“ఈ దుఃఖం.. ఏనాటి శాపమో
ఈ శోకం.. ఎందరెందరి శాపమో..”
అంటూ ఉద్వేగభరిత పదాలను లిఖించిన ఆ స్వరం ఇప్పుడు మన మధ్య లేదు.. ఆమె కేవలం కవయిత్రి కాదు, పోరాట స్ఫూర్తి, సమానత్వం కోసం స్త్రీ హక్కుల కోసం రగిలిన “అగ్నిశిఖ”
“చైతన్యం పడగెత్తింది” అంటూ తొలి రచనతోనే ఒక నినాదమై కదిలిన
“నిర్భయాకాశం”

“గులాబీలు జ్వలిస్తున్నాయి” అంటూ మహిళలపై అన్యాయాలను ఎత్తి చూపి శ్రమజీవుల పక్షాన నిలిచిన “చెమట చెట్టు”
కాకతీయ విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా, ప్రజా గాయనిగా, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలిగా వెలిగిన తెలంగాణ ఉద్యమకారిణి.
1958లో వరంగల్ జిల్లాలో జన్మించిన రజిత గారు, చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని, తెలంగాణ తొలి ఉద్యమదశలోనే చురుకుగా పాల్గొన్నారు.
దస్తఖత్, అనగనగా కాలం, మట్టిబంధం, మార్కెట్,స్మార్ట్ శ్రీమతి
“వెతలే కథలై”, “ఉద్విగ్న” (2013, అత్యాచార విరోధ సంకలనం), “అగ్నిశిఖ” (2014), “జీగర్”, “ముజఫర్‌నగర్ మారణకాండ”, “పోలవరం-ప్రాణాంతక ప్రమాదం” వంటి సమాజానుసారమైన సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. సామాజిక ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ, ఆదివాసీలు,దళితులు అట్టడుగు వర్గాల గొంతును తనదిగా చేసుకుని కవితలు, వ్యాసాలు,పాటలు వ్రాసిన అసాధారణ సాహిత్య యోధురాలు.
ఉపన్యాసాలలో ఆమె కవిత్వం ఉత్సాహం నింపేది, సాహిత్య వేదికలపై ఆమె మాటలు ఆలోచనల జ్యోతిని వెలిగించేవి. 2017లో తెలంగాణ ప్రభుత్వం ఆమెను “రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం”తో సత్కరించడం, ఆమె కృషికి లభించిన గౌరవం.
తన ఆలోచనలకు ఏ ముసుగులు లేకుండా స్పష్టంగా మాట్లాడడం ఆమెకే సాధ్యం. హృదయంలో మృదుత్వం. ఆలోచనల్లో స్పష్టత..ఆచరణలో
దృఢత్వం.. ఆమె నైజం. జీవితంలో సాదాసీదాగా కనిపించినా,ఆచరణలో, ఆలోచనల్లో ముక్కుసూటి తత్వం.
వారి వ్యక్తిత్వంలో నాకు బాగా నచ్చింది నిరాడంబరమైన వ్యవహారశైలి. రాతల్లో రాస్తున్నది ఆచరణల్లో ఉండాలని, హంగు ఆర్భాటాలను పొగడ్తలను తిరస్కరించేవారు. వ్యక్తిగత ప్రయోజనం కాదు, సమాజ హితంకోసమే రచనలు సాగాలని ముఖ్యంగా మహిళలు మహిళల గురించి ఆలోచించాలని అనేవారు.
ప్రోత్సహించడం ధైర్యం చెప్పడం ఆమె సహజ స్వభావం కష్ట సమయాల్లోనూ తడబడకుండా ముందుకు నడిచే నాయకత్వం వారిది. రజిత గారి వ్యక్తిత్వం మనందరికి స్ఫూర్తిదాయకం ఆమె జీవితం మంచి విలువలను నేర్పుతుంది అలాంటి వ్యక్తి సాహిత్యంలో ఉండడం మన అదృష్టం. నా మొదటి నవల “వేద” ఆవిష్కరణకు ఎంతో సంతోషంగా వచ్చారు. రెండవ నవల జగతికి ముందుమాటలు రాశారు. నవల అందుకున్న క్షణం నుండి ఆవిడకు నాకు ఒక మంచి బంధం ఏర్పడింది. నన్నెందుకు అంతగా ఇష్టపడ్డారో నాకు తెలియదు గానీ “కవిత్వం కన్నా నవలా రచన నీనుండి కోరుకుంటున్నా” అని ఎప్పుడూ గుర్తుచేసేవారు.
ఏ సాహిత్య సమావేశానికి వెళ్లినా అక్కడి విశేషాలను నాతో పంచుకునేవారు.
అనిశెట్టి రజిత గారు లేరన్న విషయం తెలియగానే, ఆమెను సన్నిహితంగా చూసినవారు మాత్రమే కాదు, ఆమెను రచనల ద్వారా తెలుసుకున్న పాఠక హృదయాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఎన్నో కలాలు వారిని స్మరిస్తూ కన్నీటి అక్షరాలను లిఖించాయి.
రజిత గారు లేకపోవడం లోటు మాత్రమే కాదు నా వరకు ఒక వెలితి
కొన్ని ఖాళీలు మరొకరితో భర్తీ చేయలేము. నిజంగా
“ఈ దుఃఖం ఏనాటి శాపమో.. ”
ఆమె ఆశయం ఒక వెలుగుతున్న దీపం..
ఆ దీపకాంతులు అంతటా ప్రసారించాలని ఎంతోమందిని ప్రభావితం చేయాలని కోరుకుంటూ
మనసు నిండా తొణుకుతున్న కన్నీటితో నివాళి.