లోకాభిరామాయణం 4

స్నేహం

ఈనాటి లోకాభిరామాయణంలో చాలా మంది తరతరాలుగా చెప్పుకునే ఒక గంభీరమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. అదే స్నేహం, స్నేహబంధం.
పాత అంశం ముచ్చటించేది ఏముందీ అంటారా, మన లోకాభిరామాయణం లో పాత,కొత్త అన్నీ ఉంటాయి.
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం, నీవుంటే వేరే కనులెందుకూ అంటూ స్నేహాం యొక్క గొప్పతనాన్ని చాటుతూ చాలా పాటలూ,కవితలూ, కథలూ, సినిమాలూ వ్యాసాలు వచ్చాయి.
బాపూ,రమణల స్నేహం గురించి చాలా మందికి సుపరిచితమే. మంచి స్నేహానికి మారు పేరు అని చెప్పుకుంటాం.
మంచి స్నేహంలో అపార్ధాలకి, అసూయలకి తావు ఉండదు. ‘మడిసన్న తర్వాత కూసింత కళాపోషణ ఉండాల’ అని ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్లు, మనిషన్న తర్వాత కోపతాపాలు సహజంగానే ఉంటాయి. కోపతాపాలు వచ్చినా, స్నేహంలో అసూయ ఉండకూడదు.

ఇదంతా అందరికీ తెలిసిన సంగతే కదా, ఎందుకు సుత్తి వేస్తున్నారు అనుకుంటున్నారు కదూ!
కాలానుగుణంగా మనషుల మనస్తత్వాల్లో, పరిస్థితుల్లో మార్పుల వల్ల నిజమైన స్నేహితులని వేళ్ళ మీద లెక్కించవచ్చు.
స్నేహితులు అనేమాట పరిచయస్థులకి పర్యాయపదంగా వాడుతున్న సందర్భాలు సాధారణం అయిపోయింది.
ఆ మథ్య మా బంధువుల ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ వచ్చింది. రిటర్న్ గిఫ్ట్స్ కొనాలి దగ్గర దగ్గరగా వంద మంది ఉన్నారు ‘ఫ్రెండ్స్’ ఉన్నారు అంది.
“అంతమంది స్నేహితులు ఉన్నారా నీకు. ఎప్పుడూ చూడలేదే'” అన్నాను.
‌‌. తను చెప్పిన దాన్ని బట్టి కొంతమంది ఫేస్ బుక్ ఫ్రెండ్స్, కొంతమంది గుళ్ళో కలిసే వాళ్ళు, కొంతమంది లలితా, విష్ణు పారాయణ లో కలిసే వాళ్ళు ఇలా ఉన్నారు. వీళ్ళందరినీ పిలవటం తప్పు కాదు, కానీ వీళ్ళందరి గురించి వెనుక ఏదోఒక నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. తిడుతూనే‌ ఉంటుంది. తీరా వాళ్ళు ఎదురు పడినప్పుడు , నీ తర్వాతే నాకు ఎవరైనా అంటూ ఎక్కడలేని ప్రేమతో మాట్లాడుతుంది.
ఇలాంటి బంధాలు స్నేహం అనిపించుకోవు. నిజమైన స్నేహితులు రోజూ పనులన్నీ మానుకుని గంటలగంటలు మాట్లాడుకోవలసిన అవసరం లేదు. అవసరంలో సహాయపడి, ఆపదలో నీకు నేను ఉన్నాను అనేవాళ్ళే నిజమైన స్నేహితులు.
దాదాపు పాతిక సంవత్సరాల క్రితం మాట. మావారి ఫ్రెండ్ కి స్నేహితుడి అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వచ్చారు. అప్పటికి జస్ట్ పరిచయం అంతే మధ్యలో ఉన్న వ్యక్తి వల్ల మాకు పరిచయం పెరిగింది.
శుభలేఖ ఇచ్చాక పెళ్ళి పనులు ఎంతవరకూ వచ్చాయి అని అడిగారు మావారు. ఆయన అన్ని చెపుతూ,
“సమయానికి రావాల్సిన డబ్బు రాలేదండీ. కాస్త టెన్షన్ గా ఉంది” అన్నాడు వెంటనే మావారు
” మీరు మొహమాట పడకండి. ఏదైనా కావాలంటే నేను సర్దుతాను” అన్నారు.
ఆయన మొహమాట పడుతూనే “ఒక ఇరవైవేలు ఉంటే సర్దగలరా” అని అడిగాడు.
వెంటనే మావారు చెక్ రాసి ఇచ్చారు. సరిగ్గా రెండు నెలల తర్వాత వడ్డీ కలిపి పదివేలు ఇవ్వబోతే, మావారు వడ్డీ వద్దంటే వద్దు అని పదివేలు తీసుకున్నారు. ఆ రోజు ఆయన ఒక విషయం చెప్పారు.
” నేను నా ప్రాణ స్నేహితుడు అనుకున్న అతనిని డబ్బులు అడిగితే, నీవు నీకు తెలిసిన వాళ్ళందరినీ అడుగు, అన్ని ప్రయత్నాలు చేయి. ఏవీ ఫలించక పోతే అప్పుడు నా దగ్గరకు రా అన్నాడు. కానీ కేవలం ఒక సంవత్సరం పరిచయం తోనే మీరు అడిగి మరీ సహాయం చేసారు” అన్నాడు ఉద్వేగంతో.
ఆ తర్వాత నుంచి క్రమంగా ఆయనతో మా ‌స్నేహం బలపడి ఫ్యామిలీ ఫ్రెండ్ అనే స్టేజ్ కి వచ్చాం. మా ప్రతి క‌ష్టంలో, సుఖంలో ఆయన పాలుపంచుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత మా పాప పెళ్ళికి మాకు ఇంచుమించుగా అదే పరిస్థితి ఏర్పడితే రెండో కంటికి తెలియకుండా అక్షరాలా రెండు లక్షల రూపాయలు మావారు, నేను ఉన్నప్పుడు తెచ్చి ఇచ్థారు. ఈ రెండు సంఘటనలు మా ఇద్దరికీ తప్ప మరొకరికి తెలియదు, ఈ రోజు నేను చెపటం తప్పితే. నిజమైన స్నేహం అంటే ఇది.
స్నేహం అనేది ఇరువైపులా ఉండాలి. కానీ ఒకొక్క సారి ఒకవైపే సాగుతుంది. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుని సహాయసహకారాలు అందించుకుంటూ ఉంటున్నారు. అయితే ఇందులో ఒకామె ఒక సందర్భంలో వేరే ఎవరి దగ్గరో తన స్నేహితురాలి లోని లోపాలు గురించి ఆమె పరోక్షంలో చెప్పింది. ఈ సంగతి ఆ స్నేహితురాలికి చేరవేసారు. ఆమె నమ్మలేదు. తను అలాంటిది కాదు అనే నమ్మకంతోనే ఉంది.
ఈమె ప్రవర్తన అంతటితో ఆగిపోలేదు. చాలా మంది దగ్గర చెపటం మొదలు పెట్టింది. చివరికి ఆ స్నేహితురాలికి ఈ సంగతి తెలిసింది.
“నాలోని లోపాల్ని నాతో డైరెక్ట్ గా చెపితే నేను ఏమన్నా అనుకుంటానీ, ఇనన్నీ నా దృష్టికి తేవాలనే ఉద్దేశ్యంతో పరోక్షంగా చెపుతున్నావు అని అర్ధమైంది. నిజమైన స్నేహం నీది” అని సున్నితంగా చెప్పింది.
నాకు తెలిసి ఆమె సిగ్గుతో తలవంచుకుని ఉండాలి. ఆ తర్వాత ఆమె మరేనాడు తన స్నేహితురాలి గురించి ఎవరి దగ్గరా చెడుగా మాట్లాడింది లేదు. ఆ రకంగా ఆమె తన స్నేహాన్ని నిలుపుకుంది.
ఇలాంటి వారు ఉంటారా అని ఆశ్చర్యపోకండి. ఉంటారు. కాబట్టే స్నేహం అనే మాట తరతరాలుగా వినపడుతున్నది. కానీ ఈ స్వార్ధపూరిత ప్రపంచంలో వారి సంఖ్య తగ్గిపోయినా, వేయిమందిలో ఒకరయినా ఇలాంటి వారు తగులుతారు.
స్నేహం లో కృతజ్ఞత ఉంటుందే గానీ, కృతఘ్నత ఉండదు. ఇవ్వటం ఉంటుంది కానీ ఆశించటం ఉండదు. వంద మంది పరిచయస్తుల్లో నలుగురు మాత్రమే స్నేహితులు. వారిలో కూడా ఒకరే ప్రాణ స్నేహితుడు.
స్నేహం అనేది మధ్యాహ్నం నీడలాంటిది. పొద్దు వాలుతున్న కొద్ది పెరుగుతూ వచ్చి, అస్తమయం దాకా వెన్నంటే ఉంటుంది. జీవితంలో నలభై వసంతాలు దాటాక పరిపక్వత తో కూడిన స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం మన జీవిత చరమాంకం దాకా నిలిచి ఉంటుంది.
బంధుత్వాలు బలహీనపడుతున్నాయి. ఆస్తిపాస్తుల కోసం కొట్లాటలు, అనవసరమైన ఇగోలు రక్తసంబంధీకులని, తోబుట్టువులని కూడా దూరం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనసులోని మాట చెప్పుకోవటానికి కనీసం ఒక నేస్తంకావాలి.
అలాంటి నేస్తం కావాలి అంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. అలా లేని పక్షంలో నిజమైన స్నేహాలు కనుమరుగవుతాయి.
ఇదండీ ఈ నాటి లోకాభిరామాయణం . వచ్చే నెల సరి కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
అన్నట్లు నేను ఇప్పుడు ఒక ఫ్రెండ్ తో మాట్లాడాలి. మొన్న రైల్లో వెళుతుంటే పరిచయం అయింది. ఒక నాలుగు గంటల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ మి అయినాం. మరి ఉండనా!

Written by PVS Krishnakumari

పేరు. : పీ. ( వల్లూరు) వి. యస్. కృష్ణ కుమారి
భర్త : పోతరాజు వేణుగోపాల కృష్ణ మూర్తి ( రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ హై కోర్టు)
పుట్టిన తేది. ఆగష్టు, 14
తండ్రి. : వల్లూరు కోటేశ్వరరావు
తల్లి : వల్లూరు రాజ్యలక్ష్మి
పిల్లలు : నీలా సుందరి ( కూతురు )
రవిశంకర్ ( అల్లుడు)
శ్రీవాత్సవ ( కుమారుడు)
‌. మృణాళిని ( కోడలు)

జన్మస్థలం : వల్లూరు , గుంటూరు జిల్లా
విద్యాభ్యాసం. : పొన్నూరు, విజయవాడ ,
క్వాలిఫికేషన్ : బి.ఏ. బీఈడీ
వృత్తి. : ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ స్కూల్ ( సొంత స్కూల్)
ప్రవృత్తులు. : సంగీతం, సాహిత్యం
సాహితీ ప్రయాణం. : 2010 లో మొదటిసారిగా కవితలతో మొదలైంది. వార్త, మన తెలంగాణా, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్ లలో వందకి పైగా కవితలు
2015 లో మొదటి కథ ' ఓ సీత కథ' నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణా, జాగృతి, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధం, ఉషా మ్యాగజైన్ లలొ దాదాపు ఇరవై ఐదు కథలు, బహుమతులు , సాధారణ ప్రచురణకు ప్రచురితమైనాయి.
కథా మంజరి, కథా వేదిక, తరుణి ఇంకా అనేక ఫేస్ బుక్ గ్రూప్ లలో యాభైకి పైగా కథలు రాగా, ఇరవై కథలకి బహుమతులు వచ్చాయి.
నవలలు : జీవన విపంచి
వేద సుధామయం.
నేల నుండి నింగికి ( అముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్క తో ముచ్చట్లు-31

దేవుడు నవ్వాడు