జరిగిన కథ: చిత్రపటాన్ని మహారాజుల శయ్యాగృహంలో పెట్టి, పుట్టింటికి బయలుదేరుతుంది ప్రమీలాదేవి. ఆ చిత్రపటాన్ని గాంచిన, విక్రమసింహుడు, ఆమె మనసునర్థం చేసుకొని యుద్ధానికి బయలుదేరుతాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో, ఆగంతకులతో మహారాజున్నారని, అనంతుడు కీడుని శంకించినా, అనంతునికి ధైర్యం చెప్పి అంగరక్షకులుగా వారిని నియమిస్తాడు మహారాజు. ఆ తర్వాత మరికొంతమంది వారితో చేరినా విక్రమసింహ అడ్డుపెట్టడు. గాని ఆగంతకులను నమ్మని అనంతుడు, మహారాజులను వారేమైనా చేస్తారేమోనన్న భయంతో, వారిపైనే దృష్టిపెట్టడంతో, తన గుండెల్ని చీల్చడానికి వస్తున్న బాణాన్ని కాచుకోలేక పోతాడు. అది చూసి వైరివర్గంలో, ఆనందం వెల్లివిరుస్తుంది.
తర్వాత ఏమైందో చూద్దాం రండి.
శత్రు సైన్యాధ్యక్షుడు వేసిన బాణం అనంతుని గుండెల్ని చీల్చడానికి, సూటిగా ముందుకు దూసుకు వస్తుంది. అనంతుడు తేరుకునేటప్పటికే ఆలస్యమైపోయింది. అది చూసిన వైరిపక్షంలో విజయమిక తమదేనన్న ఆనందం…
క్షణమాలస్యమైతే, ఆ బాణం అనంతుని గుండెల్ని చీల్చేసేదే! గాని, ఇంతలో ఎటునుండి వచ్చిందో ఇంకొక బాణం? అనంతుని తాకబోయే బాణాన్ని తుత్తునియలు చేసింది. ఆ బాణం వేసింది ఎవరో కాదు, ఆ పదిమందిలో ఒకరు. విపరీతమైన కోపంతో, శత్రు దేశ సైన్యాధ్యక్షుని వైపు ఉరికాడా యువకుడు. తన బాణ పరంపరతో, వైరికి ఊపిరాడకుండా చేశాడు. విజయం వరిస్తుందని సంబరపడేలోగా, తనను చుట్టుముడుతున్న బాణాల నుండి, కాచుకోవడంతో సరిపోయింది వైరికి. ఈలోగా తేరుకున్న అనంతుడు, ఆ యువకుడికి తోడై, శత్రు సైన్యాధ్యక్షుని ఎదుర్కొని, వారి సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అనంతుడు, పూర్తిస్థాయిలో విరుచుకు పడడంతో, ఆరోజు వైరిపక్షం వైపు, భారీగా నష్టం సంభవించింది.
ఆ రాత్రి, సమాలోచనల అనంతరం, “అనంతా! నీ క్షేమాన్ని గాలికొదిలి, మా గురించే ఆలోచిస్తున్నావు. నీకేమైనా ఐతే, మేము తట్టుకోగలమా?” వ్యాకులత నిండిన స్వరంతో అడిగాడు మహారాజు.
వచ్చిన కొత్త వీరులపై విక్రమసింహకున్న విశ్వాసాన్ని, పరిగణనలోకి తీసుకోకుండా, మహారాజునే సందేహించినందుకు… ఇప్పుడందులోని ఒక వీరుడే, తన ప్రాణదాత అయినందుకు, సిగ్గిలపడ్డాడు అనంతుడు.
“క్షమించండి ప్రభూ! ఇంకొకసారి ఇలా జరగదు” అని ఊరుకున్నాడు .
“ఆ వీరుల సంగతి మాకొదిలి, నీవు నిశ్చింతగా ఉండు. వారు మనకు అత్యంత నమ్మకస్తులు” అనంతునిలో ధైర్యాన్ని నింపాడు మహారాజు.
వారు మహారాజుకు విధేయులు కాబట్టే, తన ప్రాణదాతలు కాగలిగారు. అటువంటి వారిని ఇన్నాళ్లూ అనుమానించడమే తన తప్పిదం. ఇంకా నమ్మకపోవడమూనా! మనసులో అనుకొని, “అలాగే ప్రభూ!” అని, విక్రమసింహను విశ్రాంతి తీసుకోమని మహారాజ మందిరం నుండి బయటకొచ్చి తిన్నగా ఆ వీరులున్న మందిరానికి బయలుదేరాడు అనంతుడు.
అనంతుని కోసమే చూస్తున్నట్టు, సంపూర్ణ కవచధారియై ఉన్న ఆ యువకుడు అనంతునికి ఎదురొచ్చి, “ప్రభూ! మీరు క్షేమమేనా!” ఆదుర్దా నిండిన కంఠంతో క్షేమమడిగాడు.
“మా ప్రాణదాతలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. ఈ జన్మంతా మీకు కృతజ్ఞుడనై ఉంటానన్న” అనంతుని మాటలకు నొచ్చుకున్నాడా యువకుడు.
“ప్రభూ! మీరిలా అనడం తగునా! మగధరాజ్య తనువు మహారాజైతే, మీరు గుండెకాయ. అటువంటి మీ ఎదురుగా నిలబడగలడంతో నా జన్మ ధన్యమైందని” అంజలి ఘటించాడు. ఆ వీరుడికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకొని మందిరానికి నడిచాడు అనంతుడు.
*
మరుసటి రోజు యుద్ధం కూడా, అమీతుమీ అన్నట్టు సాగింది. ఆర్గురు వీరులు మహారాజుకు రక్షణ వలయమైతే, ఆర్గురు వీరులు అనంతుని చుట్టూ వలయమై, శత్రువులపై విరుచుకుపడుతున్నారు. ఈ వీరుల రాకతో, యుద్ధతంత్రమే మారిపోయింది. రెట్టించిన ఉత్సాహంతో మగధసైన్యం ముందుకు కదులుతుంది. నిన్నటి వరకు కుంతలదేశంది పైచేయి ఐతే, ఈరోజు మగధదేశానిది అయింది పైచేయి. ఇలాగే యుద్ధం కొనసాగితే త్వరలో, విజయం మగధదేశం వైపే నిలుస్తుందనడంలో సందేహం ఏమీ లేదు. అనంతుడికి పూర్తి నమ్మకం ఏర్పడింది ఆ వీరుల మీద. యుద్ధం అయిపోయాక ఆ వీరులను తగిన రీతిలో, సత్కరించి, వారికి మహారాజుల ఆస్థానంలో మంచి కొలువులు ఇప్పించాలని అనుకున్నాడు.
మరో వారం రోజులు గడిచాక, శత్రు సైన్యం భారీగా నష్టపోయింది. అపజయానికి ఆమడ దూరంలో ఉంది. విజయమో! వీర స్వర్గమో! తేల్చుకోవాలో, లేక శరణు వేడి, ప్రాణనష్టాన్ని తగ్గించుకోవాలో తేల్చుకోలేక సతమవుతమవుతున్నాడు కుంతలదేశపు రాజని, వేగుల వారు తెచ్చిన సమాచారంతో, ఎంతో సంతోషాన్ని పొందిన అనంతుడు, శత్రుసైన్యం వైపు భారీ ప్రాణనష్టాన్ని కలిగించడంలో, ఆ వీరుల పాత్ర కొట్టి వేయలేమని అనుకుంటూ, ఆ వీరుల కోసం కబురు పంపాడు. ఆ వీరులను అనుమానించినందుకు, మరొక్కసారి క్షమార్పణలు కోరుకోవాలని, వారు కోరుకున్న స్థానాన్ని సైన్యంలో ఇవ్వాలని అనుకుంటూ వారి రాక కోసం ఎదురు చూస్తుంటే, వారి బదులు “వారు శిబిరంలో ఎక్కడా కనిపించలేదన్న,” వార్త వచ్చింది.
నమ్మకమేర్పరిచి ఇంతలోనే మాయమవ్వడమేమిటి? వారెవరో ఇప్పటికీ, తెలుసుకో లేకపోవడం తన వేగుల వారి వైఫల్యం… తన వేగు వ్యవస్థ అతి పటిష్టం. ఆఖరికి నరసింహుడు కూడా వారి విషయంలో విఫలం చెందాడు. నిఘావ్యవస్థ తన ఆధీనంలోనే ఉన్నందున తన వైఫల్యమే! ఏమిటీ కుట్ర? తన ప్రాణదాతల గురించలా అనుకోవడానికి మనసు రావడం లేదొకప్రక్క. వాళ్లు వైరివర్గం వారే అయివుంటే, తననెందుకు కాపాడతారు? ఆరోజు తనను కాపాడకుంటే యుద్ధంలో తమ దేశానికి నష్టం వాటిల్లి, వారికే మేలు జరిగేది కదా! అలా చెయ్యలేదంటే, వారి పథకమేమిటి?
ఆలోచిస్తుంటే, ఒక్కసారి కళ్ళకు కట్టిన గంతలు విప్పినట్లయింది. ఆ యువకుడన్నట్టు గుండెకాయ తాను కాదు. మహారాజుల వారు. తాను పోయినా, మహారాజుల సారధ్యంలో విజయం తమకు దక్కవచ్చు. అందుకే, కాపాడినట్లు నటించి, తన నమ్మకాన్ని చూరగొన్నారు. తాను నమ్మడంతో వారిపై నిఘా తగ్గింది. మొదటినుండి కూడా వారు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. ఉంటే మహారాజుకు చేరువలో, లేకుంటే వారి శిబిరంలో… ఒంటరిగా చిక్కడం లేదెవ్వరికీ.
శత్రురాజ్యం పరాజయపు అంచుల్లో ఉన్నప్పుడు, తమవైపు ఉన్నవారు పలాయనం చిత్తగించారంటే… దానర్థం? పూర్తిగా తేటతెల్లమైంది అనంతునికి, వారెవరో! ఎందుకొచ్చారో! వారి లక్ష్యం మహారాజుల వారు. మహారాజుల వారే లేకుంటే, ఎంతమందున్నా, సైన్యమెవరి కోసం పోరాడుతుంది? అంటే… విజయం కోసం వారు మహారాజులనే లక్ష్యం చేసుకున్నారనే భయంకర నిజం అనంతుని కళ్ళకు గోచరించింది.
మహారాజులను వారేమి చేశారో? ఈ ఆలోచన రావడంతో ఊపిరాగినంత పనైంది. అంతే ఒక్కుదుటన లేచి, సైన్యాధ్యక్షుడినని కూడా మర్చిపోయి, మహారాజ శిబిరానికి దౌడు తీశాడు. ఈ విషయం తెలియగానే, అనంతుని ఆధీనంలో ఉన్న నలుగురు సైన్యాధిపతులు… గజ, అశ్వ, పదాతి బలాలకు ఒక్కొక్కరుగా, శిబిర రక్షణకు ఒకరు చొప్పున మొత్తం నలుగురు… అనంతుని అనుసరించసాగారు. వీరందరినీ చూసి కాపలా సైన్యంలో కలకలం బయలుదేరింది. ఏమి జరిగి ఉంటుంది? శిబిరాల్లోకి శత్రుమూకలు చొరబడ్డాయా? మహారాజులకు జరగరానిదేమైనా జరిగిందా? ఇటువంటి ఆలోచనలు వారి మనసుల్లో చొరబడ్డాయి. దాంతో మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకొని, ఎవరికి సంబంధించిన స్థానంలో వారుండి పహారాను మరింత కట్టుదిట్టంగా నిర్వర్తిస్తున్నారు.
శిబిరానికి చేరిన అనంతుడికి, మహారాజు అగుపించలేదు. అనుసరించి వచ్చిన మిగిలిన సేనాధిపతులకు, అనంతుని ఆందోళన అవగతమైంది. బయటకు విషయం పొక్కకుండా శిబిరంలోని అన్ని గదులను శోధించారు. ప్రభువుల జాడ కానరాలేదు. రేపో మాపో విజయం సిద్ధిస్తుందని ఆశిస్తున్న తరుణంలో, మహారాజు శిబిరంలో కనిపించడం లేదంటే… చాటుగా శత్రుదేశపు రాజు దెబ్బతీశాడా? తమకన్నా ముందే వారికీ విషయం తెలిసుంటుందా? మహారాజుల అదృశ్యానికి కారణం వారే అయితే, వారికే ముందు తెలుస్తుంది కదా! ఇటువంటి పరిస్థితులలో తమ తక్షణ కర్తవ్యమేమిటి?
ఏ రకంగా మహారాజును కాపాడుకోవాలి? అసలు మహారాజు ఎక్కడున్నారు? ఎవరి ఆధీనంలో ఉన్నారు? శత్రురాజుకు తెలిసుంటే ఈ సరికే శిబిరం ముట్టడి జరిగుండేది. అంటే వారికింకా విషయం చేరలేదు. ఈ నిమిషం నుండి తాము వేసిన ప్రతి అడుగూ, తీసుకున్న ప్రతి నిర్ణయం, మహారాజుల వారు శిబిరంలో ఉన్నారన్నట్టుగానే సాగాలి. ఆ రకంగానే వ్యూహరచన చేయాలి. అసలా పదిమంది వీరులు ఎక్కడున్నారో ముందు కనిపెట్టాలి. ఈ ఆలోచన రాగానే, తక్షణం నరసింహుడికి కబురు పెట్టాడు. సేనాధిపతులను చూసి తల ఊపాడు.
ఏమి చెయ్యాలో వారికర్థమైంది. వారి క్రిందనున్న మెరికల్లాంటి సైనికులకు కబురెళ్ళింది. వచ్చిన వారందరికీ ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో సూచనలందాయి. ఏమీ జరగనట్టుగానే వారందరూ తమ తమ సైన్యాల దగ్గరకు వెళ్లి, “శత్రువు బలహీనపడి ఉన్నాడు. మనమేమాత్రం అలక్ష్యము ప్రదర్శించినా, చేరువవ్వబోయే విజయలక్ష్మికి గడువిచ్చినట్లు అవుతుంది. అందుకని అందరూ మరింత అప్రమత్తతగా ఉండాలి. కొత్తవారెవరైనా కనిపిస్తే తక్షణం సేనాధిపతులకు వార్తను అందజెయ్యాలని,” మొత్తం సైన్యానికి వార్త వెళ్లేలా చేశారు.
పన్నెండుమంది వీరులున్న శిబిరానికి వెళ్లిన, అనంతునికి నమ్మినబంటు, విజయుడు వచ్చాడు. విజయుని ముఖం చూడగానే, ఆ శిబిరంలో వాళ్ళెవరూ లేరని అర్థమైంది.
రాజశిబిర కాపలావాళ్లను పిలిపించి తానే స్వయంగా విచారించడం మొదలుపెట్టాడు అనంతుడు. వారికి అనుమానం రాకుండా, మామూలుగా అడిగినట్లు, “అనుమానాస్పద విషయమేమైనా జరిగిందా? ఎవరినైనా కొత్తవారిని చూశారా?” అంటూ వివరాలు సేకరిస్తున్నాడు. అటువంటిదేమీ లేదని సమాధానమిచ్చిన వాళ్లను, “జాగ్రత్తగా ఉండండని” సెలవిస్తున్నాడు. ఒక కాపలాదారుని ముఖం చూడగానే, ఏదో ఉందని అర్థమైంది. అందరూ వెళ్లాక, తెలిసింది చెప్పమన్నట్టుగా తల ఊపేడు.
“సుమారు అర్థగంట క్రిందట, నేను వారిని చూశాననే విషయం తెలియగానే మహారాజుల వారు నన్ను దగ్గరికి పిలిపించి, ‘నేను అనంతుల వారి శిబిరానికి వెళ్తున్నాను. ఈ విషయమెవరికీ తెలియకూడదు. అతి రహస్యమని’ నన్ను హెచ్చరించారు ప్రభూ” అని చెప్పి ఊరుకున్నాడు.
తన మందిరానికంటే ఎవరికీ అనుమానం రాదని అలా చెప్పి, మహారాజు తనంతట తాను వారితో ఎందుకెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? ప్రభువులు దేనికీ లొంగరే! అటువంటిది, మహారాజు తమతో స్వచ్ఛందంగా రావడానికి, వారే మాయ చేశారు? ఏ బలమైన కారణం చూపించారు? ప్రభువులిప్పుడెక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? ప్రభువులకేమీ ముప్పు వాటిల్లకుండా చూడమని, పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ఇదంతా తన తప్పిదమే. తన ప్రాణదాతలని, వారి విషయంలో కొంత అలసత్వానికి తాను తావివ్వడం వల్లనే ఇదంతా జరిగింది. శత్రువు కుతంత్రాలను అర్థం చేసుకోవడంలో, తనకు ముందుచూపు లేకుండా పోయిందని, తనను తానే నిందించు కుంటున్నాడు అనంతుడు.
శత్రు శిబిరాల్లో హడావుడి ఏమీ లేదన్న వార్తతో ముందు నరసింహుడు వచ్చాడు. అంటే మహారాజు అదృశ్యమైనట్టు వారికింకా తెలియదు. ఇది కొంత నయం, తన మనసులోని ఆలోచనలు బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు, ఏమాత్రం బయటపడినా సర్వనాశనమే జరుగుతుందని.
తర్వాత చారులొక్కక్కరే రాసాగారు. అనుమానాస్పదమేమీ లేదన్న వారిని మరింత అప్రమత్తతగా ఉండమని బయటికి పంపించాడు. మిగిలిన ఇద్దరూ… అనంతుని సైగ అందుకుని, బయటికెళ్లి ఇద్దరు కాపలావారిని తెచ్చారు. వారు చెప్పిన వార్త… అనంతుని ఆందోళనకు గురిచేసింది. ఆ వార్త… “రాజముద్రిక చూపించి పన్నెండుమంది అశ్వయోధులు సైనిక శిబిరాన్ని వీడాలనుకుంటే, ఎవరినైనా సరే అర్ధరాత్రి బయటకు పంపించేది లేదని తామడ్డగించామని, గాని అంతలో అక్కడకు విచ్చేసిన ప్రభువులవారే స్వయంగా వారిని సైనిక శిబిరం బయటకు తోడ్కొని పోయారని, వెళ్తూ ‘ఈ విషయమెవ్వరికీ తెలియకూడదని, ముఖ్యంగా…’ మాట పూర్తి చెయ్యకుండా ఆగిపోయారు వారిద్దరూ.
ఇంతవరకూ శిబిరాల్లోనే ఎక్కడో ఉన్నారనుకున్న మహారాజు, తన మందిరానికంటే ఎవరికీ అనుమానం రాదని, అలా చెప్పి, శిబిరం బయటకు వెళ్లారంటే… అదీ, ఏ రక్షణా లేకుండా, ఆ పన్నెండుమందితో కలిసి… జరగబోయేది అర్థం చేసుకొన్న అనంతుడికి, పైప్రాణాలు పైనే పోయాయి. యుద్ధం సంగతి తర్వాత. ముందు మహారాజుల వారిని రక్షించాలి. ఈ ఆలోచన రాగానే, క్షణం ఆలస్యం చెయ్యకుండా, “నా అశ్వాన్ని సిద్ధం చెయ్యండి. నాకూడా నలుగురు రండి. మిగిలిన వాళ్ళిక్కడే ఉండి, చీమైనా శిబిరంలోకి దూరకుండా కట్టుదిట్టం చెయ్యండని,” కరవాలాన్ని చేబూని, మహోగ్రంతో ముందుకు సాగాడు అనంతుడు.
మహారాజుల వారేమయ్యారో తరువాయి సంచికలో మనమూ చూద్దాం పదండి…