“విద్యను ఒసగుమా ఒజ్జ గణపతీ!

వినాయక చవితి సందర్భంగా

“విద్యను ఒసగుమా ఒజ్జ గణపతీ!
జయమునీయుమా విజయ గణపతీ!
సద్బుద్ధి నిచ్చి సర్వవేళలా
మమ్ము బ్రోవుమయ్యా మహా గణపతీ!”

వినాయకచవితి! యావత్ ప్రజలూ భక్తితో జరుపుకునే వినాయకుడి పండుగ. మన తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి.
వినాయకచవితి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
వినాయకోత్పత్త:- గజాసురుడనే రాక్షసుడు శివభక్తుడు. అతడి ప్రార్థనను మన్నించి శివుడు అతడి ఉదరంలో ఉండటం మొదలెడతాడు. ముల్లోకాలలోనూ శివుడిని వెతికిన దేవతలు, చివరకు శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నది తెలుసుకుంటారు. శివుడిని పొట్టలో దాచుకున్న గజాసురుడిని విష్ణుమూర్తి సంహరించటం కోసం నందిని గంగిరెద్దుగా అలంకరించి ఇంద్రాదులతో కలిసి ఆడిస్తాడు. ఆ గంగిరెడ్డాటకు మెచ్చిన గజాసురుడు వరం కోరుకొమ్మంటే, శివుణ్ణి విముక్తుణ్ణి చెయ్యమంటాడు. అతడంగీకరిస్తాడు. నంది ఆ రాక్షసుడి పొట్టను చీల్చి శివుణ్ణి బయటకు రప్పిస్తుంది. శివుడు భక్త సులభుడు కదా! తనకు కలిగే ప్రమాదం కూడా ఆలోచించకుండా వారాయాలనిస్తాడు. విష్ణుమూర్తి దుర్మార్గులకిట్టి వారములివ్వరాదని శివుని మందలిస్తాడు.
ఇక కైలాసానికి శివుడు వచ్చేలోగా, పార్వతి నలుగుపిండితో ఒక శిశువుని చేసి, ప్రాణం పోసి వాకిట కాపుంచి, ఎవ్వరినీ లోన రానివ్వవద్దంటుంది. శివుడు వచ్చి, లోపలకు పోవటానికి ఆ బాలుడు అడ్డుపడటంతో శివుడు అతని కంఠమును తన శూలముతో తునిమి లోపలకు వెళ్ళి పార్వతీదేవికి ముదమును కోరుస్తాడు. వారిద్దరి ప్రసంగవశమున గుమ్మంలో బాలుని విషయం తెలుసుకున్న పార్వతి శివునకు అసలు విషయం చెప్పటంతో, శివుడు ఉత్తరదిశగా తలపెట్టి నిద్రిస్తున్న ఏనుగు తలను తెచ్చి, ఆ బాలుని శరీరానికి అతికించి ప్రాణం పోస్తాడు.
ఒకసారి ముక్జ్కోటి దేవతలూ విఘ్నములకు అధిపతిగా ఒకరిని నియమించామని శివుణ్ణి కోరతారు. తాను అగ్రజుడు కనుక తనకు విఘ్నాధిపత్యం ఇవ్వమని గజాననుడు, అతను మరగుజ్జు, అసమర్ధుడు కనుక ఆ నాయకత్వం తనకిమ్మని కుమారస్వామి శివుడిని వేడుకుంటారు. అప్పుడు శివుడు ముల్లోకాలలో తీర్థములలో స్నానమాడి, ఇద్దరిలో ఎవరు ముందు తనవద్దకు వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇవ్వబడుతుంది చెప్తాడు.
అప్పుడు కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి వాయువేగంతో అక్కడనుంచి వెళ్ళిపోతాడు. గజాననుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా అతనొక ధర్మసూక్ష్మమును చెప్తాడు. ఎవరైతే తల్లిదండ్రులకు ముమ్మారు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణము చేస్తారో వారు ముల్లోకములలోని సకల తీర్థములలో స్నానము చేసినట్లేయని. వెంటనే గజాననుడు నారాయణమంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేస్తాడు. ఆ మంత్ర ఫలితంగా కుమారస్వామి ఏ తీర్థంలో స్నానం చెయ్యటానికి వెళ్లినా, అప్పటికే గజాననుడు ఆ తీర్థంలో స్నానం ముగించి తనకు ఎదురు వస్తున్నట్లు కనిపిస్తాడు. దాంతో అతడు కైలాసమునకు తిరిగి వచ్చి, గజాననుడు బలమెరుగక తనజు పందానికి సిద్ధపడ్డందుకు క్షమాపణలు వేడి, అతనికే విఘ్నాధిపత్యం ఇవ్వమంటాడు. అప్పుడు సకలదేవతలు సమక్షంలో గజాననుడిని విఘ్నాధిపత్యం ఇవ్వబడుతుంది. ఆయన గణపతి, విఘ్నాధిపతి , వినాయకుడిగా పేరుపొండుతాడు.
ఆ నాడు వినాయకుడు భక్తులు నివేదించిన ఉండ్రాళ్ళు, కుడుములవంటివి పొట్టనిండా తిని, కొన్ని తన వాహనమైన అనింద్యుడనే ఎలుకకు పెట్టి, ఇంకొన్ని చేతులలో పట్టుకుని , తల్లిదండ్రుల ఆశీర్వాదం కొరకు వెళ్తాడు. అప్పుడతను భుక్తాయాసముతో, పెరిగిన బొజ్జతో, నడవలేక, నడవలేక నడుస్తూ తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామం చేయబోగా అతని నుదురు నెలకు తాకితే, కాళ్ళు ఆకాశం వైపుకు చూశాయట. కష్టపడి కాళ్ళను నేలకు ఆనిస్తే నుదురు అన లేదు.
. ఆ అవస్థను చూసి శివుని సిగపై ఉన్న చంద్రుడు వికటంగా నవ్వాడట. అంత, రాజా దృష్టి సోకితే,రాయయినా పగులుతుందనే సామెత నిజమయ్యేటట్లుగా, వినాయకుడి పొట్ట పగిలి, అందులోని ఉండ్రాళ్ల్లీ, ఇతర తినుబండారాలు బయట పడి అక్కడంతా దొర్లాయి. అతండునూ మృతుడయ్యాడు. దానితో పార్వతీదేవికి కోపమొచ్చి, చంద్రుణ్ణి ఎవరు చూస్తే వాళ్ళు నీలాపనిందలు పాలౌతారని శాపం పెట్టింది. అప్పుడు బ్రహ్మదేవుడు అతన్ని బ్రతికించి అనేక వరాలిచ్చాడు. దాంతో పార్వతీ దేవి వినాయక చవితి నాడు మాత్రం చంద్రుడిని చూడకుండా ఉంటె చాలని శాపావకాశం ఇచ్చింది.
చాలాకాలం తరువాత వినాయక చవితినాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడవటం చేత మింటి వంక చూడకుండా గోశాలకు వెళ్లి పాలు పితుకుతూ ఆ పాలలో చంద్ర బింబం నీడ చూసాడు. తత్ఫలితంగా ప్రసేనుడిని శమంతకమనికోసం చంపాడన్న నింద పడ్డాడు. ఆయన మహానుభావుడు కనుక సత్యాన్ని నిరూపించి ఆ అపనింద నుంచి తప్పించుకున్నాడు.
అప్పుడు దేవతలు నీ శాపం వాళ్ళ లోకాలకాపచారం కలుగుతోంది, దాన్ని తొలగించమని లోకమాతను వేడగా ఆమె వినాయక చవితినాడు వినాయకుడి కథ శమంతకోపాఖ్యానం విని అక్షింతలు వేసుకున్నవారికి చంద్రదర్శనం దోషం ఉండదని శాపావకాశం ఇచ్చింది.

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నిలోకాల్లో నివసించేవారు విఘ్నాలను తొలగించే నిమిత్తం వినాయకుడికి తొలిపూజ చేస్తారు. వినాయకచవితినాడు పూజ చేసిన తరువాత కథ విని అక్షతలు వేసుకుంటారు.
వినాయకుడిది పృథ్వీ తత్వం. అందువల్ల మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించటం శ్రేయస్కరం. సంప్రదాయం! అలాగే వినాయకుడికి గరిక అంటే ఎంతో ప్రియం . అందుకే ఆయనను గరికతో పూజించాలి. ఇంకా ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించటం ఆనవాయితి. అవి ఏవంటే…
మాచీపత్రం (మాచిపత్రి)
బృహతీపత్రం (వాకుడు / నేలమునగ ఆకు)
బిల్వపత్రం (మారేడు ఆకు)
దూర్వాయుగ్మం (గరికె)
దత్తూరపత్రం (ఉమ్మెత్త ఆకు)
బదరీపత్రం (రేగు ఆకు)
అపామార్గపత్రం (ఉత్తరేణి ఆకు)
తులసీపత్రం (తులసి ఆకు)
చూతపత్రం (మామిడి ఆకు)
కరవీరపత్రం (గన్నేరు ఆకు)
విష్ణుక్రాంతపత్రం (విష్ణుక్రాంత ఆకు)
దాడిమీపత్రం (దానిమ్మ ఆకు)
దేవదారుపత్రం (దేవదారు ఆకు)
మరువకపత్రం (మరువం ఆకు)
సింధువారపత్రం (వావిలి ఆకు)
జాజీపత్రం (సన్నజాజి ఆకు)
గండకీపత్రం (గండకి ఆకు / సీతాఫలం ఆకు)
శమీపత్రం (జమ్మి ఆకు)
అశ్వత్థపత్రం (రావి ఆకు)
అర్జునపత్రం (మద్ది ఆకు)
అర్కపత్రం (జిల్లేడు ఆకు) [1, 2, 3, 4]
ఈ 21 రకాల పత్రాలకూ ప్రత్యేకమైన కే ఔషధ గుణాలు ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే పలు రకాల వ్యాధుల నుండి మనల్ని రక్షించేందుకు ఈ ఆకులు తోడ్పడతాయని ఆయుర్వేదంలో ఉంది.
ఇంక వినాయకుడిని లక్ష్మీ సహితంగా పూజిస్తారు. సరస్వతీ అనుగ్రహం కోసం ఆరాధిస్తారు. సకల శుభాలను ఇస్తాడని నమ్ముతారు. ముఖ్యంగా విద్యార్థులు తమ పుస్తకాల మీద ‘ఓం’ అని వ్రాసి, వినాయకుడి ముందు ఉంచి పూజిస్తారు. గుంజిళ్ళు తీసి ప్రార్థిస్తారు.పాటలు, పద్యాలు పాడతారు. కనీసం మూడు ఇళ్లకు వెళ్ళి, ఆ ఇళ్లల్లో వాళ్ళు పెట్టుకున్న వినాయకుళ్ళను దర్శిస్తారు.
ఆ రోజు ఎంతమంది చేత తిట్లు తింటే అంత మంచిదని పల్లేరు కాయల్ని రోడ్ల మీద, ఇళ్ళకప్పుల మీద వేసేవారు.అవి గుచ్చుకున్నవాళ్ళు తిడుతుంటే, వాటిని దీవెనలుగా భావించేవారు.
ఇక ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్న పట్టణాలలో సామూహికంగా కూడా వినాయకపూజలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై వంటి అనేక పెద్ద పట్టణాల్లో రోడ్లమీద పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలను ఉంచి, పూజించి గణపతి నవరాత్రులను వైభవంగా జరుపుతున్నారు. ఆ తొమ్మిది రాత్రులు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతున్నారు. కొన్నిచోట్ల ఈ కార్యక్రమాలు సభ్యత పరిధులను దాటుతున్నాయని కూడా ఫిర్యాదులు ఈ మాదే వినవస్తున్నాయి.
ఏదేమైనా హిందూ పురాణాల ప్రకారం ఏ కార్యమును ఎవరు తలపెట్టవలెనన్న, తొలిపూజ గణపతికే! పండుగ తాలూకు పవిత్రత నిలబెట్టటం, సంప్రదాయబద్ధంగా జరుపుకోవటం హిందువులందరి కర్తవ్యం. మనవి కానీ క్రిస్మస్, న్యూ ఇయర్ (జనవరి 1) వంటి పండుగలను సైతం జరుపుకుంటే ఆదర్శ భావాలున్న మనం, మన ఇష్టదైవమైన వినాయకుని పండుగ భక్తి నిష్టలతో జరుపుకుని, ఆయన అనుగ్రహం పొందటం అవశ్యం, ఆచరణీయం కూడాను.
“తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్!”

Written by Saraswati Karavadi

నా పేరు సరస్వతి కరవది. నా గురించి ఏం చెప్పుకోవాలి? నేనొక రచయిత్రిని. ‘సంపంగి’ అనే అంతర్జాల మాసపత్రిక సంపాదకురాలిని. కవితలు, సమీక్షలు, నాటికలు అన్నీ వ్రాస్తుంటాను. ఒక పత్రిక కోసం అనేక ఆడియో కథలు చదివాను. చదువుతున్నాను. వ్యాఖ్యాత్రిని. వస్తతః ఎడమ చేతి వ్రాత. ఆ చెయ్యి బొటన వేలి నరం దెబ్బతినటం వలన కుడిచేత్తో వ్రాస్తున్నాను.
5 నవలలు, 200 వరకు కథలు,
గిడుగు రామమూర్తి అవార్డు,
స్వాతి అనిల్ award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వృత్తాంతర చిత్రం

నేలతల్లి నవ్వింది 3