స్వయంకృషితో స్వావలంబన

కవిత

“ఏమండీ!పండక్కి నాకో చీర కావాలి” అని అడిగే స్థాయినుండి చీరల వ్యాపారం
చేసే స్థాయికి ఎదిగింది మగువ!

వంటింటి గడప దాటి ఎరుగని ఇల్లాలు..
ఒంటి చేత్తో గృహ గోవర్థనగిరిని ఎత్తుతూ
కుటుంబాన్ని కాపాడుతోంది!

భర్త ఇచ్చిన నెల జీతాన్ని
ఇంటి ఖర్చులకు పోగా పొదుపు చేసే అర్థాంగి..
రోజుకో రూపాయి పొదుపు పేరుతో డ్వాక్రా సంస్థ నిర్వహిస్తూ స్వావలంబన సాధించింది!

ఇద్దరు పిల్లల ఒంటరి తల్లి..
ముంబయి బీచ్ లో బఠాణీలు అమ్మి
యాభై పైసలు సంపాదించిన సందీప..
స్వయంకృషితో సూక్ష్మఋణం సంపాదించి..
యాభై లక్షల టర్నోవర్ గల
స్వంత టీ వ్యాపారం సాగిస్తున్న సాక్షిగా..
ఆత్మవిశ్వాసంతో అవనినేలుతున్నది అతివ!

అంతేనా..

ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి అడిగే ఆత్మనూన్యత నుంచి బయటపడి..

వేన్నీళ్లకు చన్నీళ్లుగా చేయూతనందిస్తూ..
కుటుంబసభ్యుల కలలను నెరవేరుస్తూ..
బదనిక భర్తను పోషిస్తూ..
కుటుంబానికి వెన్నెముకై..

చదువులో పట్టాలు సాధించి
దేశానికి పట్టుకొమ్మయి
విజయపతాకాన్ని గర్వంగా
వినువీధులలో ఎగురవేస్తోంది ఈనాడు!
**************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వరలక్ష్మీ నమోస్తుతే !

కనిపించని నాలుగో సింహం – బడుగుల సుమతి ఐ.పి.ఎస్.