సంగీతం వీనుల విందు The Muscle gain

23 – 2 – 2025 తరుణి పత్రిక సంపాదకీయం

జలజల పారే సెలయేరు పక్కన కూర్చుంటే చల్లదనపు స్పర్శతో పాటు

కర్ణ పుటాలకు చక్కని శబ్ద సౌందర్యం వినిపిస్తుంది. వసంత ఋతువు వసంతాగమనాన్ని తెలిపే కోయిల పాటలో తెలియని సంగీతం ఏదో దాగుంది. శబ్దాన్ని రాగంతో మేళవిస్తే వినసొంపు సంగీతం హృదయ కమలాన్ని వికసింప చేస్తుంది. ప్రకృతి మనిషి మమేకమయ్యే సందర్భాలలో సంగీత సాహిత్యాలు తన్మయత్వంలో ఓలలాడిస్తాయి.

రాగం తానం పల్లవి శృతి లయ సంగీత శాస్త్రానికి సంబంధించిన పదాలు. సంగీత ప్రాథమిక లక్షణాలకు ముఖ్యమైన విషయాలు.

సంగీతం, సాహిత్యం, శిల్పం, నృత్యం, చిత్రలేఖనం అనే  లలిత కళలలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న కళ సంగీతం.వాద్య సంగీతం, గాత్ర సంగీతం ఈ రెండు ముఖ్యమైన సంగీతాలున్నాయి. మళ్లీ ఈ రెండింటిలో సంప్రదాయ సంగీతము జానపద సంగీతం అనే రెండు విభాగాలు ఉన్నాయి. జనానాం పదం జానపదం అంటారు అంటే గ్రామీణ ప్రాంతంలో జనులు  హృదయోల్లాసంతో పాడుకునే పల్లె పదాలు . ఎవరి చిత్తానుసారంగా వాళ్లు పాడుకునే పాటలు పురాణా కథలో ఉంటాయి వాళ్ల జీవన వేదలో ఉంటాయి ప్రకృతిని వర్ణించే పాటలు ఉంటాయి. ఏ నియమనిబంధనలు ఉండవు, లిపి లభ్యం కానటువంటివి ఈ జానపద సంగీతంలోని విశేషత. ఈ మౌఖిక సాహిత్యం గురించి ప్రస్తుతం చాలా పరిశోధనలు జరుగుతున్నాయి,దొరుకుతున్నాయి.ఇంగ్లీషులో folk music అంటాం, హిందీలో లోక్ గీత్ అని అంటాం. శారీరక శ్రమ నుండి ఉపశమనాన్ని కోరుకుంటూ పాడే పాటలు. వినోదం ఉల్లాసమే కాకుండా విజ్ఞాన సంబంధమైన పాటలు ఉంటాయి. ప్రకృతి మనిషి లయాన్వితమైన సంగీతం మానవ సంస్కృతి లో భాగమైంది.

శాస్త్రీయ సంగీతం ప్రపంచంలో నే ఎంతో పురాతనమైన సంగీతం. ఉత్తర భారత సంగీతం, దక్షిణ భారత సంగీతం రెండు భిన్నమైన సంగీతం పద్ధతులు.దేని ప్రత్యేక శైలి దానిదే. భిన్నమైన సంగీత బాణీలు సమకూర్చడం, భిన్నమైన సాహిత్య స్వరార్చన చేయడం ఉన్నది .

సంగీతం ఎన్నో వాయిద్యాలపై వాయిస్తుంటారు. గేయకావ్యాలను గానం చేస్తూ గాయనీ గాయకులు ఎందరో ప్రాచీన సంగీత సంప్రదాయాలను రక్షిస్తున్నారు. ఎప్పుడో క్రీస్తు శకం ఒకటో శతాబ్దం లో నే అమరావతి స్తూపం పై సంగీత పరికరాలను చెక్కారంటే అర్థం చేసుకోవచ్చు భారతీయ సంగీత శాస్త్రం ఎంత పురాతనమైనదో.

సంగీతంలో సప్త స్వరాలు పక్షుల, జంతువు ల కూతల నుండి తీసుకొని ఏర్పరచాలి అంటారు. సరిగమపదనిస లు స్వరాలు. సజ్జమ వృషభ గాంధార మ గా ణ్మధ్యమ పంచమ, దైవత. నిషాధ అనే పేర్లతో సప్త స్వరాలుగా చెప్పబడుతున్నాయి.వీటిల్లో కొన్ని స్వరాలైన రాగంలో ఇమిడ్చి పాడాలి అనే నియమం ఉంది. కృతులు శృతులు విషయాలెలా ఉన్నా, ఆరోహణ అవరోహణ స్థాయీ భేదాలు ఉంటాయి. స  అంటే షడ్జమం నెమలి క్రేంకారం నుండి, రి రిషభం ఎద్దు రంకెనుండి, గ గాంధర్వం మేక అరుపు నుండి, మీ మధ్యమం క్రౌంచ పక్షి నుండి మీ మధ్యమం కోయిల కూత నుండి, ది దైవతం గుర్రం సకిలింత నుండి, ని విషాదం  ఏనుగు ఘీంకారం నుండి గ్రహించినట్టు  తెలుస్తున్న ఈ స్వరాలతో  ఎన్నో రాగాలను సృష్టించి సంగీత ప్రియులకు సాధారణ జనులకు ఆనందాన్ని కలిగిస్తున్నవి.

జీవితంలో  తమతమ గమనాలకు తగినట్టు తారా స్థాయిలో నో మధ్యమ స్థాయి లో నో మంద్ర స్థాయిలో నో అనుభవించే ఆలోచనలు ఈ సంగీత సాహిత్యాలను  మేళవించినట్టే ఉంటాయి. సంగీతం వీనుల విందు .

సాహిత్యం బుద్ధి కి విందు.సంగీత సాహిత్య సౌరభాలను అందుకొని బతుకు నావికులుగా మారిపోయి ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి.

***

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హృదయ శ్రీమంతం

పద్యం