“చూడరా అబ్బీ, శైలజ మంచిపిల్లరా…. నువ్వూ…”
“జేజీ!ఈ మాట నువ్వు నిన్ననే చెప్పావ్, నేను ఒప్పుకునేఇక్కడికి వచ్చాను .తనే వాళ్ళ అమ్మనాన్నకి చెప్పకుండాఏ విషయం చెప్పలేనంది”అన్నాడు నవ్వుతూ.
“ఒప్పుకుంటుందిరా. నీలాంటి బంగారు కొండని ఎవరైనా కాదన గలరా “సుందరం బుగ్గలు నిమిరి, ముద్దు పెట్టుకుంది.
********************
సాయంత్రం తన మిత్రబృందాన్ని తమ కొబ్బరి, అరటి తోటలు చూపించడానికి తీసికెళ్ళాడు హరి. వారితో పాటు సుందరం, జగదీశ్ బంటీ, సుశీల కూడా వెళ్లారు.
చుట్టూ పచ్చని చెట్లు, చల్లనిగాలి, గుంపులు గుంపులుగా ఎగిరేపక్షులు….ఆ వాతావరణం చూసి ముగ్ధులయ్యారు. పట్నంలో వాయు, శబ్దకాలుష్యాలతో గందరగోళంగా ఉండే వాతావరణం మాత్రమే తెలిసిన వాళ్ళకి,ఈ పరిసరాలు స్వర్గధామంలా అనిపించాయి.పట్టణాలలో సెల్ టవర్ల మూలంగా, రెడీయేషన్ వల్ల అంతరించిపోతున్న పక్షులు. ఇక్కడ పక్షులు చేసె వింత వింత ధ్వనులు వీనులకి విందుగా ఉన్నాయి.
కొబ్బరిచెట్ల మధ్యలో అక్కడక్కడా కూరగాయల మొక్కలు,
పక్కనే అరటితోట. అక్కడక్కడా అరటి గెలలతో బరువుగా ఒoగిన చెట్లకి కర్రలు కట్టి నిలబెట్టారు.
వివిధ భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు.
అక్కడక్కడ గుడిసెల్లో ఉన్న జనాన్ని చూసి సోనీ”సార్! దొంగలు దోచుకోరా వాళ్ళని ” అడిగింది.
“ఏ రోజు సంపాదనతో ఆరోజు గడిపే వాళ్ళు… వాళ్ళ దగ్గర ఏముంటుంది దోచుకోడానికి,కట్టెలపొయ్యి మీద వండుకునే మసి గిన్నెలు తప్ప ” చెప్పాడు జగదీశ్.
“ఇక్కడ చాలామంది లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు సోనీ. అందుకే దొంగతనాలు తక్కువే. అయినా దొరికితే చితక్కోడతారని తెలుసు. ఈ పొలాల్లో కాపలా వాళ్ళందరూ ఇలా గుడిసెలు వేసుకునే కాపురం ఉంటారు.ఒక్క కేక పెడితే అందరూ ఒకచోటకి చేరిపోతారు. వాళ్ళలో ఐకమత్యం చాలా ఎక్కువ “చెప్పాడు హరి.
పాలేరు కొట్టి తెచ్చిన కొబ్బరి బొండాల నీరు తాగారు, కొందరు తాగడం రాక బట్టల మీద పోసుకుని నవ్వుకున్నారు. అటునుంచి గోదావరి గట్టు మీదకి వెళ్లి, ఆ చల్లగాలిలో కాసేపు తిరిగి వస్తూ, దారిలో పూతరేకులు చేసేవారిని వింతగా చూస్తూ బాగా చీకటి పడ్డాక ఇంటికి చేరారు.
సీతమ్మ కాఫీ అంటే వద్దని చెప్పేశారు. మధ్యాహ్నo పిండి వంటలతో
భోజనం వల్ల భుక్తాయాసం ఇంకా తగ్గక పోయినా, రాత్రి డిన్నర్ చేయక తప్పలేదు. చేసిన పిండివంటలు అందరికీ తలో కొన్ని కవర్లలో వేసి ఇచ్చింది సీతమ్మ.
తాతయ్య, నానమ్మ గారికి చెప్పి,వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
” మళ్ళీ ఈ ఇంటి కోడళ్ళుగా అడుగు పెట్టాలర్రా పిల్లలూ ” అన్నారు బామ్మగారు నవ్వుతూ.
“వస్తారు లేమ్మా, వాళ్ళ నాన్నగారు వస్తామన్నారుగా మాట్లాడదాం”అన్నాడు కృష్ణ ప్రసాద్. చందన, శైలజ మాట్లాడ లేదు.
“అయినా, ఎప్పుడు చూసినా నీకు పెళ్లి మాటలు తప్ప ఇంకోమాట రాదా నానమ్మా ” చిరుకోపం ప్రదర్శించింది సుశీల.
“వయసులో ఉన్న పిల్లల దగ్గర పెళ్లి మాటలు కాక ఇంకేముంటాయే అమ్మడూ!నీకూ కూడా చూడమని మీ నాన్నకి చెప్తున్నా “అంది సుబ్బలక్ష్మి.
“ఇదిగో అత్తయ్యా, నేను పి జి పూర్తి అయ్యి,ఉద్యోగంలో చేరాకే పెళ్లి. అంత వరకూ నో పెళ్లి.. ఇప్పుడు…”
“అయితే అప్పటికి నువ్వు ముసలిదానివయిపోతావే పిన్నీ “
అన్నాడు సుందరం నవ్వుతూ.
” ఒరేయ్ నిన్నూ…. నన్ను…… ఉండు నీ పనిచెప్తా. అసలు… నీ క్రాఫ్ చూసుకుని మురిసిపోతుంటావు కదా… రాత్రి పడుకున్నప్పుడు దాన్ని కత్తిరించేస్తాను. “సుందరాన్ని కొట్టడానికి వెళ్లేసరికి అతను తాతయ్యగారి మంచం చుట్టూ తిరుగుతూ తప్పించుకుంటున్నాడు.
“టివి సీరియల్స్ చూసి చెడిపోతున్నావే నువ్వు…పిన్నీ! సీరియల్స్ చూడనివ్వకండి దీన్ని ” సీతమ్మతో చెప్పాడు జగదీష్ నవ్వుతూ.
అందరూ నవ్వేశారు.
రామ్ ప్రసాద్ రాత్రి ప్రయాణం వద్దని అన్నా, మరునాడు ఆఫీస్ ఉందని బయలు దేరారు.వారితోజగదీశ్ కూడా బయలుదేరాడు.
*******************
చీకటితోనే హైదరాబాద్ చేరుకున్న అందరూ మధ్యలోనే వాళ్ళ ఇళ్ల దగ్గర దిగిపోయారు. శైలజని కూడా దింపి, చివరగా చందనని దింపి, బయలుదేరుతుంటే,” లోపలికి రండి. డాడీకి పరిచయం చేస్తాను. ” అంది,హరి,జగదీశ్ తో.
“ఇప్పుడా!ఈ నిద్రమొహం, ప్రయాణపు అలసటతో ఉన్న నన్ను చూస్తే … నో వే…. సాయంకాలం ఆఫీస్ అయ్యాక వస్తాను ” చెప్పి వెళ్ళిపోయాడు.
బెల్ కొడితే రేవతి తలుపు తీసింది. “ప్రయాణం బాగా జరిగిందా? “
అడిగింది.
“బాగానే జరిగింది మమ్మీ. డాడీ ఇంకా లేవలేదా?”
“లేదు…. వెళ్లి ఫ్రెష్ అయి రా కాఫీ ఇస్తా “
“లేదులే మమ్మీ… కళ్ళు మండుతున్నాయ్ కాసేపు పడుకుని లేస్తా”అని తన గదిలోకి వెళ్ళిపోయింది.
మళ్ళీ లేచేసరికి తొమ్మిది అయింది. అప్పటికి వాసుదేవరావు ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.గబ గబా తయారై టిఫిన్ తింటూ అక్కడి విశేషాలు క్లుప్తoగా చెప్పి “సాయంత్రం హరి, వాళ్లన్నయ్య వస్తారు మమ్మీ “చెప్పి, తను కూడా ఆఫీస్ కి వెళ్ళిపోయింది
శ్యామల పలకరింపుగా నవ్వి “ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారా?” అడిగింది.
“ఆ!ఈవెనింగ్ పని అయిపోయినా వెళ్ళిపోకు.మాట్లాడేపనుంది “.
చెప్పింది.
అలాగే అన్నట్లు తలూపింది శ్యామల. లంచ్ టైమ్ లో ఇంకా నలుగురు ఐదుగురు ఉండడంతో శ్యామలతో విడిగా మాట్లాడడానికి కుదరలేదు.
“సాయంత్రం శ్యామల్ని పార్క్ కి తీసుకోస్తా. మీరు మీ అన్నయ్య గారిని తీసుకురండి. ముందుగా ఇద్దరికీ పరిచయం చేద్దాం.తరువాత మెల్లగా పెళ్లి గురించి మాట్లాడదాము “అని హరికి మేసేజ్ పెట్టింది.
అతను ఓకే అని రిప్లై ఇచ్చాడు.
సాయంత్రం తనపని ముందే అయిపోయినా శ్యామల కోసం ఆగింది.
రోజూ ఇద్దరూ ఒకేసారి బయలుదేరితే శ్యామలని బస్టాప్ దగ్గర దింపి వెడుతుంటుంది.
“ఈ రోజు మనం పార్క్ కి వెడుతున్నాం “
“అక్కడికి హరిగారు వస్తున్నారా? “అంది శ్యామలనవ్వుతూ.
“అవును… నీకు మా ట్రిప్ విశేషాలు చెప్పాలి కదా ”
“విశేషాలు . అంటే… ముఖ్యమైన.. అదే. ప్రత్యేకమైన విశేషలెమైనా ఉన్నాయా? “అంది, ఓరగా చూస్తూ.
“అవును “…
“శుభవార్త?”
“తినబోతూ రుచి అడగడంఎందుకూ? ” పార్క్ ముందు స్కూటీ ఆపి లోపలికి నడిచింది.
ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చున్నారు.
“నేనూ, మా కజిన్ శైలజ, హరి ఆఫీస్ వాళ్ళు.. అన్నట్లు నీకు చెప్పానా? మా శైలూ హరి గారి ఆఫీస్లో చేరింది ఈ మధ్యనే.మరో నలుగురు మొత్తం ఆరుగురo కలిసి హరి గారి ఊరు వెళ్ళాము. నువ్వు మిస్ అయ్యావు గానీ, ఆ వాతారవరణం, పండుగ సంబరాలు సూపర్ గా ఉన్నాయి..
హరి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్…. నూరేళ్ళు వారికి. నేను ఇంతవరకు ఆ వయసు దంపతుల్ని చూడలేదు….. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు పోవడం ఒకరే తొoభై పైన ఉన్నవాళ్లని చూశాను గానీ…”
“అవును చందూ! ఇద్దరూ నూరేళ్ళు ఉండడం అరుదైన విషయమే.”
“కదా!… అందులో ఇద్దరూ నిండుగా శుభ్రంగా.. మేము అనారోగ్యంతో ఉన్నాం అని బాధ పడుతూ కూర్చోకుండా…”అంటూ వాళ్ళతో తామoదరు తీసుకున్న ఫోటోలు చూపించింది.
“నిజమే చందూ…”హరి జగదీష్ వస్తుండడం చూసి ఆగి “హరి గారితో వస్తున్నది వాళ్ళ అన్నయ్యగారు జగదీశ్.” చెప్పింది.
ఇద్దరూ దగ్గరకి వచ్చాక పరస్పర పరిచయాలు అయ్యాక నలుగురు గడ్డిలో కూర్చున్నారు.
కాసేపు మాములు మాటలు అయ్యాక చందన”మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను.”.. అంది.
ఏమిటన్నట్లు చూశారు.
“నా చిన్నప్పుడే.. అంటే పుట్టగానే మా అమ్మ చనిపోయింది.
కొంత కాలం శైలూ వాళ్ళమ్మ నన్ను పెంచింది. అలా పరాయి వారిoట నేనుండడం ఇష్టం లేని మా నాన్న, నన్ను మా తాతయ్య నానమ్మల దగ్గర ఉంచాలనుకున్నారు కానీ, అప్పటికి ఇద్దరూ బిపి, షుగర్, మోకాళ్ళ నొప్పులు వంటి వాటితో బాధపడుతున్నవాళ్ళకి నన్ను
పెంచడం కష్టమే అయింది. అందుకే…… వాళ్ళ బంధువుల్లో భర్త చనిపోయి ఒక కొడుకు ఉన్న ఒకావిడతో మాట్లాడి ఇద్దరినీ కూర్చోబెట్టి… ఆ రోజుల్లోనే….ఇది దాదాపుగా పాతికేళ్ళ క్రితం.సంగతి…. ఆమె కొడుక్కి నాన్న తండ్రి, నాకు ఆమె తల్లి లేని లోటు తీర్చుకుంటూ వాళ్ళు దంపతుల్లా కలిసి మెలిసి ఉండేలా మాట్లాడి పెళ్లి జరిపించారు.
ఆ మాటకి కట్టుబడి ఆవిడ నాకు తల్లి లేని లోటు, నాన్న ఆవిడకొడుక్కి తండ్రిలేని లోటు తీరుస్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి.. మా అన్నయ్య అమెరికాలో ఎమ్మెస్ చేసి, అక్కడే జాబ్ చేస్తున్నాడు. ” ఆగింది.
కాసేపు నిశ్శబ్దం….
“మీ వ్యక్తిగతమే అయినా మీ వెల్ విషర్ గా చెప్పడానికి సాహసిస్తున్నందుకు మన్నించండి… శ్యాము! బిడ్డతో ఒంటరిగా నువ్వు,
అలాగే బిడ్డతో ఒంటరిగా జగదీష్ గారు… .
మీరిద్దరూ…..”
” చందూ!ప్లీజ్…” లేవబోతున్న శ్యామల ని చెయ్యిపట్టి ఆపి, “శ్యాము! ప్రాక్టికల్ గా ఆలోచించు. నీకు చిన్నవయసు.బాబుని ఒంటరిగా పెంచడం కష్టమైన పని…. ఈ రోజుల్లో ఇలాంటి పెళ్లిళ్లు సాధారణం అయిపోయాయి. తోడు – నీడ వంటి సంస్థలు ఒంటరిగా ఉన్నవాళ్ళకి … పెళ్ళికి, సహజీవనానికి తగిన తోడుని ఏర్పాటు చేస్తున్నాయని విన్నాను.పెళ్లి చేసుకుంటే ఫరవాలేదు. లేకుంటే దానివల్ల సమాజంలో గౌరవం ఉండదు. అందరూ అసహ్యంగా చెప్పుకుంటారు.సుబ్బలక్ష్మి ఆంటీ అన్నట్లు కుటుంబవ్యవస్థ విచ్చిన్నo అయిపోతుంది.అయినా పిల్లలు లేనివాళ్ళకి, పెద్దవాళ్ళు అయి సెటిల్ అయినవాళ్ళకి అవన్నీ కుదురుతాయి. మీకు చిన్నపిల్లలున్నారు. మీఇద్దరిదీ చిన్నవయసు. ఆలోచించండి
ఇద్దరూ ” ఆగింది చందన.
“సరే. నేను వస్తాను “లేచి సమాధానం కోసం చూడకుండా మెల్లగా నడిచి వెళ్ళిపోయింది శ్యామల.
“అన్నయ్యా! నేను ఎమ్మెస్ చెయ్యడానికి అమెరికా వెళ్ళడానికి ముందు కొన్నాళ్ళు బెంగళూర్ లో జాబ్ చేశాను కదా. అప్పుడు ఈమె, భర్త ఇద్దరూ కొలీగ్స్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
నేను యూ ఎస్ వెళ్లాను. తరువాత ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశాను కదా, ఆ బిజీ లో వాళ్ళ గురించి మరిచిపోయాను. మళ్ళీ మొన్నామధ్య పార్క్ లో చందనతో మాట్లాడుతున్న అతన్ని చూసి గుర్తుపట్టాను . నేనూ దగ్గరకి వచ్చి మాట్లాడదామనుకునే లోపల హడావిడి గా వెళ్ళిపోయాడు.
తరువాత చందన ఫ్రెండ్ అని తెలిసింది. అప్పుడు శ్యామలతో మాట్లాడితే తెలిసింది
కొన్నాళయ్యాక వేరే స్త్రీ తో సంబంధం పెట్టుకుని ఈమెను కొట్టడం తిట్టడం… ఆమె పాలిట శాడిస్ట్ అయ్యాడు. తన జీతంతో పాటు ఆమె జీతాకూడా తీసేసుకుని తాగుడుకి అలవాటు పడ్డాడు.. చివరికి అతని తల్లికి కూడా కొడుకు అంటే అసహ్యం వేసి ఇంట్లోనుంచి గెoటేసి, కోడలిచేత విడాకులు ఇప్పించేసింది. ఈ ఊరి బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆవిడ కోడలిని కూతురుగా చూసుకుంటోంది.”
“ఇద్దరూ మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నారు.. క్రితం నెలలో మేము పిక్నీక్ కి వెళ్ళినప్పడు నేనూ శ్యామల క్లోజ్ గా ఉడడం చూసినట్లున్నాడు, ఒకరోజు నేను ఇంటికి బయలుదేరుతుంటే
మాట్లాడాలి ఈ పార్క్ కి రమ్మని రిక్వెస్ట్ చేశాడు సహోద్యోగి కదా అని వచ్చాను. అప్పటికి అతను శ్యామల భర్త.. అదే మాజీ భర్త అని నాకు తెలియదు. ఈ పార్క్ లోనే ఆ విషయం చెప్పాడు . అతను విషయం చెప్ప బోతుండగానే బంటితో పార్క్ కి వచ్చిన హరిగారిని చూసి వెళ్ళిపోయాడు.
హరిగారు అప్పుడే నాకు పరిచయం “చెప్పింది చందన.
“పీక్నీక్ కి వెళ్లిన రోజు వాళ్ళ అబ్బాయికి దెబ్బతగిలి అమ్మకోసం ఏడుస్తున్నాడంటే నా కారులో తనను వాళ్ళింటికి తీసికెళ్లాను.అప్పుడు తను కాఫీ పెట్టడానికి లోపలికెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు మళ్ళీ పెళ్ళికి శ్యామలని ఒప్పించమని చెప్పారు “
చెప్పింది చందన.
“ఆడపిల్ల.. శ్యామల ధైర్యంగా మాట్లాడలేకపోవచ్చు .నీకు తన నంబర్ ఫార్వర్డ్ చేస్తాను మాట్లాడు. లేదంటే మనిద్దరం వాళ్ళింటికి వెళ్లి, వాళ్ళ అత్తయ్య గారితో మాట్లాడదాం.” అన్నాడుహరి.