రంగు రంగుల రాఖీలు. ఎక్కడ చూసినా అంబారాన్నంటే సంబరాలు. అక్కాచెల్లెళ్లు కట్టిన తళుకులు అద్దిన మెరుపుల రాఖీలు ముంజేతికి కట్టుకుని మురిసిపోతున్న అన్నాదమ్ముళ్లతో వీధులు నిండిపోతున్నాయి కదా? రకరకాల మిఠాయిలతో వాళ్ళకి విందుభోజనం పెట్టి, వాళ్ళిచ్చిన కానుకలను అపురూపంగా చూసుకునే అక్కాచెల్లెళ్ల కళ్ళల్లో ఆనందం. ఏమిటీ పండుగ? ఎందుకింత సంతోషాల హేల? రక్షాబంధనమనే ఈ రాఖీ పండుగ అసలెందుకు?
ఇప్పటిదా ఈ వేడుక? అన్నదమ్ములకి అక్కాచెల్లెళ్ల పట్ల ఉండే మమకారం, అభిమానం, బాధ్యత పురాతనo , సనాతనం .
బలిచక్రవర్తి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి, అతని కోరిక మేరకు పాతాళ లోకంలోనే ఉండిపోతే లక్ష్మీదేవి తన భర్తను తిరిగి వైకుంఠానికి పంపమని ఒక సోదరి లాగా బలిచక్రవర్తికి రాఖీ కట్టి కోరుతుంది. అలాగే ద్వాపర యుగంలో శిశుపాల వధ సమయంలో గాయపడిన శ్రీకృష్ణ పరమాత్మ చిటికిన వెలుకి తన కొంగు చింపి కట్టుగట్టిన ద్రౌపడికి, అవసరమైనప్పుడు నీకు వస్త్ర దానం చేసిఅన్నగా నా బాధ్యత నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఆ ప్రకారమే, ద్రౌపదీ వస్త్రాపహరణ వేళ, అన్నయ్యా అని ఎలుగెత్తి పిలువగానే, పరుగున వచ్చి చీరలిచ్చి ఆమె మర్యాదను కాపాడతాడు. . ఇవి పురాణ కథలు. ఇక చరిత్రలోకి తొంగి చూస్తే, అలెగ్జాండర్ (సికందర్) భారతదేశంపైదండెత్తినప్పుడు, అతని భార్య భారతీయ రాజు పురుషోత్తముడికి రాఖీ పంపి, యుద్ధంలో తన భర్తను చంపవద్దని కోరుతుంది. పురుషోత్తముడు యుద్ధ రంగంలో అలెగ్జాండర్‌ను చంపే అవకాశం వచ్చినా, చేతికి ఉన్న రాఖీని చూసి అతడిని వదిలేయడం వెనుక ఉన్నది సోదర అనుబంధమే. ఇవన్నీ మనకి చెప్తున్నదేమిటి? సోదర, సోదరీ అనే బాంధవ్యానికి ఒకే తల్లి కడుపున పుట్టనవసరం లేదు. పర స్త్రీని సహోదరిగా భావించి, గౌరవించి, కాపాడాలనే సద్భావన.
కుటుంబం లోని మగపిల్లలు కేవలం సంపదలు పెంచుకోవడం, పంచుకోవడం మాత్రమే కాదు. ఇంటి ఆడపడుచుకు పెళ్లి చేసి మరో ఇంటికి పంపేయడం మాత్రమే కాదు. పుట్టింట్లో మేము నీకున్నామనే భరోసా ఇచ్చి, ఆమె కష్టానష్టాలలో ఆదుకోవడం అవసరమనే సందేశాన్నిచ్చేదే రాఖీ పండుగ.సమాజంలో స్త్రీ పట్ల గౌరవాన్ని పెంచేదే ఈ రాఖీ పండుగ.