శైలజతో కబుర్లు చెప్తుండగా… కిటికీ తలుపులు టప తపా కొట్టుకోవడం మొదలైంది.
“సరే. ఉంటానే.. గుడ్ నైట్ ” సెల్ ఆఫ్ చేసి, బెడ్ మీద పడేసి, కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది.గాలి బాగా వీస్తోంది. ఆకాశం అంతా మబ్బులు కమ్మినట్లు అంతటా చీకటిగా ఉంది.
“వర్షం వస్తుందేమో ఎందుకైనా మంచిది “అనుకుంటూ కిటికీ తలుపులు మూసి వచ్చి, పడుకుంది.
********************
డ్యూటీ అయిపోయాక పార్కింగ్ లో ఉన్న స్కూటీ దగ్గరికి వచ్చి, హ్యాండ్ బ్యాగ్ డిక్కీలో పెట్టి,హెల్మెట్ పెట్టుకుంటుంటే “ఎస్క్యూజ్ మీ” అని వినిపించి ఎవరా వెనక్కి తిరిగి చూసింది చందన.
మురళీ మోహన్ నిలబడి ఉన్నాడు.
హెల్మెట్ తీసి, చేత్తో పట్టుకుని “చెప్పండి మురళీ గారూ “అంది చిరునవ్వుతో.
“మీతో కాస్త మాట్లాడాలి మేడమ్ ”
“చెప్పండి మురళీ గారూ ” హెల్మెట్ సీట్ మీద పెట్టి, రెండు అడుగులు ముందుకి వచ్చింది.
“ఇక్కడ కాదు…మీరు వెళ్లే దారిలో .. పార్క్ ఉంది కదా. నేనక్కడ ఉంటా, మీరు కూడా రండి. జస్ట్ పది నిముషాల్లో వెళ్లిపోవచ్చు.”
“పెర్సనల్ గా మాట్లాదేముంది?” సందేహం గా చూసిoది.
“అక్కడ కలుస్తాం కదా, అప్పుడు చెప్తాను “అంటూ వెళ్లి, తన బైక్ స్టార్ట్ చేశాడు.
చందన హెల్మెట్ పెట్టుకుని,స్కూటీ స్టార్ట్ చేసి, మెల్లగా నడుపుతూ
“మురళీ అంత నాతో రహస్యంగా మాట్లాదేముంది “అని ఆలోచిస్తోంది.
స్కూటీ లాక్ చేసి, పార్క్ లోపలికి వెళ్ళింది. అతను ఒక చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉన్నాడు.
వెళ్లి బెంచీకి మరో ప్రక్కన కూర్చుంది.
“సారీ చందన గారూ! మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని తెలుసు. కానీ, తప్పడం లేదు.”అన్నాడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ.
“అదేమీ లేదు చెప్పండి మురళీ గారూ! నాతో మాట్లాడేదేముంది?”
” శ్యామల గురించి ”
“శ్యామల గురించా? ” అయోమయంగా చూసింది.
“అవును. చందన గారూ ”
“చెప్పండి ”
“శ్యామల.. నా భార్య.”
“వాట్!” అదిరిపడింది చందన.
“అవును.. శ్యామల…… తెలివితక్కువతనంతో నేను దూరం చేసుకున్న నా భార్య.”
” అంటే… బెంగళూరు… నుంచి వచ్చింది…. ”
“తనకోసమే ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను ”
“అసలేం జరిగింది.?… ఇద్దరూ ఎందుకు విడిపోయారు?.. మీ అమ్మగారు తన దగ్గర ఉండడం ఏమిటి?”అయోమయంగా చూసింది చందన.
అతను ఏదో చెప్పబోతూ గేట్ లో నుంచి పార్క్ లోకి వస్తున్న మనిషిని చూసి “నేను తరువాత మీకు కాల్ చేసి మాట్లాడతా ” అంటూ, గబ గబా వెళ్ళిపోయాడు.
అసలు అతను ఏం చెప్పాలనుకున్నాడో, ఎందుకు అలా హడావిడిగా వెళ్లిపోయాడో చందనకి అర్ధం కాలేదు.
“శ్యామల తన భార్య అంటాడు. మరి ఆమెతో ఉండకుండా వేరే ఎక్కడో ఉండడం ఎందుకు? అతని తల్లి శ్యామలతో ఉండడం ఏమిటి? “అంతా గందరగోళంగా అనిపిస్తుంటే లేచి, బేగ్ తీసుకుంటుంటే “ఎక్సక్యూ జ్ మీ!” అని వినిపించి తలతిప్పి చూసింది.
ఆరడుగుల పొడవుతో విశాలమైన నుదురు, సన్నని మీసకట్టు, చామన ఛాయ రంగు, నుదుటి మీదకి పడుతున్న నొక్కుల జుట్టుతో .. సుమారు ఇరవై ఏడు, ఇరవై ఎనిమిదేళ్లు వయసు ఉండొచ్చు. ఫుల్ హేండ్స్ షర్ట్…….
“హలో మేడమ్!ఏమిటలా చూస్తుండిపోయారు? ”
ఉలిక్కిపడి “ఏమిలేదు….. మీరు….. ఎవరా అని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నా “అంది, తడబాటుని అణుచుకుని చిన్నగా నవ్వుతూ.
“నో ఛాన్స్.. మనం ఇంతకుముందు ఎప్పుడూ ఎక్కడా కలవలేదు…అయినా . ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పలకరించానంటే….. ఇంతకు ముందు.. మీతో మాట్లాడుతున్న వ్యక్తి…. మురళీ మోహన్ కదా.?”
“అవును…. ఇద్దరం పనిచేసేది ఒకే ఆఫీస్ లో. సెక్షన్స్ వేరే అనుకోండి ”
“అవునా?.. వెరీ గ్లాడ్ టు మీట్ యూ!… ఐ యామ్ హరి… హరిశ్చoద్ర ప్రసాద్……”
“నైస్ మీటింగ్ యూ….. ఐ యామ్ చందన…. హరి చందన.. రావ్ &రాజ్ సొల్యూషన్స్ లో పని చేస్తున్నాను.”
” ఓ.. నైస్.. బెంగళూరు హెడ్ ఆఫిస్ లో నేను కొన్నాళ్ళు పని చేశాను. ”
“ఔనా? నైస్ మీటింగ్ యూ ” నమస్కరించింది.
దూరంగా ఆడుతున్న నాలుగదేళ్ల పిల్లవాడిని చూస్తూ “బంటీ!జాగ్రత్త.”అరిచాడు.
“మీ అబ్బాయా?”
“కాదు మా అన్నయ్య గారి అబ్బాయి ..బై ది బై…. నేను..” తను పని చేస్తున్న ఆఫీస్ పేరు చెప్పి,”అది మా సొంత ఆఫీస్. బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడే యూ యస్ లో మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే వెళ్ళి, వచ్చాక ఇక్కడ నేను, ఇద్దరు ఫ్రెండ్స్ ..కలిసిసొంతంగా స్టార్ట్ చేసాం.”చెప్పాడు.
“వెరీ నైస్ “అంది ఇంకేమనాలో తెలియక.
“ఆ మురళీతో కాస్త జాగ్రత్తగా ఉండండి..అతను కాస్త.. తేడా మనిషి. మీలాంటి అందమైన ఆడపిల్లలు కనిపిస్తే….”
“అర్ధమైంది. ఏదో మాట్లాడాలంటే…. ఫస్ట్ టైమ్ అతన్ని కలవడం…
అతని భార్య…”
“శ్యామల…. డివోర్స్ ఇచ్చేసింది గా ”
“మీకు తను తెలుసా?”ఆశ్చర్యం గా చూసింది.
“ఆ..తెలుసు.. శ్యామల మీకెలా తెలుసు?”
“ఆఫీస్ లో నా పక్క సీటే తనది. మంచి స్నేహితులం అయ్యామ్. కానీ, పర్సనల్ విషయాలు తెలియదు ఎప్పుడూ అడగలేదు.”.
“ఓ.. శ్యామల మీ ఆఫీస్ లో … అదే.. కంపెనీలోనే చేస్తోందా.? తన సెల్ నంబర్ ఇస్తారా?.. ”
“తప్పకుండా…మీ నెంబర్ చెప్పండి. తన నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను.”అంది.
హరీశ్చంద్ర ప్రసాద్ తన సెల్ నెంబర్ చెప్పాడు.
అతనికి శ్యామల నంబర్ ఫార్వర్డ్ చేసింది.
“బాబాయ్!ఇంటికెళ్లి పోదాం ” బాబు పరుగెత్తు కుంటూ వచ్చి, చిటికెన వేలు చూపించాడు.
” బాబూ ! నీపేరేంటి? ”
“బంటీ!”ముద్దు ముద్దుగా చెప్పాడు
“నైస్ నేమ్!”వంగి బాబుని ముద్దు పెట్టుకుంది.
“ఓకే చందన.. సీ యూ లేటర్..” చెప్పి,బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు. హరి.
మెల్లగా బయటికి వచ్చి శ్యామల గురించే ఆలోచిస్తూ స్కూటీ స్టార్ట్ చేసింది చందన.
“ఇవాళ ఇంత లేటయిందేంటి?” అడిగాడు వాసుదేవరావు
“కొలీగ్స్ మాట్లాడుతుంటే లేటయింది డాడీ “అని మురళీ గురించి, హరి గురించి చెప్పి,తన రూమ్ లోకి వెళ్లి,ఫ్రెష్ అయి వచ్చేసరికిరేవతి భోజనం వడ్డించింది . కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేశారు.
అమెరికా నుంచి శ్రీ కాంత్ కాల్ చేస్తే ముగ్గురూ మాట్లాడారు.
ఇద్దరికీ గుడ్ నైట్ చెప్పి,తన రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద వాలింది.
ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తుంటే
శైలజ కాల్ చేసింది.
“చెప్పు శైలు, డిన్నర్ అయిందా?”
“అయింది, ఏంటీ ఆఫీస్ విశేషాలు?”
“రోజూ కొత్త విశేషాలేముంటాయే మొద్దూ….
“ఈవెనింగ్ బయట ఉన్నానన్నావ్.. ఎటెళ్ళావ్.. షాపింగ్ కా?
“కాదే బాబూ “అంటూ జరిగినదoతా చెప్పింది చందన.
“ఆ మహాను భావుడు గ్రంథసాంగుడేమో!జాగ్రత్త.అతను పిలవగానే అలా ఒంటరిగా వెళ్ళకు.”
“ఆ విషయం ఇప్పుడేగా తెలిసింది. అలాంటిదేదో ఉండే ఉంటుంది. లేకపోతే శ్యామల ఎందుకు విడాకులు ఇస్తుంది.
తను చాలా మంచి పిల్ల. భర్తకి విడాకులిచ్చాక అత్తగారిని తనదగ్గర ఉంచుకోవడం ఏమిటో.. ఏమీ అర్ధం కాలేదు ”
“అత్తయ్య… అంటే. మేనత్త లేదంటే.. ఆ వరస అయినవాళ్లు కూడా కావచ్చుకదా చందూ ”
“అదీ నిజమేలే.. ఒకే గుడ్ నైట్ ”
” గుడ్ నైట్ ” చెప్పి నిద్రకి ఉపక్రమించ బోతుంటే……..
(సశేషం )