
యోగి, జోగి, భోగి, రోగి
ఇందులో ఎవరు గొప్ప?
ఎవరు సమాజానికి పనికి వస్తారు?
ఏమిటి ఈ ప్రశ్న అంటారేమో?
కాని ఇది నిజం. సమాజానికి ఈ నలుగురు వ్యక్తులు అవసరం.
వీరివల్ల ఏం ఉపయోగం అంటారేమో?
ఉంది. చాలా చాలా లాభం ఉంది. వీరివల్ల
యోగివల్ల సమాజానికి ఎంత మేలు, మంచిమాటలు చెప్తారు, మనశ్సాంతి ఇస్తారు. అంతే కాదండోయ్, వీరివల్ల ధనం కూడా వస్తుంది. ఎలా అంటారేమో?
ఎన్ని ఆన్ లైన్ కోర్సులు పెడతారు, ఎంతెంత ఫీజులు వసూలు చేస్తారు, ఆ ధనం సహజ ప్రగతికి ఇస్తారు కదా?
మరక ఉపయోగం కూడా ఉందండి. నల్లధనం వదిలించుకోవడానికి కూడా కొందరు నకిలీ బాబాలు ఉపయోగపడతారు కదా? మరి ఎంత లాభం ఈ యోగులవల్ల ప్రపంచానికి.
మరి రెండోవారు జోగి
వీరే లేకపోతే మనుష్యులలో దానగుణం ఎలా వస్తుంది? ఏదో కొంత విసుక్కుంటూ అయినా దానం చేస్తారు కదా, పుణ్యం వస్తుందేమోనన్న ఆశతో.
మరి ఈ జోగులు పరోక్షంగ ఎంత ఉపయోగం సమాజానికి.
జోహార్లు జోగులూ మీకు.
ఇహ మూడోవారు భోగులు.
వీరు లేకపోతే సమాజాభివృద్ధే లేదు కదా?
వీరికోసమే కదా ఇన్ని కళాఖండాల సృష్టి.
ఇన్ని రకాల సౌందర్య పోషణశాలలు, ఇన్నిరకాల వ్రస్త పరిశ్రమలు. వీరే లేకపోతే ఇవి కొనేదెవరు?
వస్తువులు అమ్ముడుపోయేదెలా?
మానవుల సృజనాత్మక శక్తి పెరిగేదెలా?
క్రొత్త క్రొత్త అలంకరణలు, ఆకృతులు వచ్చేదెలా?
పరిశ్రమలు అభివృద్ధి చెందేదెలా?
మరి భోగులు ఎంత గప్పవారు. ఎన్ని కళలు వీరివల్ల అభివృద్ధి చెందుతున్నాయి. మరి వీరి ఋణం ఎలా తీర్చుకోగలం?
ఇహ చివరిగా రోగులు
వీరు కూడా గొప్పవారే.
వీరివల్ల కూడా సంఘానికి ఎంతో మేలు. ఎలా అంటారేమో?
వీరే లేకపోతే ఆసుపత్రులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు?
సైన్సు అభివృద్ధి చెందేదెలా?, పరిశోధనలు సాగేదెలా?
కొత్త కొత్త జబ్బులు కనుక్కునే దెలా? వాటికి విరుగుడు మఁదులు కనిపెట్టేదెలా?
చెవికి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, ముక్కుకు ఒక డాక్టరు అంతదాకా ఎందుకు? శరీరంలో ఎన్ని భాగాలున్నాయో? అన్నిటికి అంతమంది డాక్టర్లు తయారు అయ్యేదెలా?
ఈ రోగ మహాశయులు లేకపోతే. అందుకే ఈ రోగులు సమాజ పురోగతులు.
యోగి, జోగి, భోగి, రోగి అందరూ ఉత్తములే, అందరూ భావి నిర్మాతలే. అందుకే అందరినీ ఆప్యాయంగా చూడండి, వారితో కలసి ముందుకు సాగండి.
జై యోగి, జై జోగి, జై భోగి, జై రోగి
సర్వేజనా సుఖినోభవంతు
సమస్త మంగళానిభవంతు
ఓం శాంతి, శాంతి, శాంతి