వొంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

తరుణి పత్రిక పాఠకుల రుచి కరమైన భోజనం అందించాలని…. ఆ… భోజనమా! అని ఆశ్చర్యపోకండి. అవును! మన రచయిత్రి లక్ష్మీ మదన్ చక్కగా రుచికరమైన వంటలు ఎలా చేసుకోవాలో ఆసక్తికరంగా చెబుతున్నారు. వినండి… అదేనండీ తయారు చేసే విధానం ” ఒంటిల్లు ఒడవని – ముచ్చట” ( కాలమ్) అంటూ వ్రాస్తున్నారు. ప్రతినెలా మీకోసం… చదువుతూ వంటచేసుకోండి. నలభీమ పాకం అన్నారు కదా మనకు కాదనుకోకండి. ఆ నలుడూ భీముడు కూడా ఆనాడు ఇదిగో ఇలాంటి లక్ష్మీ మదన్ వంటి ఏ అమ్మ చేతివంటతిని నేర్చుకున్నారో గాని మనమూ నేర్చుకుందాం. ఏమంటారు? చెప్పే విధానం బాగుండాలి వంటదేం? అనీ అంటారా? అవునవును ఎంత బాగా చెబుతున్నదో ఈ ధారావాహిక క్విక్ కిచెన్ కాలమ్ ను మీరే చూడండి…
                                 – డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి పత్రిక ఎడిటర్.

______

మహిళలు ఎక్కడ మహా రాణులు కాకున్నా,వంటింట్లో మాత్రం మహా రాణులే!

సమానత్వం కావాలని జెండాలు పట్టుకుని, మగవారితో పోట్లాడుతామా!

కానీ వంటింటి విషయానికి వస్తే, ఇలా దగ్గరికి రండి ఒక మాట చెప్తా! వాళ్లను వేలు పెట్టనిస్తామా చెప్పండి?

వంటింట్లో వాళ్ళు మనకు సహాయం చేయకుంటే, “ఒక్కదాన్నే పని అంతా చేసుకోవాలి. కనీసం కూరగాయలైనా తరిగి పెట్టరు. అంతా నేనే చేసుకోవాలి” అని పైపైకి అంటాము కానీ, వాళ్ళు చేస్తే మనం ఒప్పు కుంటామా? ఎన్నో వంకలు పెట్టమూ!

అయినా మన హక్కులు ఎవరండీ కాల రాసేది!

కొంతమంది ఈ మధ్య వయ్యారాలు పోతూ, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

మా అమ్మాయిని ఏ పని చెప్పకుండా పెంచామండి. తనకు వంటిల్లు ఎక్కడుందో కూడా తెలియదు. అసలు స్టవ్ దగ్గరికి పోనిస్తామా! ఇప్పటివరకు కాఫీ పెట్టుకున్నది కూడా తెలియదు. తాగడం మాత్రమే తెలుసు”

ఇలా వంకర, టింకర తెగులు మాటలన్నీ వింటూనే ఉన్నాము. ఎందుకు వంట రాకుండా పెంచాలి? మన దేహం అనే దేవాలయానికి వంట అనేది నైవేద్యమే కదా! అంతేకాక మనం వంట చేసి పెడితే, అవతలి వాళ్ళు తిని సంతృప్తి పడితే అంతకన్నా ఆనందం ఇంకేం ఉంటుంది!

సరే విషయానికి వస్తే ఈరోజు ఓ వంట గురించి చెప్పుకుందాం.

నేను కొత్తగా సృష్టించిన వంట కాదు. మన ఇంట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు వండిన వంటనే ఇది. మాకు తెలిసిన వంటనే ఇది. మీరు నేర్పేది ఏంటి? అని అనకండి . ఇది చేయలేని వారు కూడా ఉంటారు.మరచి పోయిన వాళ్ళు కూడా ఉంటారు.

ఈరోజు నా పాక శాలలో పాలకూర పొడి కూర.

మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆకుకూరలు తప్పకుండా తెచ్చుకోవాలి. ఆన్లైన్ లో కొన కండి. ఎందుకంటే పాపం ఎండలో కూర్చొని అమ్ముకుంటారు కదా!వాళ్ళకి దొరికేది ఎంతని! వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళ కడుపు నిండుతుంది.

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ ఆకు కూరని తప్పకుండా రోజు వంటకంలో చేర్చుకోవాలి. అలాగని డీప్ ఫ్రైకి వాడవద్దు.

పాలకూర పొడి కూర చేద్దామని కంకణం కట్టుకున్నాను. కొన్ని వంటలు ఇంట్లో వాళ్ళు తినమని ముక్కు విరిచినా, మూతి విరిచినా తప్పక చేసి వాళ్ళతో తినిపించడం మన కర్తవ్యం, బాధ్యత. అలా అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని, కొంగు బిగించి వంటింట్లోకి వెళ్లాను.

ఆకు కూరను కనీసం నాలుగు లేక ఐదు సార్లు కడగటం అవసరం. అది కూడా తరగక ముందే కడగాలి. కాసేపు ఉప్పునీటిలో నాన పెడితే ఇక మీరు తోపు. మీరు సగం డాక్టర్ అయినట్టే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మరియు మీ ఆరోగ్యం గురించి అవగాహన ఉంది కదా!

ఓ రెండూ కట్టలు పాలకూర,
ఓ రెండు గుప్పిళ్లు పెసర పప్పు కడిగేసి పెట్టండి,
నూనె, పోపు గింజలు ఉప్పు, కారం ఇవన్నీ చెప్పాలా!
ధనియాల పొడి
నువ్వుల పొడి ఓ గంటెడు,
రెండు ఉల్లిపాయలు(ఇష్టం ఉంటేనే అయ్యో మేము ఉల్లిపాయలు తినండి అని అనకండి)
ఓ నాలుగు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోండి!
కొత్తిమీర, కరివేపాకు నేను చెప్పకున్నా మీకు తెలుసు రెడీగా పెట్టుకున్నారు కదా!
ఓ గుప్పెడు పుట్నాల పొడి లేదా శనగపిండి అందుబాటులో ఉంచుకోండి.

ఇక తయారీ విధానానికి వద్దామా!

ఓ దళసరి బాండ్లీ ఎంచుకోండి. ఇంట్లో లేదని కొనడానికి మాత్రం వెళ్ళకండి. ఉన్న దాంట్లో గట్టి బాణలి తీసుకొని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ ముట్టించడం చెప్పనవసరం లేదు.

మీరు వాడ గలిగే అంత నూనె వేసుకోండి. ఎక్కువ తక్కువ చెప్పాననుకోండి అయ్యో! ఇంత నూనెనా! మా ఆరోగ్యం ఏమైపోను! అంటారు!

తక్కువ చెప్తే మరీ నూనె లేకుండా వంట ఏం బాగుంటుంది? అంటారు .అందుకే మీ ఇష్టం.

నూనె సుయ్య మని వేగాక, పోపు దినుసులు వేసి అవి మనం కోపం వస్తే ముఖం చిట్లించి నట్టు చిటపట లాడాలి. పసుపు, ఇంగువ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించండి. ఆహా! అనిపించేలా వాసన వస్తుంది. అప్పుడు కడిగిన పెసరపప్పు వేయండి. మరి కాసేపు వేసి వేయించి, ఇప్పుడు పాలకూర వేసుకోండి. చాలామంది మూత పెడితే రంగు మారుతుంది వద్దు అని చెప్తున్నారు. కానీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎందుకంటే ఇందులోని పోషకాలు వెళ్లిపోతాయి. కాసేపు మగ్గ గానే, దాంట్లో నీళ్లు వచ్చేస్తాయి. కంగారు పడకండి. ఇంకా కాసేపు ఓపికగా కలుపుతూ ఉండండి. ఈ లోపల మొబైల్ పట్టుకొని కూర్చో వద్దు. కూర కోపంతో ముఖం మాడ్చు కొని నల్లగా అయిపోతుంది.

అయినా మీరందరూ వంట అంటే ఇష్టం ఉన్న వాళ్లే కదా, అలా చేయరు.

ఇప్పుడు అందులో స్పూన్ ధనియాల పొడి అలా అలవోకగా విసిరేయండి. ఆ తరువాత శనగపిండి లేదా పుట్నాల పొడి తొలకరి జల్లులా చల్లండి. మళ్లీ చక్కగా కలిపి, కాసేపు మూత పెట్టి ,వేగిన తర్వాత మూత తెరిచి చూడండి. అమ్మమ్మనో, నానమ్మనో గుర్తు రాకుంటే నన్ను అడగండి.

                               

ఫైనల్ గా ఒక చెంచాడు నువ్వుల పొడి, కొంచెం కొత్తిమీర కరివేపాకు చిరునవ్వుతో పైన చల్లండి.

అప్పుడు ఆ కూర కూడా మనల్ని నవ్వుతున్నట్లే చూస్తుంది.

భోజనం సమయంలో అందరికీ ఆకుకూర తింటే ఎంత మంచిదో చెప్పి, ప్లేట్లలో వడ్డించండి. ముందు ముఖాలు చిట్లిస్తారు. కానీ మనం తగ్గొద్దు. ఎందుకంటే మనము ప్రేమతో అందరి ఆరోగ్యం బాగుండాలనే సంకల్పంతో వంట చేస్తాం. అది రుచిగా ఉంటుంది.

వేడి అన్నంలో నెయ్యి వేసుకుని, ఈ కూర కలుపుకొని తింటే మరొకటి అడగరు నా మాట నమ్మండి.అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు.

ప్రతి వంటకాన్ని దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. కానీ ఇందులో ఉల్లిపాయ వేయటం వల్ల నేను నైవేద్యం పెట్టలేదు. దేవుడికి కూడా ఈ మసాలా భోజనం ఎందుకండీ!

సరే! మీరు చేసుకుని ఆ రెసిపీని మరొకరితో పంచుకుంటారని కోరుతున్నాను.

______

ఎప్పుడూ మన పాతకాలం వంటలు పెడితే, వాళ్లు కూడా తిట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలా స్టైల్ గా చేసి పెడితే, వాళ్లు హ్యాపీ మనం కూడా డబల్ హ్యాపీ. కాకపోతే ఈ విధానాన్ని వండడానికి వాళ్ల సహాయం తీసుకోవాలి. మొత్తం వాళ్లే చేసినా పర్వాలేదు. ఈ వంట మొత్తం నాదే అనే క్రెడిట్ నేను తీసుకోవడం లేదు. మా కోడలు పిల్ల హస్తం దీంట్లో పెట్టేసింది. వేడి మీద కాదు చల్లారాక చేతులు పెట్టేసింది.

అయితే ఒక మాట చెప్పాలి!

పెరుగుట విరుగుట కొరకే అనే సామెత విన్నారా?

అలాగే మా ఇంట్లో స్టైల్ కొట్టిన పాలు బాగా పొంగిపోయాయి. పై పైకి పోయి కొన్ని స్టవ్ మీద కూడా పడ్డాయి. అబ్బో అది క్లీన్ చేసుకోవడం పెద్ద పని. అంత ఫోజు కొట్టి పైకి పోయినయా! మనం చిటుకున నీళ్లు చల్లేసరికి కిందికి వచ్చి కుయ్యోమని వాటి స్థానంలో అవి ఉన్నాయి.

ఇలా గర్వంతో పొంగిపోయిన పాలు, రాత్రికి ఫ్రిజ్లో ప పెట్టకపోవడం మూలానో ఏంటో! విరిగిపోయాయి. బాగయిందా! గర్వం అణిగిందా? మరి ఎందుకు అంత పొంగిపోవాలి? ఇప్పుడు విరిగిపోయావు !అని మనసులో అనుకున్న. అవి విరిగిపోయిన సరే వాటిని ఎలా వినియోగించాలో మనకు బాగా తెలుసు. అందులో ఏది సులువుగా పారేసే అలవాటు లేదు. అహనా పెళ్ళంటలో లక్ష్మీపతి టైపు మనం.

ఆ విరిగిపోయిన పాలని ఒక బట్టలో వడకట్టి, గట్టిగా ఒక బరువు పెట్టేస్తే గంటా రెండు గంటల వరకు గట్టిపడి ముక్కలు కోసుకొనే విధంగా తయారవుతుంది. వడకట్టిన తర్వాత వచ్చిన నీళ్లను అసలే పారిపోయొద్దండోయ్ దానిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

అనుకోని అతిథులు వచ్చినట్లుగా అనుకోకుండా పన్నీరు వచ్చే చేరింది. ఇప్పుడు పిల్లల పంట పండింది.

ఈ సారి మహా రాణిని నేను కాదు నా కోడలు. కోడలు అన్నీ చేసినా అత్తగారు వచ్చి వేలు పెట్టి ,నేనే చేసాను అన్నట్లు కాసేపు అసలైన అత్తగా మారిపోయాను ఒక్క క్షణంలో. “నేనే అత్తను నువ్వు వంట చేస్తే నేను ఒప్పుకోవడమా?” అనుకున్నాను కానీ పూర్తిగా రాని వంటలో వేలు కాలు ఏది పెట్ట వద్దని ఊరుకున్నాను.

చర్చలు జరిగిన మీదట పనీర్ కూర చేయడానికి సిద్ధపడ్డాము. ఉల్లి వెల్లుల్లి వద్దంటే కుదరదమ్మ! నేను మీకు చెప్పినట్లుగానే మా కోడలు నాకు చెప్పింది. నోటి మీద వేలు వేసుకొని తల ఊపాను.

ఏమేం పదార్థాలో చెప్పాలి కదా!

పనీర్ ముక్కలు ( విరిగి పోయిన పాలను బట్టి) కొనుక్కుంటే ఓ 200 గ్రాములు వేసుకోండి.

బఠానీలు ఓ రెండు గుప్పిళ్ళు.
ఉల్లి, వెల్లుల్లి నేను చెప్పనండి మీ టేస్ట్ ని బట్టి ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు.

ఓ ఆరు టమాటాలు ,
కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ,
కొత్తిమీర ,కరివేపాకు మామూలే.
నూనె, ఉప్పు, కారం పోపు గింజలు ఇవన్నీ చెప్పనవసరం లేదు.

ఇంకా నేను ఏదైనా మర్చిపోతే అయ్యో! పోనీలే అనుకొని మీరు ఇంక్లూడ్ చేసుకోండి.

  

        

ఇప్పుడు తయారీ విధానం
పనీర్ తో పరవళ్లు
______

ఓ బాండీ పెట్టుకోండి. అదే స్టవ్ మీద నండి. ఇందులో పనీర్ వేయండి. కొంచెం వేగనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. వాటి సంగతి మర్చిపోండి ఇక. బటానీలు కూడా వేయించి పక్కనపెట్టి వాటి సంగతి కూడా మర్చిపోండి.

ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయ వెల్లుల్లి రేకులు కొత్తిమీర ఉప్పు కారం వేసి ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. గర్ర్ మని సౌండ్ వచ్చిందా! అయిపోయినట్లే.

ఇప్పుడు అదే బాణలిలో నూనె ఉంటే సరే, లేకుంటే ఇంకా కొంచెం వేసుకుని పోపు గింజలు , పసుపు వేయండి. తర్వాత ఈ పేస్ట్ వేయండి. ఇప్పుడు మీ ఓపికకు పరీక్ష అనుకోండి.

ఇది టక్కున అయ్యేవంట కాదండి. కాస్త నిదానము, ఓపిక ప్రదర్శించండి. పాకశాస్త్రంలో మనం ప్రావీణ్యులం కదా!

స్టవ్ ని సిమ్ లో పెట్టి, ఏ సిమ్ ఎయిర్టెల్ నా, జియో నా అని అడగకండి. చిన్న మంట మీద అని అర్థం. ఇప్పుడు ఆ పేస్ట్ వేసి నిదానంగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ కలుపుతూ కలుపుతూ ఉంటే మెల్లిగా పక్కల నుండి నూనె విడిచి పెడుతుంది. మనం జ్ఞానం వచ్చే కొద్ది జీవితం మీద మమకారం వదిలినట్లు.

ఈ సమయంలో మనం వేయించిన పన్నీర్ ముక్కలు, బఠానీలను వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. గరం మసాలా ధనియాల పొడి చల్లే సమయం ఆసన్నమైంది. ఇంకేం చూస్తారు నన్ను.

అయినట్లే కదా ఈ గార్నిషింగ్లు అవన్నీ నాకు రావు. ఓ గిన్నెలోకి తీసి పెట్టి అందర్నీ తినమని చెప్పడమే!

ఎలా ఉందంటారు? ఏమిటి నా మొహం లా ఉందా! అయితే బాగున్నట్లే నేను బాగానే ఉంటానుగా!

మరొక వంటతో..

వచ్చేస్తా!

ఆరోగ్యమే మహా భాగ్యం

వంటకారిణి లక్ష్మీమదన్

 

 

 

 

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు – 28

సాహిత్య పుస్తకాలు చదివేవారు కనుమరుగయ్యారు