగు కథలు, గోతెలుగు, సుమతి,తపస్వి మనోహరం, వార్త, తెలుగుతల్లి కెనడా పత్రికల లోనే కాక, TAGCA వారి వాహిని ఉగాది పత్రికలోనూ, సుధామగారు నిర్వహించిన ప్రసన్నభారతి వారి ఓసారిచూడండి అంతే,
ఫేస్బుక్ గ్రూప్ లు అచ్చంగా తెలుగు, భావుక, బాపురమణీయం, పొన్నాడ వారి పున్నాగవనం లో నా కథలు వచ్చాయి. ఇరవైకి పైగా కథలకు బహుమతులు వచ్చాయి.

నేను వ్రాసిన చాలా కథలు, టోరీ రేడియో ప్రోగ్రాం లోనూ, లక్ష్మి చెప్పే కథలు, మీ కృష్ణమ్మ కథలు, మీ కథల సమయం, మనతెలుగు కథలు వంటి యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు.

సైకాలజీ అన్నా, కౌన్సిలింగ్ అన్నా, ఎంతో ఇష్టమున్న నాకు, నేను వ్రాసే కథలే, పాఠకులకు ఒక కౌన్సిలింగ్ గా ఉండాలని ఒక సమస్యతో కథ వ్రాస్తే దానిలోనే పరిష్కారం సూచిస్తూ కథలు వ్రాయడం మొదలుపెట్టాను. అదే నా ప్రత్యేకతగా అందరూ అభిమానిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మూడో సీత కథ – సమ్యక్పరిశీలన

నీలి మేఘం. నిరంతర యజ్ఞం..!