శ్రీరామ నవమి వేసవి తొలి రోజుల్లో వచ్చే పండుగ . ఉగాది తొలి పండుగ అయితే రాములవారి పెళ్లి అంటే శ్రీరామనవమి మలి పండుగ .దశావతారాలన్నింటిలో విశిష్టమైనది .పరిపూర్ణమైంది రామావతారం .సీతారాముల కళ్యాణం జరిపించిన , చూసిన సర్వ శుభాలు కలుగుతాయని మన పెద్దలు అంటుంటారు .
భారతీయ సంస్కృతి సా కారమైంది రాముని వ్యక్తిత్వంతో . రాముడు మర్యాద పురుషోత్తముడు . జగదభి రాముడు .జగదేక మోహనుడు . చైత్ర శుద్ధ నవమి విశిష్టమైన తిధి . రామ కళ్యాణము రావణ వధా నంతరం అయోధ్య ప్రవేశం చేసింది చైత్ర శుద్ధ నవమినాడే . మర్నాడు అంటే దశమి నాడు పట్టాభిషేకం జరిగింది. సీతారామ కళ్యాణం ,అయోధ్య ప్రవేశం , రెండు రామజనం నాడే జరిగాయి . అందుకే ఈ నవమి ప్రత్యేకమైనది . పవిత్రమైనది కూడా.
ఒకనాడు దేశంలో క్షా త్ర శక్తి సంకోచించుకొని పోయింది. రావణాసురుని ఆగడాలు మితిమీరి ఋషులు, మునులు, సామాన్య ప్రజలు అనేక అగచా ట్లకు లోనయ్యారు .అష్టకష్టాలు పడ్డారు . అలాంటి సమయంలో రామచంద్రుడు కోదండము చేతబట్టి రాజ్యాన్ని , రాజ్య భోగాలను , స్వీయ జనాన్ని వదిలి 14 ఏళ్లు అడవుల్లో తిరిగి రావణుని అంతమొందించాడు .
నేడు మనం చిన్నచూపు చూస్తున్న చూసిన వారితో స్నేహం చేశాడు . పడవ నడిపే గుహుడు మొదలు కొని తపసంపన్నులైన ఋషుల ఆశీర్వాదాలతో ,గిరి చర- వనచరులతో సహా సమాజాన్ని సంఘటిత పరిచి ,రావణ వధ తో దేశాన్ని బాధా ముక్తం చేశాడు .

రామనవమి నైవేద్యాలకు పంచభక్ష పరమాన్నాలు అక్కరలేదు .వడపప్పు పానకం చాలు ఎందుకంటే ఎందుకు అవే అంటే
రథసప్తమి నుండి ఎండలు తీక్షణమవుతూ ఉంటాయి క్రమంగా . ఆ వేడిమిని తట్టుకోవడానికి నానబెట్టిన పెసరపప్పు తినాలి . పానకం లేదా పనీయారం అంటే బెల్లం కరిగించిన నీటిలో మిరియాల పొడి, చిటికెడు ఉప్పు కలిపితే తయారయ్యే ద్రావణం .అది చాలు .వడపప్పు క్లుప్తంగా అంటే నానబెట్టి వడగట్టిన పెసరపప్పులో చిటికెడు ఉప్పు వేస్తే చాలు . ఇంకొంచెం రుచి కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర చాలు . తురిమిన కొబ్బరి ,మామిడి చేరిస్తే అమోఘం . మనవాళ్ళ గొప్పదనం అక్కడే ఉంది ఏ స్థాయి వారిని నొప్పించలేదు .నైవేద్యాలన్నీ సింపుల్వి .ఆయా కాలాలకు అనుగుణం గా ,ఆరోగ్యపరంగా హితమైన వాటినే ఎంచుకున్నారు . ఆహార శాస్త్రంలో పూర్వులు సాధించిన ప్రగతి ,దూర దృష్టి ఇలాంటిప్పుడే బయటపడుతుంది .

గతంలో ఈ పండుగ అంటే 9 రోజులు వీధుల్లో పందిళ్లు ,హరికథలు , బుర్రకథలు ,భజనలు ,పురుషులు వేసే కోలాటాలు ఎంతో హడావిడి .మా చిన్నప్పుడు పెద్దవాళ్లకు విసనకర్రలను , చెప్పులను , గొడుగులను ప్రసాదంతో పాటు పంచేవారు .కొన్ని ఊళ్ళల్లో ఊర వతల పాత అట్టముక్కలతో ఓ నగరం సెట్ ల వేసేవారు . ఓ వ్యక్తి హనుమంతుని వేషధారణలో కొరివితో దాన్ని తగలబెట్టేవాడు . అదే లంక దహనం .
తెలుగు ప్రాంతాలను ఏలిన రెడ్డి రాజులు తొమ్మిది రోజులపాటు వసంతోత్సవాలను నిర్వహించి ,సామాన్య ప్రజానీకానికి వేడుకలను ,వినోదాన్ని అందించారు . అదే సమయంలో కళాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించి ప్రభువుల మెప్పు పొందే అవకాశం. చాలామంది రామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మరుసటి రామనవమికి కి పూర్తి చేసేవారు .
మరో విశేషం
దక్షిణ అమెరికా మధ్య భాగంలో నివసించే రెడ్ ఇండియన్ అనే ఆదివాసులు నేటికీ ప్రతి సంవత్సరం సీతారాముల ఉత్సవ ఘనంగా జరుపుకుంటారని ఈ సందర్భంగా సీతారాముల జీవిత ఘట్టాలను నాటకాలుగా ప్రదర్శిస్తారని 1931లో ప్రచురించబడిన హిందువుల పండుగలు అనే పుస్తకంలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు రాశారు ( పేజీ 34 -35)

ఇంకో ముఖ్య విషయం
సీతారాములు ఆదర్శ దంపతులు . అపురూప దంపతులు .వారిని విడదీయాలనుకున్న వారే నాశన మయ్యారు ఎన్ని కష్టాలు వచ్చినా వారి మధ్య ఉండే ఆ ప్రేమ ,అభిమానం మరింత గాఢంగా రూపుదిద్దుకున్నది .శూ ర్పణఖ సీతను దూరం పెట్టి , రాముని పొందాలనుకుని అవమానాల పాలయింది , అలాగే రావణుడు రాముని నుండి సీతను విడదీసి , పొందాలనుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా సర్వనాశనమయ్యాడు .
సీతారాములు ఇద్దరు కాదు ఒక్కరే . రాముని జన్మకు కారణం రావణ వధ తద్వారా లోక కళ్యాణం సీతతో కూడిన రాముని వల్లనే లోక కళ్యాణం సాధించబడింది .
సీతా రాముల కళ్యాణం చూ తము రారండి .