విధివంచిత(కవిత)

పద్మశ్రీ చెన్నోజ్వల

కళ్లెదుటే భళ్ళుమన్న అద్దాలమేడ-

పగిలిన గాజు ముక్కల్లో ప్రతిబింబిస్తున్న నీలినీడలు

తైలసంస్కారంలేని శిరోజాలు – జీవితేచ్చ నశించిదని చెప్పకనే చెబుతున్నాయా ?

మండుటెండల ఎడారిలో దాహం తీరక అలమటిస్తూ ఎండమావుల

వెంట పరుగులెత్తిన అనుభవాల అగ్నిశిలలు కరిగి

కన్నీటి లావా పెల్లుబికి కమిలిన చెక్కిళ్ళు –

బ్రతుకు పోరులో చెలరేగిన సునామీలకు సూచికలా?

కరిగిన కాలపు పరదాల మాటున కదలాడుతున్న

అస్పష్ట చిత్రాలు – అగ్గిరవ్వలై  శ్వాస చక్రాన  పరిభ్రమిస్తున్నాయా ?

దిక్కులు పిక్కటిల్లేలా రోదించి బ్రద్దలైన స్వరపేటిక –

తన కర్తవ్యాన్ని కనుగవకు బదిలీ చేసిందా ?

తెగి వొళ్ళో పడి ఉన్న మాంగళ్యం – వివాహ వ్యవస్థ పై  చేసే వికటాట్టహాసమా ?

మేనిపైని మానిన గాయాల తాలూకు మచ్చలు –

మృగంతో ముడివడిన బంధానికి ఆనవాళ్ళా?

ఎండిన చనుబాల ధారలు – పొతిళ్లలోనే సమాధైనా

అమ్మతనానికి సంకేతాలా ?  ఈ ఉలికి ఇంత కర్కషత్వమా!

ఈ సృజనకు ఇంత పైశాచికత్వమా !

మూర్తీభవించిన శోకదేవతను తలపిస్తున్న

ఈ రాతి బొమ్మకు – నిండు గోదారిలా పండువెన్నెలా

దూకేజలపాతంలా స్వేచ్ఛా విహంగంలా నాట్యమయూరిలా శర చ్చంద్రికలా

సృష్టిలోని సమస్త రమనీయత కమనీయతలా

కలబోతగా పునర్జన్మ ప్రసాదించమని  ఉలి రత్నానికి

నా వినతిపత్ర సమర్పణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాల చిత్రం

మౌనమేఘాలు