స్వర్ణ విజయనగర కీర్తి సార్ధకమ్ము
అనే మకుటంతో శ్రీమతి రాధిక మంగిపూడి గారు రాసిన ‘విజయనగర వైభవ శతకము’ ఆసాంతం చదివాను.
దీని గురించి రెండు ముక్కలు మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ సమీక్ష.
ముందుగా ముఖచిత్రం అద్భుతంగా పేరుకి తగ్గట్టుగా చారిత్రక కట్టడాలతో మనస్సుని ఆకట్టుకుంది. ముఖచిత్రం చూస్తుంటేనే విజయనగర వైభవం వైభవోపేతముగా విరాజిల్లుతోంది.
ముఖ్యంగా తేటగీతి పద్యం రాయడం కష్టం.
ఆటవెలది రాసినంత సులువు కాదు.

ఎంతో శ్రమకోర్చి ఛందోబద్ధమైన పద సంపద పుష్టిగా కూర్చిన ఈ తేటగీతి పద్యాలు అన్ని చాలా బాగున్నాయి.
కన్నతల్లి, జన్మభూమి ఎప్పుడు తలుచుకున్నా వయస్సు మర్చిపోయి మనస్సు తన్మయత్వపు ఆనందాల ఊటలు ఊరుతూనే ఉంటుంది అన్న విషయం ఈ పుస్తకం చూడగానే అర్థమయింది.
జన్మభూమిపై రాధిక గారికి ఉన్న మక్కువ మాటలలో వర్ణించనలవి కానిది.

అంతేగాక తేటగీతుల శతకంతో పైడితల్లికి పాదపూజ చేసుకున్న రాధిక గారి జన్మ తరించింది. “విజయనగర మహా వైభవ వైవిధ్యానికిది నూరులాంతర్ల నీరాజనం”
అంటూ బ్రహ్మశ్రీ బేతవోలు రామ బ్రహ్మంగారు తమ ముందుమాటగా అభినందన ఆశీస్సులు ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత.
రాధిక గారు ఈ పుస్తకాన్ని పైడితల్లి అమ్మవారికి అంకితం ఇవ్వడం వలన ఈ పుస్తకాన్ని అందగించింది.
శ్రీకరముగ శుభము కూర్చు సిరుల తరువు
అంటూ ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర రాజవంశ గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి గురించి మొదలుపెట్టి , సింహాచలం, రామతీర్థం ఆలయాలను తలుచుకుంటూ విజయనగర కోట ఆనంద గజపతి మహారాజు గారు, ఆదిభట్ల, గురజాడ, శ్రీశ్రీ, సంగీత కళాశాలకు ముఖ ద్వారం వంటి ద్వారం వారు, కోడి రామ్మూర్తి, కె వి కృష్ణారావు, ఆరుద్ర, పింగళి, గొల్లపూడి మారుతి రావు, తాతా సుబ్బరాయ శాస్త్రి, త్రైలింగస్వామి, కళావరు రింగ్,
పొరుగు ప్రాంతమైన బొబ్బిలి కోట, హజరత్ డెంకషా వలీ బాబా..
ఇలా ఎందరెందరో విజయనగర గడ్డపై నడయాడి ప్రపంచ ఖ్యాతి గడించిన మహానుభావులను ఆధ్యాత్మిక, రాజకీయ విద్యా చలనచిత్ర, చారిత్రక రంగాలనుండి, మతసామరస్య భావంతో రాధిక స్మరించుకొని మాకు దర్శంపజేశారు.
మేటి విద్యల నగరమై మెరిసెనన్ని రంగముల
అని సాటి లేని విద్యా కేంద్రం-విజయనగరం అంటూ వారికి పద్య గురువైన కళ్యాణ చక్రవర్తి గారికి ఈ పద్య సుమాలను గురుదక్షిణగా అందించారు ఆమె.
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు కలుగును సుమతి (పుత్రికోత్సాహం) అనే సుమతి వాక్యాన్ని అక్షరాల నిజం చేసిన రాధికను గనిన
జననీ జనకులు శ్రీ కొటికలపూడి కూర్మనాధం గారు
శ్రీమతి మంగతాయారు గారికి, ఈ
బహుముఖ ప్రజ్ఞాశాలిని కని సమాజానికి అందించిన పుణ్య దంపతులుగా నమస్కరిస్తూ
రాధికగారిని వారి పుస్తకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
మీ మేలాంబువు నుండి ఇంకా ఎన్నెన్నో సాహిత్య తుషార బిందువులు సిరాగా వర్షించాలని మనసారా కోరుకుంటూ..
