రెండో పెళ్ళి

కథ

గత కొన్ని రోజులుగా మాలతి మనసు మనసులో లేదు. అందుకు బలమైన కారణం లేకపోలేదు. తన ఆలోచనంతా ఒక్కగానొక్క కూతురు దీపిక గురించే! దీపిక వయసు పద్దెనిమిది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఎందుకో దీపిక ఈమధ్య అదోలా మూడీగా ఉంటోంది. మునుపటి చురుకు, చలాకీతనం ఆమెలో లోపించాయి. ఎప్పుడూ ఏదో పరధ్యానంగా ఉండడం చదువుకునే సమయంలో , ఉన్నట్టుండి పక్క మీద వాలిపోయి సెల్లో గంటల తరబడి లోగొంతుతో మాట్లాడడం ఎక్కువ అయింది. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా తన అలంకరణ పట్ల, అందం పట్ల ఎక్కువ శ్రధ్ద చూపడం, కాలేజీ నుంచి లేటుగా రావడం, అదేమని అడిగితే ఏక్స్ట్రా క్లాసులు అని చెప్పడం చూస్తుంటే తల్లి మాలతికి ఏదో అనుమానం…మరెన్నో శంకలు ఆమె మస్తిష్కాన్ని తొలిచేస్తున్నాయి….కొంపదీసి దీపిక ప్రేమలో పడలేదు కదా! దీపికకి యుక్త వయసు వచ్చే వరకూ మాలతి కూడా ఓ ఉద్యోగస్తురాలే. కానీ కూతురి శ్రేయస్సు దృష్ట్యా తాను ఉద్యోగం మానేసింది. ఇంటి పట్టున ఉంటూ కూతురికి కావలసినవి చేసి పెట్తూ ఆమెను ఓ కంట కనిపెడుతూ కాలం వెళ్ళదీస్తోంది. అందులో భాగంగానే తాను కూతురులో జరుగుతున్న ఈ మార్పుని కని పెట్టగలిగింది. ఇంకా మాలతి ఆలోచనలు ఈ విధంగా సాగాయి. దీపిక ప్రేమలో పడ్డా ఆశ్చర్యం లేదు.ఆ వయస్సు అటువంటిది మరి. ఆ వయస్సు ఆడపిల్లలు, మగపిల్లలు పరస్పరాకర్షణకు గురి కావడం సహజం. కానీ తల్లిదండ్రులుగా వారిని ఆ మత్తులోంచి తట్టి లేపి, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత తమదే! అందుకే భర్తతో కూడా ఈ విషయం చర్చించి ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందని మాలతి ఆలోచించింది.
**
అనుకున్నట్లుగానే ఆ రోజు రాత్రి భోజనాల తర్వాత బెడ్రూంలోకి వచ్చింది మాలతి. ఏదో పుస్తకం చదువుతున్న భర్త శేఖర్ పక్కన వచ్చి కూర్చుంది. “ఇంకా నిద్ర పట్టడం లేదా?” అన్నది తాను చెప్పబోయే దానికి ఉపోద్ఘాతంగా..! “లేదు, ఎందుకు?” అనడిగాడు.
“ ఏమండీ నేను ఈ మధ్య మన దీపిక అదోలా ఉండడం గమనిస్తున్నాను. దాని వైఖరి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండీ..! ఎందుకంటే ఆ లక్షణాలన్నీ ప్రేమలో పడ్డ వాళ్ళకే ఉంటాయి. ఈ విషయంలో మీ అభిప్రాయం కూడా కనుక్కుని ప్రొసీడ్ అవుదామని అనుకుంటున్నాను. అది విన్న శేఖర్ “ అయితే నీవనుకుంటున్న విషయం నిజమవునో కాదో తెలుసుకోవాలి అంటే అందుకు తగిన ఆధారాలు మనం సేకరించాలి. దీపిక ఇంట్లో లేని సమయంలో దాని గదిలో దాని వస్తువులు, పుస్తకాలు చెక్ చేయి. అలా ఎందుకంటున్నానంటే సాధారణంగా ప్రేమలో పడ్డ వాళ్ళ దగ్గర, ఒకరికొకరు రాసుకున్న ఉత్తరాలు కానీ, ఫోటోలు కానీ బయట పడతాయి. ఆ ఆధారాలను బట్టి మనం మనమ్మాయిని కదిలించొచ్చు. ప్రేమించడం తప్పని నేను అనను. కానీ తాత్కాలిక ఆకర్షణనే ప్రేమనుకుంటే మాత్రం ప్రమాదం….! అందుకే అది తేల్చుకోవడం ముఖ్యం. తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా..!” అన్నాడు. “ నేనూ అదే అనుకుంటున్నానండీ! అయితే రేపే మొదలు పెట్తాను నా ఇన్వెస్టిగేషన్…!” అని నవ్వి నిద్ర కుపక్రమించింది మాలతి.
***
మర్నాడు దీపిక కాలేజీకి వెళ్ళిపోయాక , మాలతి కూతురు గదిలోకి అడుగు పెట్టింది. నేరుగా ఆమె పుస్తకాలున్న కబోర్డ్ దగ్గరకు వెళ్ళి అందులోంచి ఒక్కొక్క పుస్తకం తీసి పేజీలు తిప్పి చూసింది. అలా కొన్ని పుస్తకాలు చూసాక కెమిస్ట్రీ బుక్ లోంచి ఒక ఫోటో జారి పడింది. అది అందమైన ఓ యువకుడి ఫోటో. ఆ ఫోటో వెనుక ప్రియమైన దీపికకు ప్రేమతో ‘ శరత్ ‘ అని రాసి ఉంది.
ఇంతలో ఏదో స్ఫురించినట్లు, మాలతి దీపిక బట్టల కబోర్డ్ కూడ తెరిచి బట్టలన్నిటినీ ఒక్కొక్కటీ తీసి చూసింది. వాటి అడుగున కొన్ని లెటర్స్ కనిపించాయి. వాటిని తీసి ఒక్కొక్కటీ చదివింది.ఒక లెటర్లో ‘ నా హృదయంలో నిదురించే చెలీ ‘ అన్న ఆరాధన లోని పూర్తి పాట ముత్యాల్లాంటి అక్షరాల్లో రాసి ఉంది. క్రింద ప్రేమతో నీ శరత్ అని రాసి ఉంది. మిగతా లెటర్స్ లో కూడా దీపిక అందాన్ని పొగుడుతూ ఆమె అందం తనని పిచ్చెక్కిస్తోందనీ, నిన్ను పొందే భాగ్యం నేకెప్పుడోనన్న అభ్యర్థన ఇలాగే ఏవేవో స్వీట్ నథింగ్స్ ఉన్న ప్రేమలేఖలవి. వాటిని జాగ్రత్తగా దీపిక దాచి పెట్టుకుందంటే ఆమె అతని ఆకర్షణలో పూర్తిగా పడిపోయిందని తెలుస్తోంది.
ఇంతలో డోర్ బెల్ వినపడడంతో గబగబా కూతురి కబోర్డ్ మూసేసి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఎవరో కాదు తన ప్రాణ స్నేహితురాలు సుజాత….ఆమెని చూడగానే మాలతి ప్రాణ లేచి వచ్చినట్లయింది. “ రావే రా భలే టైమ్కి వచ్చావు.” అంటూ లోపలికి ఆహ్వానించింది. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. మాటల సందర్భంలో మాలతి దీపిక విషయం తెచ్చింది. దీపిక ఈ మధ్య కాలంలో అదోరకంగా ఉండడం తనూ తన భర్త ఆ విషయమై ఏమాలోచించిందీ టూకీగా చెప్పింది. అది విన్న సుజాత “ ఒసేవ్ దీపిక గురించి ఓ విషయం చెప్తాను నువ్వు ఏమనుకోనంటే..” అన్నది. అందుకు మాలతి, “ అదేంటే అలా అంటావు….ఇన్ని రోజుల మన స్నేహంలో నీకామాత్రం స్వాతంత్ర్యం ఉంది…చెప్పు ఏమిటి విషయం?” అంది.
“ఏం లేదే ఈ మధ్య నేను మన దీపిక ఎవరో యువకుడితో బైక్ మీద వెళ్ళడం రెండు మూడు సార్లు చూశానే…అతనెవరో క్లాస్మేట్ తనని ఎక్కడో డ్రాప్ చేస్తున్నాడేమోలే అనకుని నేనంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇతను అతనేనేమోననిపిస్తోందే! “ అన్నది. అది విన్న మాలతి ఒక్క నిమిషం ఉండవే నీకో ఫొటో చూపిస్తాను అంటూ పరుగున వెళ్లి దీపిక గదిలోంచి శరత్ ఫొటో తీసుకొచ్చి సుజాతకి చూపించి “ ఇతనేనా సరిగా చూసి చెప్పవే “ అంది. శరత్ ఫొటో చూసి సుజాత “ అవునే ఇతనే “ అన్నది నిఠారుగా కూర్చుంటూ.
అప్పుడన్నది మాలతి “ మరిప్పుడేం చేయమంటావే మమ్మల్ని? ఒక్కొగానొక్క కూతురని అల్లారు ముద్దుగా పెంచుకున్నామే..మేము దానికిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు ఇప్పటివరకూ, తల్లి తండ్రులంటే భయం భక్తీ కల పిల్లే! కానీ ఇప్పుడు తొందరపడి ఏ నిర్ణయం తీసుకుంటుందో న్ని భయంగా ఉందే…. పోనీ దీపికని అడిగేయమంటావా ఆ అబ్బాయి ఎవరని….? “
“ ఈ విషయంలో తొందరపడడం అంత మంచిది కాదే! ముందు ఆ అబ్బాయి ఎవరూ, ఏం చేస్తూంటాడు వగైరా ఇన్ఫర్మేషన్ సేకరించండి, ఆ తరువాత అడగవచ్చు “ అని సలహా ఇచ్చింది సుజాత.
**
ఆ రోజు రాత్రి భర్తతో తాను దీపిక గదిలో చూసినవీ, సుజాత చెప్పిన విషయాలనూ చర్చించింది మాలతి.ఆ శరత్ గురించిన వివరాలు సేకరిస్తానని మాలతికి చెప్పాడు శేఖర్.
***
వారం రోజుల తర్వాత ఓ రోజు దీపిక కాలేజి నుండి ఆలస్యంగా వచ్చింది. ఇంటికి రాగానే ఫ్రెషప్ అయ్యి తన గదిలోకి వెళ్తున్న కూతురిని పిలిచాడు శేఖర్. “ఏంటి నాన్నా! “ అంటూ తండ్రి గదిలోకి వచ్చింది దీపిక. తన వెంటే మాలతి కూడా వచ్చింది.
దీపికను తన పక్కన కూర్చోబెట్టుకుని ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా, “ ఎవరమ్మా ఆ శరత్? “ అని అడిగాడు కూతురి కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఒక్క సారిగా ఉలిక్కిపడింది దీపిక. తండ్రి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కళ్ళు దించుకుని మౌనంగా ఉండిపోయింది.
“ చెప్పమ్మా మేము నీ శ్రేయోభిలాషులమన్న నమ్మకం నీకుంది కదా, మరి నీ జీవితం చక్కదిద్దవలసిన బాధ్యత మాకుందని కూడా ఒప్పుకుంటావు కదూ..! అవునన్నట్లు తలాడించింది దీపిక. “ మరయితే ఏ విషయమూ మా దగ్గర దాచకుండా అన్నీ చెప్పమ్మా “ అన్నాడు అనునయంగా.
ఆయన మా కెమిస్ట్రీ లెక్చరర్ నాన్నా…ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను “ అంది తండ్రి వంక సూటిగా చూడలేక కళ్ళు దించుకునే!
సరే ప్రేమించడం నేరం కాదు…కానీ ఈ రోజుల్లో టీనేజర్స్ వయస్సు వల్ల కలిగే పరస్పర ఆకర్షణనే ప్రేమనుకుంటారు. అటువంటి ప్రేమ ఎక్కువ కాలం నిలవదురా…! ఓసారి శారీరకంగా కలిసాక ఆ ప్రేమ మత్తు దానంతటదే దిగిపోతుంది. అందువల్ల నష్టపోయేది ఆడపిల్లవు నువ్వే కానీ పురుషుడికి అందువల్ల వీశమెత్తుకూడ నష్టం ఉండదు. అందుకే ఆడపిల్లను కన్న తల్లి తండ్రులు తమ కూతుళ్ళను అన్ని కట్టుదిట్టాలతో పెంచేవారు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు పెద్దవాళ్ళ మాటలను లెక్క చేయడం లేదు. స్వేచ్ఛ పేరుతో విశృంఖలంగా ప్రవర్తించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నీవు కూడా ఆ మార్గంలో నడిచి నిండు నూరేళ్ళజీవితాన్ని నాశనం చేసుకోకూడదనే మా తాపత్రయం అంతా!” అన్నది ఈ సారి మాలతి.
“ అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారన్న విషయం నీకు తెలుసా? “ బాంబులంటి మరో ప్రశ్న సంధించాడు ఈ సారి శేఖర్ అతి నింపాదిగా! మరోసారి ఉలిక్కిపడింది దీపిక.
“ ఆ సంగతి నీకెలా తెలుసు?” అన్నది తడబడుతూ. “ నాకెలా తెలిసిందో తరువాత చెప్తాగానీ నువ్వీ ప్రశ్నకు జవాబు చెప్పు ముందు. పెళ్ళై ఇద్దరు పిల్లలున్నతన్ని ప్రేమించి నువ్వు ఏం సాధించదలుచుకున్నావ్?” సూటిగా అడిగాడు శేఖర్. ఆ ప్రశ్నకు మౌనమే సమాధానమయింది. “ పోనీ అతన్ని ప్రేమించినందువల్ల నీకు ఫ్యూచర్ లేదన్న విషయమయినా ఒప్పుకుంటావా?”
“ నేను అంతదూరం ఆలోచించలేదు నాన్నా! శరత్ గారు పాఠం చెప్పే తీరు, హుందాగా ప్రవర్తించే ఆయన స్వభావం అన్నిటికీ మించి ఆయన నన్ను ఓ ప్రత్యేక దృష్టితో చూడటం ఇవన్నీ కలిపి నాకు ఆయనంటే ఇష్టం పెంచుకునేలా చేసాయి. అదే ప్రేమనుకుంటున్నాను.” అంది నిబ్బరంగా.
“ అదేనమ్మా మీ ఆడపిల్లల బలహీనత.ఈ బలహీనతనే అనాదిగా మగవాడు ఎక్స్ప్లాయిట్ చేస్తూ వస్తున్నాడు. నువ్వీమధ్య ఇంటికి అప్పుడప్పుడు లేట్గా వస్తున్నావని అమ్మ చెప్పింది. బహుశా మీరిద్దరూ కలిసి ఏ పార్కకో లేక ఏ రెస్టారెంట్కో వెళ్తూండవచ్చు. ఇలా కొంత కాలం సాగాక అతను అడగకూడనిది నిన్నడగవచ్చు. నువ్వు కాదనలేని పరిస్థితికి వచ్చేస్తావు అప్పటికి. దాంతరువాత ఏం జరుగుతుందో సైన్స్ స్టూడెంట్ వయిన నీకు నేను చెప్పక్కర్లేదు. దీన్నేనమ్మా సిడక్షన్ అంటారు. అతను నిన్ను మెల్లిగా సిడ్యూస్ చేసి ఆ తరువాత అతనికి కావలసినది లభ్యం అయినాక నిన్ను ఓ హాట్ పటేటోలాగా డ్రాప్ చేయడమే అతని ఉద్దేశ్యం.”
“ కాదు నాన్నా ఆయన అలాంటి వారు కాదు…!” అన్నది ఎంతో నమ్మకంగా.
“ అదే…అదే అనాదిగా మగవాడు చేస్తున్నది…ఆడ పిల్లని నమ్మించి మోసం చేయడమేనమ్మా…! సరే అంతెందుకు నువ్వు అతన్ని పూర్తిగా నమ్ముతున్నావు కదూ…అతను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నట్లైతే వాళ్ళావిడకు విడాకులిచ్చి నిన్ను పెళ్ళి చేసుకుంటాడేమో అడుగు. నీకే తెలుస్తుంది అతనెలాంటివాడో…!” అన్నాడు శేఖర్ కొంచెం ఆవేశంగా!
తండ్రి మాటలకు దీపిక మొహం ఎర్రబడింది. “ సరే నాన్నా అలాగే ఆయన్ని అడుగుతాను రేపే!”
***
రెండో పెళ్లి part 2

ఆ రోజు సాయంత్రం శరత్ని కలిసింది దీపిక. “ఏమిటి ఇంతర్జంటుగా కలవాలన్నావు ఏంటి సంగతి?” అడిగాడు శరత్. మన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది శరత్ గారూ! మీకు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఒక పెళ్ళైన వ్యక్తిని ఎలా ప్రేమిస్తున్నావు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా అని నన్ను నిలదీసారు. నిజం చెప్పాలంటే నేను అంత దూరం ఆలోచించలేదు కానీ ఇప్పుడు మా అమ్మా నాన్నా చెప్పాక నేను కూడా ఆలోచించాను. అవును మిమ్మల్ని ప్రేమించినందువల్ల నా భవిష్యత్తు ఏమిటి? ఈ సమాజంలో ఓ అమ్మాయి పెళ్లి కాకుండా ఓ మగాడి తో సంబంధం పెట్టుకుని గెటాన్ కావడం సాధ్యమా…! మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లైతే నాకోసం ఏమైనా చేయగలరా?” ప్రశ్నించింది.
అందుకతను “ నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను దీపికా నీకా సంశయం వద్దు. నీకోసం నేను ఏమైనా చేయడానికి, ఆఖరికి నా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నాకు కావాలి….నిన్ను పోగొట్టుకుని బ్రతకలేను దీపికా నన్ను నమ్ము” అన్నాడు.
“ మరయితే చెప్పండి నా కోసం మీ భార్యకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా…?”
అందుకతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఓ క్షణం నోటమాట రానివాడిలా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకుని తనే ఇలా అన్నాడు.
“ దీపికా నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నా భార్య కూడా నన్ను అంతగానే ప్రేమిస్తోంది. నేను కనుక విడాకులు ఇస్తే ఆమె ఆ షాక్ కి తట్టుకోలేదు. చూస్తూ చూస్తూ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోలేను. కానీ ఓ పని చేయవచ్చు.” అన్నాడు. అదేంటన్నట్లు చూసింది దీపిక.
“ నీకు కావాల్సింది నేను నిన్ను పెళ్ళి చేసుకోవడమే కదా! అలాగే గుళ్ళో మీ అమ్మా నాన్నల సమక్షంలో నీ మెళ్ళో తాళి కట్తాను. నీవు నా రెండవ భార్యగా ఉండవచ్చు.. నీకు ఏ లోటు రానివ్వను ఏమంటావు? “
“ అదెలా సాధ్యం శరత్ గారూ..రెండో పెళ్ళి చట్టవిరుద్ధం కదా?”
“ ఆఁ ఈ రోజుల్లో ఇలా రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరినీ ఈ చట్టం ఏం చేయగలిగింది? అలా అనుకుంటే కట్నం తీసుకోవడం ఇవ్వడం ఈ రెండూ కూడా నేరమే, కానీ ఎవరైనా తీసుకోవడం ఇవ్వడం మానారా? ఇదీ అంతే!” అన్నాడు శరత్.
“ సరే అయితే మీరు చెప్పినదాన్ని మా పేరెంట్స్కి చెప్తాను. వారు కనుక ఈ ప్రపోజల్ కి ఒప్పుకుంటే మీరు చెప్పినట్లే చేద్దాము “ అని చెప్పి ఇంటికి వచ్చేసింది దీపిక.
**
ఆ రోజు రాత్రి తల్లితండ్రుల గదిలోకి వచ్చింది దీపిక. ఆమెను చూడగానే రామ్మా రా అన్నారు. దీపిక వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ చెప్పింది, “అమ్మా నాన్నా మీరు చెప్పినట్లుగానే నేను ఈ రోజు శరత్ గారితో మాట్లాడాను. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. కానీ నన్ను మాత్రం గుళ్ళో రెండో పెళ్లి చేసుకుంటారుట. నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటారుట. దీనికి మీరేమంటారు?” అన్నది దీపిక.
“ అమ్మా నేనొకటి చెప్తాను శ్రధ్ధగా విను. చూస్తుంటే శరత్ అధికస్య అధికం ఫలం అనుకుంటున్నట్లున్నాడు. కానీ అతను గనుక నిన్ను రెండో పెళ్ళి చేసుకుంటే చట్టమే కాదు ఈ సమాజం కూడా హర్షించదు. నీకు పుట్టే పిల్లల్ని కూడా సంఘం స్వీకరించదు. అసలు నువ్వు చేసుకున్న పెళ్లే చెల్లదు. ఇక పుట్టిన పిల్లలకి ఏం భవిష్యత్తు ఉంటుందమ్మా? ఆలోచించు! జీవితాంతం సమాజం వారిని చిన్న చూపే చూస్తుంది. వాళ్లకు అడుగడుగునా ఎదురయ్యేవి హేళనలూ, నిరాదరణేనమ్మా….! అసలు అటువంటి జీవితాన్ని కోరి ఆహ్వానించవలసిన ఖర్మ నీకేమిటమ్మా….! నీకేం తక్కువని ఓ పెళ్ళై పిల్లలున్న మగవాడిని చట్టవిరుద్ధంగా పెళ్ళాడి జీవితాంతం సవతిపోరు ఓ పక్క, సమాజం నిరాదరణ మరో పక్క అనుభవించాలి? నీకింకా ఎంతో బంగారు భవిష్యత్తు ఉందమ్మా. ఇప్పుడింకా నువ్వు చిన్నదానివి. మంచి చెడుల గురించి విచక్షణ చేయగల వయస్సు లేదు. అర్థం పర్థం లేని ఈ క్షణికమైన ఆకర్షణ లో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా!” అన్నాడు ఎంతో లాలనగా.
“ మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ నేను శరత్ గారు లేని జీవితం ఊహించలేకుండా ఉన్నాను నాన్నా! “
“ పోనీ ఓ పని చేద్దాం. ఈ విషయంపై శరత్ భార్య అభిప్రాయం ఏంటో కనుక్కుందాం. ఆమె దీనికి అంగీకరిస్తే అలాగే శరత్ని పెళ్లి చేసుకో! అప్పుడు సమాజం నుంచి ఆదరణ దొరకకపోయినా అతని భార్య నుంచైనా నీకు నిరాదరణ తప్పుతుంది. కనీసం సవతి పోరు ఉండదు. అందుకని నువ్వతనికి చెప్పు, ఇలా నీ భార్య కనుక ఈ రెండో పెళ్లికి ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదని, ఏమంటావు?” అన్నాడు శేఖర్.
“ సరే నాన్నా అలాగే చేస్తాను “అని తల్లితండ్రులకు గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది దీపిక.
దీపిక అటు వెళ్లగానే మాలతి భర్తతో “ అదేంటండీ అలా అనేసారు, కొంపదీసి మనమ్మాయిని అతను రెండో పెళ్ళి చేసుకోవడం మీకు కూడా ఇష్టమేనా ఏంటి? “ అన్నది కలవరపడుతూ.
“ తగ్గు తగ్గు అంత అప్సెట్ కాకు…! ఎంత శరత్ అధికస్య అధికం ఫలం అనుకుంటున్నా భర్త రెండో పెళ్లి చేసుకుంటానంటే పిల్లలున్న ఏ భార్య ఒప్పుకుంటుంది మాలతీ ? అదెలాగో జరగదన్న ధైర్యంతోనే నేను ఆ సలహా ఇచ్చాను. మనమ్మాయి ఆ విషయం తనంతట తానే తెలుసుకుంటే మంచిదన్నదే నా ఉద్దేశ్యం. ప్రపంచమేంటో తనకుకూడ తెలిసి రానీ! “ అన్నాడు శేఖర్ కూల్గా!”
***
ఆ మర్నాడు దీపిక శరత్ ని కలిసి తండ్రి చెప్పిన ప్రపోజల్ అతని ముందుంచింది. అతను కూడా ఏ మాత్రం తొణక్కుండా తన భార్యని ఒప్పిస్తానని భరోసా ఇచ్చాడు.
***
ఆ మర్నాడు శరత్ మొబైల్కి కాల్ చేసింది దీపిక. ఎంత సేపటికీ శరత్ దగ్గరనుండి రెస్పాన్స్ లేదు. సామాన్యంగా ఒకటి రెండు రింగులకే ఫోన్ ఎత్తే శరత్ ఈ రోజు ఫోనెందుకు ఎత్తడంలేదని ఆశ్చర్యపోయింది. అంతలోనే ఏదో బిజీగా ఉన్నాడేమోనని సరిపెట్టుకుంది. అలాగే అన్యమనస్కంగానే కాలేజీకి వెళ్ళింది.కాలేజీలో క్లాసులన్నీ అయిపోయాక ఇక ఉండబట్టలేక శరత్ని కలుద్దామని వెళ్ళిన దీపికకి శరత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. ఆ వార్త విన్న దీపిక నిర్ఘాంతపోయి అలాగే స్థాణువులా నిలుచుండిపోయింది.

సమాప్తం

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అయితే మీరే.. (భుజాలు తడుముకుంటున్నారుగా!) -7వ భాగం

ఓ ప్రేమ కథ- 3వ భాగం