స్విట్జర్లాండ్ ప్రయాణం
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ఏమీ నచ్చక, టైమూ సరిపోక పోవటంతో జ్యూస్ ఒక్కటే తాగి రెడీ అయ్యాను. నిన్న రాత్రి డిన్నర్ కాస్త కడుపునిండా తినడం వల్ల కాబోలు పెద్ద ఆకలి అనిపించలేదు. నిన్న డిన్నర్ కోసం ఇండియన్ హోటల్ దావత్ కి తీసుకెళ్ళారు. ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, ఆలూగోభి కర్రీ, సాంబార్, బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ, మంచి పెరుగుతో డిన్నర్ ఏర్పాటు చేసారు. వాటిని చూడగానే ఎక్కడలేని ఆకలి అనిపించింది. కాని నిరాశే మిగిలింది. దేనిలోను ఉప్పులేదు. నాన్ వెజ్ సంగతి తెలియదు. ఆ హోటల్ యజమాని నార్త్ ఇండియన్. పొరపాటున మా టేబుల్ దగ్గరికి వచ్చి ‘ఆర్ యూ ఎంజాయింగ్ డిన్నర్? కైసా హై హమారా దావత్?’ అని అడిగాడు. నేను ‘బహుత్ అచ్చాహై…… ఆపకా దహీ ఓర్ పానీ’ అని వెంటనే అనేశాను. అందరూ గొల్లున నవ్వారు. ‘హా బయ్యా, కర్రీ ఓర్ సాంబార్ మే నమక్ నహీ హై. సబ్సే అచ్చా ముఝే దహీ అవుర్ పానీ బహుత్ అచ్చా లగా’ అని చెప్పాను. అందరూ అవునని అనే సరికి సారి సారి అంటూ లోపలికి వెళ్ళి పోయాడు. ఆవురావురుమంటూ అదే మహా ప్రసాదంగా తిన్నారు.

ఉదయం అందరూ బస్సులో బయలు దేరేసరికి తొమ్మిది అయిపోయింది. అప్పటి వరకు ముందు కూచున్న గుజరాతి మిసెస్ దావ్ డే, మేము కూచున్న సీట్ల వెనకాల పొడుగు సీటు మీద కూచుంది. రెండు రోజుల నుంచి బాక్ సీట్స్ లో ఎంజాయ్ చేస్తున్న పిల్లలంతా ముఖాలు ఇబ్బందిగా పెట్టారు. మావాడు ప్రణయ్ ఊరుకోకుండా ‘క్యాహువా ఆంటీ పిఛే సీట్ పర్ ఆగయ్’ అని అడిగాడు. ‘మేరా కమర్ మేనా బహుత్ దరద్ హోరా. యహా మే సోజావుంగీ.’ ఆమే గుజరాతి యాసలో నడుము నొప్పి అంటూ అక్కడే పడకేసేసింది. ‘యే క్యాహైమా. హమ్ సబ్లోగ్ ఇదర్ అచ్చా ఎంజాయ్ కర్రే. బీచ్ మే ఆప్ సోగయ్‘ అని ఆమె కూతురు షీల్ విసుక్కుంది. అయినా ఆవిడ లేవలేదు. రెండు రోజులుగా ఆ అమ్మాయి ఈ మగపిల్లలతో తిరగటం ఆమె తల్లితండ్రులకి ఇష్టం లేదు. పదే పదే నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు ఆమె నాన్నగారు వినోబాయ్ దావ్ డే. ‘ఆప్ కా బచ్చా కహాకహా గూమ్ రహా హై. పకడ్కే రకో. నహీ తో కోయీ బచ్చీకో ఉటా కే లేజాయెగా.’ అన్నాడు ఒకసారి. ‘హాఁ వో బచ్చా హై. కోయీ తాజూబ్ నహీ’ అన్నాను. మా వాణ్ణి పట్టుకుని ఉండాలని లేకపోతే ఏదో అమ్మాయిని లేపుకొని పోతాడని ఆయన అంటే అవును పిల్లాడే కదా అలా చేయటం ఆశ్చర్యం ఏమి లేదన్నాను. అతను వాళ్ళ అమ్మాయి వీళ్ళతో కలిసి తిరుగుతుందని అలా నన్ను హెచ్చరిస్తున్నాడని నేను అనుకోలేదు. అప్పుడర్థమైంది వాళ్ళ బాధ. పాపం ఆ అమ్మాయేమో తన ఈడు వాళ్ళతో గడపాలని అనుకుంటుంది. అంత తప్పు పట్టాల్సిన పని లేదు. కాని వాళ్ళ భయం వాళ్ళది. పిల్లలంతా నా పక్కనున్న సీట్లలో సెటిల్ అయి పోయారు. నాకేమి అబ్జెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా పాటలు వింటు ఎంజాయ్ చేస్తున్నారు. దారి పొడుగునా పచ్చటి గడ్డి చెట్లతో చాలా అందంగా ఉంది. ఆ ఆకుపచ్చని గడ్డిని మేస్తూ నల్లమచ్చలున్న తెల్లటి ఆవులు చాలా ప్రత్యేకంగా కనిపించాయి. మన వేపు ఉన్న ఆవుల్లా లేవు. నిజమే స్విట్జర్లాండ్ భూతల స్వర్గం అంటారు. అంత అందంగా కనిపించింది.
స్విట్జర్లాండ్, యూరోప్ ఖండంలో ఉన్న దేశాల్లో కల్లా చిన్నదే కానీ అత్యంత అభివృద్ధి చెందిన దేశం. ప్రకృతి సౌందర్యం, మంచు పర్వతాలు, ఖచ్చితమైన గడియారాలు, చాక్లెట్లు, న్యూట్రలిటీ (తటస్థ రాజకీయ వైఖరి), బ్యాంకింగ్ లకు ప్రసిద్ధి చెందింది. దీని రాజధాని బెర్న్ (Bern). పెద్ద నగరాలు: జ్యూరిక్ (Zurich), జెనీవా (Geneva), బాసెల్ (Basel), లూసెర్న్ (Lucerne). మొత్తం ఆ ప్రాంతం సుమారు 41,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి జనాభా దాదాపు 9 మిలియన్లు. ప్రజలు సుమారు 63% ప్రముఖంగా మాట్లాడే భాష జర్మన్. మిగిలిన వారిలో ఫ్రెంచ్ 23%, ఇటాలియన్ 8%, రొమాంచ్ 1% మాట్లాడే వారు ఉన్నారని చెబుతారు. స్విట్జర్లాండ్‌లోని భోజన సంస్కృతి అనేది జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ ప్రాంతాల ప్రభావంతో విస్తారంగా అభివృద్ధి చెందింది.

ప్రతి ప్రాంతంలో ప్రత్యేకమైన భోజన శైలులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన స్విస్ ఫుడ్ స్పెషాలిటీసలలో మొదటిది ఫోండ్యూ (Fondue). వేడిగా మరిగించిన చీజ్ మిశ్రమాన్ని చిన్న పాత్రలో సర్వ్ చేస్తారు. బ్రెడ్ ముక్కల్ని గుచ్చి దానిలో ముంచి తింటారు. చీజ్ రకాల Gruyère + Emmental మిశ్రమం. వీటిని ముఖ్యంగా వెనుకభూములైన ఆల్పైన్ ప్రాంతాల్లో, ముఖ్యంగా శీతాకాలంలో దొరుకుతాయి. రెండవది రక్లెట్ (Raclette). రక్లెట్ చీజ్‌ను వేడి చేసి, ఉడికించిన బంగాళాదుంపలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పికిల్స్, ఉల్లిపాయలపై పోసి తినే వంటకం. సాధారణంగా ప్రత్యేక రక్లెట్ గ్రిల్‌ను ఉపయోగిస్తారు. మరో ఆహారం రోష్టి (Rösti). బంగాళాదుంపలతో తయారు చేసిన క్రిస్పీ వంటకం. అల్పాహారంగా లేదా దాల్చిన టాపింగ్‌లతో లంచ్‌లో తీసుకుంటారు. ముఖ్యంగా బెర్న్ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉంది. మరో రుచికరమైన వంటకం జురిచర్ గెష్నెట్సెల్టెస్ (Zürcher Geschnetzeltes). చిన్న ముక్కలుగా కోసిన కాలిన కాడ్ మాంసం (veal) ను క్రీమ్, వైన్, పచ్చి ఉల్లిపాయలతో వండిన డిష్. సాధారణంగా రోష్టితో పాటు సర్వ్ చేస్తారు. జ్యూరిక్ ప్రాంతానికి చెందిన డిష్.
ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగింది స్విస్ చాక్లెట్ (Swiss Chocolate). స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ చాక్లెట్ల తయారీదారుగా పేరు పొందింది. ప్రసిద్ధ బ్రాండ్లు: Lindt, Toblerone, Läderach, Cailler అనేక టూర్స్ కూడా ఉన్నాయి (Lindt Chocolate Tour – Zurichలో). ఇంకా స్విస్ చీజ్‌లు (Swiss Cheeses). ప్రసిద్ధ రకాలలో: Gruyère, Emmental, Appenzeller, Tête de Moine, చీజ్ ప్లాటర్స్ లేదా బ్రెడ్/ఫలాలతో కాంబోగా తింటారు.
బిర్చర్ మ్యూస్లీ (Bircher Müesli) అల్పాహారంగా తీసుకునే వంటకం. ఓట్స్, పాలు, యాపిల్ పండ్లు, నెయ్యితో తయారు చేస్తారు. ఆరోగ్యకరమైన స్విస్ ఆవిష్కరణ. నట్ టోర్ట్ (Nusstorte). ఒక రకమైన స్వీట్ టార్ట్. వాల్‌నట్స్, కారమెల్, మిల్క్‌తో తయారు చేసిన స్వీట్. ముఖ్యంగా Graubünden ప్రాంతంలో ప్రసిద్ధం. ఇవే కాక వెజ్ & ఇండియన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రపంచ రుచులు కూడా అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా జ్యూరిక్, జెనీవా, లూసెర్న్ లాంటి నగరాల్లో. ఇండియన్ రెస్టారెంట్లు (ఉదా: Tandoori, Bombay Kitchen, Taj Palace, Namaste India) అనేక నగరాల్లో ఉన్నాయి. వెజెటేరియన్ ఆప్షన్స్ కూడా సాధారణంగా లభిస్తాయి (పాస్తా, వెజ్ ఫోండ్యూ, మ్యూస్లీ, సలాడ్స్ మొదలైనవి)
ఇక్కడి కరెన్సీ స్విస్ ఫ్రాంక్స్. ఆల్ప్స్ పర్వతాలు స్విట్జర్లాండ్‌ను విస్తృతంగా ఆక్రమించి ఉన్నాయి. వీటిలో ప్రముఖ మంచు పర్వత శిఖరాలుగా మాటర్‌హోర్న్ (Matterhorn), యంగ్ఫ్రా (Jungfrau), మోంక్ (Mönch). ఎన్నో అందమైన సరస్సులున్నాయి. వాటిలో లేక్ జెనీవా, లేక్ లూసెర్న్, లేక్ జ్యూరిక్ చెప్పుకోదగ్గవి. పర్యాటక ఆకర్షణలుగా జ్యూరిక్ – ఆర్థిక కేంద్రం, నైట్లైఫ్, మ్యూజియమ్స్, లూసెర్న్ – చారిత్రక నగరం, చప్పెల్ బ్రిడ్జ్, జెనీవా – యునైటెడ్ నేషన్స్, రెడ్ క్రాస్, ఇంటర్లాకెన్ – అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు హబ్, జెర్మాట్ – Matterhorn కు అడుగుజాడ, యంగ్ఫ్రావ్యోచ్ – Top of Europe, స్ట్రాస్‌బర్గ్, మౌంట్ టిట్లిస్, లౌటర్‌బ్రూనెన్ – ప్రకృతి రత్నాలుగా ప్రసిద్ధ మైనవి. అధికంగా అభివృద్ధి చెందిన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యూటికల్స్, ప్రిసిషన్ ఇంజనీరింగ్ రంగాల్లో ప్రపంచ నాయకత్వం. టూరిజం ముఖ్య ఆదాయ వనరు. బ్యాంకింగ్ అంటే మనందరికి గుర్తుకొచ్చేది స్విస్ బాంక్. మన దేశంలో ఉన్న చాలా మంది ధనవంతులకి ఆ బాంక్ లో ఖాతాలున్నట్టు వింటూనే ఉన్నాం. ప్రతీ ఎలక్షన్ల టైములో మన నాయకులందరూ చేసే ‘స్విస్ బాంక్ లో మనవాళ్ళు దాచుకున్న ధనాన్ని మనదేశానికి రప్పిస్తామనే’ వాగ్దానాలు.
ఇది ప్రపంచంలో ప్రత్యేకతగా చెప్పుకునే దేశం. న్యూట్రలిటీ స్విట్జర్లాండ్ యుద్ధాలలో తటస్థంగా ఉంటుంది (ప్రపంచ యుద్ధాల్లో పాల్గొనలేదు), డైరెక్ట్ డెమొక్రసీ ప్రజలే ముఖ్యమైన నిర్ణయాల్లో భాగం. అత్యున్నత జీవన ప్రమాణాలు. వేసవి, శీతాకాలం టూరిజం రెండూ విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇండియా నుండి స్విట్జర్లాండ్ ప్రయాణానికి షెంజెన్ వీసా అవసరం. వేసవి (జూన్ – సెప్టెంబర్): హైకింగ్, సరస్సులు, పర్వతాలు, శీతాకాలం (డిసెంబర్ – ఫిబ్రవరి): స్కీయింగ్, స్నో యాక్టివిటీలకు బెస్ట్ సీజన్. ప్రపంచస్థాయి రైలు వ్యవస్థ. స్విస్ ట్రావెల్ పాస్ ద్వారా దేశం మొత్తం తిరగవచ్చు (అన్లిమిటెడ్ ట్రావెల్). అలా వైదేహి అక్కడి రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి వివరిస్తూన్నంతలో ఐగర్ జెస్లర్ స్టాప్ వచ్చేసింది. అక్కడినుంచి యంగ్ఫ్రావ్యోచ్ (Jungfraujoch) పర్వతం పైకి ప్రయాణం.
యంగ్ఫ్రావ్యోచ్ (Jungfraujoch) పలకటం కొంచెంకష్టమే. స్పెలింగ్ ని పట్టి పదాన్ని పలకటం కుదరదు. దీంట్లో ‘J’ అక్షరం సైలంట్. Jungfrau అంటే యంగ్ వుమెన్ లేదా కన్య అని అర్థం. Joch ని యోక్ లాగా పలకాలి. దానర్థం కొండల మధ్య ఉన్న దారి లేదా కొండల మధ్య రాకపోకల మార్గం. మొత్తంగా Jungfraujoch అంటే ‘కన్య కొండదారి మార్గం’ లేదా ‘కన్య కొండ మధ్య దారి’ అని చెబుతారు. ఈ ప్రదేశం స్విట్జర్లాండ్‌లో ఉన్న అతి ప్రసిద్ధ పర్వతశిఖరాల మధ్యనున్న ఒక అద్భుతమైన పర్యాటక గమ్యం. ఇది “Top of Europe” (యూరోప్ శిఖరం) యూరోప్ ముల్లోకానికి ద్వారం అని కూడా పిలవబడుతుంది. ఇది యంగ్ఫ్రా (Jungfrau) మరియు మోంక్ (Mönch) అనే పర్వతాల మధ్య ఉంది.
యంగ్ఫ్రావ్యోచ్ పర్వతం సముద్ర మట్టానికి 3,454 మీటర్లు (11,332 అడుగులు) ఎత్తులో ఉంది. ఇంటర్లాకెన్ (Interlaken), లౌటర్‌బ్రూనెన్ (Lauterbrunnen), లేదా గ్రిండెల్వాల్డ్ (Grindelwald) నుండి ట్రైన్ మార్గం ద్వారా యంగ్ఫ్రావ్యోచ్ చేరుకోవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైలు స్టేషన్. టిక్కెట్లను ముందుగా బుక్ చేసుకోవాలి, ముఖ్యంగా పీక్స్ సీజన్‌లో.
యూరోప్‌లోని అతిపెద్ద హిమనది ఆల్స్‌గ్లెషియర్ (Aletsch Glacier)ని ఇక్కడ చూడవచ్చు. ఐస్ ప్యాలెస్ (Ice Palace) మంచుతో తయారైన విహారమందిరాలు, శిల్పాలు. స్ఫింక్స్ అబ్జర్వేటరీ అద్భుతమైన 360 డిగ్రీ లాండ్స్కేప్ వీక్షణ. స్నో ఫన్ స్కీయింగ్, ట్యూబింగ్, స్నోబోర్డింగ్ వంటివి ఇక్కడి ఆకర్షణలు. గ్రీష్మకాలంలో (జూన్ – సెప్టెంబర్) మంచు తక్కువగా ఉంటుంది, గ్లెషియర్ విహారాలకు వీలు. శీతాకాలంలో (డిసెంబర్ – మార్చి) మంచు ప్రకృతి అందాలు, స్నో యాక్టివిటీలు చేయవచ్చు. గాలి పీడనం తక్కువగా ఉండే కారణంగా కొంత మందికి తలనొప్పి లేదా ఊపిరితిత్తుల అసౌకర్యం కలగవచ్చు. వెదర్‌ను ముందుగా చూసుకోవాలి. వర్షం లేదా మబ్బులు ఉంటే దృశ్యాలు కనపడకపోవచ్చు. శరీరానికి తగిన విధంగా చలి ఆపగలిగే దుస్తులు ధరించాలి. వాతావరణం 1 degree నుంచి 2 degrees పైన ఉంటుందని, వర్షం కాని మంచు కాని కురిసే అవకాశం ఉందని వైదేహి మా అందరికి బస్సులోనూ, కిందటి రోజు వాట్సప్ మెసేజెస్ లోను తెలియచేసింది.
యంగ్ఫ్రావ్యోచ్ (Jungfraujoch – Top of Europe) కు చేరడానికి ప్రయాణించే ప్రధాన మార్గం రైలు మార్గం, ఎందుకంటే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లే కేబుల్ కార్ లేదు. అయితే, రైలు మార్గంలో ఒక భాగంగా కేబుల్-కార్ (Eiger Express) కూడా కలిసివస్తుంది. ఈ యంగ్ఫ్రావ్యోచ్ కి వెళ్ళటానికి టికెట్ ధర ఒక్కొక్కరికి 180 యూరోస్ మానుంచి ముందే కలెక్ట్ చేసారు. అక్కడనుంచే యాంగ్ ఫ్రో విచ్ పర్వతం పైకి ఎక్కే కేబుల్ కార్ టర్మినల్ వచ్చేసింది. దాదాపు రెండు గంటల ప్రయాణం. కొంత భాగం కేబుల్ కార్ ఆ తర్వాత కొండల మధ్యలోంచి తొలిచిన మార్గం గుండా రైలు జర్నీ ఉంటుంది. యంగ్ఫ్రావ్యోచ్ (Jungfraujoch – Top of Europe) కు చేరడానికి ప్రయాణించే ప్రధాన మార్గం రైలు మార్గం, ఎందుకంటే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లే కేబుల్ కార్ లేదు. అయితే, రైలు మార్గంలో ఒక భాగంగా కేబుల్-కార్ (Eiger Express) కూడా కలిసివస్తుంది.
వైదేహి టికెట్స్ తీసుకుని మా అందరికి పంచింది. ఆమె మా అందరికి పాస్పోర్ట్ లాంటి చిన్న ఎర్రటి పుస్తకాలను కూడా ఇచ్చింది. యంగ్ఫ్రావ్యోచ్ పర్వతం పై అంత ఎత్తుకి వెళ్ళామనే గుర్తుగా ఆ బుక్లో మన పేరు రాసుకోవాలి. అందులో అక్కడి ఎగ్జిక్యూటివ్స్ స్టాంప్ వేస్తారట. ఒక్కొక్కరం కేబుల్ కారులోకి ఎక్కేసాము. అది చాలా నెమ్మదిగా నడుస్తూనే ఉంటుంది. అలాగే ఎక్కాలి. కానీ కష్టమేమి కాదు. అందరం ఒకేదాంలోకి వచ్చేసాము. అందరికి కూచునే సీట్స్ ఉన్నాయి. నెమ్మదిగా పైకి వెళుతూ కిందనున్న వృక్షాలు, పచ్చికబయలు అందులోని ఆవులు కనువిందు చేసాయి. ఆవుల మెడలోని గంటల మోత వీనులవిందుగా రిథమెటికల్ గా వినిపిస్తుంది. కార్ పైకి వెళ్ళుతున్నా కూడా స్పష్టంగా వినబడుతుంటే అదెలా వీలవుతుందని కార్ పై కప్పును గమనిస్తే అక్కడి స్పీకర్లలోంచి ఆ గంటల శబ్దం వినిపిస్తుంది. వాటి మెడలోని మువ్వల శబ్దం లాగా. ఇంకా పైకి వెళుతుంటే పక్కనుంచి మేఘాలు వెళ్ళటం అద్భుతంగా అనిపించింది. కార్ పర్వతాల చుట్టూ తిరుగుతూ పైకి వెళుతుంది. చుట్టూ కొద్ది దూరం పొడవాటి వృక్షాలైతే పైకి పోయేకొద్ది తెల్లటి మంచు కొండలు. చాలా త్రిల్లింగా ఫీలయాము. ఫొటోలు వీడియోలు తీసుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేశాము. కనుమరుగైన పచ్చికబయలు, చెట్లు, చుట్టూ మంచు పర్వతాలు, దూదిపింజాల్లా గాలిలో తేలియాడుతున్న మేఘాలు, నదీ వంపులూ కాన్వ్యా స్ మీద చిత్రంలాగా అనిపించింది. అదొక్కటే కాదు కంటికి కనిపించే ప్రతీ దృశ్యం చిత్రించిన బొమ్మల్లా కనిపిస్తున్నాయి. ఇరువై నిముషాల జర్నీ తరువాత ట్రైన్ జర్నీ ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర షార్ట్ టైమ్ కోసం ఒక సైట్ లో ఫొటోల కోసం ఆపుతారని చెప్పింది. ఒకచోట ఆపి ఫొటోలకు అనుమతించారు. పర్వతాల పైన మంచు, చల్లగాలి. అందరం అక్కడనుంచి ఫొటోలు తీసుకున్నాము. చల్లటి గాలి రివ్వున వీస్తుంటే ముఖం కూడా కూడా వెచ్చగా కప్పుకుంటే బాగుండనిపించింది. నేను మాస్క్ తీసుకెళ్ళాను కాబట్టి వేసుకున్నాను. తలపైన స్కార్ఫ్ కట్టుకుని ఆపైన హూడి తో తలకప్పుకుంటే కొంత నయం. మళ్ళీ రైల్లో ప్రయాణించి పూర్తి పైకి చేరుకున్నాము. చెవులు మూసుకు పోయి, తలంతా దిమ్మెక్కి వళ్ళు స్వాధీనం తప్పుతున్నట్టు అయింది. ఎవరికైనా చెబితే కంగారు పడతారని, చివరికి ప్రణయ్ కూడా తెలియచేయలేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. అప్పటికే లంచ్ టైమ్ వల్ల అక్కడ ఉన్న రెస్టారెంట్ లోకి మా అందర్నీ తీసుకెళ్ళారు. కాళ్ళూ చేతులు పనిచేయనని మొరాయిస్తూన్నా ప్లేట్లో అన్ని వడ్డించుకుని టేబుల్ దగ్గరికి చాలా కష్టంమీద చేరుకున్నాను. గబగబా తినేశాను. నా ఉద్దేశ్యం నాకే నీరసం వల్ల అలా అవుతుందనుకున్నాను. బహుశా అందరి పరిస్థితి అలాగే ఉందనుకుంటా. భోజనం చేసాక కొద్దిగా తేరుకున్నాను. ప్రణయ్ గబగబా నా ద్దరికి వచ్చి ‘విజయా నాకు చేతుల స్పర్శ తెలియటం లేదు.’ అంటూ చెబుతుంటే కంగారు పడిపోయాను. నాకు అప్పటి వరకూ పడుతున్న బాధ మర్చిపోయాను. వాడి అరచేతులు పట్టుకుంటే ఐస్ ముద్దల్లా ఉన్నాయి. వాడు చాలా పొడుగు ఉండటం వల్ల వాడి స్వెట్టర్ చేతులు అరచేతుల వరకు రావటం లేదు. వెంటనే వాడి చేతుల్ని రుద్దుతూ నా స్వెట్టర్ తో కప్పేశాను. వాడు నా ముఖం చూసి నీకు ఆక్సిజన్ అందటం లేదు. ఊపిరి బాగా పీల్చుకో. అన్నాడు. అప్పుడు అర్థ మైంది నేను పడుతున్న బాధేమిటో. పర్వతాల పైన హై అల్టిట్యూడ్ ప్రభావానికి మనకు సరియైన ఆక్సిజన్ పీల్చుకోలేక తల తిరిగినట్టుగా అవుతుంది. ఎక్కువగా గాలి పీల్చి వదలటం వల్ల నేను త్వరగానే తేరుకున్నాను. మాగ్రూప్ లోని జ్యోతి వాళ్ళ మదర్ యోగా చేస్తుందట. ఆమె మా అందరితో చప్పట్లు కొట్టించింది. దాని వల్ల రక్తప్రసరణ జరిగి చేతులు తిమ్మిర్లు ఎక్కవు. కాసేపటిలోనే మేమంతా సర్దుకున్నాము. అక్కడనుంచి ఒక గుహలాగా ఉన్న దాంట్లోకి వెళ్ళాము. అదంతా ఐస్ తో కప్పబడి ఉంది. గుహంతా ఐసే. చాలా చలి. కింద అంతా మంచు.
స్విట్జర్లాండ్‌లోని జంగ్‌ఫ్రాయోచ్ (Jungfraujoch – Top of Europe) లో ఉన్న ఒక ప్రదర్శన సొరంగం (Exhibition Tunnel)ఇది. అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. Alpine Sensation Tunnel అనే ప్రదర్శన సొరంగంలో ఇది భాగంగా ఉంది. ఇది జంగ్‌ఫ్రాయో రైల్వే 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా 2012లో ప్రారంభించారు. ఇందులో చాలా రకాల శిల్పాలను ప్రదర్శించారు. ఒక శిల్పం (statue) ఒక వ్యక్తి మంచు గుట్టల మధ్య చిక్కుకొని ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇది నిజమైన వ్యక్తి కాదు. ఇది ఒక ప్రతీకాత్మకంగా, ఈ రైల్వే నిర్మాణంలో పాల్గొన్న కార్మికుల (workers) కష్టాలను మంచు పర్వతాల్లో వారి పోరాటాన్ని తెలియజేయడానికి ఉద్దేశించబడినదిగా భావించవచ్చు. ఈ ప్రదర్శనలో జంగ్‌ఫ్రాయో రైల్వే నిర్మాణ చరిత్రను లైట్లు, ధ్వని, శిల్పాలతో చూపిస్తారు. నిర్మాణ సమయంలో మరణించిన కార్మికులకు నివాళిగా కొంత భాగం ఉంటుంది. సందర్శకులు చరిత్రను గ్రహించేందుకు ఇది ఒక భావోద్వేగాత్మక అనుభూతిని కలిగిస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదర్శనలో మనం మంచు గుండా నడుస్తున్నట్టుగా అనిపించే ఎఫెక్ట్‌లు ఉంటాయి. మ్యూజిక్, లైటింగ్, శిల్పాలు అన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. మేము ఆ గుహలోకి వెళుతుంటే కొంచెం భయపడ్డాం. కింద నేలంతా గట్టి మంచుతో కప్పబడి నున్నగా, జారిపోతామేమో ననే విధంగా ఉంది. పట్టుకుని నడవటానికి వీలుగా గోడలకు స్టీల్ రాండ్స్ ఏర్పరచారు. కాని అవి మంచువల్ల చల్లగా ఐస్ ముద్దల్లా ఉన్నాయి. నేను నా స్వెట్టర్ హాడ్స్ని ముందుకు జరిపి పట్టుకున్నాను. కొద్ది సేపటికి అవికూడా చల్లగా అయిపోయాయి. రెండో చేతిని ప్రణయ్ పట్టుకున్నాడు. ఎంత మేము షూస్ వేసుకున్నా అవి మంచు మీద నడిచేవి కావు కాబట్టి జారే అవకాశ ముంటుందని వైదేహి ముందే మాకు చెప్పింది. జాగర్తగా అడుగులు వేస్తూ భయంతో నడుస్తున్నాము. మధ్యలో ఉన్న శిల్పాలను ఫొటోలు తీయటానికి నా చేయి విడిచి వెళ్ళి పోయేవాడు ప్రణయ్. అక్కడ మేము చూసిన శిల్పం “మంచులో నుంచి బయటికి వస్తున్న లేదా చిక్కుకుపోయిన వ్యక్తి”గా కనిపిస్తుంది. ఇది మనిషి, ప్రకృతి మధ్య సాగిన పోరాటాన్ని తెలియజేసే ఒక ప్రతీక. అప్పుడప్పుడు ఆ బొమ్మలను చూస్తున్నా కాని ఎక్కడ పడిపోతాయేమో ననే భయంతో మా ధ్యాసంతా నడకమీదే పెట్టాము. చల్లటి గాలి, మంచు గుహ మమ్మల్ని మంచు ముద్దల్ని చేసింది. ఎలాగోలా ఆ గుహలోంచి బయటపడ్డాము.
జుంగ్ఫ్రాయోచ్ (Jungfraujoch) ట్రైన్ టన్నెల్ నిర్మాణ చరిత్రను చూపించే ప్రదర్శన భాగం కూడా మనం చూడవచ్చు. ఇది స్విట్జర్లాండ్‌లో ఉన్న అతి ప్రసిద్ధమైన పర్వత రైలు మార్గాలలో ఒకటి. జుంగ్ఫ్రాయోచ్ రైలు మార్గం త్రవ్వక చరిత్ర ఏమిటంటే దీన్ని1890లలో ఆరంభించారు. ఈ రైల్వే నిర్మాణం ఆలోచన స్విస్ వ్యాపారవేత్త ఆడాల్ఫ్ గయ్యర్-జెల్లర్ (Adolf Guyer-Zeller) కి వచ్చింది. ఆయన క్లైనే షైడెగ్ (Kleine Scheidegg) నుండి జుంగ్ఫ్రాయోచ్ వరకూ రైలును నిర్మించాలని నిర్ణయించారు. దీని నిర్మాణం ప్రారంభం 1896 లో Eiger పర్వతం కిందుగా, రాకీ పర్వతాల్లో 7 కిలోమీటర్ల టన్నెల్ త్రవ్వుతూ ప్రారంభమైంది. ఎన్నోకష్టతరమైన పరిస్థితులను ఎదుర్కున్నారు. అప్పట్లో విద్యుత్ సాధనాలు లేవు. కూలీలు చెక్క ముట్టెలు, తుప్పలి డ్రిల్లులు, డైనమైట్ లాంటి పాత పద్ధతులతో పని చేశారు. అక్కడి ఫొటోలలో కనిపిస్తున్న వారు గుట్ట త్రవ్వక శ్రామికులు. చాలా మంది పనివారు మరణించారు కూడా.
టన్నెల్ లోపలే మధ్య స్టేషన్లు కూడా కనిపిస్తాయి. Eigewand స్టేషన్ (1903) – Eiger పర్వతం లోపల విండోస్ ద్వారా బయట దృశ్యం చూడటానికి ఏర్పరిచారు. Eismeer స్టేషన్ (1905) – మంచు పర్వతాల దృశ్యాలను చూడటానికి. ఈ టన్నల్ పూర్తి నిర్మాణం (1912) వరకు జరిగింది. మొత్తం 16 సంవత్సరాల తర్వాత, రైలు జుంగ్ఫ్రాయోచ్ (3454 మీటర్ల ఎత్తు) వరకు చేరింది. ఇది యూరోప్‌లోని అత్యున్నత రైల్వే స్టేషన్. ఈ నాటి పరిస్థితి చాలా ఆధునికంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కోగ్ వీల్ రైలు. ఈ ప్రదేశం Alpine Sensation Exhibit గా పిలవబడుతుంది, ఇది ఆ శ్రమికుల స్మరణార్థంగా నిర్మించబడింది.
ఈ ప్రాజెక్ట్ స్విట్జర్లాండ్ ఇంజనీరింగ్‌కి చిహ్నంగా నిలుస్తుంది. ఈ ప్రదర్శన శాశ్వతంగా అందులో పాల్గొన్న కార్మికుల ఘనతను గుర్తుచేస్తుంది.

ఆ తరువాత బయట శిఖరం పై ఒపెన్ ప్లేస్ కి వచ్చాము. చాలా చలిగాను ఉంది. అందరూ ఆ మంచులో నడుస్తూ ఇంకా పైకి వెళుతున్నారు. కిందంతా మంచు వల్ల జారుతున్నాయి. పడతానే భయంతో నేను అక్కడే ఆగి పోయాను. నాతో పాటు కొత్తగూడెం తెలుగు ఫామిలీ రాణి గారు జ్వరంగా ఉందని తానూ నాతోనే ఉండిపోయింది. జ్యోతి, వాళ్ళ అమ్మగారు నాతో పాటు అక్కడే ఆగిపోయారు. ప్రణయ్ నన్ను రమ్మని పిలిచాడు కాని రానని వాణ్ణే వెళ్ళమన్నాను. మగపిల్లలు అందరూ చివరికంటా వెళ్ళి ఫొటోలు తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న మాల్, రెస్టారెంట్ ల్లో మేము తిరిగాము. మమ్మల్నందరిని మూడు కల్లా అక్కడికి రమ్మని వైదేహి మాకు చెప్పింది. అందరూ వచ్చేసరికి నాలుగయింది. మళ్ళీ ట్రైన్, కేబుల్ కార్ లో ప్రయాణించి కిందకు వచ్చేసాము.
అక్కడే కేఫ్ లో టీ తాగేసి, స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లాకెన్ (Interlaken) అనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలోని Kursaal Park కి వెళ్ళాము. అక్కడ ఓ ఫలకంలో “Ambassador of Interlaken” అనే శీర్షిక ఉంది. ఇది బాలీవుడ్ దర్శకుడు యాష్ చోప్రా (Yash Chopra) గారిని స్మరించేందుకు ఏర్పాటు చేసిన విగ్రహం ఉంది. ఆయన ఇంటర్లాకెన్ ప్రాంతాన్ని తన సినిమాల్లో చూపించడం వల్ల స్విస్ టూరిజం పై ప్రభావం చూపారు. ఫలకంపై “Yash Chopra, 1932–2012, Bollywood Regisseur” అని స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్లాకెన్ కు బాలీవుడ్ పర్యాటకులను ఆకర్షించినందుకుగాను ‘Ambassador of Interlaken’ గౌరవం 8 ఏప్రిల్ 2011 ఇవ్వబడింది. ఈ విగ్రహం ఆయనను సినిమాటోగ్రాఫర్ గెటప్‌లో, పురాతన కెమెరాతో చూపిస్తుంది — ఇది ఆయన సినిమాటిక్ లెగసీకి గుర్తుగా ఉంటుంది. అక్కడే కెమెరాతో ఉన్న యాష్ చోప్రా శిల్పం దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. చుట్టూ ఉన్న షాపింగ్ మాల్ లోకి పరుగులు తీసారు. నేను మిథాలి, వాళ్ళ అమ్మగారితో పాటు టీ తాగేసి చుట్టూ పరిసరాలను చూస్తూ కాసేపు గడిపి బస్ లో వెళ్ళి కూచున్నాము. అప్పటికే డిన్నర్ టైమ్ అయిందంటూ హడావిడి చేసింది వైదేహి.
మరునాటి టిట్లీ పర్వతం పై విశేషాలను మరో ఎపిసోడ్ లో చెబుతాను. బహుశా ఎదురుచూస్తారనుకుంటా. ఈలోపు మీ కామెంట్స్ ని తెలియచేస్తే నాకు ఉత్సాహంగా ఉంటుంది.