రమక్క తో ముచ్చట్లు -24

అందరూ పిండి కొట్టుకుంటుంటే కోతి గుండుకొట్టుకుంటుందంట..!!

అందరికీ శనార్థులు
ఎట్లున్నరు.

అప్పుడే ఎండలు దంచి గొడ్తున్నయి ఆగమాగం అయితుంది పానము. ఈ ఎండలకు పెయి పగిలిపోతుంది. అందరూ పైలముల్ల. జాగ్రత్తగ ఉండుండి. జర సల్లగ అంబలి దాగుడు, కుండల నీళ్లు తాగుడు చేస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇయాల రేపు జనాలు ఎట్లా తయారయిన్రు అంటే ఎండాకాలం అని కూడా ఏమి సల్లగ లోపల కూసోరు. ఏదొక్కటి చేద్దామన్నట్టే ఉన్నరు. ముఖ్యంగ పోరగాల్లను ఊకె ఉంచనే… ఉంచరు. యాడికో కాడికి తోల్తనే ఉంటరు
గింత ఎండల సుత.
మా అపార్ట్మెంట్ల చిన్నచిన్న పొట్టెగాళ్లు మస్తు మంది, సెలవులు.. సెలువులు.. అని దుంకుకుంట ఒక్క రెండొ ద్దులు ఎల్లాడిన్రో లేదో వాళ్ళ నాయినలు అమ్మలు, ఆళ్ళను తీస్కపోయి
డాన్స్లల్ల, సమ్మర్ క్యాంపులల్ల, క్రికెట్ అకాడమీల చేర్పిత్తాన్రు.
ఓలను ఏమంటట్టె లేదు, దునియ గట్లనే ఉంది. ఇంట్ల ఉంటే పానం తింటరు. బేజ ఖరాబ్ చేస్తరు అని అమ్మ నాయినల శిఖాయత్తు!
గిప్పుడు నేనేం ముచ్చట చెప్తున్ననంటే..
మా ఇంటి కాడ ఒకాయన వాళ్ళ బామ్మర్ది కొడుకుకు గిటార్ నేర్పిస్తున్రు అని, ఆల్ల పోరగాన్ని సుత గిటార్ క్లాసుకు తొలిండు. ఆనికి గిటార్ వస్తలేదు. గిటార్గు పట్టుకునుడు సుత వస్తలేదు. అసలు ఆ పిల్లగానికి గిటార్ కొట్టుడు ఇష్టమే లేదు. క్రికెట్ ఆడుకోవాలనిపిచ్చి. వీళ్ళ నాయన నువ్వు నేర్సుకోవాలి అంతే అని అండ్ల జెరపిచ్చిండు. వాని చేతి వేళ్ళన్ని కట్ చేసుకొని అచ్చిండు.
అందరూ అపార్ట్మెంట్ పొద్దుగాల లేవంగనే జిమ్ములకు పోతున్రని ఒకామే జిమ్ముకు పోయి, ఆడ ఏం పట్టుకుందో ఏమో నడుమంతా నొప్పి అని అడ్డం పడ్డది. ఇది ఇట్లుంటే… ఇంకోరకం ఉన్నరు జనాలు. వాళ్ళు ట్రెండు మనుషులు.

ట్రెండు.. ట్రెండు అన్న పదము పిచ్చి లేచినట్టు ఇనవడుతుంది. అది ఏం ట్రెండో ఏం వైరలో..ఒక్కడు ఒకటి జేస్తే ఇంకోడు.. ఇంకోటి జెయ్యాలి.అది సుత కొత్తగ జెయ్యాలి. వాడికన్న ముందు ఉర్కాలె.
ఎవ్వరు ఏమి పనులు చేస్తున్నరో అర్థం అయితలేదు. పొద్దుగాల లేసినప్పటినుంచి నిజంగ కోతుల లెక్కనే తయారయిన్రు జనాలు కొందరు.

“అందరూ పిండి కొట్టుకుంటుంటే, కోతి గుండుకొట్టుకుంటుందంట” గీ సామెత యాది కచ్చింది నాకు ఎందుకంటే.

ఇప్పటి కాలంల ట్రెండ్ అన్న పేరుతోని పిండి గొట్టేటోళ్ల లెక్క తయారయ్యిన్రు, ఎవల్లో ఇన్‌స్టాల రీలు వెడితే సాలిగ,మనం సుత పెట్టాలె. ఒక్క తీరు డాన్సులు, డైలాగ్లు, దేశం మొత్తం ఎందుకు జేస్తున్రో ఏమి పట్టింపులేదు. ఇగ ఈ మందల ఇంక కొందరుంటరు.. నేను ఆళ్ళలెక్క పొను.. నా ఇక్మత్ వేరే… అని జేసే ఏషాలు సూస్తుంటే… నెత్తి ఏడ పెట్టుకోవాల్నో సమజయితలేదు. గిదే గుండు గొట్టిచ్చుకునుడంటే.
ఆత్మహత్యలు చేసుకున్నట్టు వీడియోలు తీసుడు, సంపుతున్నట్టు వీడియోలు తీసుడు, ఇప్పుడు ఏఐ “కృత్రిమ మేధ’ నట దాంతో ఏం చేస్తున్నరో అర్థం అయితలేదు. ఎవడన్నా ఒకటి మంచిది ఉపయోగపడే చేస్తే.. పోనీ.. గా లెక్కన పద్ధతిగ చేస్తారా.. అంటే లేదు. వాళ్ళందరూ ఒక తీర్చేస్తే వీళ్ళు ఇంకో తీరు జేస్తరు, గదే గుండు గొట్టుకుంటరు. చిన్న పిల్లల కాడికెల్లి అందరు సూస్తరు. ఏమన్న రీతి ఉందా జెప్పుండ్రి. పసిపిల్లలకు సుత గవే నేర్పుతున్రు… మస్తు మనాది ఐతుంది సూస్తుంటే.
ఎట్ల తయారైతుందంటే.., ఈ రోజులల్ల ట్రెండ్ అన్నది ఒక మహాచక్రం లెక్క తిరుగుతుంది. ఒకల్లు జుట్టుకు గోధుమ రంగు ఏసుకుంటే.., ఇంకోడు పువ్వులు పెట్టుకుంటుండు, గిట్ల కొత్తగ జేస్తే లైకులు వస్తయంట. సూసెటోళ్లకు కండ్లు తిరిగి వాంతులు వస్తున్నయ్!
ఎవల్లో మైలురాయి మీద ఫోటో తీస్తే, మరొకడు బర్రె మీద పండుకోని పోజిస్తడు! ఏమనాల్నో ఏమో!
ఎంత పనికిమాలిన పని అనిపించినా సరే, అండ్ల మనం సుత ఉండాలె, లేకుంటే అనామకులం అయిపోతమేమో అన్న భయంల జనాలు ఉన్నరు అనిపిస్తున్నది. ఒక మాట ఆంగ్లభాషల ఉంది.
“I believe in being different. I create my own rhythm! డిఫరెంటుగ ఉండుడే నా క్రియేషన్, నా సృజనాత్మకత అని దీని అర్థం! దానిని మంచిది కాదు గిట్ల గుండు కొట్టించుకునే ఎడ్డి పనులకు చేస్తున్నం.
హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అని సుత పెట్టేశిన్రు.
ఒక్కళ్ళు ఒక విచిత్రమైన పని చేస్తే, ఇంకొకలు వేరేతీరు జెయ్యాలి.దాంతోని మంచైతదా? చెడు అయితదా అన్న ఖ్యాల్ ఏం లేదు. కొత్తగ జెయ్యాలి. ట్రెండు అంతే ” ఆ ట్రెండ్ అనేదే పెద్ద గుండు లాగా తయారైంది.
మొత్తం మీద తమ్మి..! చెల్లె..!
మస్తు మారుతుంది దునియా, రోజు రోజుకు. మంచి దిక్కుపోతుందా? చెడు దిక్కు పోతుందా? అని ఎవ్వల్లు చెప్పేటట్టే లేకుండా అయ్యింది ఎవలకు వాళ్ళు, వాళ్ళ బతుకులల్ల పిండి కొడుతున్నమా… గుండు కొట్టుకుంటున్నమా… అన్నది చూసుకోవాలి! ఏదైనా అవసరమే మనకు అందరితో పాటు ‘నలుగుట్ల నారాయణ’ అంటరు. అంటే అందరితోని కలిసే.. నడుద్దాం, కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఏం చేస్తే మంచిగ ఉంటదని ఎవ్వలకు వాల్లు మాత్రం సొంచాయించాలే! గిదే నేను మీకు చెప్పాలనుకున్నది.
ఉంట మల్ల పైలం

ప్రేమతో
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మా పల్లె

ముఖాముఖీ