మూడో సీత కథ – సమ్యక్పరిశీలన

నవల సమీక్ష

 మూడో సీత కథ – సమ్యక్పరిశీలనమూడోసీత కథ కొంత వాస్తవము. మరి కొంత రచయిత స్వకపోలకల్పితం.
ఆ ఊరు పుల్లేటికుర్రు. ఆ ఊరిలో ముగ్గురు సీతలున్నారు.
పెద్ద సీత వాళ్ళ అమ్మ నాన్న చూపించిన ఓ “శఠ గోపం” గాడిని
నోరెత్తకుండా పెళ్ళి చేసుకుని పిచ్చి గొర్రెలా వాడి వెనకాల వెళ్ళింది.
ఇక రెండవ సీత విషయానికి వస్తే.. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివింది గాని ఉత్త పిచ్చి మొద్దు.ఎంత సేపు ఈ వోణీ మా బావ బొంబాయి నుండి తెచ్చాడనో, ఈ గాజులు మా బాబాయి అమెరికా నుండి తెచ్చాడనో గొప్పలు చెప్పుకోవడం తప్ప బుర్రలో గుజ్జు లేదు.
ఇక మిగిలింది చిన్న సీత. అందుకే మూడో సీత కథ అన్నారు. ఈ సీత అమాయకురాలు కాదు. గడుగ్గాయి. కొంచెం అహం, మరి కొంచెం పెంకితనం కలగలిసిన అమ్మాయి. మేధావి. ఎవ్వరూ తనని ఒక్క మాటంటే పడదు. ఆఖరికి కన్న తల్లి అయినా సరే. తల్లి దండ్రులకు ఒక్కతే కూతురు.అల్లరి పిల్ల.
సీత మాటల్లోనే …మా ఊరు ఎవరైనా వచ్చి ప్లీడరు సుబ్బారావు గారి ఇల్లెక్కడ? అని ఎవరినైనా అడిగితే, రెండు నిముషాలు ఆలోచిస్తారు. “అల్లరి సీత” ఇల్లెక్కడ అని అడిగితే, క్షణంలో చూపిస్తారు. అది మా ఊళ్ళో నాకు ఉన్న పరపతి అంటుంది. సీత తల్లి పేరు భాగ్యలక్ష్మి.
      లింగంనేని సుజాత, సమీక్షకురాలు
పెద్ద సీత పెళ్ళి చూపులనాడే..అదేంటే పెద్ద సీతా! ఆ చీపురి పుల్ల గాడిని నువ్వు ఎలా పెళ్ళి చేసుకుంటావే? అని మూడవ సీత అంటుంది.పెద్ద సీత నాయనమ్మ, ముందు ఇక్కడినుంచి పోతావా? పోవా? పిదప కాలం, పిదప బుద్ధులు అంటూ మూడవ సీత నెత్తిమీద ఒక మొట్టికాయ తగిలించింది.
నేనేమీ నీ మనుమరాలిలాగా మూగ మొద్దును కాదు.జాగ్రత్త అంది సీత.
ఏం చేస్తావే భడవా? అంటూ కోపంగా సీత వైపుకు పరుగెత్తుకు వచ్చింది.
ఈ సారి మంగలి అనంతయ్యతో చెప్పి నీ గుండుకు గాటు పెట్టిస్తా! అని ఇంకా దూరంగా పరిగెడుతూ అరిచింది సీత.
నిన్నూ …నిన్నూ…అంటూ ఆవిడ వెంటపడటం, సీత చెంగున గోడ దూకి గెంతెయ్యడం,పెద్దావిడ బ్యాలెన్స్ తప్పి గోడకు గుద్దుకోవడంలో, హాస్య రసం తొణికిసలాడుతోంది. తళ తళ లాడే మర చెంబు లాంటి ఆవిడ గుండు మీద నుండి రక్తం ధార కట్టడం ఒక్కసారే జరిగినాయి. ఇక్కడ కరుణ రసం జాలువారింది. పెద్ద సీత పెళ్ళి చూపులనాడు జరిగిన గోలకు పెద్ద సీత, చిన్న సీతతో మాట్లాడడం మానేసింది.
సీత ఆ ఊరిలో సుందరాచారి కొలిమి దగ్గరకు వెళ్ళి పలుగులూ,కొడవళ్ళు, నాగలి కర్రులు, తయారు చేస్తుంటే, సీత నేనూ తిత్తి ఆడిస్తానంటే అమ్మాయిగారమ్మాయిగారూ…మీరు బ్రేమ్మల పిల్ల. ఇట్టా తిత్తి ఆడించారని తెలిస్తే, నా నోటి కాడ కూడు పోతుంది.
మీకు దండమెడతా గానీ, దూరం నుంచి చూడండి అన్నాడు.
కుమ్మరి నరసింహులు ఇంటికి వెళ్ళి సారె తిప్పుతానన్నా,అలాగే చేతులెత్తి నమస్కరించాడు. వడ్రంగి నాగాచారి ఇంట్లో బాడితె పట్టుకుని చెక్కుతానన్నా ఇదే గోల. సీత ఈ విషయం తల్లిదండ్రులకు చెపితే , సీత వాళ్ళ నాన్న ఊరుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మ అంటూ సొంటూ లేకుండా, అందరి ఇళ్ళు తిరుగుతావా? భడవా! ఇంకొకసారి వాళ్ళిళ్లకు వెళ్ళావో నీ కాళ్ళు విరగ కొట్టి గదిలో కూర్చో బెడతానంటూ తిట్టింది.
సీత ఐదో తరగతి చేరే సరికి చట్టి ముక్కు జోగారావు, కిర్రు చెప్పుల మధు, మెల్లకళ్ళ పార్వతీశం, డొంకాడ వెంకటరావు,మద్దిమత్తిన సుభాష్ బోసు, సీతకు ప్రాణ స్నేహితులయ్యారు. సీత వీళ్లతో కలిసి మామిడితోటల్లోనూ, అరటి తోటల్లోనూ దొంగతనాలు చేసేది. సీత వాళ్ళతో కలిసి బచ్చాలాట, కబడ్డీ ఆడేది. ఆ విషయం సీత తల్లికి తెలిసి, మగపిల్లలతో ఆటలేమిటే? నీకు అంటూ చెవులు సాగదీసేది.
ఆడ పిల్లలతో ఆడుకుందామంటే, వాళ్ళు తొక్కుడుబిళ్ళలూ, గచ్చకాయలు, పులీ మేకా, బొమ్మలాటలు ఆడతారు కదా!
చిన్న చెరువు దగ్గర కరణం గారి పాలేరు గేదలను కడుగుతున్నాడు. వాడు చూడకుండా సీత ఒక దాని మీదకు ఎక్కి కూచుంది. దాన్ని ఒడ్డుకు ఎక్కించడానికి కాంతారావు తన్నాడు. గేద చరచరా బయటకు వచ్చి పరుగు లంకించుకుంది. సీతకు దూకాలంటే భయం. గేద ఎగురుతూ పరిగెడుతుంటే వణుకు. ఊళ్ళో వాళ్ళు ఆ గేదని, గేద మీద వణుకుతున్న సీతని చూసి ఒకటే నవ్వు. ఆ తర్వాత గేదల మీద ఎక్కి స్వారీ చేయడం సీతకు అలవాటు అయ్యింది.
వినాయక చవితి వచ్చిందంటే భుజాన గోనె సంచులు తగిలించుకుని, సీత తన మగ స్నేహితులు,పత్రి కోసుకు రావడానికి బయల్దేరేవారు. మగ పిల్లలు చెట్లు ఎక్కి వెలగ పత్రి, కాయలు, సీతాఫలాలు కోసేవారు.పూజకు రకరకాల పూలు,పళ్ళు కోసుకుని తెచ్చేవారు. అందులో ఉన్న పెద్ద కాయల్ని సీత తన సంచిలో వేసుకోవడంలో కిలాడీతనం తెలుస్తోంది.
పాలవెల్లి కడిగి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, పాలవెల్లికి పూలు పళ్ళు వేలాడ దీస్తారు. వినాయకుడిని పసుపు రాసిన పీఠం మీద పెట్టి, పైన పాలవెల్లి తగిలిస్తారు. వినాయకుడిని పూలు, పళ్ళు, ఇంటిలో వండిన నైవేద్యం పెట్టి, పూజిస్తారు. ఆ సాయంకాలం తొమ్మిది మంది ఇళ్లకు వెళ్ళి వినాయకుడిని చూస్తే,పిల్లలకు చదువు బాగా వస్తుందని ప్రగాఢ నమ్మకం.
ఆ ప్రకారం సీత వాళ్ళ అమ్మతో పాటు తొమ్మిది మంది ఇళ్లకు వెళ్ళి వినాయకుడిని చూసి వచ్చింది. తర్వాత స్నేహితుల ఇళ్లకు వెళ్ళి చూసి వచ్చింది. పిదప మధుగాడు సీత ఇంటిలో వినాయకుడిని చూసి, పాలవెల్లికి కట్టి ఉన్న పెద్ద వెలక్కాయలు, సీతా ఫలాలు, మొక్కజొన్న పొత్తుల్ని చూసి, సీతా! నా సంచిలో ఉన్న పెద్ద కాయల్ని దొంగతనం చేస్తావటే? అంటూ ఏడుస్తూ వెళ్ళి ఆ విషయం అందరికీ చెప్పాడు. అందరూ సీతను దొంగతనం చేశావట గదా! అని అడిగితే, మా అందరి సంచులు ఒకే రకంగా ఉన్నాయి. పొరపాటున సంచి మారింది అని చెప్పడంలో సీత ఎంతటి మేధావో తెలుస్తోంది.
 పుల్లేటికుర్రులో మూడు స్కూళ్లు ఉన్నాయి. మేడబడి, సుబ్బరాజు గారి బడి, పాకబడి. సీత వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉందని,లాయరు సుబ్బారావు గారు సీతను పాక బడిలో చేర్చారు. ఏలియా మాస్టారి పాక బడిలో చదివి, పది మంది పిల్లలు హైస్కూల్లో చేరడానికి ఎంట్రన్స్ పరీక్ష వ్రాశారు. అందరూ పరీక్ష పాసై హైస్కూల్లో చేరారు.
సీత హైస్కూల్లో చేరగానే, వాళ్ళ నాన్నగారు నైలాన్ గౌను కొని ఇచ్చారు. ఆ ఊరిలో మొట్ట మొదటి సారి నైలాన్ గౌను సీతే తొడిగింది. ఆ విద్యార్థులందరిలో సీతే ధనవంతురాలు.
 హైస్కూల్లో హిస్టరీ మాస్టారి పెన్ను పోయింది. వెలక్కాయల విషయంలో సీత ఫేమస్ కనుక, సీతే తీసి ఉంటుందని మేడబడి విద్యార్థిని కమలకుమారి అందరికీ చెప్పింది. సీతే మాస్టారి పెన్ను కొట్టేసిన వీరదొంగ అని, పోస్టాఫీసు గోడ మీద, స్కూలు గోడల మీద రాశారు.
సీత అంటే గిట్టని పెద్ద సీత నాయనమ్మ, సీత ఇంటికి వచ్చి, గురువులంటే ఎవరనుకున్నావు? గురువు గారి పెన్ను కొట్టేస్తావా? నువ్వు చేసిన వెధవ పని వల్ల మీ అమ్మ నాన్నలకు ఎంత అప్రదిష్టే అంది. ఆ మాటతో సీత తల్లి రెచ్చిపోయి, మర్యాదగా మాస్టారి పెన్ను ఇవ్వు అని సీత చెవుల్ని బారెడు సాగ దీసింది. నేను మాస్టారి పెన్ను తీయలేదని సీత చెప్పినా ఎవరూ నమ్మలేదు.
మర్నాడు మూడో పీరియడ్ హిస్టరీ మాస్టారు వచ్చి, పిల్లలూ నా పెన్ను ఇంట్లోనే దొరికింది అన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లగానే సీత పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ, వాళ్ళ అమ్మను, ఏమే పెదపాడు మా లక్ష్మికూతురా! కన్న బిడ్డను దొంగ అనడానికి నీ నోరెట్లా వచ్చిందే? మాస్టారుగారు పెన్ను ఇంట్లో మరిచిపోతే, దొంగతనం నాకు అంట గడతావా? ఇవాల్టినుంచి నువ్వు నా కన్నతల్లివీ కాదు. నేను నీ కూతుర్ని కాదు అంటుంది. కన్నతల్లి అయినా సరే,అనవసరంగా ఒక మాట అంటే… సీత పడదు.
సీత వాళ్ళ నాన్న సీతను బుజ్జగించి, సైకిలు ఎక్కించుకుని తీసుకు వెళ్ళి సీతకు వాటర్ మెన్ పెన్ను కొని ఇచ్చాడు. ఆ విధంగా ఫస్ట్ ఫారం లోనే సీత పెన్నుకు సొంతదారు అయింది. మహా గణపతి దయ వల్ల సీత మీద పడిన అపవాదు తొలగిపోయిందని సీతకు గట్టి నమ్మకం.
దసరా పండుగకు స్కూలు పిల్లలు, మాస్టార్లు కలిసి పిల్లల ఇళ్లకు వెళ్లేవారు. అయ్య వారికి చాలు అయిదు వరహాలు. పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు అని పిల్లలు పాడగానే, ఆ ఇంటి వాళ్ళు వచ్చి,పిల్లలకు తినుబండారాలు, మాస్టారికి డబ్బు ఇచ్చేవారు.
దీపావళికి సీత పాకబడి బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి సిసింద్రీలు,
మతాబులు, చిచ్చుబుడ్లు, అవ్వాయి చువ్వాయిలు తయారు చేసేవాళ్ళు. అందరిలోకి సీత చలాకీగా ఎక్కువ కొట్టేసి, తానే కాల్చిన కిలాడి.
దీపావళికి ఆ ఊరిలో అందరి ఇళ్లల్లో వివిధ రకాల స్వీట్లు తయారు చేసేవారు. పిల్లలు ఎవరి ఇళ్ళకు వెళ్ళినా, స్వీట్లు పెట్టేవారు.
ఒక రోజు ముత్యాలోడు మా ఇంట్లో నూకలు కూడా లేవే? నేను నిన్న రాత్రి అన్నం తినలేదే సీతా! అన్నాడు…
సీత ఏడుస్తూ, నేను రేపటి నుండీ క్యారేజీ తెస్తా! నీవు నాతో కలిసి తిందువు గాని అంది. సీతది అంతటి జాలి గుండె.
కోమటి గురవయ్య తోటలో మామిడి కాయలు కొయ్యడానికి సీత తన క్లాసు మేట్సుతో వెళ్ళింది. మామిడి చెట్టు ఎక్కిన మధు గాడిని కరెంటు చీమలు కుడితే, బాబోయ్ అని అరిచాడు. తోటమాలి సుబ్బన్న,అల్లుడు,కూతురు, భార్య రావడంతో సీత బ్యాచ్ అంతా పట్టుబడ్డారు. ఇంతకీ గోనెలో ఉన్నవి ఏడు కాయలు. పిల్లల్ని గట్టిగా పట్టుకుని, ప్రెసిడెంటు గారి ఇంటికి తీసుకొని వెళ్లారు. ఆయన పిల్లల తల్లిదండ్రులను పిలిపించారు.
ఇక్కడ పట్టుబడ్డ వాళ్లందరూ తలా పాతిక రూపాయలు”తప్పు” కట్టాలి. ఇకముందు ఇటువంటి తప్పు చేయమని, అందరి కాళ్ళు పట్టుకుని ప్రమాణం చేయాలి. ఇదే నా తీర్పు అన్నాడు ప్రెసిడెంటు.
సీతకు పిచ్చి కోపం వచ్చింది.ప్రెసిడెంటు వైపు కోపంగా చూస్తూ, ఛస్తే నేను ఎవడికాళ్ళు పట్టుకోను. మేము కోసింది ఏడు కాయలు. అసలీ తోటమాలి సుబ్బన్న,రోజూ ఎన్ని కాయలు దొంగతనంగా అమ్మడం లేదూ! …
గురవయ్యా! దొంగ లెక్కలు వ్రాసి, దొంగ కొలతలు కొలిచి ఎంత డబ్బు అన్యాయంగా కొట్టేస్తున్నావో నాకు తెలి యదనుకున్నావా? …
ఏమండీ ప్రెసిడెంటు గారూ! మీరు “బోడెమ్మ” ఇంటిలో దూరితే నేను చూశానని, నాకు బిస్కట్లు కొని పెట్టీ, ఎవరికీ చెప్పవద్దని, మీరు నాతో ఒట్టు వేయించుకోలేదా? అని సీత గట్టిగా అరిచింది.
అంతే! క్షణంలో ప్రెసిడెంటు గారి భార్య గడప ఇవతలకు వచ్చి, ఆయన రెక్క పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. పంచాయతి మధ్యలోనే ఆగిపోయింది. ఎవరి ఇళ్ళకు వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
ఏడు మామిడి కాయలు దొంగిలించిన తమను అందరి కాళ్ళు పట్టుకోమని తీర్పు ఇచ్చిన ప్రెసిడెంటును, ధైర్యంతో ఎదుర్కొని ఆయన పరువు తీసిన సీత ఎంతటి మేధావో వేరే చెప్పాలా?…
సీత శకుంతల నాటకం వ్రాసింది. సీత బ్యాచ్ ఆ నాటకం స్కూలు యానివర్సరీ రోజున వేశారు. శకుంతలగా నటించిన సీతకు ఫస్ట్ ప్రైజు వచ్చింది. సీత తల్లి సంబర పడింది.ఊరందరూ సీతను మెచ్చుకున్నారు.
సీత తన స్నేహితుడు బాజీ వల్ల సైకిల్ తొక్కడం నేర్చుకుంది. ఆ ఊరిలో మొదటి సారి సైకిల్ కొనుక్కుని సైకిల్ మీద తిరిగిన ఆడపిల్లసీతే.
ఆ ఊరి లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదివిన మొదటి ఆడపిల్ల కూడా సీతే.
స్కూలు పక్కన బడ్డీ కొట్టు పెట్టుకున్న వెల్లంగి రామారావు భార్యను తన్ని,ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని విన్న సీత, తన క్లాసులోని ఆడపిల్లలందరినీ,కొంత మంది మగ పిల్లల్నీ,వెంటబెట్టుకుని రామారావు కొట్టుకు వెళ్ళింది.
రామారావు గారూ…మీ ఆవిడ సూర్యావతిని మీరు తన్ని, బయటకు నెట్టారని మాకు తెలుసు. ఇలా ఇంకొక సారి జరిగితే,మీ దగ్గర ఎవరం ఏమీ కొనము.
అవసరమైతే స్కూలు పిల్లలు మొత్తం వెళ్ళి,పోలీసు స్టేషన్ లోను మెజిస్ట్రేట్ ఇంటి దగ్గరా మీమీద కంప్లైంట్ ఇస్తాం. మర్యాదగా కామినేని వాళ్ళ ఇంట్లో నుంచి,నీ పెళ్ళాన్ని బతిమాలి నీ ఇంటికి తీసుకు పో అని బెదిరించింది.
అట్టాగే! అమ్మాయి గారు చిత్తం అంటూ తన భార్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. థర్డ్ ఫారం లో సీత చేసిన ఘన కార్యంలో నాయకురాలి లక్షణాలు తెలుస్తాయి.
ఆ కాలంలో పూనకాలు పూనేవాళ్లు కొందరుంటే, దెయ్యాలు పట్టినవి అనే వాళ్ళు కొందరుండేవారు. భార్యలను బానిసలుగా చూస్తూ, అయినదానికీ, కానిదానికీ భార్యను కొట్టే వాళ్ళు కొందరుండేవారు. కొంతమంది తెలివైన భార్యలు, దెయ్యం పట్టినట్టు, లేక పోతే దేవుడు పూనినట్టు, నటించి భర్తలను భయ పెట్టేవారు.
కార్తిక మాసంలో కార్తిక స్నానాలు, వన భోజనాలు ఉంటాయి. ఆ ఊరి శివాలయంలో, ఆశ్రమంలో,రద్దీగా ఉంటుంది. భక్తులు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన సీత అటువంటి వాటిల్లో ముందే ఉంటుంది.
ఒక రోజు స్కూలు నుండి సీత ఇంటికి వెళ్లేసరికి, వాళ్ళ నాన్న కోపంగా ఉన్నాడు. సీతా… నీ ఎస్.ఎస్.ఎల్.సి. చదువు అయిపోవచ్చింది గదా! అని మీ అమ్మ నీ పెళ్ళి చేయమంటోంది. ఏం చేయమంటావో చెప్పు అన్నాడు.
వెంటనే సీత… నేను ఇప్పుడు చస్తే పెళ్ళి చేసుకోను. మొదట డిగ్రీ కావాలి. తర్వాత లాయర్ని కావాలి. జీవితంలో సెటిలయ్యాక, నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానంది.తన అభిప్రా యాలను కుండ పగులకొట్టినట్లు చెప్పడంలో, సీతకి సీతే సాటి.
సీత అమ్మమ్మకు బాగా లేదని టెలిగ్రామ్ వస్తే, తల్లిదండ్రులతో పాటు సీత కూడా ఏలూరు వెళుతుంది. సీత అమ్మమ్మ చనిపోతుంది. ఆమె పెద్ద కర్మ ముగిసిన మర్నాడు,సీత తాత కూడా చనిపోతాడు. సీత తల్లి మానసికంగా కుంగిపోతుంది. సీత తల్లికే ధైర్యం చెప్పిన ధీర బాలిక.
సీత ఎస్.ఎస్.ఎల్.సి. రిజల్ట్స్ వచ్చాయి. సీత వాళ్ళ స్కూలు ఫస్టు మాత్రమే కాదు. స్టేట్ సెకండ్ హైయెస్ట్ స్కోరు కూడా సీతకి వచ్చింది. సీత ఆనందానికి హద్దుల్లేవు.
సీత తల్లి సీతతో… నువ్వు చదివిగొప్పదానివి అయితే, అందరూ నన్ను చూపించి, ఆమే సీత తల్లి అంటుంటే…చూడాలని ఉందే అంటూ, సీతను కావిలించుకుంటుంది.
సీత తల నిమురుతూ తండ్రి ఆనందంతో, దగ్గరకు తీసుకున్నాడు. ఆయన కన్నీళ్లు సీత తల మీద అక్షింతలుగా పడుతున్నాయి.
ఇంతటితో మూడవ సీత కథ సమాప్తం.
ఈ నవల చదివి ముగించిన తర్వాత ఒక మంచి పుస్తకం చదివామన్న ఆనందం కలుగుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.ఇంత మంచి నవలను వ్రాసి, మనందరికీ ఆనందం కలిగించిన భువన చంద్ర గారు నిజంగా ధన్య జీవులు.
ఈ నవలలోని భాష ప్రాంతీయ వ్యవహారిక భాషతో అలరారుతోంది.భాషా విశేషాలు, జాతీయాలు, సామెతలు సందర్భానుసారంగా ఉన్నాయి.
కాళ్ళు విరగ్గొట్టి గాడి పొయ్యిలో పెట్టేవాడిని.
ఉన్నదీ పోయింది. ఉంచుకున్నదీ పోయింది.
ఒంటి కాయ సొంటికొమ్ము.
నలుగురిలో జరిగేది చావైనా బ్రతుకైనా పండుగ లాంటిదే.
మరణ చక్రం ఒక ఇంట్లో, పదమూడు రోజుల్లో రెండు సార్లు తిరిగింది. ఆయనను ఏడుకట్ల సవారీ మీద ఎక్కించారు.
నోరా! వీపుకు దెబ్బలు తెచ్చుకోకే.
కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం.
కుక్కతోక వంకర- మనిషి మాట వంకర…ఏంచేస్తాం శంకరా!
కోపంతో తెగ ముట ముటలాడేది. బతక లేక బడిపంతులు.
 పైసా మే పరమాత్మా, ధన మూలం ఇదం జగత్.
తలంటి అంటే తిట్టు, తాషామర్బా అంటే వీపు విమానం మోత మోగించడం, గడేకార్, బేఫికర్, భాడకావ్, మొదలైన విశేష పదాలను ఉపయోగించారు.

Written by Lingamneni Sujatha

పేరు: లింగంనేని సుజాత
భర్త పేరు: డా: లింగంనేని బసవ శంకర రావు ఎం.ఏ. పిహెచ్.డి
ఊరు:చెన్నై
వృత్తి: గృహిణి
ప్రవృత్తి: కథలు, కవితలు, వ్యాసాలు,వంటలు వ్రాయడం, పజిల్స్ పూర్తి చేయడం. పజిల్స్ పూర్తి చేసి మూడు సార్లు నగదు బహుమతి అందుకున్నాను.
ఇప్పటివరకు 100 కథలు వ్రాశాను.
40 కథలతో "సుజాత కథలు" అనే పుస్తకము 2020వ సంవత్సరంలో ప్రచురించాను.
మరొక 40 కథలతో "మనిషి కథలు" అనే పుస్తకము 2024వ సంవత్సరంలో ప్రచురించాను.
25-5-2025 న అక్షరయాన్ వారిచే మాతృవందనం పురస్కారాన్ని అందుకున్నాను.
3-8-2025 న అశోక్ నగర్ ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన డిజిటల్ యోగా కంటెస్ట్ లో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాను.
13-8-2025 న నవ తెలంగాణా మానవి లో నన్ను గురించిన వ్యాసం ప్రచురించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తోడూ  నీడ

మహానటి