రమక్క తో ముచ్చట్లు-19

సక్కగ కొలువు -సక్కగ మెలుగు 

శనార్థులు అందరికీ!

గోవిందు బామ్మరిది పెండ్లి దావత్ కు భార్య పిల్లలతో పదిహేను రోజులు ముందే పోయి అల్లుడు అన్న అహం కూడ మరిశి అన్నీ సగవెట్టిండు, శివరాఖరున అత్తా-మామా బామ్మర్ది, పాపం గోవిందును కదర్ చెయ్యలేదు, చిన్నల్లుడికి ఇచ్చిన ఇజ్జత్ ఈయనకు ఇయ్యలేదు.
పెద్దిందుల రోజు భార్యకు గూడ చెప్పకుండ తన ఊరుకు వెళ్ళిపోయిండు.
ఇగ ఆపొద్దు కెల్లి భార్యతోని మాట్లాడుడు బంద్ చేసిండు. అత్తమామలు బామ్మర్ది వచ్చి మస్తు బతిమాలిన గూడ ఆయన కోపమే తగ్గలేదు.
ఏదో ఒక ఒంక వెట్టి ఎప్పుడు లొల్లి చేస్తడు ఇంట్ల. పాపం ఆయన భార్య రందిల పడిపోయింది. సరైన పనేనా ఇట్ల జేసుడు ఆలోచన చెయ్యుండి. ఊరు ముందే పోయి లగ్గం పనులు చేసుడు ఎందుకు? నెత్తిమీద ఏసుకొనుడు ఎందుకు. గిట్ల అందరినీ బాధ పెట్టుడు ఎందుకు.
గోవిందు కత తోని మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే…, దేనికైనా ఒక బ్యాలెన్స్ -సమానం, చేసుకొనుడు రావాలి. అదే కొలుసుడంటే!
ఏంది కొలిచేది కూరగాయలా అంటవా చెల్లె!కాదు … అవొక్కటే కాదు
మంచి – చెడు, సుఖం- దుఃఖం , ఏడ మొదలు పెట్టాలె,ఏడ ఆపాలె ఇట్లా అన్నింటినీ కొలుసుడు తెలవాలె! ఒట్టి సౌదలు,కూరగాయలు కొలుసుడు కాదు.
దీన్నే జర హద్దుల ఉండుడు, ఆలోచించి పనులు చేసుడు, ఆలోచన చేసి మాట్లాడుడు అని కూడా అంటరు.
అన్ని ఇక్మత్తులు సక్కగ కొలుసుడు తెలిస్తే, సక్కగ మసులుడు మెలుగుడు కూడా వస్తది.

అన్ని కలిస్తేనే జీవితం అయితది. అన్ని మోతాదుల ఉంటేనే అందంగుంటది.
జీవితంల అన్ని రంగాలల్ల బ్యాలెన్సింగ్ – భావోద్వేగాలు, ఆర్థిక వ్యవహారాలు, మనిషి మనిషి లెక్క ఎదుగుడు గిట్ల అన్నింట్ల కొలుసుడు ఉండాలె.
వ్యక్తిగత అవసరాలు, మల్ల సమాజంల మన బాధ్యతలు, ఉద్యోగాలు నౌక్రీలు, ఇంట్ల బయట కిరికిరీలు.. అన్నింటిని సూసుకుంటా పోవాలే. ఇది ఒక సవాల్ లెక్క! యాడ మోతాదు ఎక్కువ – తక్కువ అయినా.. లొల్లే ఉంటది. నిజంగ ఎవరన్న బుద్ధిమంతుడు అంటే ఈ కొలుసుడు వచ్చినోడే!
మనిషి అన్ని మోతాదుల చూసుకోవాలంటే ఏం చేయాల్నో జర తెలుసుకుందాం!

. భావోద్వేగ (Emotional) బ్యాలెన్సింగ్
భావోద్విగాలంటే.. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా, కుళ్ళు వచ్చిన,.
కువార్కం వచ్చిన, జర మనల్ని మనము చెక్ చేస్కోని సూడాలె. గోవిందు కథ ఏమాయే ముందు దుఃఖమాయే, తర్వాత కుళ్ళు పుట్టే… అటుకెంచెల్లి పెండ్లాం తోని మాటలే మానేసే..అంటే మొత్తం మతే పోయిందని అర్థం. ఇదే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలె,సక్కగ కోలుసుకోవాలె!
ఎట్ల వీటిని బ్యాలెన్స్ చేయాలె? ఎట్ల కొలువాలె అంటే…
బుద్ధి సరిగ్గ పని చేయాలి. ఎదుటోళ్ల గురించి కూడా ఆలోచించుడు మొదలు పెట్టాలి. ఎప్పుడూ నేనే రైటు అనుకోకుండ ఆల్ల కష్టమేముందో ఎందుకు మాట్లాడలేదు. ఏమైందో..అని ఒకసారి , ఆళ్ళ కెంచెల్లి ఆలోచన చెయ్యాలె.
ఉద్యోగంల, వ్యాపారంల కూడా ఏదైనా ఒత్తిడి వస్తే అది తీసుకొచ్చి ఇంట్లోళ్ళ మీద రుద్దొద్దు. కొంచెం భక్తి పెంచుకోవాలి. ధ్యానము యోగా అసొంటివి చేస్తే కూడా… దిల్లు దిమాక్
తండ వడ్తయి.
ఎవల్ల మీద నన్న కోపం వస్తే వాళ్ళు తప్పు చేసిండ్రు అనిపిస్తే కూసోని మాట్లాడుకోవాలి. పోనీ..ఎవరన్నా మాట్లాడనీకి వస్తే ఇక వాళ్ళు మన కింద లాచారి పడ్డట్టు వాళ్ళను అణగదొక్కొద్దు.
బాధ కోపం వస్తే ఫ్రస్ట్రేషన్ వస్తది. ఆ ఫ్రస్టేషన్ కెల్లి,సొల్యూషన్స్ కి పోవాలి.

. ఆర్థిక (Economic) బ్యాలెన్సింగ్
మనిషి జీవన ప్రమాణాలను పెంచుకొనుట్ల పైసలు బ్యాలెన్స్ చేసుడు కూడా చాలా రావాలి.
ఆర్థిక స్వేచ్ఛ లేకపోతే , ఆత్మవిశ్వాసం, కుటుంబ సంతోషం దెబ్బతింటయి. అట్లనే ఇష్టం వచ్చినట్టు దుబారా చేసినా కూడా చాలా పరేషానే! అందుకే ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత చానా ముఖ్యం. జాగ్రత్తగ కొలువాలే ఈడ జాగ్రత్తగ మెలగాలె! సంపాదన ఎంత? ఖర్చెంత? దేనికి పెట్టుకోవాలి ఏది ముఖ్యము. సోకులేంది గిట్ల చూసుకుని మన ఇంటికి మన బడ్జెట్టు తయారు చేసుకోవాలి.
పిల్లల సదువులు, ఆరోగ్యము మంచి ఆహారము , వీటి మీద ఫస్ట్ ఖ్యాల్ పెట్టాలి.
ఆ తర్వాత తిరుగుళ్ళు సోకులు సూస్కోవాలి.
సమయ (Time balancing )పాలన

అన్నింటికంటే ఇది చానా ముఖ్యం.
సమయపాలన జీవితంల నెరవేర్చే లక్ష్యాలకు పానం లాంటిది. కరెక్ట్ టైం ల చేసే పని కరెక్టు టైం కి వచ్చిన ట్రైన్ లెక్క! లేటుగా వస్తది కదా అని పట్టాల మీద కూసున్నమనుకో పరిస్థితి ఏంది?
ఏ టైం ల ఏ పని, చెయ్యాల్నో అది కరెక్ట్ చేయాలి. కొలువులు జేసుడు, సంపాదన, సమాజం గురించి జర పట్టించుకొనుడు గిట్ల యే యాలకు, ఏ పని చేయాలో – ఆ యాలకు,,ఆ పని చేయకపోతే ఒట్టిదే బతుకు. భక్తి ఆధ్యాత్మికత పెంచుకోవాలన్న కూడా శరీరం గట్టిగ ఉన్నప్పుడే చేయాలి.
” శరీరమాధ్యంఖలు ధర్మసాధనం” అంటరు. వయసుండంగ మొత్తం బేకార్ తిరిగి ముసలోడు అయినంకన కొండలు ఎక్కుతా, కొలువులు జెస్తా అంటే చేయగలుగుతవా ఏంది!?.
పొద్దుగాల నుంచి మన పని ఏంది,మన షెడ్యూల్ ఏంది, ప్రణాళిక ఏంది, అని ఏసుకొని దాని ప్రకారంగా ఇంటిల్లి పాది గలిసి చేసుకుంటే సుకూన్ ఉంటది పానం.

ఆరోగ్య (Physical Health) బ్యాలెన్సింగ్
అందరికీ ఎరుకున్న మాటనే “ఆరోగ్యమే
మహాభాగ్యము” అని.. కానీ కాపాడుకునేటోళ్లు కొంతమందే.
ఆరోగ్యాన్ని పట్టించుకోకుంటే మిగతా అన్ని ఉన్నా పెద్ద సున్నానే కదా!
మన శరీరం మనం చెప్పిన మాట వినేటట్టు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి ముఖ్యమైన పని ఏంటంటే.. నోరు కంట్రోల్ ఉండాలి. అంటే మాటకే కాదు తిండికి సుత. ” నోట్లకి ఏం పోతుంది నోట్ల కెంచెల్లి ఏమి వస్తుంది” జాగ్రత్తగా చూసుకోవాలి.
అంటే మాట్లాడే దానిమీద తినే తిండి మీద కంట్రోల్ ఉండాలి.
ఆరోగ్యం కొలుసుడంటే ఒట్టి శరీరాన్ని బాగా పెట్టుకునుడే కాదు. ‘మెంటల్ హెల్త్ ‘ మనస్సును కూడా ఆరోగ్యంగ పెట్టుకోవాలి. ఎదుటోళ్ల మీద కుళ్లు కుచ్చితాలు చేయకపోవుడు , మంచి ఆలోచనలు దైవభక్తి ఉండుడు,. మనుషులందరి యెడల గౌరవము ప్రేమ ఉండుడు… గిట్ల ఉండాలి. గిదే మానవత్వం అంటే.

సామాజిక బాధ్యత (Social Responsibility) బ్యాలెన్సింగ్
మన కుటుంబం కూడా సమాజంల ఒక పాత్ర పోషిస్తది కనుక, అక్కడ కూడా చూసుకోని మన వంతు బాధ్యత మనము నిర్వర్తించాలి.
ఉదాహరణకు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చెయ్యాలి., చెట్లు నాటడం.
పరస్పర సహాయం ఇట్ల చెయ్యాలి

“జీవితం అనేది ఒక సైకిల్ లెక్క! రెండు పయ్యాలు సక్కగ తిరగాలంటే సమతుల్యత తప్పనిసరి. అదే సక్కగ కొలుసుకుంట, సక్కగ మెలుగుతే ముందుకు మంచిగ పోతది. అట్ల గాక ఒక పయ్య ఎన్కకు, ఒక పయ్య ముందుకు పోతే కిందపడి బొక్కలు ఇరుగుతయ్.
బుద్ధి అయినా, పైసలైన ఎంత ఉంది అని కాదు, ఎట్ల కొలుస్తున్నం – ఎట్ల మెలుగుతున్నమన్నదే మన జీవితం.

ఉంట మరి పైలెం
ప్రేమతో
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

॥॥ ఇంతేకదా॥॥