
“అపూర్వా” గట్టిగా విని పినిపించిన అత్తగారి పిలుపుకు, అత్తగారి కోసం టిఫిన్ ప్లేట్ లో సద్దుతున్న అపూర్వ ఉలిక్కి పడింది. ఇప్పుడేగా స్నానం చేయించి, చీర కట్టి, జడేసి, కూర్చోబెట్టి టిఫిన్ తెద్దామని వంటింట్లోకి వచ్చింది. ఇంతలో ఏమి జరిగిందని గాభరా పడుతూ అత్తగారి దగ్గరకు హడావిడిగా వెళ్ళింది. సుభద్రమ్మ మంచం మీద దిండు, దాని మీది కవర్ తీసేసి ఓ పక్కకి పడి ఉంది.
“ఏంటండి?” అని అడిగింది.
“నాచంద్రహారం తీసావా?” గద్దించింది సుభద్రమ్మ కోడలిని.
“నేనెందుకు తీస్తాను? ఎక్కడ పెట్టారు మీరు?” అడిగింది.
“ఎక్కడ పెడుతాను ఎప్పటిలాగే రాత్రి దిండు కవర్ లో పెట్టాను. ఇప్పుడు వేసుకుందామని చూస్తే లేదు. నువ్వు తప్ప ఈ గది లోకి ఎవరూ రారు” అంది సుభద్రమ్మ.
ఆ హడావిడికి గదిలోకి వచ్చి “ఏమైందమ్మా?” అడిగాడు శేఖర్.
“నా చంద్రహారం కనిపించటం లేదు. రాత్రి పడుకునే టప్పుడు తీసి దిండు కవర్ లో పెట్టాను. ఇప్పుడు పెట్టుకుందామంటే లేదు. ఇదో చూడు” అంటూ దిండును, కవర్ ను విడిగా తీసి చూపించింది సుభద్రమ్మ కొడుకుకు.
“ఏమయి ఉంటుంది?” అన్నాడు శేఖర్.
“ఏమవుతుంది? నీ పెళ్ళాం తీసి చెల్లెలికిచ్చింది” కసిగా అంది.
“అపూర్వ చెల్లెలికి ఇవ్వటం ఏమిటి?” అశ్చర్యంగా అడిగాడు శేఖర్.
“నన్ను బాత్ రూం లో కూర్చొబెట్టి చెల్లెలు వచ్చిందని బయటకు వచ్చింది. అదేమో ఏవో డబ్బులు కావాలని ఏడవటము, ఇదేమో దాన్ని సముదాయించటము విన్నాను. నాకెట్లాగూ కనిపించదని నా దిండుకు కింద ఉన్న చంద్రహారం తీసిచ్చింది” అంది కోపంగా అపూర్వ వైపు చూస్తూ.
అత్తగారి అభియోగమూ, శేఖర్ ఆశ్చర్యమూ చూస్తూ నోట మాటరాక నిశ్చేస్టురాలై, నోటమాట రాక నిలబడిపోయింది. మౌనంగా ఉన్న కోడలిని చూస్తూ “చూడు నంగనాచిలా ఎట్లా చూస్తూ నిలబడ్డదో” అంది సుభద్రమ్మ. శేఖర్ మళ్ళీ దిండునూ, కవర్ నూ దులిపి చూసాడు. ఎక్కడా లేదు.
“ఎందుకుంటుందిరా అదెప్పుడో దాటిపోయింది. మీ నాన్న నాకు ప్రేమగా మా యాభవ పెళ్ళిరోజున చేయించారు. ఆ తరువాత దాటిపోయారు. ఆయన గుర్తుగా రోజూ వేసుకుంటూ, రాత్రిళ్ళు గుచ్చుకుంటోందని దిండుకవర్ లో దాచుకుంటున్నాను. నాకు తెలుసు దీనికి పుట్టింటివాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఇదివరకు కూడా ఇలాగే ఏవో వకటి దోచిపెడుతుండేది. ఇప్పుడు నా చంద్రహారంకు ఎసరు పెట్టింది” శోకాలు తీస్తూ పెద్దపెద్దగా అరవసాగింది సుభద్రమ్మ.
ఇంతలో శేఖర్ కోసం ఎవరో రావటం తో, భార్య వైపు చూసి, బయటకు వెళ్ళాడు. ఏమి చేయటానికి తోచక ఉన్న అపూర్వతో “నాకు తిండి కూడా పెట్టకుండా చంపేస్తావా?” అరిచింది సుభద్రమ్మ.
మౌనంగా లోపలికి వెళ్ళి టిఫిన్, కాఫీ ఇచ్చింది. సుభద్రమ్మ అరుపులు భరిస్తూ, నిశబ్ధంగా తన పని తాను చేసుకుంటోంది అపూర్వ. పుట్టింటికి సామాన్లు చేరవేస్తుందని సుభద్రమ్మ ఈ మధ్య అప్పుడప్పుడూ అంటూనే ఉంటుంది. కానీ దానికి అపుర్వ ఏమీ జవాబివ్వదు. ఇప్పుడు దీనికీ ఏమీ జవాబివ్వని భార్య ను సాలోచనగా చూసాడు. సుభద్రమ్మ ఎప్పుడు ఫోన్ చేసిందో శేఖర్ చెల్లెలు వాసవి వచ్చింది. కూతురిని పట్టుకొని భోరుభోరున ఏడుస్తూ కోడలి దొంగతనం గురించి చెప్పింది.
“అమ్మా నువ్వన్నింటికీ యాగీ చేయకు. వదిన వాళ్ళ చెల్లెలికి ఎందుకు ఇస్తుంది? గుర్తు తెచ్చుకో ఎక్కడ పెట్టావో” అంటూ మళ్ళీ దిండునూ, కవర్ నూ దులిపింది. లేదు. అమ్మను లేపి పక్క మీది దుప్పటిని తీసి దులిపింది. “అదంతా మీ అన్న చూసాడు” అన్న అమ్మ మాటలు పట్టించుకోకుండా, ఆమెను కుర్చీలో కూర్చోపెట్టి, పరుపెత్తి చూసింది. పరుపు కింద మిలమిలా మెరుస్తూ చంద్రహారం కనిపించింది. “ఇదో చూడు పరుపు కింద పెట్టి దిండు కవర్ లో పెట్టాననీ, వదిన తీసి చెల్లెలికిచ్చిందనీ అరుస్తున్నావు” అంది వాసవి.
ఈ తతంగమంతా నిశబ్ధంగా చూస్తున్న అపూర్వతో ” పొద్దున మీ చెల్లెలు అపర్ణ వచ్చిందా? తనకు డబ్బు అవసరం పడిందని నిన్ను అడిగిందా?” అడిగాడు శేఖర్.
“రాలేదు. పనమ్మాయి వచ్చి బయట నుంచే ఈ రోజు తన కూతురి స్కూల్ ఫీజ్ కట్టాలని, మనీ మీరిచ్చారని, ఆలశ్యంగా వస్తానని చెప్పి వెళ్ళింది. అప్పుడు మీరూ ఉన్నారు” అంది అపూర్వ.
“నీకు తెలుసా అన్నయ్యా అపర్ణ రాలేదని” ఆశ్చర్యంగా అడిగింది వాసవి.
“తెలుసు. ఆచంద్రహారం ఇక్కడేఎక్కడో ఉంటుందనీ తెలుసు. ఆఫీస్ అతను వెళ్ళాక చిన్నగా వెతుకుదామనుకున్నాను. అంతే కాదు వదిన పుట్టింటివాళ్ళకు ఏమీ చేరవేయటము లేదనీ తెలుసు. అయినా వాళ్ళకు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాల్సిన ఖర్మ ఏముంది” అన్నాడు.
“మరి మీకు తెలిసే అత్తయ్యగారు అన్ని మాటలు అంటుంటే ఊరుకున్నారా?” గొంతుపూడుకు పోతుండగా అంది అపూర్వ.
“నువ్వు ఇవ్వటం లేదని, అమ్మ అనవసరంగా నిన్ను అంటోందనీ తెలుసుగా మరి నువ్వెందుకు మాట్లాడవు. మౌనంగా ఎందుకూరుకుంటున్నావు? నేనెందుకు నిన్ను సపోర్ట్ చేయాలి? ఎల్లకాలమూ నేనుంటానా నీతో? నీ సమాధానం నువ్వు చెప్పుకోవటం రాకపోతే ఎట్లా? అందుకే నేనేమీ మాట్లాడటం లేదు” అన్నాడు శేఖర్.
అపూర్వ కళ్ళల్లో నీళ్ళు నిండాయి. “ఇదో ఈ బేలతనమే వద్దనేది. నీకు నువ్వు గట్టిగా ఉండాలి.నీ మీద దొంగతనం అపవాదు పడినా మౌనంగా భరించక్కరలేదు. మౌనం అన్నిటికీ సమధానం కాదు” అన్నాడు.
“కానీ అన్నయ్య అసలు అమ్మ ఇదివరకు లేదు. ఇప్పుడు ఎందుకిలా ప్రవర్తిస్తోందో! వదినను ఎందుకు అనుమానిస్తోందో అర్ధం కావటము లేదు.” అంది వాసవి.
“ఇందులో అర్ధం కాకపోవటనికి ఏముంది. నాన్నపోయాక చాలా అభద్రతాభావం ఏర్పడింది. పైగా ఈ సీరియల్స్ లో చూపించేవి, అన్నీ తనకే జరుగుతున్నాయని, అందులోలా తన కోడలు తనని ఏమి చేస్తుందోనని భయం. అందుకే అపూర్వ ఇచ్చిన పాలు అప్పుడప్పుడు నాకో పిల్లలకో ఇచ్చి నాకు తాగాలని లేదు మీరు తాగండి అంటుంది. మేము తాగాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది” అన్నాడు.
“ఆ టీ. వీ పీకించేయ్ అన్నయ్య. వదిన నిన్ను అంత బాగా చూసుకుంటుంటే ఇట్లాంటి పిచ్చి వేషాలేస్తున్నావు. ఇంకోసారి ఇట్లా చేస్తే ఊరుకోము. నిన్ను ఓల్డేజ్ హోం లో పెట్టేస్తాము” అని అమ్మను బెదిరించింది వాసవి.
మౌనంగా ఉండవద్దు, మాట్లాడు. దేవుడు నోరిచ్చింది తినటానికే కాదు. మాట్లాడటానికి కూడా అంటాడు శేఖర్. కానీ ఎవరితోనైనా ఏమని వాదిస్తుంది? ఎవరి వాదన వారిది. వాదనలతో ఎవరినీ నమ్మించలేము. ఎవరి అభిప్రాయమూ మార్చలేదు. ఎవరేమన్ననూ మారాడ బోకు, మగడేమన్ననూ మాట్లాడబోకూ అని అమ్మ చెప్పిన మాటలు పాటిస్తోంది తను. కాబట్టే ఎప్పుడూ ఎవరితో గొడవలు రాలేదు. అటు అత్తింటనూ, ఇటు కోడలింటనూ నెగ్గుకొచ్చింది. కానీ శేఖర్ అన్నట్లు మౌనం అన్ని వేళలా మంచిది కాదా! ఏమో కాలమే జవాబివ్వాలని రాసుకొని డైరీ మూసింది అపూర్వ.